రష్యా వ్యాక్సిన్ అద్భుతంగా పనిచేస్తోంది.. కన్ఫామ్ చేసిన లాన్సెట్ జర్నల్
posted on Sep 5, 2020 @ 10:31AM
రష్యా ప్రభుత్వం హడావిడిగా తీసుకొచ్చిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్వి-v" బాగా పనిచేస్తోందని.. వ్యాక్సిన్ రెండు దశల ట్రయల్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని తాజాగా మెడికల్ జర్నల్ లాన్సెట్ పేర్కొంది. ఈ వ్యాక్సిన్ తొలి రెండు దశల ట్రయల్స్‌లో పాల్గొన్న అందరిలోనూ కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు వంద శాతం ఉత్పత్తయ్యాయని ఆ పత్రిక తెలిపింది. దీంతో స్పుత్నిక్-v వ్యాక్సిన్ సరిగా పనిచేయదన్న వారికి తొలి రెండు దశల పరీక్షల్లో వచ్చిన రిజల్ట్స్ సమాధానమని తాజాగా రష్యా ప్రభుత్వం పేర్కొంది. మొన్న జూన్ - జులై నెలలలో వ్యాక్సిన్‌పై జరిపిన రెండు దశల పరీక్షలలో 76 మంది పాల్గొనగా.. వారందరిలో యాంటీబాడీలు పెరిగాయి. అంతేకాకుండా వారిలో ఎవరికీ తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్ రాలేదని లాన్సెట్ జర్నల్ తెలిపింది.
అయితే మరి అంతా బాగుంటే మరి ఈ వ్యాక్సిన్‌పై విమర్శలు ఎందుకనే ప్రశ్న కూడా వస్తుంది. ఈ వ్యాక్సిన్ తేవడంలో రష్యా వ్యవహరించిన తీరుతో దీని పై వ్యతిరేకత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. అసలు తొలి రెండు దశల ట్రయల్స్‌లో వచ్చిన ఫలితాలపై రష్యా ప్రభుత్వం ప్రపంచానికి ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు. దీనికి తోడు మూడు దశల ట్రయల్స్ విజయవంతంగా పూర్తైన తర్వాతే వ్యాక్సిన్ విడుదల చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేయడమే. కానీ రష్యా మాత్రం రెండు దశల ట్రయల్స్ పూర్తవగానే హడావిడిగా వ్యాక్సిన్ రిలీజ్ చేసేసింది. దీంతో కరొనాకు అది సరైన వ్యాక్సిన్ కాదని ప్రపంచ దేశాలు, నిపుణులు కూడా తిరస్కరించారు. అయితే లాన్సెట్ జర్నల్ కూడా ఈ వ్యాక్సిన్‌కి అప్పుడే పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీనిపై మరింత భారీ స్థాయిలో ఎక్కువ కాలం పాటు పరీక్షలు జరపాలని కోరింది.
తాజాగా రష్యా గత వారం 40వేల మందిపై ఈ వ్యాక్సిన్ తో ట్రయల్స్ నిర్వహించింది. వాటి ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. అయితే ఈలోగానే రష్యా భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ సంవత్సరం ఆఖరికి నెలకు దాదాపు 20 లక్షల వ్యాక్సిన్ డోసుల్ని ఉత్పత్తి చేస్తూ.. క్రమ క్రమంగా నెలకు 60 లక్షల డోసుల్ని తయారుచేస్తామని స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా రష్యా ప్రభుత్వం ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లకు కూడా సవాల్ విసురుతోంది. మేము తయారు చేసిన వ్యాక్సిన్ పై కామెంట్స్ చేస్తున్న మీరు తయారు చేస్తున్న వ్యాక్సిన్లు ఏమాత్రం పనిచేస్తాయో చూస్తాం అంటూ రష్యా అధికారులు సవాల్ విసురుతున్నారు.