ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు ఆద్యురాలు

లిల్లీ పౌలెట్ హారిస్ (2 సెప్టెంబర్ 1873 - 15 ఆగస్టు 1897)   మహిళలంటే వంటింటికే పరిమితం అనుకునే రోజుల్లోనే క్రీడారంగంలోనూ రాణించిన మహిళ లిల్లీ పౌలెట్ హారిస్. 18వ శతాబ్దంలోనే ఆస్ట్రేలియాలో మహిళా క్రికెట్ జట్టును ఆమె స్థాపించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా క్రికెట్ జట్టులో ఆస్ట్రేలియాదే అగ్రస్థానం. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది.    2 సెప్టెంబర్ 1873 న లిల్లీ పౌలెట్, వైలెట్ కవలలుగా జన్మించారు. ఆమె తండ్రి రిచర్డ్ డియోడాటస్ పౌలెట్-హారిస్, తల్లి ఎలిజబెత్ ఎలియనోర్. తండ్రి హోబర్ట్ బాయ్స్ హైస్కూల్ హెడ్ మాస్టర్, టాస్మానియా విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు. విద్యలోనూ రాణించిన లిల్లీ వయోలిన్, పియానో వాయిస్తూ సంగీతంలో ప్రతిభ కనపరిచారు. దాంతో పాటు బ్యాట్ పట్టుకుని గ్రాండ్ లో ఆడడం చిన్నప్పటి నుంచి  ఆమెకు ఎంతో ఇష్టం. గుర్రపుస్వారీ, సైక్లింగ్ లోనూ ఆమె చురుగ్గా పాల్గొనేవారు. క్రమంగా క్రికెట్ వైపు ఆమె ఆసక్తిని పెంచుకున్నారు. ఆమె అభిరుచిని తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించారు. 1894లో స్థానిక మహిళల కోసం ఓయిస్టర్ కోవ్ లేడీస్ క్రికెట్ క్లబ్ ను ఆమె ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా కాలనీల్లో మొదటి క్రికెట్ క్లబ్ గా పేరుగాంచింది. ఆ తర్వాత ఆమె క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ తన జట్టును విజయాల దిశగా పరుగులు తీయించారు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు. అయితే క్షయవ్యాధి కారణంగా లిల్లీ క్రికెట్ ఎక్కువ రోజులు ఆడలేకపోయారు. అతి చిన్నవయసులోనే 15 ఆగస్టు 1897లో లిల్లీ మరణించినప్పటికీ క్రికెట్ రంగంలో ఆమె సేవలు చిరస్మరణీయం.   ఓయిస్టర్ క్లబ్ ఆస్ట్రేలియాలో జాతీయస్థాయిలో మహిళా క్రికెట్ టీమ్ ఏర్పడడానికి పునాదులు వేసింది. మహిళల క్రికెట్ ను ఆమే ప్రారంభించింది అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ టీమ్ అంతర్జాతీయ పోటీల్లోనూ విజేతగా నిలుస్తోంది. 1978లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించారు. ఆ తర్వాత 1982, 1988, 1997, 2005 , 2013 లో మరో ఐదు సందర్భాలలో టైటిల్‌ను సాధించారు.  1973 ప్రపంచ కప్‌లో వారి మొదటి మ్యాచ్ నుండి ఇప్పటివరకు  254 వన్డేలు (వన్డే ఇంటర్నేషనల్స్) ఆడారు. ఇప్పటివరకు వన్డే జట్టులో 122 మంది మహిళలు ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించారు. మహిళల టీ20 ప్రపంచ కప్‌లో గత మూడు సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మహిళా జట్టు ట్రోఫీని సొంతం చేసుకుంటుంది. ఆస్ట్రేలియాలో అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడా జట్టుగా నిలిచింది. ఒక మహిళకు క్రికెట్ పై ఉన్న ఆసక్తి ఈ రోజు ఇన్ని విజయాలకు కారణం అయ్యింది.

త్వరలో హైదరాబాద్ మెట్రో పరుగులు.. సిటీ బస్సులు మాత్రం..

కేంద్ర ప్రభుత్వం అన్ లాక్-4 లో భాగంగా అనేక సడలింపులు ఇస్తూ మెట్రో రైళ్లను నడిపే విషయంలో మాత్రం నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. దీంతో ఈ నెల 7 నుంచి హైదరాబాద్ మెట్రో రైళ్లను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, నగరంలోని సామాన్యులకు అందుబాటులో ఉండే సిటీ బస్సుల విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సిటీ బస్సులు నడిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ప్రభుత్వం నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి సంకేతాలు అందలేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.   ఇది ఇలా ఉండగా ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయం మరోలా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెట్రో రైళ్లలో అయితే ప్రయాణికులను నియంత్రించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను పాటించేందుకు అవకాశం ఉంటుందని.. అదే సిటీ బస్సుల విషయంలో ప్రయాణికులను నియంత్రించడం సాధ్యం కాకపోవచ్చని అంటున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో మరీ ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికి కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్న నేపథ్యంలో సిటీ బస్సులు నడిపితే పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. సిటీ బస్సుల విషయంలో మాత్రం మరికొంతకాలం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. పవన్ అభిమానులు ఐదుగురు దుర్మరణం!

ఈ తెల్లవారుజామున వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. దామెర మండలం పసరగొండ దగ్గరలో ఈ ఘటన జరిగింది. మరణించిన వారంతా జిల్లాలోని పోచం మైదాన్ కు చెందిన వారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలను బయటకు తీయడానికి రెండు గంటలు శ్రమించినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రాథమిక ఆధారాలను బట్టి, ముందు వెళుతున్న ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ శ్రీనివాస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం వరంగల్ లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్టుగా తెలిపారు.   కాగా, రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు యువకులు పవన్ కళ్యాణ్ అభిమానులని తెలుస్తోంది. ఈరోజు పవన్ పుట్టినరోజు కావడంతో రాత్రి పుట్టినరోజు వేడుకలు నిర్వహించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మరోవైపు, చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా పవన్ అభిమానులు ముగ్గురు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ కరెంట్ షాక్ తగిలి మరణించారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చారు.

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు 14వ తేదీ నుంచి..

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఈనెల 14న తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ ఒకటో తేదీ వరకు సమావేశాలను నిర్వహిస్తారు. ఈ నెల 14వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు దిగువ స‌భ‌లో స‌మావేశం కావాల‌ని రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ తెలిపినట్లు లోక్‌స‌భ సెక్ర‌టేరియేట్ నోటికేష‌న్‌లో  ప్రకటించారు. అదే రోజున రాజ్య‌స‌భ కూడా సమావేశం అవుతుంది. అయితే రెండు సభల ప్రారంభ సమయాల్లో వ్యవధి ఉంటుంది.    కోవిద్ 19 కారణంగా కట్టుదిట్టమైన చర్యలను తీసుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ వెల్లడించింది. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిద్ నిబంధనలు సభ్యులంతా తప్పనిసరిగా పాటించాలని సూచించారు. చర్చించాల్సిన అంశాలు ఎక్కువగా ఉన్నందున పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల‌ను దాదాపు 15రోజులు (అక్టోబ‌ర్ ఒక‌టో తేదీ వ‌ర‌కు) నిర్వ‌హించాల‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల క్యాబినెట్ క‌మిటీ సిఫార‌సు చేసింది. కరోనా నియంత్రణ చర్యలు, వ్యాక్సిన తయారీ, సరిహద్దుల్లో పరిస్థితులు, ఆర్థిక మాంద్యం ఎదుర్కోనే అంశాలు, రాష్ట్రాలకు నిధులు తదితర అంశాలపై చర్చ జరగనుంది   తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 20రోజుల పాటు ఈనెల ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు దాదాపు 20రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున 20 రోజులపాటు సభ నిర్వహించే అవకాశాలున్నాయి.

మహిళలకు ఓటు హక్కు కల్పించాలని..

హ్యారియెట్ షా వీవర్ (1 సెప్టెంబర్ 1876 - 14 అక్టోబర్ 1961)   తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరణలో పెడతారు కొందరు. తాను నమ్మి, ఆచరిస్తున్న వాటిని ఇతరుల కూడా ఆచరించేలా అవగాహన కల్పిస్తారు మరికొందరు. వీరు కార్యకర్తలుగా, నాయకులుగా సమాజంలో మార్పునకు దోహదపడతారు. ఈ కోవలోనే వస్తారు హ్యారియెట్. ఆమె ఒకవైపు రాజకీయ, సాహిత్య కార్యకర్తగా పనిచేస్తూ మరోవైపు పత్రికాసంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.   హ్యారియెట్ ఫ్రోడెషమ్ లో ధనిక కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ వీవర్, డాక్టర్ ఫ్రెడెరికి వీవర్. హ్యారియెట్ బడికి వెళ్ళకుండా ప్రైవేటుగా చదువుకున్నారు. సామాజిక రాజకీయ అంశాలపై అపారమైన అవగాహన పెంచుకుంటూ సామాజిక కార్యకర్తగా మారారు. మహిళలకు ఓటు హక్కు కల్పించాలని జరిగిన పోరాటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. ఉమెన్స్ సోషల్ అండ్ పొలిటికల్ యూనియన్ లో సభ్యురాలిగా చేరారు. డోరా మార్క్ డెన్, మేరీ గౌత్రోవే ఆధ్వర్యంలో వెలువడుతున్న ఫెమినిస్ట్ వీక్లీ ది ఫ్రీ ఉమెన్ లో చేరారు. ఆ తర్వాత ఆమె ఈ పత్రికకు ఎడిటర్ గా బాధ్యతలు తీసుకుని పత్రిక పేరును ది న్యూ ఫ్రీ ఉమెన్ గా మార్చారు.  ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోంటూ సాహిత్య పత్రిక సంపాదకుడు ఎజ్రా పౌండ్ సలహా మేరకు పత్రిక పేరును ది ఎగోయిస్ట్ గా మార్చారు. కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూ పత్రికలను పాఠకులకు చేరువ చేస్తూ ఆర్థిక నష్టాల నుంచి బయటపడ్డారు. మహిళలకు ఓటు హక్కు సాధించడంలో ఆమె పత్రిక కూడా ఉపయోగపడింది.   మహిళా హక్కులను కాపాడే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆమె సేకరించిన సాహిత్యం బ్రిటిష్ లైబ్రరీకి, నేషనల్ బుక్ లీగ్ కు అందించారు.

స్టీఫెన్ రవీంద్రకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 10శాతం మంది పోలీసులు కరోనా బారిన పడ్డారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర కరోనా బారినపడ్డారు. సోమవారం కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయిన రిపోర్టు మంగళవారం వచ్చింది. దాంతో గత వారం రోజుల్లో తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కరోనా టెస్ట్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. డాక్టర్ల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్ లో రవీంద్ర ఉంటారు.   కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందువరుసలో నిలబడిన పోలీసులు, వైద్యసిబ్బంది, పారిశుద్ధకార్మికులు, జర్నలిస్టులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. వైద్యసిబ్బంది సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కరోనా బారిన పడిన వైద్యసిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిలో 50బెడ్స్ కూడా ప్రత్యేకంగా కేటాయించారు.

మావోయిస్టు అగ్రనేత గణపతికి గ్రీన్ సిగ్నల్!!

మావోయిస్ట్ అగ్రనేత గణపతి(ముప్పాల లక్ష్మణరావ్) లొంగిపోనున్నట్లు వస్తున్న వార్తలపై తెలంగాణ పోలీసులు స్పందించారు. గణపతి లొంగిపోవాలనుకుంటే స్వాగతిస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. బంధువులు, మిత్రుల ద్వారా లొంగిపోవాలనుకున్నా లేదా వేరే ఎవరి ద్వారా లొంగిపోయినా పూర్తిగా సహకరిస్తామని తెలిపారు. గతంలో లొంగిపోయిన జంపన్న, సుధాకర్‌ లాంటి వారికి ఏ విధంగా సహకరించామో గణపతికి కూడా అలాగే వ్యవహరిస్తామని పోలీసు అధికారులు తెలిపారు.    పునరావాస ప్రక్రియ కింద ఇప్పటి వరకు 1,137 మంది లొంగిపోయారని తెలిపారు. లొంగుబాటు ప్రక్రియకు పూర్తిస్థాయిలో ద్వారాలు తెరిచే ఉన్నాయని చెప్పారు. గణపతికి మానవతా ధృక్పథంతో తాము పూర్తిగా సహాయ, సహకారాలను అందిస్తామని స్పష్టం చేశారు. గణపతితో పాటు వేణుగోపాల్ కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం ఉందని చెప్పారు. ఇతర మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంటే సంప్రదించవచ్చని తెలంగాణ పోలీస్ శాఖ భరోసా ఇచ్చింది.

ఆ జ్యోతిర్లింగ క్షేత్రంలో పూజల పై సుప్రీం కోర్టు సెన్సేషనల్ తీర్పు 

మన దేశంలో గల 12 జ్యోతిర్లింగ క్షేత్రాలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన ఉజైన్ కు చెందిన మహాకాళేశ్వర ఆలయం కూడా ఎంతో విశిష్టమైంది. ఎంతో పురాతనమైన ఘన చరిత్ర కలిగిన ఈ మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో పూజల పై మంగళవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇక్కడ శివలింగం క్షీణిస్తున్నందున గర్భగుడిలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ఈ ప్రముఖ జ్యోతిర్లింగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈరోజే ఆయన సుప్రీం కోర్టు జడ్జిగా అయన పదవీ విరమణ కూడా చేయబోతున్నారు. దాదాపు మూడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసులో కేవలం శివుడి అనుగ్రహం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.   సుప్రీం కోర్టు తాజాగా మహాకాలేశ్వర్ ఆలయంలో పూజల విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలు ఇవే: ఆలయంలోని శివలింగాన్ని ఎవరూ చేతులతో రుద్దకూడదు. శివలింగంపై పెరుగు, నెయ్యి, తేనె పోసి మర్దన చేయకూడదు. శివాలయం గర్భ గుడిలోకి భక్తులెవరినీ అనుమతించకూడదు కేవలం స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన నీటిని మాత్రమే శివలింగం పై పడేలా పోయాలి. ఇప్పటి నుండి నిబంధనలను ఉల్లంఘించిన పూజారులపై ఆలయ కమిటీ చర్యలు తీసుకుంటుంది.   అయితే ఉజ్జయిని లోని మహా కాళేశ్వర్ ఆలయంలో శివలింగం క్షీణిస్తోందని కాబట్టి భక్తులను లోపలికి అనుమతించకూడదని, అభిషేకాలు కూడా చేయకూడదని కోరుతూ 2017లో సారికా గురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఆలయాన్ని సందర్శించి, పరిస్థితిని సమీక్షించి నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ ఆలయాన్ని సందర్శించి తాజాగా పలు సూచనలు చేసింది. వీలైనంత తక్కువ పూజా ద్రవ్యాలతో మాత్రమే పూజలు చేయాలని.. ఆర్‌వో నీటితోనే అభిషేకం చేయాలని తెలిపింది. ఈ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఈరోజు జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెల్లడించింది.

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్

ఏపీ మంత్రి పెద్దిరెడ్డికి కరోనా పాజిటివ్ ఏపీలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటు సామాన్య ప్రజల నుండి అటు విఐపిల వరకు ప్రస్తుతం అందరిని కరోనా చుట్టేస్తోంది. ఈ రోజు ఉదయం ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కు కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో క్యాబినెట్ లో సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొద్దీ రోజుల క్రితం వైసిపి నేతలు విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు లు కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే.

బొమ్మ.. వామ్మో..

బొమ్మల మార్కెట్ 66వేలకోట్లపైనే..   చిన్నారుల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను పెంచుతూ మనోవికాసానికి ఉపయోగేవాటిలో బొమ్మలదే అగ్రస్థానం. ఒక్కప్పుడు మట్టితో, కర్రతో, లక్కతో బొమ్మలను తయారుచేసేవారు. కాలక్రమేణా వస్తువుల తయారీలో ప్లాస్టిక్ వచ్చి చేరడంతో వివిధ రంగుల్లో, రూపాల్లో బొమ్మలను తయారు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బొమ్మల పరిశ్రమ టర్నోవర్ దాదాపు తొంభై బిలియన్ల యూస్ డాలర్లు. అంటే మన కరెన్సీలో 66,18,83,25,00,00 రూపాయలు అన్నమాట. వేల కోట్ల టర్నోవర్ జరుగుతుంది కాబట్టే మన ప్రధానమంత్రి నోట బొమ్మల మాట వచ్చిందన్నమాట. వామ్మో బొమ్మ అని ఇప్పుడు అనండి.   పూర్వకాలంలో మట్టిపిడతలు, కొయ్యబొమ్మలతో పిల్లలు ఆడుకునేవారు. మన దేశంలో బొమ్మల తయారీకి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ, పారిశ్రామికరణ నేపధ్యంలో అన్ని రంగాల్లో మాదిరిగానే బొమ్మల పరిశ్రమలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చి లోకల్ బొమ్మలకు గిరాకీ తగ్గిపోయింది. చిన్నారుల చేతిలో గిల్లక్కాయ కూడా ఇంపోర్ట్ చేసుకున్నదే. ఇప్పుడు కేంద్రప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ నినాదంతో తిరిగి స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించే పనిలో నిమగ్నమైంది. ఆటవస్తువుల తయారీలో, చవకైన వస్తువుల తయారీలో ప్రపంచ మార్కెట్ ను ఆక్రమించిన చైనాను దెబ్బకొట్టడం కూడా ఎత్తుగడే. ఏదీ ఏమైనా మన చిన్నారులకు కావల్సిన బొమ్మలను మనమే తయారుచేసుకుందాం అంటూ ప్రధాని మోడీ పిలుపు ఇవ్వడంతో ఆయారాష్ట్రాలు తమ రాష్ట్రంలో కనిపించకుండా పోయిన బొమ్మలను.. బొమ్మల పరిశ్రమలను, తయారీదారులను వెతుకుతున్నారు.   400 వందల ఎకరాల్లో.. కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే మొదటి అతి పెద్ద బొమ్మల పరిశ్రమ తమ రాష్ట్రంలోని కొప్పాలలో అభివృద్ధి చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. బొమ్మల తయారీ కోసం తమ రాష్ట్రానికి ఐదువేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని, దాదాపు 40వేల మందికి ఉపాధి లభిస్తుందని లెక్కలు వేస్తున్నారు. నాలుగువందల ఎకరాల్లో అత్యంత విశాలంగా పరిశ్రమను నెలకొల్పి ఆధునిక ఆటవస్తువులను తయారుచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మానవ నాగరికతలో బొమ్మలు భారతీయ సంస్కృతిలో, సంప్రదాయంలో బొమ్మలకు విశేషస్థానం ఉంది. అనేక జానపద కథలు, ఇతిహాసాలు,పురాణాల్లో బొమ్మల ప్రస్తావన ఉంది. బొమ్మలతో కథలు చెప్పే విధానం చాలా పురాతనమైంది. చిన్నారుల్లో, సృజనాత్మక మానసిక వికాసం పెంచేలా ఈ బొమ్మలు ఉండేవి. వివిధ ఆకారాలు, సైజుల్లో బొమ్మలు తయారుచేసే వృత్తిపై ఆధారపడిన కళాకారుల కుటుంబాలు వేలసంఖ్యలో ఉన్నాయి. కలప, రాయి, బంకమట్టి, వస్త్రం, జంతువుల తోలు మొదలైన వాటిని బొమ్మల తయారీలో వాడుతారు.    బొమ్మలతో ఆడుకోవడంతో పిల్లలు మొదటి పాఠాలను నేర్చుకుంటారు.  సమాజంలోని సామాజిక-సాంస్కృతిక చరిత్రను ప్రతిబింబిస్తాయి. రాతితో చెక్కబడిన బొమ్మల నుంచి అత్యంత ఆధునిక బార్బీ బొమ్మల వరకు, మానవ నాగరికత బొమ్మలలో ప్రతిబింబిస్తుంది.   దేశం పేరుగాంచిన బొమ్మల తయారీ ప్రాంతాలు భారతదేశంలో, సింధు లోయ నాగరికత ఉన్న ప్రదేశం నుండి వెలికితీసిన తొలి బొమ్మలు ఐదువేల సంవత్సరాల నాటివి. బొమ్మల సంస్కృతి ఇప్పటికీ మనుగడలో ఉన్నా వాటి రూపురేఖలు, తయారీ విధానం, ఉపయోగించే ముడిపదార్థంలో మార్పులు వచ్చాయి. భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి బొమ్మలు తయారు చేయడంలో ప్రత్యేకమైన శైలి ఉంది. ప్రతి బొమ్మకు స్వంత కథ ఉంది. బొమ్మల తయారీకి సాంప్రదాయ కేంద్రాలుగా అనేక ప్రాంతాలు పేరుగాంచాయి. తెలంగాణలోని నిర్మల్, ఆంధ్రప్రదేశ్ లోని కొండపల్లి కొయ్యబొమ్మలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని చన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబ్రీ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి వంటి బొమ్మల తయారీ కేంద్రాలు ఎన్నో ఉన్నాయి.   ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుమేరకు దేశంలోని బొమ్మల తయారీ కేంద్రాలన్నీ కళకళలాడి.. కళాకారులకు చేతినిండ పని.. చిన్నారులకు ఆరోగ్యకరమైన బొమ్మలు అందితే వోకల్ ఫర్ లోకల్ నినాదం నిజమైనట్లే..

ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ.. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందే!!

జీఎస్టీ కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. జీఎస్టీ కొత్త ప్రతిపాదనలపై నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. జీఎస్టీ నిర్ణయాలు అన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవేనని విమర్శించారు. రుణాల‌పై ఆంక్ష‌లు స‌రైందికాద‌న్న కేసీఆర్.. కేంద్రం ప్ర‌తిపాద‌న‌లు ఫెడ‌ర‌ల్ స్ఫూర్తికి వ్య‌తిరేక‌మ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.    క‌రోనా కార‌ణంగా ఆదాయం ఘోరంగా ప‌డిపోయింద‌ని.. జీఎస్టీ బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితే.. దేశాలు అభివృద్ధి చెందిన‌ట్టేన‌ని.. బ‌ల‌మైన రాష్ట్రాలు ఉంటేనే దేశంకూడా బ‌లోపేతం అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.    కేంద్రం రుణం తీసుకుని రాష్ర్టాల‌కు పూర్తిగా ప‌రిహారం ఇవ్వాల‌ని, ప‌రిహారం త‌గ్గించాల‌ని తీసుకున్న నిర్ణ‌యం ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేసీఆర్ కోరారు. న‌ష్టం జ‌రుగుతుంద‌ని తెలిసినా తెలంగాణ ప్ర‌భుత్వం జాతీయ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును స‌మ‌ర్థించిందని, మొట్ట‌మొద‌లు స్పందించి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపింది త‌మ ప్ర‌భుత్వ‌మేన‌ని గుర్తు చేశారు. ప్ర‌తి రెండు నెల‌ల‌కోసారి పూర్తి జీఎస్టీ ప‌రిహారం చెల్లించే విధంగా చ‌ట్టంలో క‌చ్చితంగా నిబంధ‌న ఉన్నా.. జీఎస్టీ ప‌రిహారం చెల్లింపులో జాప్యం కొన‌సాగుతోంద‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మొత్తం చెల్లించాల్సిందేనని సీఎం కేసీఆర్ కోరారు.

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్రకోణం.. సీబీఐ దర్యాప్తుతో ప్రభుత్వం ఇరుకున పడనుందా?

జగన్ సర్కార్ కు కోర్టుల్లో అనేక సందర్భాల్లో ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో ప్రభుత్వం అభాసుపాలైంది. పదేపదే కోర్టుల్లో అక్షింతలు పడటంతో.. చివరికి ఆయనను ఎస్ఈసీగా నియమించక తప్పలేదు. ఓ రకంగా ఇది జగన్ సర్కార్ కి మాయని మచ్చలా మిగిలిపోతుందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం కూడా ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బతీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   డాక్టర్ సుధాకర్ అంశం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని, వైద్యుల రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని డాక్టర్ సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేశారు. మాస్క్ లు ఇవ్వమని అడిగినందుకు సస్పెండ్ చేయడం ఏంటని విమర్శలు వ్యక్తమైనా ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతేకాదు, ఆయన పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఆయనను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్తూ విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మానసిక స్థితి బాలేదని చెప్తూ ఆయనను మానసిక వైద్యశాలలో చేర్పించారు. సాధారణంగా ఉన్న తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్‌ లేఖ కూడా రాశారు. ఈ మొత్తం వ్యవహారం హైకోర్టుకి చేరడంతో.. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.   తాజాగా డాక్టర్ సుధాకర్ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 11న పూర్తి స్థాయి నివేదికను అందించాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 16వ తేదీకి వాయిదా వేసింది.   కాగా, సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని సీబీఐ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మాస్క్ లు అడిగిన పాపానికి సుధాకర్ ని పిచ్చి వాడిగా ముద్ర వేసారని.. మొదటి నుండి సుధాకర్ తల్లి, విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు మాత్రం ఆయన వెనుక ప్రతిపక్ష పార్టీ ఉందని, ఆయన తాగి న్యూసెన్స్ చేసారని, ఆయన పిచ్చి వాడని ఆరోపించారు. కానీ తాజాగా  సీబీఐ సుధాకర్ కేసులో కుట్రకోణం దాగి ఉందని చెప్పడం.. ప్రభుత్వ పెద్దల్ని ఇరుకున పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారాన్ని వైద్య, దళిత సంఘాలు సీరియస్ గా తీసుకున్నాయి. ఈ కేసులోని  కుట్రకోణం బయటపడితే ప్రభుత్వ మరోసారి అభాసుపాలయ్యే అవకాశముందని అంటున్నారు. దళిత డాక్టర్ పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముంది.    తాజాగా ఇదే అంశంపై టీడీపీ నేత వర్ల రామయ్య ట్విట్టర్ ద్వారా స్పందించారు. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రీకరించేందుకు కుట్ర జరుగుతోందని తాము ఎంత మొర పెట్టుకున్నా వినలేదని విమర్శించారు. ఇప్పుడు, సీబీఐ అందులో కుట్ర దాగి ఉందని హైకోర్టు కు చెప్పింది అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోకుండా అసలు ముద్దాయిలు అరెస్ట్ అయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నామని వర్ల రామయ్య పేర్కొన్నారు.

భవిష్యత్ లో భూగోళం

2030లో కృత్రిమ రక్తం ఉత్పత్తి   2040లో వాణిజ్యవనరుగా అణుశక్తి   2050లో మూన్ టూర్ ఫర్ కామన్ మ్యాన్   ప్రపంచం రేపు ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఉంటుంది. అందుకే 2050 వరకు అంటే మరో మూడుదశాబ్దాల్లో ఈ భూగోళంపై మానవ జీవితంలో వచ్చే మార్పులను ఇలా అంచనా వేస్తున్నారు. మరి ఆ మార్పులేంటో దశాబ్దాల వారీగా మనం తెలుసుకుందామా..   2030 నాటికీ అంటే రానున్న దశాబ్ద కాలంలో వచ్చే మార్పులు.. - జర్మనీ పెట్రోల్ డీజిన్ తదితర ఇంధనాలపై నడిచే కార్ల అమ్మకాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. - భూమిపై అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం మారనుంది. - పక్షవాతం వచ్చిన రోగుల్లో వారి అవయవాలను మెరుగుపరచడానికి నరాలను శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. - మూలకణాల నుంచి అంటే స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి చేయబడిన కృత్రిమ రక్తం మార్కెట్‌ లో లభిస్తోంది. - సోలార్ ప్యానల్ ధర ప్రతి వాట్ 0.5 డాలర్లు సమానంగా అవుతుంది. - ప్రపంచవ్యాప్తంగా 13,166,667 ఎలెక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతాయి. - డయాబెటిస్ టైప్ 2 ను అదుపు చేయడానికి ప్రోటీన్ ఇంజెక్షన్లను ఉపయోగిస్తారు - శాస్త్రవేత్తలు ఫ్లూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తారు, ఇది అన్ని జాతుల నుండి రక్షిస్తుంది. - ప్రపంచ జనాభా 8,500,766,000 కు చేరుకుంటుందని అంచనా - అవయవాల తయారీలో 3డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు - వచ్చే దశాబ్దంలో అంగారక గ్రహం పైకి వెళ్లడానికి మానవాళి సిద్ధమవుతుంది   2040లో - ఫుడ్ రెప్లికేటర్లు మీ పోషక స్థాయి ప్రకారం భోజనాన్ని డిజైన్ చేస్తాయి - ప్రపంచ జనాభా 9,157,230,000 కు చేరుకుంటుంది. - ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెంది భారతదేశం అమెరికాను అధిగమిస్తుంది. - ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల సంఖ్య 173,987,427,000 కి చేరుతుంది. - ప్రతి ఒక్కరికీ 19 పరికరాలు అవసరం అవుతాయి. అందుబాటులో ఉంటాయి - తూర్పు మధ్య, ఆఫ్రికా ఖండంలో కొంత భాగంలో ఉష్టోగ్రతలు విపరీతంగా పెరిగి నివసించడానికి అననుకూలమైన వాతావరణంలో ఉంటాయి. - వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా సామూహిక వలసలు పెరుగుతాయి. - ప్రపంచంలోని మొట్టమొదటి స్పేస్ ఎలివేటర్ ను పూర్తి చేసే స్థాయిలో జపాన్ ఉంటుంది.   - అణుశక్తి వాణిజ్యవనరుగా మారుతుంది. - క్వాంటం కంప్యూటింగ్ చిప్స్ కారణంగా గతంలో కంటే వేగంగా యంత్రాలు పనిచేస్తాయి. - ప్రపంచవ్యాప్తంగా మహాసముద్రాల నుండి వనరులను సేకరించడం పెరుగుతుంది. - వాతావరణంలో మార్పులు, పరిమిత వనరుల కారణంగా ఆహార కొరత ఏర్పడుతుంది.  - యువతలో అల్జీమర్స్ వ్యాధి కేసులు పెరుగుతాయి. - టెలివిజన్ మాయమై ఆన్ లైన్ వీడియో, మీడియా పెరుగుతాయి. - ప్రపంచవ్యాప్తంగా పొగాకు నియంత్రిస్తారు. - నాసా జలాంతర్గామి సాటర్న్ ఉపగ్రహం టైటాన్లో గ్రహాంతర జీవుల కోసం అన్వేషిస్తుంది - స్పేస్‌ ఎక్స్  తన స్పేర్ షిప్ లో మార్స్ కు మనషులను తీసుకువెళ్లుతుంది. - మనిషి మెదడును రోబోట్ లోకి పంపించే కొత్త టెక్నాలజీ  క్లినికల్ ట్రయల్ జరుగుతాయి.   2050 - జనటిక్ ఇంజనీరింగ్ ద్వారా బిడ్డను కనాలనుకుంటే డబ్బులను చెల్లించాల్సిందే. - మానవ భావోద్వేగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీకి అనుసంధానం చేయవచ్చు. - న్యూరోటెక్నాలజీని ఉపయోగించి ఇతర వ్యక్తులతో సంభాషించడానికి వీలు కలుగుతుంది. - వివిధ రకాల క్యాన్సర్‌లకు వ్యతిరేకంగా యూనివర్సల్ టీకా ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది. - ప్రపంచ జనాభా సుమారు 10,143,271,720కు చేరుతుంది. - 5 బిలియన్ ప్రజలు ఇప్పుడు నీటి ఎద్దడి ప్రాంతాల్లో నివసిస్తారు - ప్రపంచ జనాభాలో సగం మంది దృష్టి లోపంతో ఉంటారు.  - ప్రపంచ ఉష్ణోగ్రత సగటు 37.4 సెల్సియల్ డిగ్రీలుగా ఉంటుంది. - ధ్రువ ఎలుగుబంట్లు అంతరించిపోతాయి. - అత్యంత ఆధునికంగా పనిచేసే అవయవాలు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో చాలామంది తమ అవయవాల స్థానంలో వాటిని ఏర్పాటుచేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. - ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన పరికరాల 237,500,000,000 కు చేరుకుంటుంది - ప్రతి వినియోగదారుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయబడిన 25 పరికరాలను కలిగి ఉంటారు. - ఎలక్ట్రిక్, ఆధునిక కార్లు మాత్రమే యుకె, జర్మనీ, ఇండియా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో అమ్ముడవుతాయి - బహుళ అంతస్తుల హైటెక్ భవనాల సంఖ్య పెరిగి పట్టణాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. - మన మహాసముద్రాలలో చేపల కంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుంది. - సుదూర ప్లానెట్ల చిత్రాలను కూడా తీయగలిగిన అధిక రిజల్యూషన్ కెమెరాలు అందుబాటులోకి వస్తాయి. - చంద్రునికి టూర్ వెళ్లడం సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తుంది. - మార్స్ మీద శాశ్వతంగా నివాసం ఏర్పర్చుకునే వీలు కలుగుతుంది. - మన జ్ఞాపకాలను కంప్యూటర్లలోకి అప్‌లోడ్ చేయవచ్చు. వాటిని డిజిటల్‌గా సేవ్ చేయవచ్చు.

ఆ దారుణ ఘటన కారణంగానే ఐపీఎల్ కు దూరమయ్యా.. సురేష్ రైనా క్లారిటీ 

దుబాయిలో జరగనున్న ఐపీఎల్- 2020 నుంచి హఠాత్తుగా తప్పుకుని చెన్నైసూపర్‌ కింగ్స్‌ సూపర్ ప్లేయర్ సురేశ్ రైనా అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసాడు. అయితే రైనా నిర్ణయం వెనుక గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియలేదు సరికదా.. అతడు హోటల్ లో ధోనికి బాల్కనీ ఉన్న రూమ్ కేటాయించి తనకు మాత్రం మాములు రూమ్ కేటాయించడంతో అలిగి వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా ఈ విషయం పై సురేశ్ రైనా ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.   "పంజాబ్‌లోని తమ బంధువులు ఒక భయంకర ఘటనను ఎదుర్కొన్నారని ఆ ఘటనలో తన అంకుల్‌ని కొంత మంది నరికి చంపేశారని రైనా తెలిపారు. ఈ ఘటనలో తమ ఆంటీతో పాటు మరో ఇద్దరు కజిన్‌లకు తీవ్రగాయాలయ్యాయని వారంతా ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతుండగా.. దురదృష్టవశాత్తు తన కజిన్ గత రాత్రి మృతి చెందాడని. అలాగే తన ఆంటీ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది" అని సురేశ్ రైనా పేర్కొన్నాడు. అంతే కాకుండా ఈ ఘటనకు కారకులెవరో, ఆ రాత్రి అసలు ఏం జరిగిందో ఇప్పటివరకు ఎవరికీ స్పష్టంగా తెలియదని.. ఈ మొత్తం ఘటనపై దృష్టిసారించాలని అయన పంజాబ్ పోలీసులను కోరుతున్నానన్నారు. "ఈ హేయమైన చర్యకు పాల్పడిన వారు తప్పించుకుని, మరో నేరం చేయడానికి వీల్లేదు" అంటూ పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌కు సురేశ్ రైనా తాజాగా ట్వీట్ చేశారు.

కుప్పకూలే స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ.. 1996 నుంచి చూస్తే ఇదే అతి పెద్ద పతనం

దేశ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో పతనమైంది. మోడీ సర్కార్ ఇప్పటికైనా ఆ దిశగా దృష్టి పెట్టకపోతే దేశం ఓ ఇరవై ముప్పై ఏళ్లు వెనక్కు వెళ్లిపోతోందని నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. భారతదేశపు వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో(ఏప్రిల్, మే, జూన్ నెలల్లో) 23.9 శాతానికి పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన 5.2 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే రికార్డు స్థాయికి క్షీణించింది. ఈ గణాంకాలను సోమవారం అధికారికంగా విడుదల చేసిన నేషనల్‌ స్టాటిస్టికల్ ఆఫీస్‌.. కరోనా మహమ్మారి విలయం, లాక్‌డౌన్‌ లాంటి పరిణామాలు.. అప్పటికే మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థను మరింత కుంగదీశాయని పేర్కొంది. ఇక అంతకుముందు త్రైమాసికం (2020 జనవరి, ఫిబ్రవరి, మార్చి)లో జీడీపీ 3.1 శాతంగా వృద్ధి నమోదైంది. 1996 నుంచీ చూస్తే ఇదే అతి పెద్ద పతనం. తయారీ, నిర్మాణ, వాణిజ్య రంగాలు వరుసగా 39.3శాతం, 50.3 శాతం, 47 శాతం వద్ద భారీ క్షీణించాయని తెలిపింది. ప్రభుత్వ వ్యయం కూడా 10.3శాతం  పడిపోయింది. వ్యవసాయ రంగం పనితీరు 3.4 శాతం వృద్ధితో మెరుగ్గా ఉందని పేర్కొంది.   జీడీపీ ఇంతగా పతనమవుతుంటే దేశంలో ఆర్ధికమంత్రి ఉనట్టా లేనట్టా? ఉంటే ఏం చేస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిర్మలా సీతారామన్ ఆర్ధికమంత్రి పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని ఏం చేస్తున్నారు? దేశ ఆర్ధిక పరిస్థితిని చూస్తున్నారా? కాస్త ఆ వైపు దృష్టి పెట్టండి అంటూ ఆర్ధిక నిపుణులు, విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు.   కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని, జీడీపీ దారుణంగా పడిపోవడానికి ప్రభుత్వ అసమర్థతే కారణమని కేంద్ర మాజీ ఆర్ధికమంత్రి చిదంబరం విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థితిలో ఉందన్న విషయం బహుశా ప్రధానమంత్రికి, ఆర్దికమంత్రికి తప్ప అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. "మోడీ సర్కార్ నిర్లక్ష్యానికి దేశ ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం ఇన్నాళ్లూ కథలు చెబుతూ వచ్చింది. అవన్నీ అబద్ధాలని అధికారికంగా నిరూపణైంది'' అని చిదంబరం అన్నారు.

డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉంది.. హైకోర్టులో సిబిఐ

ప్రభుత్వ ఆసుపత్రులలో మాస్కులు లేవని ఆందోళన వ్యక్తం చేసిన నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు పలు మలుపులు తిరిగి చివరికి హైకోర్టు ఆదేశాలతో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సంగతి తెలిసిందే.   తాజాగా సిబిఐ డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర కోణం ఉందని ఐతే దీని పై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉందని ఈ రోజు హైకోర్టుకు నివేదించింది. దీని కోసం తమకు మరో నెల సమయం ఇవ్వాలని సిబిఐ అభ్యర్ధించింది. దీనిపై సిబిఐ వాదనలు విన్న హైకోర్టు నవంబర్ 11 వరకు దీనిపై పూర్తి రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా మాస్కులు అడిగిన పాపానికి తన బిడ్డను పిచ్చివాడిగా ముద్రవేసి హాస్పిటల్ లో జాయిన్ చేసారని ఆయన తల్లి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

మండలి చైర్మన్ షరీఫ్‌ కు కరోనా పాజిటివ్

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజుకు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా.. తాజాగా మండలి చైర్మన్‌ షరీఫ్‌ కు కరోనా పాజిటివ్‌ ‌గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు ఉండటంతో ఆయనకు పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   కాగా, ఏపీలో సోమవారం 10,004 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 85 మంది కరోనా కారణంగా మృతిచెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,31,876 కు చేరగా.. మృతుల సంఖ్య 3,969 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,276 యాక్టివ్ కేసులున్నాయి.

చైనా దాడిని తిప్పికొట్టి కీలక ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ

తూర్పు లద్దాఖ్‌లో చైనా మరోసారి దుస్సాహసానికి పాల్పడింది. శనివారం అర్ధరాత్రి - ఆదివారం తెల్లవారుజాము మధ్యలో ప్యాంగ్యాంగ్ సరస్సు దక్షిణ తీరంలో భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు చైనా ఆర్మీ చేసింది. జూన్‌ 15న గల్వాన్‌ లోయ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తర్వాత ఎల్‌ఏసీ వెంట యథాతథస్థితిని కొనసాగించాలంటూ కమాండర్‌ స్థాయి చర్చలలో కుదిరిన ఒప్పందాలను చైనా తాజా ఘటనతో ఉల్లంఘించింది. అంతేకాకుండా ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నం చేస్తూ ఒకపక్క నిర్మాణ సామగ్రితో పాటు క్షిపణి వ్యవస్థను కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి తరలిచింది. ఇప్పటి వరకు ఉత్తర తీరంలోని భారత భూభాగంపై కన్నేసిన చైనా ఇపుడు దక్షిణం వైపు రావడం ఇదే తొలిసారి. అయితే చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత సైన్యం చైనా ఆర్మీ చర్యలను దీటుగా తిప్పికొట్టింది. సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలతోపాటు మిసైల్ క్షేత్రాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న చైనా ఇప్పుడు పాంగాంగ్‌ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని భారత్‌ సీరియ్‌సగా తీసుకుంది.   చైనాతో సరిహద్దుల్లో మళ్ళీ ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ముందుకు దూసుకొచ్చిన చైనా సైనికులను వెనక్కు తరిమేసి భారత జవాన్లు కీలకమైన ఓ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. పాంగ్యాంగ్ సరస్సుకు సమీపంలోని ఒక ఎత్తయిన ప్రాంతాన్ని చైనా ఆర్మీ నుండి భారత జవాన్లు స్వాధీనం చేసుకున్నారని మన సైనిక వర్గాలు వెల్లడించాయి. తాజా ఘటనతో ఆ ప్రాంతంలో భారత్ దే పై చేయి అయిందని సమాచారం. ఈ ప్రాంతంలో విధుల్లో ఉన్న స్పెషల్ ఆపరేషన్ బెటాలియన్ చైనాను అడ్డుకుంది. సరస్సు దక్షిణ భాగంలోని తౌకుంగ్ ప్రాంతంలో ఎత్తయిన ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలో ఇది ఒక కీలక ప్రాంతం. ఇక్కడి నుంచి సరస్సు పశ్చిమ ప్రాంతాన్నంతా నియంత్రించడమే కాకుండా సరస్సు చుట్టుపక్కల ప్రాంతాలపైనా నిఘా పెట్టవచ్చు. అయితే తాజా ఘటనలో ఇరు సైన్యాల మధ్య ఎలాంటి ఘర్షణ జరగలేదని భారత సైన్యం అధికార ప్రతినిధి కల్నల్‌ అమన్‌ ఆనంద్‌ తెలిపారు. ఓ వైపు చర్చలు జరుగుతుండగా, భారత సైన్యం, నిబంధనలను ఉల్లంఘిస్తోందని చైనా కమాండర్ ఆరోపించగా, భారత్ మాత్రం వాటిని కొట్టిపారేసింది. చైనా ఆర్మీ రెచ్చగొడుతూ మన భూభాగం లోకి చొరబడుతూ వస్తున్నారని, భారత ఆర్మీ దాన్ని తిప్పికొడుతోంది భారత సైన్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

కరోనా లక్షణాలు లేని వారి వల్లే

రోజురోజుకు విజృంభిస్తున్న కోవిద్ 19 వైరస్ వ్యాప్తి వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇందుకు కారణాలు అన్వేషిస్తున్న వైద్యబృందం, పరిశోధకులు సరికొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. వైద్యపరీక్షల సంఖ్య పెంచడంతో బయటకు వచ్చిన అంశాలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.   తెలంగాణలో కరోనా పాజిటివ్ గా  నమోదు అయినవారిలో 69శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని వైద్యాధికారులు వెల్లడించారు. కేవలం 31శాతం మందిలో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయంటున్నారు. అయితే లక్షణాలు లేనంత మాత్రాన వారి నుంచి ఇతరులకు వైరస్ సోకదు అని కచ్ఛితంగా చెప్పలేమని అంటున్నారు. లక్షణాలు కనిపించని వారి వల్ల కూడా వైరస్ వ్యాపిస్తోందని స్పష్టం చేశారు. లక్షణాలు లేని వారు తమకు తెలియకుండానే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని వైద్యాధికారుల బృందం ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే కుటుంబంలో ఎక్కువ మంది కరోనా బారిన పడుతుండడానికి ఇదే కారణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,24,963 మంది కరోనా బారినపడగా వారిలో 86,225 మందిలో ఎటువంటి లక్షణాలు లేవని వెల్లడించారు.   తెలంగాణలో  ప్రస్తుతం 31,299 యాక్టివ్ కేసులుంటే అందులో 24,216 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. మిగతావారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.