రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైతే మంత్రి కొడాలి నాని!!

ఏపీలో టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నిన్న మంత్రి కొడాలి నాని స్టార్ట్ చేసిన ఈ మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. నాని నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల పై ఇప్పటికే దేవినేని ఉమా తో సహా మరికొంతమంది నేతలు స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా మంత్రి నాని వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు కొడాలి నాని పనితీరు కానీ, మాటలు కానీ ప్రజలకు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? అని ఆమె ఈ సందర్భంగా ప్రశ్నించారు. మంత్రి నానీని చూస్తుంటే రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు ఉందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసారు. కరోనా ప్రభావం ఆయనకు తెలిసుంటే.. చంద్రబాబు వేషధారణ గురించి అలా మాట్లాడేవారు కాదన్నారు. ఎవరెన్ని అన్న చంద్రన్నది నిజంగా చంద్రమండలం స్థాయేనని కొడాలి నాని తెలుసుకోవాలని స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.   అసలు మాటిమాటికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడనే నాని, ఆరోజు జరిగిన పరిణామాలకు తనే స్క్రిప్ట్ రాశాడా?. స్వర్గీయ ఎన్టీఆర్ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా స్టెరాయిడ్స్ ఎవరిచ్చారో, సూట్ కేసులు ఎవరు తరలించారో నానీకి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు తండ్రి అయిన ఖర్జూర నాయుడి గారి కుటుంబం రౌడీయిజంతోను, ఫ్యాక్షనిజంతోను పైకి రాలేదని అన్నారు. అసలు చంద్రబాబు వయస్సు గురించి, చావుల గురించి మాట్లాడటానికి మంత్రి ఏమైనా యమధర్మరాజుకి శిష్యుడా?. ఇప్పటికైనా సరే, వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుతో సమానంగా ఎవరైనా పనిచేయగలరా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు గురించి ఒకసారి ఒక పేపర్‌లో చులకనగా రాశారని గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును.. నాని లాంటి వాళ్లు ఎన్ని మాటలన్నా, ఆయన తలవెంట్రుకల్లో ఒక్కటి కూడా కదలదు. మంత్రిస్థాయిలో ఉండి లారీలతో గుద్దిస్తామనే ఆలోచనలు చేయడం బాధాకరం అని అంటూ.. లక్షకోట్ల అప్పులు తెచ్చి, ఏం చేశారో చెప్పకుండా, కేవలం ప్రశ్నించినవారిని చంపేస్తాం.. లేపేస్తాం అని బెదిరిస్తారా.. సీఎం జగన్ ప్రజలసొమ్ముని కోర్టు ఖర్చులకు దుబారా చేయకుండా, ఆ సొమ్ముతో తన సొంత పార్టీవారికి సభ్యత, సంస్కారాలు నేర్పితే మంచిది. ఇక మంత్రి నానినుద్దేశించి మాట్లాడుతూ.. మొరటోడికి మొగలిపువ్వు ఇస్తే, ఎక్కడో పెట్టుకున్నట్టు, మంత్రి పదవితో నాని ఏం చేస్తున్నాడో తెలియడం లేదు అని నానిపై దివ్యవాణి తీవ్ర విమర్శలు చేశారు.

కెనడియన్ జానపద సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చిన హెలెన్

మేరీ హెలెన్ క్రైటన్ (5 సెప్టెంబర్ 1899 - 12 డిసెంబర్ 1989)   గ్రామీణ ప్రాంతాలప్రజల రోజువారి జీవితాల నుంచి వచ్చే పాటలు, ఆటలు కాలక్రమేణా మరుగున పడిపోతాయి. వాటిని సేకరించి భవిష్యత్ తరాలవారి కోసం భద్రపరచాలన్న ఆలోచనతో తన జీవితాన్ని జానపదం కోసం అంకితం చేశారు మేరీ హెలెన్ క్రైటన్. కెనడాకు చెందిన ప్రముఖ జానపద రచయిత. ఆమె కృషి వల్లే ఈనాడు కెనడాలో జనపద సాహిత్యం వెలుగులోకి వచ్చింది.    నోవా స్టోటియాలో 5 సెప్టెంబర్ 1899 లో జన్మించిన హెలెన్ పల్లెపాటలు వింటూ పెరిగారు. దాంతో ఆమెకు తెలియకుండానే జానపదసాహిత్యంపై మక్కువ పెరిగింది. హాలిఫాక్స్ లేడీస్ కాలేజీ చదువుకున్న ఆమె మెక్గిల్ విశ్వవిద్యాలయంలో సంగీతం డిప్లొమా పూర్తి చేశారు.టొరొంటోలోని రాయన్ ప్లైయింగ్ కార్పోస్ లో చేరారు. కింగ్స్  కాలేజీ యూనివర్సిటీ లో ఆమె డీన్ గా పనిచేశారు. జన బాహుళ్యంలో ప్రాచుర్యంలో ఉన్న పాటలను, కథలను హెలెన్ సేకరించేవారు. అలా దాదాపు ఆమె నాలువేల సాంద్రాయ పాటలను, కథలను సేకరించారు. వాటన్నింటినీ అక్షరీకరిస్తూ అనేక పుస్తకాలు ప్రచురించారు. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అందించిన ఫెలోషిప్ తో రికార్డర్ కొని ఆమె జానపద పాటలను, రికార్డు చేసేవారు. కెనడియన్ మ్యూజియం ఆఫ్ సివిలైజేషన్ కోసం పాటలను కంపోజ్ చేసి రికార్డింగ్ చేశారు. కేవలం కెనడియన్ జానపదసాహిత్యామే కాకుండా గాలీ, జర్మన్, మిక్ మక్, ఆఫ్రికన్  ప్రజల ఆచారాలను సేకరించారు. ఇందుకోసం ఆమె మారుమూల ప్రాంతాల్లోకి కాలినడకన వెళ్లేవారు. అలా ఆమె సేకరించిన జానపదసాహిత్యంలోని పాటలు, కథలు అక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.   దశాబ్దాల పాటు చేసిన పరిశోధనల ఫలితంగా వెలుగులోకి వచ్చిన పాటలు, కథలే కాదు ప్రజల ఆచారాలు, మూఢనమ్మకాలను హెలెన్ పుస్తకాలుగా తీసుకువచ్చారు. జానపదసాహిత్యంలో ఆమె చేసిన కృషికి అనేక గౌరవ డిగ్రీలు అందుకున్నారు. 1976లో ఆర్డర్ ఆఫ్ కెనడాలో సభ్యురాలిగా పనిచేశారు. 12 డిసెంబర్ 1989లో ఆమె చనిపోయిన తర్వాత  ఆమె ఇల్లు, ఎవర్‌గ్రీన్ హౌస్, డార్ట్మౌత్ హెరిటేజ్ మ్యూజియంలో ఒక భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ది ఫ్రాంక్ డేవిస్ లెగసీ అవార్డును అందుకున్న హెలెన్ ను 2018లో జాతీయ చారిత్రక వ్యక్తిగా కెనడా గుర్తించింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్‌.. క్రెడిట్ చంద్రబాబుదే!!

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌(సులభతర వ్యాపార నిర్వహణ)లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌ స్థానం నిలబెట్టుకుంది. 2019 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఇంత‌కు ముందు ఏడాది రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి ఒక స్థానం దిగ‌జారింది. ఇక తెలంగాణ‌ త‌ర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.   కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ లో ఏపీ అగ్ర‌స్థానంలో నిలవ‌డానికి త‌న తండ్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. "ఇది చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేత‌త్వానికి ఓ నిద‌ర్శ‌నం. ఆయన కష్టం వల్లే ఈజ్ ఆప్ డూయింగ్ 2019లో టాప్ లో ఏపీ నిలిచింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను స‌మ‌ర్థంగా అమ‌లు చేసినందుకు ధ‌న్య‌వాదాలు. చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్ కూడా ఏపీలో మంచి ప‌నుల‌ను చేయాల్సింది.. కానీ చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ కీలక ప్రకటన

ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సస్ అవుతారు. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న స్టార్స్ సైతం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఓట్లు సంపాదించటానికి అవస్థలు పడుతుంటారు. అయినప్పటికీ ఎందరో సినీ స్టార్స్  రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు.    తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతుంది. ప్రతి ఏడాది ఆయన ఈ పుట్టినరోజు నాడు పార్టీని ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. తీరా ఆయన పుట్టినరోజు నాడు ఎటువంటి ప్రకటన ఉండదు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న తంతు. మరోవైపు రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తా అంటారు కానీ, ఎప్పుడొస్తారో క్లారిటీ ఇవ్వరు. దీంతో అసలు ఆయన రాజకీయాల్లోకి రారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రజినీకాంత్ పొలిటికల్ పార్టీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్  కీలక ప్రకటన చేశారు. త్వరలో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీలో తాను చేరబోతున్నానని స్పష్టం చేశారు.   రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది అభిమానులు, సన్నిహితులు నన్ను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారందరికీ ఓ శుభ వార్తను చెబుతున్నా. నా గురువు రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతాను. నా సమాజ సేవకు జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారు. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం తప్పడంలేదు. కానీ రజనీకాంత్‌ మాత్రమే విపక్ష నాయకులపై విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయగలరు. అందునే నేను ఆయన దారిలో నడవాలని నిర్ణయించుకున్నా. నాకు సహాయం చేసిన వారిని నేను విమర్శించలేను’ అని లారెన్స్‌ ట్వీట్‌ చేశారు.    లారెన్స్‌ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ ‌టాపిక్ ‌గా మారింది. రజనీకాంత్‌ పార్టీపై తమిళనాడులో మళ్లీ చర్చలు మొదలైయ్యాయి. రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్.. ఉన్నట్టుండి రజనీకాంత్‌ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతానని చెప్పడం చూస్తుంటే.. త్వరలోనే రజనీకాంత్‌ పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.   

అమరావతిలో కలకలం.. అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయం

అమరావతిని నుండి రాజధానిని తరలించొద్దు అంటూ అక్కడి రైతులు 250 కి పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడం కలకలం రేపుతోంది.   అమరావతిలో ఉన్న అంబేడ్కర్‌ స్మృతివనంలో విగ్రహాలు మాయమయ్యాయి. శాఖమూరులో గత టీడీపీ ప్రభుత్వం ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అందులో ఐదు విగ్రహాలు మాయమయ్యాయి. మరో విగ్రహానికి ఉన్న కళ్లద్దాలను పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం దగ్గర ఆందోళనకు దిగారు. విగ్రహాలను మాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, అంబేడ్కర్‌ విగ్రహాలు మాయం కావడంపై అమరావతి రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై మండిపడుతున్నారు. దళిత ఐకాసకు సంఘీభావం పలుకుతూ, వారితో పాటు రైతులు కూడా ఆందోళనలో దిగారు.

బావా త్వరగా రావా.. హరీష్ కు ట్వీట్ చేసిన కేటీఆర్

కరోనా నేపథ్యంలో నిర్వహిస్తున్న అసెంబ్లీ సమావేశాలకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా పాజిటివ్ ఉంటే అసెంబ్లీ సమావేశాలకు నో ఎంట్రీ అన్న విషయాన్ని శాసనసభ, మండలి స్పీకర్లు ఇప్పటికే స్పష్టంచేశారు. ఈ ప్రకటన వెలువడి 24గంటలు గడవకముందే ఆర్థికశాఖమంత్రి టి. హారిష్ రావు తనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, తనను ఈ వారం రోజుల్లో కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ట్విట్టర్ లో తెలిపారు. దాంతో ఒక్కసారిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఎస్ఆర్ నాయకులు ఉలిక్కి పడ్డారు. కరోనా వచ్చినవారు కనీసం 15రోజుల నుంచి 20రోజుల వరకు ఐసోలేషన్ లో ఉండాలి. అయితే  సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ వర్షకాల సమావేశాలకు  హారిష్ రావు పూర్తిగా దూరంగా ఉండనున్నారని వినిపిస్తోంది. ఈ సమావేశాలు ఆర్థిక శాఖ మంత్రి లేకుండానే జరగనున్నాయా అన్న చర్చజరుగుతోంది. అయితే ఆర్థికశాఖ బాధ్యతలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఎవ్వరికి ఇస్తారో అన్న చర్చ కూడా జరుగుతుంది. ఈనెల 7న జరిగే టిఆర్ఎల్ పి సమావేశానికి కూడా హారిష్ దూరంగానే ఉండనున్నారు. ఇక, బావా త్వరగా కోలుకో అంటూ కెటిఆర్ చేసిన ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఈనెల 7 నుంచి కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్

12 కేంద్రాల్లో పరీక్షలకు అనుమతి ఇచ్చిన ఐసీఎంఆర్   ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు బలితీసుకుంటున్న కోవిడ్ 19 వైరస్ ను ఎదుర్కోనేందుకు మన దేశంలో తయారవుతున్న కోవాక్జిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తి అయినట్లు ప్రకటించారు. కోవాక్జిన్ వ్యాక్సిన్ ను పూనే లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ తయారుచేస్తోంది.    ఈ వ్యాక్సిన్ రెండోదశ క్లినికల్ ట్రయల్స్ కు ఇండియాస్‌ డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌ (భారత ఔషధ నియంత్రణ సంస్థ) తాజాగా అనుమతి ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఐసీఎంఆర్ ఎంపిక చేసిన 12 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించనుంది. వ్యాక్సిన్ ఎంత సమర్థంగా పనిచేస్తుందనే అంశంతో పాటు ఈ వ్యాక్సిన ఎంత వరకు సురక్షితం అన్నదే ప్రధానంగా ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి.   ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 120కిపైగా వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. మన దేశానికి భారత్‌కు చెందిన సుమారు ఆరు సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాయి.

మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా వైరస్ అటు సామాన్యులనే కాక ఇటు విఐపిలను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి హరీశ్ రావుకు కరోనా సోకింది. ఈ సంగతిని ఆయనే స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. తనలో కొన్నికొద్దీ రోజులుగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నానని.. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అయితే కొద్దిరోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని అయన కోరారు.

వ్యక్తిత్వాన్ని చెక్కే శిల్పి గురువే

సామాజిక మాధ్యమాల్లో తమ గురువులను మననం చేసుకుంటున్న నెటిజన్లు   ‘‘గురుబ్రహ్మ: గురువిష్ణు: గురుదేవో: మహేశ్వర: గురుసాక్షాత్‌ పరబ్రహ్మ: తస్మైశ్రీ గురవే నమ:’’   బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలగలసిన మూర్తిమత్వం గురువు.  ‘గురువును దైవంగా పూజించే సంప్రదాయం భారతదేశానిది. అందుకే  మన పెద్దలు గురువుకు ప్రముఖ స్థానం ఇచ్చారు.. నిజానికి గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది… అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు గురువు అని అర్థం.  ఒక రాయికి రూపం తేవాలంటే శిల్పి కావాలి. మట్టిలో దొరికిన మాణిక్యానికి మెరుగులు దిద్దితేనే దాని విలువ ప్రపంచానికి తెలుస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగాలంటే, మంచిచెడు విచక్షణతో సమాజంలో జీవించాలంటే అతడికి గురువు మార్గదర్శనం ఉండాలి. అందుకే ఉపాధ్యాయుడు లేని విద్య నిష్ఫలం అని పెద్దలు అంటారు.  మానసిక పరిపక్వత చెందే దశలో పిల్లలకు విద్య, బుద్ధి, క్రమశిక్షణ నేర్పించి,  ఉత్తమ పౌరుడుగా తీర్చిదిద్దేవాడు ` గురువు’. ప్రతి ఒక్కరికీ తల్లే తొలి గురువే. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అన్నారు. అఆలు నేర్పిన ఉపాధ్యాయుడి నుంచి విద్యాభ్యాసం పూర్తయ్యేవరకు పాఠం చెప్పిన ప్రతిఒక్కరూ గురువే. గురువంటే మార్గదర్శి. గురువువంటే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శిల్పి, నైపుణ్యతను జోడించే నేర్పరి. అలాంటి గురుస్థానం నుంచి దేశ ప్రథమ పౌరుడి స్థానం వరకు ఎదిగిన వ్యక్తి భారత రత్న, భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన పుట్టిన రోజైన 5 సెప్టెంబర్ ను ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటాం.   నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్ దాస్.   పుస్తకాలు వేలకొద్దీ ముందున్నా..? వాటిని అర్థం చేసుకుని వాటి పరమార్థాన్ని చెప్పగలిగేవారు లేకుంటే వ్యర్థం. అందుకే గురువు మన జీవితానికి అర్థం చెప్పే ఓ దైవం అన్నారు    దాశరథి కృష్ణమాచార్యులు   పురాణాల్లో, ఇతిహాసాల్లోనూ గురువుకు పెద్దపీఠ వేశారు. గురువులుగా కెరీర్ ను ప్రారంభించి తర్వాత కాలంలో సాహిత్యరంగంలో రాణించిన ప్రముఖ తెలుగు కవులు గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, గుర్రం జాషువ, విశ్వనాథ సత్యనారాయణ, వావిళ్ల రామస్వామి ,  చిలకమర్తి లక్ష్మీనర్సింహం, రాయప్రోలు సుబ్బారావు, జ్యోతిరావు ఫూలే తదితరులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం సాహిత్య సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్న వారిలో అధిక శాతం మంది ఉపాధ్యాయులే ఉన్నారు. గురువులు తమ విధులను చిత్తశుద్ధితో నిర్వహించినపుడే సమాజం జాగృత మవుతుంది. మార్గదర్శకులైన గురువులున్నపుడే జాతి సమున్నత శిఖరాలకు చేరుకుంటుంది.   పూర్వకాలంలో గురుకులాలు ఉండేవి. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు వారి వ్యక్తిత్వాన్ని కూడా ఉన్నతంగా తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉండేది. ఆ తర్వాత విద్యావ్యవస్థలో వచ్చిన మార్పులతో కేవలం విద్యాబోధనకే గురువులు పరిమితం అయ్యారు. ప్రస్తుతం డిజిటల్ విద్యాబోధనలో విద్యార్థులకు, గురువులకు మధ్య ఇంటర్నెట్ చేరింది. తరగతి గది మొబైల్‌లోకి వచ్చిన ప్రస్తుత కాలంలో ఉపాధ్యాయుడి బాధ్యత మరింత పెరిగింది.   ప్రతిఏటా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని అవార్డులతో సత్కరిస్తున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో ఇంటికే పరిమితమై విద్యార్థులు, ఇంటర్నెట్ కే పరిమితమై టీచర్లు ఉంటున్నారు. అయినా గురువు స్థానం గురువుదే. వాట్సాప్ మెసెజ్, ట్విట్టర్లు, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ జీవితంలో మార్పు చెప్పిన గురువుల గురించి మరోసారి మననం చేసుకుంటున్నారు.  

రష్యా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోంది.. కన్ఫామ్ చేసిన లాన్సెట్ జర్నల్ 

రష్యా ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్వి-v" బాగా పనిచేస్తోందని.. వ్యాక్సిన్‌ రెండు దశల ట్రయల్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని తాజాగా మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ తొలి రెండు దశల ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిలోనూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వంద శాతం ఉత్పత్తయ్యాయని ఆ పత్రిక తెలిపింది. దీంతో స్పుత్నిక్‌-v వ్యాక్సిన్ సరిగా పనిచేయదన్న వారికి తొలి రెండు దశల పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ సమాధానమని తాజాగా రష్యా ప్రభుత్వం పేర్కొంది. మొన్న జూన్‌ - జులై నెలలలో వ్యాక్సిన్‌పై జరిపిన రెండు దశల పరీక్షలలో 76 మంది పాల్గొనగా.. వారందరిలో యాంటీబాడీలు పెరిగాయి. అంతేకాకుండా వారిలో ఎవరికీ తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని లాన్సెట్‌ జర్నల్ తెలిపింది.   అయితే మరి అంతా బాగుంటే మరి ఈ వ్యాక్సిన్‌పై విమర్శలు ఎందుకనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ వ్యాక్సిన్ తేవడంలో రష్యా వ్యవహరించిన తీరుతో దీని పై వ్యతిరేకత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అసలు తొలి రెండు దశల ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలపై రష్యా ప్రభుత్వం ప్రపంచానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. దీనికి తోడు మూడు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేయడమే. కానీ రష్యా మాత్రం రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే హడావిడిగా వ్యాక్సిన్ రిలీజ్ చేసేసింది. దీంతో కరొనాకు అది సరైన వ్యాక్సిన్ కాదని ప్రపంచ దేశాలు, నిపుణులు కూడా తిరస్కరించారు. అయితే లాన్సెట్ జర్నల్ కూడా ఈ వ్యాక్సిన్‌కి అప్పుడే పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మరింత భారీ స్థాయిలో ఎక్కువ కాలం పాటు పరీక్షలు జరపాలని కోరింది.   తాజాగా రష్యా గత వారం 40వేల మందిపై ఈ వ్యాక్సిన్ తో ట్రయల్స్ నిర్వహించింది. వాటి ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. అయితే ఈలోగానే రష్యా భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఆఖరికి నెలకు దాదాపు 20 లక్షల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేస్తూ.. క్రమ క్రమంగా నెలకు 60 లక్షల డోసుల్ని తయారుచేస్తామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా రష్యా ప్రభుత్వం ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లకు కూడా సవాల్ విసురుతోంది. మేము తయారు చేసిన వ్యాక్సిన్ పై కామెంట్స్ చేస్తున్న మీరు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఏమాత్రం పనిచేస్తాయో చూస్తాం అంటూ రష్యా అధికారులు సవాల్ విసురుతున్నారు.  

కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉంటేనే అనుమతి

మీడియా పాయింట్ లేదు   తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే వారికి కరోనా నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి. కరోనా మహ్మమారి వ్యాప్తి కారణంగా ఈ మేరకు సరికొత్త నిబంధనలను వెల్లడించారు. ఈనెల 7వ తేదీ, సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశల నియమ నిబంధనలను శాసన సభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.   కరోనా నేపథ్యంలో జరుగున్న అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు అధికారులు, సిబ్బంది, పోలీసులు, మీడియా ప్ర‌తినిధులు, మంత్రుల పీఎస్‌లు, పీఏలు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలన్నారు. ఈ మేరకు కోవిడ్ 19 వైరస్ నిర్ధారణ పరీక్షలను అసెంబ్లీ ఆవరణలో నిర్వహిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ తేలితే అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి రావద్ద‌ని స్పీక‌ర్ సూచించారు. మాస్కు ఉంటేనే స‌భ‌లోకి అనుమ‌తిస్తారు. ప్రభుత్వం తరుపున శాసన సభ్యులు, మండలి సభ్యులకు ఆక్సి మీటర్, శానిటైజేర్, మాస్క్ లు ఉన్న కిట్ ఇస్తున్నారు. అసెంబ్లీలోకి వెళ్లే ప్రతి ఎంట్రెన్స్ వద్ద టెంపరేచర్, ఆక్సిజన్ లేవల్ చెక్ చేస్తారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణంగా ఉండి, జలుబు, దగ్గు వంటి లక్షణాలు లేనివారినే అనుమ‌తి ఉంటుంది.    20రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. అయితే విజిటర్స్ కు అనుమతి లేదు. సభలో సభ్యుల సిట్టింగ్ లోనూ మార్పులు చేశారు. మీడియా పాయింట్ రద్దు చేశారు. ప్రతి పక్షం ఏది మాట్లాడాలన్నా సభలోనే మాట్లాడాలని కోరారు.

మళ్లీ వాయిదా.. తొందరపాటు నిర్ణయాలు.. విపక్షాల ఫైర్! 

ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే పలు అంశాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకుని..  తర్వాత మళ్లీ మార్చుకుంది. కరోనా ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థ రీ ఓపెన్ పైనా జగన్ సర్కార్ నిర్ణయాలు విద్యార్థులు, వారి పేరెంట్స్ ను అయోమయానికి గురి చేశాయి. కేంద్రం లాక్ డౌన్ మార్గదర్శకాల ప్రకారమే ఎడ్యుకేషనల్ సంస్థలు తెరవాల్సిన ఉన్నా.. ఏపీ సర్కార్ మాత్రం ముందే నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేకున్నా సెప్టెంబర్ 5న స్కూల్స్ తెరుస్తామని ప్రకటించింది. ఇంతలోనే కేంద్రం గైడ్ లైన్స్ రావడంతో మళ్లీ అక్టోబర్ 5కు వాయిదా వేసింది.    ఈ విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5 నుంచిపునర్ ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. అదే రోజు జగనన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఏపీలో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైరస్ విస్తరించింది. దీంతో స్కూల్స్ తెరవడం సరికాదని పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు కూడా పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దని, స్కూల్స్ తెరిచే విషయంలో తొందర పడవద్దని సూచించాయి. అయినా స్పందించలేదు జగన్ సర్కార్. సెప్టెంబర్ 5నే విద్యాసంస్థలను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్‌ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో వెనక్కి తగ్గింది ఏపీ సర్కార్. స్కూల్స్ ఓపెనింగ్ ను అక్టోబర్‌ 5కి వాయిదా  వేసింది. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కూడా అదే రోజున నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. గతంలోనూ  ఎలాంటి ప్రణాళిక లేకుండానే, ముందస్తు జాగ్రత్తలు లేకుండానే ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరగడంతో వాయిదా వేసింది.    జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఏపీతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. కాని అక్కడ విద్యాసంస్థలను తెరవాలని అక్కడి సర్కార్ నిర్ణయించలేదు. ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించింది. డీడీతో ఇతర ఛానళ్ల ద్వారా ప్రసారాలు అందిస్తోంది. డిజిటల్ టీచింగ్ కు తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. 90 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వింటున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి. ఏపీ సర్కార్ మాత్రం ఆన్ లైన్ క్లాసుల ఆలోచన చేయకుండా స్కూల్స్ తెరుస్తామంటూ మొండిగా ముందుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో మళ్లీ వాయిదా వేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో డిజిటిల్ టీచింగ్ కొనసాగుతుండగా.. ఏపీలో అందుకు అవకాశం లేకుండా పోయింది. జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల వల్లే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా ఎప్పటికి కట్టడిలోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారంటున్న పేరంట్స్.. ఇప్పటికైనా స్కూల్స్ తెరవడంపై ఫోకస్ చేయకుండా ఆన్ లైన్ క్లాసులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

గన్నవరం వైసీపీలో ఘర్షణ... వెంకట్రావు వర్గీయులపై వంశీ వర్గం దాడి

గన్నవరం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ తరువాతి కాలంలో సీఎం జగన్ సమక్షంలో వైసిపిలో చేరిన దగ్గరి నుండి నియోజకవర్గంలోని ఆ పార్టీ గ్రూఫుల మధ్య ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. వైసీపీకి చెందిన చిన్న అవుటపల్లి మాజీ సర్పంచి కోట వినయ్ తో పాటు మరి కొందరు వైసీపీ కార్యకర్తలపై.. ఎమ్యెల్యే వంశీ అనుచరుల దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన పై బాధితులు ఆత్కురు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో వంశీ పై పోటీ చేసి.. ప్రస్తుతం KDCC చైర్మన్ గా ఉన్న యార్లగడ్డ వెంకటరావు పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చి.. బాధితులకు తాను అండగా ఉంటాననీ, అందుకోసమే పోలీస్ ‌స్టేషన్‌కి వచ్చానని అన్నారు. అంతేకాకుండా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన పోలీసులను కోరారు. దీనిపై ఉన్నతాధికారులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడారు. ఐతే దీని పై పోలీసులు స్పందిస్తూ.. ఘటన పై దర్యాప్తు చేసి... చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సరిహద్దులో ఘర్షణ నేపథ్యంలో.. రాజ్ నాథ్ తో చైనా రక్షణ మంత్రి తొలి భేటీ 

భారత చైనా సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రెండు దేశాల రక్షణ మంత్రులు తొలి సారి భేటీ అయ్యారు. ప్రస్తుతం మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న సాయంత్రం చైనా రక్షణ మంత్రి వీ ఫెంగ్జితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్త పరిస్థితులపై కూడా వీరు చర్చించినట్టుగా తెలుస్తోంది. దాదాపు రెండున్నర గంటలపాటు ఇద్దరి మధ్య ఈ సమావేశం జరిగింది. సరిహద్దులోని వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథస్థితిని కొనసాగించాలని ఈసందర్భంగా రాజ్‌నాథ్ చైనాను కోరారు. అయితే మే నెలలో లడఖ్‌లోని గల్వాన్ లోయలో రెండు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగి రెండు దేశాల సైనికులు కూడా మరణించిన తర్వాత భారత చైనాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే మొదటిసారి.

త్వరలో బైపోల్ షెడ్యూల్.. దుబ్బాకలో వేడీ.. టఫ్ ఫైటే!

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక జరగనుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో అసెంబ్లీ సీటు ఖాళీగా ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ, లోక్ సీట్లకు ఎన్నికలు ఉంటాయని సీఈసీ ప్రకటించింది. దీంతో దుబ్బాకలో రాజకీయం వేడెక్కింది. రామలింగారెడ్డి కుటుంబంలో ఎవరికి టిఆర్‌ఎస్‌ టికెట్‌ ఇచ్చినా… తాము ఇక్కడ పోటీ చేయబోమని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక ఏకగ్రీవం కావచ్చని అనుకున్నారు. అయితే పీసీసీ మాత్రం దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించింది. గ‌తంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మృతి చెందిన ఖేడ్‌, పాలేరులో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల పోటీకి నిలిపింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కూడా దుబ్బాక‌లో అభ్య‌ర్థిని నిల‌బెట్టాలని నిర్ణయించింది.       టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక జరిగిన అన్ని ఉప ఎన్నికల్లోనూ కారు పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే ఈ సారి దుబ్బాక‌లో వార్ వ‌న్‌సైడ్‌గా ఉండే ప‌రిస్థితి కనిపించడం లేదు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోందని వివిధ సంస్థల సర్వేల్లో తేలుతోంది. దుబ్బాక టికెట్ కోసం అధికార పార్టీలో పోటీ కూడా తీవ్రంగా ఉంది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి భార్యకు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నా ఇంకా క్లారిటీ లేదు. రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చే విషయంలో టీఆర్ఎస్ లో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతున్నట్లు చెబుతున్నారు. మాజీ మంత్రి ముత్యంరెడ్డి త‌న‌యుడు శ్రీనివాస్‌రెడ్డి సైతం ఈ సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శ్రీనివాస్‌రెడ్డికి టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వ‌క‌పోతే ఆయ‌న కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి అయినా పోటీ చేస్తార‌న్న టాక్ కూడా ఉంది.    అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కూడా తర్జనభర్జన పడుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మద్దుల నాగేశ్వరరెడ్డిని బరిలోకి దించాలా..? లేక విజయశాంతిని నిలబెట్టాలా అనే ఆలోచనలో ఉంది. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్‌కు గ్రామ స్థాయి వరకూ ఉన్న కార్యకర్తల బలం, విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. రాములమ్మ కూడా పోటీ చేసే విషయంపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు సమాచారం.   బీజేపీ త‌ర‌పున ఆ పార్టీ కీల‌క నేత ర‌ఘునంద‌న్ రావు పేరు దాదాపు ఖ‌రారైంది. ఇప్ప‌టికే ఆయ‌న ప్ర‌చారం కూడా చేప‌ట్టారు. యువ‌కులే టార్గెట్‌గా ఆయ‌న రాజ‌కీయం న‌డుస్తోంది. పలు గ్రామాల్లో జెండా ఆవిష్కరణలు చేస్తూ యువకులను, ఇతర పార్టీల వారిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. ర‌ఘునంద‌న్ రావు ఇక్క‌డ నుంచి 2014, 2018 ఎన్నిక‌ల‌తో పాటు 2019 మెద‌క్ ఎంపీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. బిగ్‌బాస్ ఫేం క‌త్తి కార్తీక ఇప్ప‌టికే దుబ్బాకలో ప్రచారం ప్రారంభించారు. మ‌రో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ప్ర‌చారం ప్రారంభించేశారు. దీంతో ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ రాకుండానే దుబ్బాక రాజ‌కీయం వేడెక్కింది.

కరోనా మరణాలపై తప్పుడు లెక్కలు.. తెలంగాణ సర్కార్ పై హైకోర్టు ఆగ్రహం 

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారికి సంబంధించి ప్రభుత్వం తప్పుడు లెక్కలు సమర్పిస్తోందని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్తత, అదే సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులు కట్టడి విషయంలో ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ మీద హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలను చాలా తక్కువగా రిపోర్టు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రతి రోజు కేవలం 8 లేదా 9, 10 మంది మాత్రమే కరోనా వల్ల చనిపోయారని ప్రభుత్వం రిపోర్టులు ఇవ్వడం మీద కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. దీని పై వెంటనే సమగ్రమైన నివేదిక అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణాలో పబ్లిక్ హెల్త్ పై మార్చి 24 కు ముందు ఎంత ఖర్చు చేశారు.. ఆ తర్వాత ఎంత ఖర్చు పెట్టారో స్పష్టంగా చెప్పాల‌ని కోరింది. ప్ర‌భుత్వ ఆస్ప‌‌త్రుల్లో సిబ్బంది పెంపు, ఇత‌ర సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై కూడా పూర్తి వివ‌రాలు అంద‌జేయాల‌ని సూచించింది. తాము వివరణ కోరిన అంశాల‌న్నింటిపైనా ఈ నెల 22వ తేదీలోగా నివేదిక‌లు ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ తప్పుడు రిపోర్టులు ఇస్తే మ‌రోసారి ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శిని మళ్ళీ కోర్టుకు పిలవాల్సి వస్తుందని హైకోర్టు తీవ్రంగా హెచ్చ‌రించింది. ఈ పిటిషన పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 24కు వాయిదా వేసింది.

గొంతు కేన్సర్ వచ్చి పోతావ్.. ఏపీ మంత్రికి దేవినేని ఉమా స్ట్రాంగ్ కౌంటర్ 

ఏపీలో వైసిపి టీడీపీ నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబును పెద్ద బిచ్చగాడని, అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అడ్డగాడిద అంటూ ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ను ఏకంగా లారీతో తొక్కిస్తానని హెచ్చరించిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. మంత్రి కొడాలి నాని తాటాకు చప్పుళ్లకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరని హెచ్చరించారు. "కొడాలి నాని ఏ మాత్రం చదువు, సంస్కారం లేకుండా మాట్లాడారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చంద్రబాబుపై సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వయస్సు గురించి.. మా చావులు గురించి మాట్లాడితే మీరు చేసిన తప్పులు కనపడకుండా పోతాయా? మీ అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబును, దేవినేని ఉమాను బూతులు తిట్టి దాంతో మీ అసమర్థత కప్పిపుచ్చుకోవచ్చని భావిస్తున్నారా? నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్" అని మంత్రి కొడాలి నాని పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. అంతేకాకుండా లారీలతో గుద్దిస్తానన్న కొడాలి బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలి అని ఉమా కోరారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టి చేతకాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఉమా అన్నారు.

కృష్ణా జిల్లాలో దారుణం.. దళిత యువతి ఇంటిని తగులబెట్టిన వైసీపీ వర్గీయులు!!

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో దారుణం జరిగింది. ప్రేమించి మోసం చేశాడంటూ ఆగ్రకులానికి చెందిన యువకుడిపై ఓ దళిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ యువకుడికి సంబంధించిన వ్యక్తులు.. ఆ యువతి ఇంటిపై దాడి చేసి ఇంటిని తగులబెట్టారు.   వడాలికి చెందిన సాయిరెడ్డి అనే యువకుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ అయినంపూడికి చెందిన దళిత యువతి మచ్చా ధనలక్ష్మి ఇటీవల ముదినేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు ప్రస్తుతం సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.     ఈ క్రమంలో అధికార పార్టీకి చెందినవారమంటూ కొందరు బాధితురాలి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు దిగారు. కేసును విరమించుకుని రాజీకి రాకపోతే ప్రాణాలకు సైతం ముప్పు ఉంటుందని హెచ్చరించడమే కాకుండా.. కుటుంబ సభ్యులపై దాడి చేశారు. దీంతో.. తమ ఇంటిపై దాడి చేసి, తమపై దౌర్జన్యం చేశారని వారం క్రితం బాధితురాలి సోదరుడు మచ్చ సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అయినా అధికార పార్టీకి చెందిన వారు ఆ కుటుంబంపై ఒత్తిళ్లు కొనసాగించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాధితురాలి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధం కాగా, ఆ కుటుంబం మాత్రం ప్రాణాలతో బయటపడింది. తాము రాజీకి రాలేదన్న కక్షతోనే సాయిరెడ్డి తన వర్గంతో కలిసి తమ కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపిస్తూ.. దీనిపై సుబ్రహ్మణ్యం బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటానని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు.    అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన పాపానికి ఆ కుటుంబానికి నిలువనీడ లేకుండా చేశారంటూ అధికార పార్టీకి చెందిన వారిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది భయానకమైన ఘటన అని అన్నారు. మచ్చా ధనలక్ష్మి అనే దళిత మహిళకు చెందిన ఇంటిని వైసీపీ వర్గీయులు తగలబెట్టారని, వైసీపీ వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడ్డారు. గత 15 నెలలుగా ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు.

చంద్రబాబు పెద్ద భిక్షగాడు.. అచ్చెన్నాయుడు అడ్డగాడిద.. మంత్రి భాష!!

ఎన్ని విమర్శలు ఎదురైనా, ఎవరేమనుకున్నా.. తన మాట తీరు ఇంతేనని ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి రుజువు చేశారు. తాజాగా ఆయన టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తనను బూతుల మంత్రి అని అంటున్నారని, తాను బూతులు తిడితే అసలు దేవినేని ఉమా, చంద్రబాబు బతికి ఉంటారా? అని వ్యాఖ్యానించారు.   నేను లారీ డ్రైవర్ అయితే.. నువ్వేమైనా మైసూర్‌ మహారాజువా?. దేవినేని ఉమా తండ్రి సోడాలు కొట్టేవాడు.. వాటిని ఈయన కడిగేవాడు అంటూ దేవినేని ఉమాపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవినేని ఉమా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. చంద్రబాబే పెద్ద భిక్షగాడని.. తనకు రాజకీయ భిక్ష పెట్టడమేంటని విరుచుకుపడ్డారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ కుటుంబం అని నాని చెప్పుకొచ్చారు.   అంతేకాదు, ఆపరేషన్ జరిగిన మరుసటి రోజే ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టై.. చాలారోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిపై కూడా నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అచ్చెన్నాయుడిలా 70 రోజుల పాటు..ఆస్పత్రిలో పడుకున్న అడ్డగాడిద ఎవరూ లేరని విమర్శించారు.   రైతులకు 'ఉచిత విద్యుత్‌- నగదు బదిలీ' పథకంపై మీడియాలో మాట్లాడుతూ మంత్రి కొడాలి నాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా సన్న బియ్యం విషయంలో 'నీ అమ్మ మొగుడు చెప్పాడా' అంటూ నాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలు సందర్భాల్లో ఆయన భాష తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయినా ఆయన తీరు మారలేదు. తాజాగా భిక్షగాడు, అడ్డగాడిద అంటూ మరోసారి విపక్ష నేతలపై వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారితీస్తోంది.