అమరావతిలో కలకలం.. అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహాలు మాయం
posted on Sep 5, 2020 @ 4:34PM
అమరావతిని నుండి రాజధానిని తరలించొద్దు అంటూ అక్కడి రైతులు 250 కి పైగా రోజుల నుండి ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలు మాయం కావడం కలకలం రేపుతోంది.
అమరావతిలో ఉన్న అంబేడ్కర్ స్మృతివనంలో విగ్రహాలు మాయమయ్యాయి. శాఖమూరులో గత టీడీపీ ప్రభుత్వం ఆరు నమూనా విగ్రహాలను ఏర్పాటు చేయగా.. అందులో ఐదు విగ్రహాలు మాయమయ్యాయి. మరో విగ్రహానికి ఉన్న కళ్లద్దాలను పగలగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న దళిత ఐకాస నేతలు స్మృతివనం దగ్గర ఆందోళనకు దిగారు. విగ్రహాలను మాయం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, అంబేడ్కర్ విగ్రహాలు మాయం కావడంపై అమరావతి రైతులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడంపై మండిపడుతున్నారు. దళిత ఐకాసకు సంఘీభావం పలుకుతూ, వారితో పాటు రైతులు కూడా ఆందోళనలో దిగారు.