దేశ సరిహద్దుల్లో సైన్యం సిద్ధంగా ఉంది

డ్రాగన్ కంట్రీ చర్యలను తిప్పికొడతాం   భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్   భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. డ్రాగన్ కంట్రీ కుట్రలు చేస్తూ సరిహద్దుల వెంట తన సైన్యబలగాలను మోహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ దుందుడుకు చర్యలను అడ్డుకుంటూ భారత్ సైన్యం ముందుకు వెళ్తోంది. సరిహద్దుల్లో ఎలాంటి చర్యలనైనా ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ స్పష్టం చేశారు. డ్రాగన్ కంట్రీకి ధీటైన జవాబు చెప్పేందుకు ఆర్మీ సర్వసన్నద్దంగా ఉందని, ఇప్పటికే త్రిదళాలను అప్రమత్తం చేశామని ఆయన తెలిపారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నా మరోవైపు చాపకింద నీరులా సరిహద్దుల్లో మోహరిస్తున్న చైనా సైన్యం ఆటలు ఇక సాగవని, కుట్రలను తిప్పికొట్టగల శక్తి సామర్ధాలు భారత్ కు ఉన్నాయని ఆయన అన్నారు.   మరో వైపు భారత్ చైనా సరిహద్దుల్లో సైన్యాన్ని అప్రమత్తం చేయడంతో పాటు ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. యుద్ధం అంటూ వస్తే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు భారత్ చేస్తోంది. అమెరికా, జపాన్ , ఫ్రాన్స్ ఇప్పటికే మద్దతు ఇవ్వడానికి అంగీకరించాయి. అమెరికా సైనిక దళాలు కూడా ముందస్తుగానే భారత్ కు అండగా నిలుస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దు వివాదంలో అమెరికా సైన్యం భారత దేశానికి  మద్దతు ఇస్తామని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ఇప్పటికే వెల్లడించారు. యుద్ధ నౌకలను కూడా దక్షిణ హిందు మహాసముద్రంలో మోహరించారు. తాజాగా భారత రక్షణ శాఖ మంత్రి రష్యాలో పర్యటిస్తూ ఆ దేశ మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఔట్ సోర్సింగ్ రిక్రూట్ మెంట్ పై మాట మార్చిన సర్కార్.. అప్పుడలా ఇప్పుడిలా

తెలంగాణ ప్రభుత్వం పోలీసు బెటాలియన్లలో రెగ్యులర్ పోస్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బార్బర్, కుక్, ధోబీ, నర్సింగ్, మిడ్‌వైఫ్, ఫార్మసిస్ట్, రేడియోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియో థెరపిస్ట్, స్కావెంజర్, స్వీపర్ వంటి విభాగాల్లోని మొత్తం 272 పోస్టులను ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఇప్పటి నుండి ఈ పోస్టులకు ఔట్ షోర్సింగ్, కాంట్రాక్ట్ పద్దతి పైన ఆ ఖాళీలను భర్తీ చేసుకోవాలని తాజాగా ఇచ్చిన ఆదేశాల్లో సూచించింది.   అయితే తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం పై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ సాక్షిగా 2017 లో సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ పర్మనెంట్ గా చేయవలసిన ఉద్యోగాలను ఔట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేయడం కరెక్ట్ కాదని... డిపార్ట్ మెంట్ కు సర్వీస్ అవసరముంటే పర్మనెంట్ పద్దతిలో రిక్రూట్ చేసుకోండని అంతేకాని ఔట్ సోర్సింగ్ కు పోవద్దని చెప్పిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

కరోనా కు మరో కొత్త వ్యాక్సిన్

అమెరికా లోని ఓహైయో యూనివర్సిటీ పరిశోధన   ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం   కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇంతవరకు ఏ వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాలేదు. వ్యాక్సిన్ కోసం ప్రపంచమానవాళి ఆశగా ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో కరోనా మహమ్మారితో పోరాడుతూ వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకునే వ్యాక్సిన్ ను అమెరికాలోని ఓహైయోవర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటికే వారు కనిపెట్టిన వ్యాక్సిన్ ను ఎలుకలపై ప్రయోగించగా ఆశించిన ఫలితాలు వచ్చాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త యు జో డాంగ్ వివరించారు.    కోవిద్ 19 వైరస్ రెండు రకాల ప్రొటీన్లను లక్ష్యంగా చేసుకుని శరీరంలోని జీవకణాలను సోకుతాయి. అయితే ఈ వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకునే కొన్నిరకాల ప్రోటీన్ల ఉత్పత్తికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. ఓహైయో యూనివర్సిటీ పరిశోధకులు తయారుచేసిన వ్యాక్సిన్ ను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటిలో ఎక్కువసంఖ్యలో వైరస్ ను ఎదుర్కోనే ప్రొటీన్లు విడుదలైన విషయం గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ద్వారా ‘సెల్యూలార్ ప్రాసెస్’ చేయడం వల్ల ఎలుకల్లోని జన్యు సమాచారాన్ని ఫంక్షనల్ ప్రొటీన్లుగా మార్చే ఆర్ఎన్ఏ మెసెంజర్ అణువుల సీక్వెన్స్ (అన్‌ట్రాన్స్‌లేటెడ్ రీజియన్స్-యూటీఆర్)లో మార్పులు చోటుచేసుకోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన ఎలుకల్లో వైరస్ ను ఎదుర్కోనే ప్రోటీన్లు విడుదల కావడంతో పాటు యాంటీబాడీలు ఎక్కువగా ఉత్పత్తి అయినట్లు పరిశోధకులు వివరించారు.   ప్రపంచవ్యాప్తంగా కోవిద్ వైరస్ కు వ్యాక్సిన్ తయారీ జరుగుతున్నా ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుందో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

ఏపీ బీజేపీ తొలి విజయం ఇదే .. సోము వీర్రాజు 

నిన్న సమావేశమైన ఏపీ కేబినెట్ ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ నిర్వహించేవారికి, అలాగే ఆడేవారికి కూడా జైలు శిక్ష ప‌డుతుందని కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ కృషి వల్లే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అయన చెప్పుకొచ్చారు.   ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల సామాన్య ప్రజల ఆలోచనలలో వచ్చే చెడు మార్పుల గురించి, అలాగే దీని ద్వారా ప్రజల సొమ్ము దోపిడీ అవడం పైనా మొన్న మేలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గారిని కలిసినపుడు అయన దృష్టికి తీసుకు వచ్చినట్లుగా అయన తెలిపారు. ఇవే కాకుండా ఇప్పటికే ప్రభుత్వం గుట్కాని నిషేధించినప్పటికీ, ఇప్పటికీ కిరాణా షాపుల్లోను, కిళ్లీ షాపుల్లో, అలాగే బ్లాక్ మార్కెట్ లోను గుట్కా దొరుకుతుండడం పై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని తాను సూచించినట్లు సోము వీర్రాజు తెలిపారు. ఈ రోజు ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్ ని ఏపీ ప్రభుత్వం బ్యాన్ చేయడం ఏపీ బీజేపీ సాధించిన తొలి విజయం. అలాగే గుట్కా అమ్మకాలు కూడా అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాలని సీఎం జగన్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అని సోము వీర్రాజు తాజాగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ పై ఐక్య పోరాటం! ప్రజా వేదిక.. రేవంత్ సపోర్ట్..కోదండరామే లీడర్!

తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ పై పోరాటానికి ఐక్య వేదిక దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలతో ఉమ్మడి పోరుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కృష్ణా బేసిన్ లో ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులే అస్త్రంగా కేసీఆర్ ను టార్గెట్ చేసేలా విపక్షాలు ఉద్యమ కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ముందుడి నడిపిన టీజేఏసీ చైర్మెన్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామే ఉమ్మడి పోరాటానికి నాయకత్వం వహించేలా.. ఆయనపై వివిధ వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది. త్వరలోనే పార్టీలకతీతంగా ప్రజా వేదిక  ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రజా వేదిక నుంచి కేసీఆర్ సర్కార్ పై సమరానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.        కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజా వేదికపై సంకేతాలు వచ్చాయి. తెలంగాణ ప్రాజెక్టుల పూర్తికి మరో ప్రజా ఉద్యమానికి నాంది పలకాలని వివిధ రాజకీయ పక్షాలు, ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాలు, సాగునీటిరంగ నిపుణులు ముక్తకంఠంతో నినదించారు. లిఫ్ట్ పేరుతో, ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తెలంగాణను ఆర్థికంగా దోచుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ను దింపింతే తప్ప తెలంగాణకు మంచిరోజులు రావన్నారు. ప్రొఫెసర్ కోదండరాం రాజకీయ పార్టీని పక్కనపెట్టి.. ఒక ప్రజా వేదికను ఏర్పాటు చేస్తే కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.    కేసీఆర్ చేస్తున్న మోసాన్ని, నైజాన్ని ప్రజలకు తెలిపి, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ అన్నారు. కేసీఆర్ కుట్రను ఛేదించడానికి అందరూ ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలిపునిచ్చారు. ప్రజా వేదికతో కలిసి పనిచేస్తామని చెప్పారు. క్రిష్ణానది పెండింగ్ ప్రాజెక్టుల అడ్డంకిని తొలగించడానికి అన్ని పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకోవడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రజా వేదిక ద్వారా పోరాటానికి మద్దతుగా ఉంటామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. అన్ని ప్రతిపక్షాలు ఏకమై కేసీఆర్ మెడలు వంచాల్సిన సమయం వచ్చిందని జర్నలిస్ట్ సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.    కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడానికి కోదండరామ్ నేతృత్వంలో ప్రజా వేదిక ఏర్పాటు కావాలని రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇప్పటికే విపక్ష నేతల మధ్య చర్చ జరిగిందని, త్వరలోనే కార్యరూపం దాల్చబోతుందని సమాచారం. ప్రజా వేదికపై ప్రజల్లో చర్చ జరగాలన్న ఉద్దేశ్యంతోనే రేవంత్ ప్రకటన చేశారని భావిస్తున్నారు. అన్ని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఏకమైతే.. కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే రేవంత్ రెడ్డి, వివేక్ లు తాము కలిసి వస్తామని ప్రకటించారు కాని.. వారి పార్టీల స్టాండ్ ఏంటన్నది తేలాల్సి ఉంది. ఇక ప్రజా వేదిక ఏర్పాటు ప్రయత్నాలపై  టీఆర్ఎస్ ఇంకా స్పందించలేదు. అధికారిక ప్రకటన వచ్చాకే గులాబీ లీడర్లు స్పందించే అవకాశం ఉంది.

హుక్కా సెంటర్లో బర్త్ డే సెలబ్రేషన్స్... హుక్కా పీలుస్తూ పట్టుబడ్డ 20 మంది మైనర్ బాలికలు

హుక్కా సెంటర్ల పై పోలీసులు దాడులు చేయడం ఆ సందర్బంగా అక్కడ హుక్కా పీలుస్తున్న కుర్రాళ్లను అరెస్ట్ చేయడం గురించి మనం చాలా సార్లు విన్నాం.. చూసాం. కానీ తాజాగా ఒక హుక్కా సెంటర్ పై పోలీసులు జరిపిన దాడిలో బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతొ ఏకంగా 20 మంది మైనర్ బాలికలు హుక్కా పీలుస్తూ పట్టుబడడం కలకలం రేపుతోంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌ లో హుక్కా బార్లపై పోలీసుల దాడులలో ఈ ఘటన వెలుగు చూసింది.    మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలోని టిటి నగర్ ప్రాంతంలో జోహ్రీ హోటల్‌లోని హుక్కా లాంజ్‌లో ఒక బర్త్ డే పార్టీ జరుగుండగా సడెన్ గా పోలీసులు దాడులు చేశారు. ఈ దాడులలో అక్కడ 20 మంది మైనర్ బాలికలు ఉన్నట్లుగా తేలింది. అక్కడ మైనర్లకు హుక్కాతో పాటు కొన్ని నిషేధిత మాదక ద్రవ్యాలు కూడా నిర్వాహకులు అందుబాటులో ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు అనంతరమే అసలు విషయం బయటపడుతుందని పోలీసులు పేర్కొంటున్నారు.    20 మంది మైనర్ బాలికలతో పాటు, 10 మంది బాలురిని పోలీసులు అదుపులోకి తీసుకుని చైల్డ్ లైన్ మరియు స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ కు అప్పగించారు. ఈ మైనర్లందరూ బర్త్ని డే పార్టీ సాకుగా చేసుకొని హుక్కా బార్ లో కలిశారని పోలీసులు తెలిపారు. అయితే హోటల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

అసెంబ్లీ సమావేశాలకు సంపూర్ణమైన సమాచారంతో సిద్ధంగా ఉండండి: సీఎం

అసెంబ్లీ సమావేశాలకు సంపూర్ణమైన సమాచారంతో సిద్ధంగా ఉండండి   మంత్రులకు, అధికారులకు సిఎం ఆదేశం   సభలో చర్చించే అంశాలపై ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం ఈ నెల 7నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, విప్ లతో గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు.   రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో కూలంకశంగా చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. ఎన్ని రోజులైనా సరే, అన్ని రాజకీయ పక్షాలు ప్రతిపాదించిన అంశాలపై చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా అన్ని వాస్తవాలను ప్రజలకు వివరించడం కోసం మంత్రులు సిద్ధం కావాలని సిఎం ఆదేశించారు.   కరోనా వ్యాప్తి నివారణ, కరోనా బాధితులకు అందుతున్న వైద్యం, రాష్ట్రంలో విస్తరించిన వైద్య సేవలు, భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టం- తీసుకోవాల్సిన చర్యలు, శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం, విద్యుత్ రంగంలో సాధించిన విజయాలు, కొత్త రెవెన్యూ చట్టం, రాయలసీమ ఎత్తిపోతల పథకం పేర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు – నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, జిఎస్టీ అమలులో జరుగుతున్న అన్యాయం, కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల కలుగుతున్న నష్టం, రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణి, నియంత్రిత పద్ధతిలో పంట సాగుతో పాటు వ్యవసాయ రంగం, పివి శతజయంతి ఉత్సవాలు తదితర అంశాలను చర్చించాలని, ప్రభుత్వ పరంగా చర్చకు సిద్ధమైన అంశాలను బిఎసి సమావేశంలో ప్రతిపాదించాలని నిర్ణయించారు.   మొదటి రోజే ఘన నివాళి ఇటీవల మరణించిన ఎమ్మెల్యే రామలింగారెడ్డికి అసెంబ్లీలో మొదటి రోజే ఘన నివాళి అర్పించనున్నట్లు సిఎం తెలిపారు. అసెంబ్లీలో చర్చకు వచ్చే అన్ని అంశాలపై సంపూర్ణమైన సమాచారంతో మంత్రులు సిద్ధంగా ఉండాలని సిఎం ఆదేశించారు. ‘‘ప్రజాస్వామ్య విలువలు పరిఢవిల్లేలా అసెంబ్లీ సమావేశాలు జరగాలి. ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చ జరగడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి చట్ట సభలకు మించిన వేదిక లేదు. ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలి. దేశానికి ఆదర్శంగా ఉండేలా తెలంగాణ శాసనసభను నిర్వహించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చట్టాలు అమలు క్షేత్రస్థాయిలో ఎలా ఉందో సభ్యులు విశ్లేషించాలి. ఏమైనా లోటుపాట్లు ఉంటే కూడా సభ్యులు ప్రస్తావించాలి. ప్రభుత్వం సభ్యులడిగే ప్రతీ అంశానికి సంబంధించిన వివరాలు చెపుతుంది. అధికార పక్ష సభ్యులు కూడా ప్రజలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని సభలో ప్రస్తావించాలి’’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.   అసహనం ప్రదర్శించడానికి వేదిక కారాదు ‘‘అసెంబ్లీ  అంటే అల్లర్లు, దూషణలు, గందరగోళం, తిట్లు, శాపనార్థాలు కాదు. పనికి మాలిన నిందలు వేసుకోవడానికి, అసహనం ప్రదర్శించడానికి అసెంబ్లీ వేదిక కారాదు. ఇలాంటి ధోరణిలో మార్పు రావాలి. తెలంగాణ అసెంబ్లీ నిర్వహణలో గుణాత్మక మార్పులు రావాలి. స్పూర్తి వంతమైన చర్చలు జరగాలి. చట్టాలు తయారు చేయానికి (శాసనాలు నిర్మించడానికి), బడ్జెట్ ఆమోదించడానికి, చట్టాలు, బడ్జెట్ అమలు ఎలా ఉందో విశ్లేషించుకోవడానికి శాసనసభలో చర్చ జరగాలి. చర్చలు గొప్పగా, వాస్తవాల ఆధారంగా జరగాలి. ప్రజలకు ఉపయోగపడే విధంగా సభ్యులు మాట్లాడాలి. అసెంబ్లీలో చర్చ ద్వారా అటు ప్రజాస్వామ్యం మరింత బలపడాలి. ఇటు ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు వెలువడాలి. ఈ విధంగా తెలంగాణ శాసనసభ జరగాలి. అదే ప్రభుత్వం కోరుకుంటున్నది. ఏ పార్టీ సభ్యులైనా సరే, ఏ విషయం గురించి అయినా సరే సభలో మాట్లాడవచ్చు. దానికి  సమాధానం చెప్పడానికి, వివరణ ఇవ్వడానికి, ఆచరణాత్మకమైన సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. సభ్యులు మాట్లాడే విషయాలు వాస్తవాలు ప్రతిబింబించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి అద్దం పట్టేలా ఉండాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.    సమీక్ష సమావేశంలో మంత్రులు వేముల ప్రశాంత రెడ్డి, కెటి రామారావు, టి.హరీశ్ రావు, ఈటల రాజెందర్, జి.జగదీష్ రెడ్డి, ఎస్. నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలిలో చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ లు ప్రభాకర్, భాను ప్రసాద్, కె. దామోదర్ రెడ్డి, అసెంబ్లీలో చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్, విప్ లు గంప గోవర్థన్, గొంగిడి సునిత, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, రేగ కాంతారావు, అరికపూడి గాంధి, రాజ్యసభ సభ్యుడు జె.సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసా..

కరోనా లాక్ డౌన్ ప్రారంభం కాగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం తగ్గిపోయింది అంటూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు విధించారు. అన్నిశాఖల్లో పనిచేసేవారి వేతనాల్లో కట్టింగ్స్  ఉంటాయన్నారు. కరోనా ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న వైద్యసిబ్బంది,  పోలీసులు,  పారిశుద్ధ్య కార్మికుల జీతాల్లో మాత్రం కోతలు లేవంటూ ఆ తర్వాత ప్రకటించారు. గత రెండు నెలల నుంచి కొన్ని శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనాలు ఇస్తున్నా చాలా వరకు కోతలే. మరి దేశానికి, రాష్ట్రానికి ఆదాయం పూర్తిగా పడిపోయిన ఈ కరోన కష్టకాలంలో అధికారంలో ఉన్నవారి జీతాల్లో కోతలు విధించారా లేదా అన్న విషయం పక్కన పెడదాం. ముందు మన ముఖ్యమంత్రుల జీతాలు ఎంతో తెలుసుకుందాం.   ఒక వ్యక్తి  వేతనాన్ని ఆ వ్యక్తి పనిచేసే సంస్థ నిర్ణయిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో మాత్రం పాలకులు తమ జీతభత్యాలను తామే నిర్ణయించుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం ముఖ్యమంత్రుల జీతాభత్యాలను క్యాబినేట్ లో నిర్ణయిస్తారు. ఇక క్యాబినేట్ లో ఉండేది వారే కాబట్టి వారికి నచ్చిన అంకె ప్రకారమే శాలరీలు ఉంటాయి అని ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతే కాదు ముఖ్యమంత్రుల, మంత్రుల జీతాలపై ఎవరి నియంత్రణ కూడా ఉండదు.  వారు చెప్పిందే ఫైనల్.  మరి ఇంతకు రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రుల జీతాల అంకెలను చూసి ఇయర్లీ ప్యాకెజ్ అనుకునేరు. నెలకు మాత్రమే. అలవెన్సులు అదనం..   తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకుంటున్న వేతనం నెలకు అక్షరాల నాలుగు లక్షల పదివేల రూపాయలు. ఇక దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్  జీతం  రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత  ఓ పదివేలు పెంచి నాలుగు లక్షల రౌండ్ ఫిగర్ చేశారు.    ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి  ఆదిత్య  యోగి జీతం  365,000 రూపాయలు మాత్రమే. ఆయన యోగి కదా మరి జీతం ఎందుకు అని మాత్రం అనకండి. ప్రజా సేవకులను ప్రశ్నించే హక్కు ప్రజలకు లేదు.    మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే నెల జీతం  మూడు లక్షల నలభైవేలు. ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన జీతం 335,000 రూపాయలు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నెలకు ఒక రూపాయే వేతనంగా తీసుకుంటాను అని ప్రకటించారు. మరి మిగతా డబ్బులు ఏం ఫండ్ కు కేటాయిస్తున్నాయో ఆయనే చెప్పాలి. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని జీతం  321,000రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జయ్ రామ్ థాకర్  నెల జీతం  310,000 రూపాయలు.   హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ జీతం రెండు లక్షల 88వేల రూపాయలు మాత్రమే. ఆయన ఇటీవల కరోనావైరస్  బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందన్న విషయాన్ని సీఎం స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. జార్ఖండ్  ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ జీతం 272,000 రూపాయలు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ - 255,000, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి  భూపేష్ బాగెల్, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జీతం 230,000 రూపాయలు.    గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జీతం 220,000, బీహార్  ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెల జీతం 215,000, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ  రెండు లక్షల పదివేల రూపాయలు. అయితే ఆమె ఒక రూపాయి మాత్రమే నెల జీతంగా తీసుకుంటూ మిగతా మొత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నట్లు ప్రకటించారు.    తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి జీతం  205,000,  కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప జీతం నెలకు రెండు లక్షల రూపాయలు.  సిక్కిం  ముఖ్యమంత్రి  ప్రేం సింగ్ తామంగ్ నెలకు తీసుకుంటున్న మొత్తం  190,000 రూపాయలు. ఇక త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ జీతం 185,500,   రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ , ఉత్తరాఖండ్ త్రివేంద్ర సింగ్ రావత్  నెలకు 175,000,  ఒడిశా  ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  165,000,  మేఘాలయ  ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా 150,000, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి హేమా ఖాండు ,  అస్సాం  ముఖ్యమంత్రి  శర్వానంద సోనోవాల్ 1,33,000 రూపాయలు తీసుకుంటున్నారు.    మణిపూర్ , పుదుచ్చేరి  ముఖ్యమంత్రులు  120,000 తీసుకుంటున్నారు. అయితే అతి తక్కువ నెల జీతం తీసుకుంటున్న ముఖ్యమంత్రి నాగాలాండ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నైపిహు రియో. ఆయన నెల జీతం  110,000 రూపాయలు మాత్రమే.    ఇవి కేవలం నెలకు వారు తీసుకునే జీతాలు మాత్రమే . అధికారంలో ఉన్నన్ని రోజులు వసతి, ప్రయాణ ఖర్చులు అన్ని ఉచితమే. అలవెన్సులు కూడా ఇస్తారు. ప్రజా సేవ చేస్తున్నందుకు ఈ మాత్రం వేతనాలు ఇవ్వాల్సిందే మరి..

ట్విట్టర్ వేదికగా లోకేష్ పై విజయసాయి, జగన్ పై అయ్యన్న అదిరిపోయే కౌంటర్లు

వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడైన లోకేష్ పై సెటైర్లు వేశారు. ఈరోజు ఒక ప్రముఖ పత్రికలో "ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో" అంటూ లోకేష్ పేరు మీద ఒక వ్యాసం ప్రచురితమైంది. తాజాగా దీని పై కామెంట్ చేస్తూ "నీకు సరిగా తెలుగు మాట్లాడడమే రాదు, అప్పుడే వ్యాసాలు రాస్తున్నావా చిట్టీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. అంతేకాకుండా "దళితునిగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు అన్న మీ నాన్నారుని అడుగు... ఎవరు దళిత పక్షపాతో, ఎవరు దళిత ద్రోహో చెబుతాడు. దళిత రిజర్వుడు స్థానాల్లో గత రెండు ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచిందో లెక్కలు చూసుకో లోకేశం" అంటూ విజయసాయిరెడ్డి ఘాటుగా ట్వీట్ చేశారు.   అయితే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లోకేష్ పై చేసిన సెటైరికల్ కామెంట్లకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "వివేకానందరెడ్డి చనిపోతే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యానన్న నువ్వు తెలుగు కోసం మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉంది" అంటూ ఎంపీ విజయసాయికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. అంతేకాకుండా "గుంటూరుని గుండూరు అనే మీ గన్నేరుపప్పుకి ముందుగా తెలుగు నేర్పించి లైవ్ లో కూర్చోబెట్టు" అంటూ సీఎం జగన్ పై సెటైర్ వేశారు. అలాగే పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడికి శిరోముండనం చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ అయ్యన్న ఈ సందర్భంగా మండిపడ్డారు. ఒక దళిత యువకుడ్ని పోలీస్ స్టేషన్ లో కొట్టి చంపిన చెత్త ప్రభుత్వం మీది అంటూ ఎపి ప్రభుత్వం పై అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జగన్ రెడ్డి.. నీకు దళిత జాతి వచ్చే ఎన్నికల్లో, గుండు కొట్టడం ఖాయం అంటూ ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ పై నిషేధం

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974 సవరణలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని.. ఆన్‌‌లైన్‌ జూదం ఆడేవాళ్ళు పట్టుబడితే 6 నెలల జైలు విధించాలంటూ ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది.   వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రూ.15380 కోట్లతో బాబు జగజ్జీవన్‌రామ్‌ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్‌ ఫేజ్‌–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.   గుంటూరు జిల్లా బాపట్లలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదించింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఏపీ ఫిషరీస్‌ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఏపీ ఫిషరీస్‌ ఆర్డినెన్స్‌–2020ను  కేబినెట్‌ ఆమోదించింది.

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై సుప్రీంకు జగన్ సర్కార్

విజయవాడ స్వర్ణప్యాలెస్‌ ప్రమాదంపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. రమేష్‌ ఆస్పత్రి యాజమాన్యం దర్యాప్తునకు సహకరించడం లేదని, ఆస్పత్రి నిర్వహణలో అనేక లోపాలున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. డాక్టర్ రమేష్‌ పరారీలో ఉన్నారని, దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందని  ఏపీ ప్రభుత్వం తెలిపింది.   రమేష్‌ ఆస్పత్రి స్వర్ణ ప్యాలెస్‌లో నిర్వహించిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు.. డాక్టర్‌ రమేష్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ సీతా రామ్మోహన్ రావులపై నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం సంగతేమిటని ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంలో హైకోర్టు ప్రశ్నించింది. అదే హోటల్‌లో అంతకుముందు ప్రభుత్వం క్వారంటైన్‌ కేంద్రాన్ని నిర్వహించిన నేపథ్యంలో.. స్వర్ణ ప్యాలెస్‌ సురక్షితం కాదని తెలిసినప్పుడు అక్కడ క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు అధికారాలు ఎలా అనుమతిచ్చారు? అని నిలదీసింది. ఈ వ్యవహారానికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌, డీఎంహెచ్‌వోలను నిందితులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హైకోర్టు.. వారిని నిందితులుగా చేర్చేదాకా ఈ కేసులో ముందుకెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది.   హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే, ఏపీ ప్రభుత్వానికి ఇప్పటికే కోర్టుల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. నిమ్మగడ్డ వ్యవహారం మొదలుకొని, తాజాగా ఇంగ్లీష్ మీడియం అంశంలో కూడా జగన్ సర్కార్ కి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మరి ఈ స్వర్ణప్యాలెస్‌ ఘటన విషయంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాలి.

వైసీపీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు.. వైఎస్సార్ పేరు ఇక ఉండదా?

వైసీపీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.   వైసీపీకి ఆ పార్టీ పేరు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' అయితే 'వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ' పేరుతో ఎలా నోటీసులు ఇస్తారంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ వివాదానికి తెరదీశారు. ఈ క్రమంలో 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' రంగంలోకి దిగింది. 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ' పేరును 'వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ'గా చలామణీ చేస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి 'అన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ' అధ్యక్షుడు మహబూబ్ బాషా ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ అనే పదాన్ని వైసీపీ వాడకుండా చూడాలని ఈసీని కోరారు. అంతేకాదు, వైసీపీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో మహబూబ్ బాషా పిటిషన్ కూడా దాఖలు చేశారు.   ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు వైసీపీకి కూడా గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ తదుపరి విచారణ జరగనున్న సెప్టెంబర్ 3వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, ఇప్పటివరకూ కేంద్ర ఎన్నికల సంఘం, వైసీపీ కౌంటర్ దాఖలు చేయలేదు. ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని వైసీపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ.. విచారణను నవంబరు 4కి వాయిదా వేసింది.   ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయకపోతే కోర్టు దిక్కరణ అవుతుంది. కౌంటర్ దాఖలు చేస్తే.. లెటర్ హెడ్లు, పోస్టర్లు, బ్యానర్లలో  'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్'కి బదులుగా 'వైఎస్సార్ కాంగ్రెస్‌' పేరు ఎందుకు ఉపయోగిస్తున్నారో వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వివరణతో కోర్టు సంతృప్తి చెందకపోతే.. అసలు పార్టీ గుర్తింపునే రద్దు చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల సంఘంలో ఆ పార్టీ పేరు 'యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ'గా రిజిస్టర్ అయ్యుంది. ఒకవేళ రద్దు చేయకపోయినా.. వైఎస్సార్ అనే పేరుని ఇక మీదట ఉపయోగించకూడదని కోర్టు ఆదేశాలిచ్చే అవకాశముంది అంటున్నారు. అదే జరిగితే వైసీపీకి తీవ్ర నష్టం జరిగే అవకాశముంది.

రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం.. ధన్యవాదాలు తెలిపిన రాజాసింగ్ 

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఫేస్‌బుక్ నిషేధం విధించింది. ద్వేషపూరిత ప్ర‌సంగాలు, వివాదాస్పద వ్యాఖ్య‌లు చేస్తూ ఫేస్‌బుక్ నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించిన కార‌ణంగా నిషేదం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. హింసను ప్రేరేపించేలా వ్యాఖ్య‌లు చేస్తున్న కార‌ణంగా ఆయ‌న ఫేస్‌బుక్ అకౌంట్‌ ని తొలిగిస్తున్నామంటూ ఫేస్‌బుక్ ప్రతినిధి తెలిపారు.   ఫేస్‌బుక్ నిషేదంపై స్పందించిన రాజాసింగ్.. త‌న‌కు అఫీషియ‌ల్‌ గా ఫేస్‌బుక్ అకౌంట్ లేద‌ని, త‌న పేరుతో ఉన్న న‌కిలీ అకౌంట్ల‌కు తాను బాధ్యుడిని కానంటూ వివర‌ణ ఇచ్చారు. ఫేస్ బుక్ లో తన పేరు మీద ప్రస్తుతమున్నపేజీలు నా అధికారిక పేజీలు కాదు.. వాటిని తొలగించినందుకు ఫేస్‌బుక్‌ కి ధన్యవాదాలు అన్నారు. అయితే, ఆయా పేజీలలో చేసిన పోస్టులతో తాను ఏకీభవిస్తానన్నారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ 2018 లో హ్యాక్ అయ్యిందని.. ఆ తర్వాత దాన్ని వాడేందుకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. అయితే, తాను సొంతంగా వాడేందుకు ప్రస్తుతం ఒక ఫేస్‌బుక్‌ పేజీ కావాలి.. దాన్ని ఫేస్‌బుక్‌ విధానాలను ఉల్లంఘించకుండా ఉపయోగిస్తాను. దీనికి సంబంధించి సదరు సంస్థకు విన్నవించుకుంటానంటూ రాజాసింగ్ పేర్కొన్నారు.    కాగా, భారత్‌ లో అధికార బీజేపీ నేతలు ఫేస్‌బుక్‌ లో చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఫేస్‌బుక్‌ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తోందని..‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్’ఇటీవల కథనం ప్ర‌చురించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించడమే కాకుండా.. ఫేస్‌బుక్‌ సంస్థకి లేఖలు కూడా రాసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా రాజాసింగ్‌పై నిషేధం విధించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.  

ప్రపంచ యుద్ధ మొదటి ఫొటోగ్రాఫర్

మేరీ ఆలివ్ ఎడిస్ (3 సెప్టెంబర్ 1876 - 28 డిసెంబర్ 1955)   మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ ఆధికారిక ఫొటోగ్రాఫర్ గా యుద్ధవాతావరణాన్ని, ప్రజాజీవనాన్ని కెమెరాలో బంధించిన వ్యక్తి మేరీ ఆలివ్ ఎడిస్. ఆమె తీసిన ఎన్నో ఫొటోలు ఆనాటి వాతావరణాన్ని, పరిస్థితులను చూసే వీలు కల్పిస్తున్నాయి. అంతేకాదు ఆమె తీసిన ఫొటోలు బ్లాక్ అండ్ వైట్ లోనే కాకుండా ఆటోక్రోమ్ ఫొటోగ్రఫీ లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించారు. 1920లో కెనడా పర్యటనలో ఆమె తీసిన ఫొటోలు ఆ దేశం మొట్టమొదటి కలర్ ఫొటోలుగా ఛాయాగ్రహణ చరిత్రలో నిలిచిపోయాయి. ఎడిస్ లండన్ లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మేరీ , ఆర్థర్ వెల్లెస్లీ ఎడిస్. లండన్ చర్చి స్ట్రీట్ లో ఆమె తన ఫస్ట్ ఫొటో స్టూడియోను ఏర్పాటుచేశారు. ఫొటోలు తీయడంలో ఆమె ప్రతిభను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం అధికారిక యుద్ధ ఫొటోగ్రాఫర్ గా ఎడిస్ ను నియమించారు. దాంతో అనేక యుద్ధ సమయంలో అనేక అంశాలను తన కెమెరాలో బంధించారు. బ్రిటిష్ ఉమెన్స్ సర్వీసెస్ సేవలను క్యాప్చర్ చేశారు. యుద్ధం ముగిసిన తర్వాత పరిస్థితులను కూడా ఛాయాచిత్రాల ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. లండన్ లో అనేక ఫొటో స్టూడియోలను ఏర్పాటుచేసిన ఆమె ఆటోక్రోమ్ పోర్ట్రెయిట్ లకు ప్రసిద్ధి చెందిన స్టూడియోలుగా వాటిని తీర్చిదిద్దారు. రాజవంశీకుల నుంచి అతి సామాన్యల వరకు ఎందరినో చిత్రాల్లో బంధించారు.   ప్రముఖ రచయితలు థామస్ హార్దీ, జార్డ్ బెర్నార్డ్ షా తదితరులను ఫస్ట్ ఫొటో తీసిన ఘనత ఆమెకే దక్కింది. 28 డిసెంబర్ 1955లో ఎడిస్ మరణించారు.   ఆమె తీసిన యుద్ధచిత్రాల్లో చాలా ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ఉన్నాయి. మరికొన్ని ఇతర చిత్రాలను సేకరించి  ఆమె పేరుతో ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహిస్తున్నారు.

ఉచిత విద్యుత్‌ పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌ కే ఉంది: సీఎం జగన్‌ 

సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన గురువారం జరిగిన కేబినెట్ భేటీలో 'ఉచిత విద్యుత్‌ పథకం- నగదు బదిలీ'కి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతుకు అందే విద్యుత్తు ఎప్పటికీ ఉచితమేనని, ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల వల్ల రైతులపై ఒక్క పైసా కూడా భారం పడదని హామీ ఇచ్చారు. అమల్లో ఉన్న పథకాన్ని మరింత మెరుగుపరుస్తున్నామని, వచ్చే 30-35ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా ఉండబోదని వెల్లడించారు.   కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి, ఆ ఖాతాలోకి నేరుగా నగదు జమ చేస్తామని, ఆ డబ్బునే డిస్కంలకు చెల్లించడం జరుగుతుందని, దీని వల్ల రైతుపై ఎలాంటి భారం ఉండదని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ ఒక్క వైఎస్సార్‌ కే ఉంది. అందుకే పథకానికి ఆయన పేరు అని సీఎం జగన్‌ తెలిపారు. మొదట శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా పథకం అమలు చేస్తామని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు.   కాగా, ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉచిత విద్యుత్‌ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పటిలాగా ఉంటే తమకు ఏ సమస్య ఉండదని.. కొత్తగా ఈ బిల్లులు, నగదు జమ, బిల్లు చెల్లింపులు వల్ల అనవసరపు శ్రమ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఒకవేళ ప్రభుత్వం నగదు జమ ఆలస్యం చేస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలకు అనుగుణంగానే వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు నగదు బదిలీ పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని చెబుతోంది.

కృష్ణా జిల్లాలో పేలుడు.. ఇద్దరు మృతి

ఏపీలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం మండ‌లం సూరంప‌ల్లి పారిశ్రామికవాడ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.   గురువారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభ‌వించ‌డంతో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతుల‌ను విజ‌య‌వాడ రూర‌ల్ కండ్రిక వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులిద్ద‌రూ విజ‌య‌వాడ నుంచి స్క్రాప్‌ కొనేందుకు ప్లైవుడ్ కంపెనీకి వ‌చ్చారు. ప్లైవుడ్ కంపెనీలో కెమిక‌ల్ డ‌బ్బాల‌ను ఆటోలో ఎక్కిస్తుండ‌గా భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

బెంబేలేత్తిస్తున్న కరోనా.. నిన్న ఒక్క రోజే 83,883 పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. మనదేశంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 83,883 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,043 మంది కరోనా తో మరణించారు. ఇది ఇలా ఉండగా నిన్న 68,584 మంది కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశం‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,53,406కి చేరింది. ఇప్పటికే కరోనా పై పోరాడి 29,70,492 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా వైరస్‌తో పోరాడుతూ 67,376 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇంకా మనదేశంలో 8,15,538 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీల రేటు 77 శాతంగా ఉంది.   కాగా, రాష్ట్రాల వారీగా మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 8,25,739 లక్షల కేసులు నమోదయ్యాయి. తాజాగా అక్కడ కొత్తగా 17,433 కరోనా కేసులు నమోదు కాగా 24 గంటల్లో 292 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇంకా తేలని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు.. నాయినితో టెన్షన్.. ఇంత లేటా!

అధికార టీఆర్ఎస్ పార్టీలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ చిచ్చు రేగుతోంది. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నా..  అభ్యర్థులను ఖరారు చేయలేకపోతున్నారు గులాబీ బాస్. ఎక్కువ మంది అశావహులు ఉండటం, సీటు దక్కకపోతే కొందరు తిరుగుబాటు చేసే అవకాశం ఉందని ఐబీ సమాచారంతో కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. నాయిని నర్సింహా రెడ్డి టర్మ్ జూన్ లోనే ముగిసింది. రాములు నాయక్ పార్టీమారడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఆ స్థానం ఖాళీ అయింది. మరో ఎమ్మెల్సీగా ఉన్న కర్నె ప్రభాకర్ టర్మ్ ఆగస్టు 18తో ముగిసింది. గతంలో ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే.. రోజుల్లోనే అభ్యర్థులను ఖరారు చేసి ఎంతో ముందే ప్రకటించేవారు కేసీఆర్. అయితే సీట్లు ఖాళీగా ఉండి చాలా రోజులవుతున్నా.. ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.    నాయినికి ఇవ్వకపోతే తిరుగుబాటే!  మాజీ హోం మంత్రి నాయిని తనకు మరో చాన్స్ దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన అల్లుడికి టికెట్ ఇవ్వనందుకు, తనకు మరోసారి ఎమ్మెల్సీ పదవిని కేసీఆర్ ఇస్తారని నాయిని తన అనచరులతో చెబుతున్నారు. నాయినికి మరోసారి అవకాశం ఇవ్వకపోతే ఆయన తిరుగుబాటు చేస్తారనే భయం టీఆర్ఎస్ లో ఉంది. ఇటీవల మండలి మాజీ చైర్మెన్ స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. ఉద్యమంలో ముందున్న నేతలకు అన్యాయం జరుగుతుందని స్వామిగౌడ్ ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు నాయిని. మొదటి టర్మ్ లో మంత్రి పదవి ఇచ్చినా... సెకండ్ టర్మ్ లో తీసుకోలేదు. రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం జరిగినా అది జరగలేదు. దీంతో చాలా కాలంగా నాయిని అసంతృప్తిగానే ఉన్నారు. కొన్ని సార్లు తన అసంతృప్తిని ఓపెన్ గానే బయటపెట్టారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోతే ఆయన తీవ్ర నిర్ణయం తీసుకోవచ్చని టీఆర్ఎస్ నేతలు ఆందోళన పడుతున్నట్లు తెలుస్తోంది.    రేసులో పీవీ కుమార్తె వాణిదేవి.. టెన్షన్ లో దేశపతి?  ఇటీవలే పదవి కాలం పూర్తైన కర్నె ప్రభాకర్ తనకు రెన్యూవల్ ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పార్టీ నుంచి ఆయనకు సిగ్నల్స్ కూడా వచ్చినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్సీ పదవికోసం దేవీ ప్రసాద్, దేశపతి శ్రీనివాస్ ఆశపడుతున్నారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పీవీ కూతురు వాణీ దేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతుంది. సర్కారు నిర్వహిస్తున్న పీవీ శతజయంతి ఉత్సవాల కారణంగా వాణీ దేవి తరచుగా సీఎం కేసీఆర్ ను కలుస్తున్నారు. కాంగ్రెస్ లో పీవీకి అన్యాయం జరిగిందని కేసీఆర్ అన్నారు. వాణీ దేవిని ఎమ్మెల్సీగా ఎంపికచేసి ఆ కుటుంబానికి న్యాయం చేశామని కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది. రేసులోకి వాణీ దేవి ఎంటరవడంతో తమ చాన్స్ కు ఆమె గండి కొడుతుందేమోనని.. ఆమె సామాజిక వర్గానికే చెందిన దేశపతి, దేవీ ప్రసాద్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది.    కొత్త వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్?  రాములు నాయక్ స్థానాన్ని తనకు ఇస్తారని మాజీ ఎంపీ సీతారాం నాయక్ ధీమాలో ఉన్నారు. 2014లో ఎంపీగా ఉన్న నాయక్ కు గత ఎన్నికల్లో సీటు ఇవ్వలేదు. గతంలో ఆయనను మండలికి పంపిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా చాలా మంది లీడర్లు తమ అదృష్టం పరీక్షించుకునే పనిలోపడ్డారు. సమయం వచ్చిన ప్రతిసారి కేటీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ జిల్లా నుంచి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎంపీ గుండు సుధారాణి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి అరెకల నర్సారెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరావు, కరీంనగర్ నుంచి తుల ఉమ, నల్గొండ నుంచి మందుల సామేలు, గ్రేటర్ హైదరాబాద్ నుంచి బండి రమేశ్‌, క్యామ మల్లేష్ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఎల్పీసెక్రటరీ రమేష్ రెడ్డి కూడా ఎమ్మెల్సీస్థానాన్ని ఆశిస్తున్నట్టు తెలిసింది. కొత్తవారికి ఎమ్మెల్సీ ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వస్తోంది. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎంపిక కేసీఆర్ కు చిక్కుముడిగా మారిందని చెబుతున్నారు. అందుకే గతంలో ఎప్పుడు లేనంతా సమయం తీసుకుంటున్నారని తెలంగాణ భవన్ లో చర్చ జరుగుతోంది.