ఎన్నికల కమిషన్ వ్యవహారంలో సీఐడీ విచారణపై హైకోర్టు స్టే 

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఈరోజు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ఎన్నికల కమిషన్ అంశంలో సీఐడీ చేస్తున్న దర్యాప్తు పై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల సంఘం ఉద్యోగులు తమ విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు నమోదు చేసిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎలక్షన్ కమిషన్ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వేధిస్తోందని ఆ పిటిషన్ లో అయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఎస్ఈసీ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నిమ్మగడ్డ రమేశ్, సాంబమూర్తిల పిటిషన్లను కలిపి విచారణ జరుపుతామని హైకోర్టు ఈరోజు తెలిపింది. ముందుగా ఈ కేసులో విచారణ ఎవరిపై, ఎందుకు చేస్తున్నారో వివరాలు తెలపాలని ఏపీ సిఐడిని ఆదేశించింది. ఈ కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసేంతవరకు తదుపరి చర్యలు నిలిపివేయాలని సీఐడీకి కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర

ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణ అసెంబ్లీ ఘననివాళి   తెలంగాణ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాల మొదటిరోజు మాజీ రాష్ట్రపతి దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ, తెలంగాణ ఎమ్మెల్యే  సొలిపేట రామలింగారెడ్డిలకు నివాళులు అర్పించారు. శాసనసభలో ప్రణబ్ ముఖర్జీపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ భారత దేశం శిఖ‌ర స‌మాన‌మైన నేత‌ను కోల్పోయింద‌ని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్ర‌పంచంలోనే ప్ర‌ముఖ ఆర్థికవేత్త‌గా ప్ర‌ణ‌బ్ పేరు తెచ్చుకున్నార‌ని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ పాత్ర మరవలేదని, రాష్ట్రపతి హోదాలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై సంతకం చేసిన మహానుభావుడని గుర్తుచేశారు. ప‌శ్చిమ బెంగాల్ లో చిన్న గ్రామంలో పుట్టిన ఆయ‌న రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు ఎదిగార‌ని, చిన్నతనంలో స్కూలుకు వెళ్లాలంటే చిన్నవాగు ఈదుకుంటూ వెళ్లేవారని, గొప్ప నేతగా ఎదిగిన ఆయన  రాజ‌కీయ స‌ముద్రాన్ని స‌మ‌ర్థంగా ఈదిన నేత అని సిఎం కొనియాడారు.   తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు క‌రోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోకి మాస్క్ధరించడంతో పాటు కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉన్నవారిని మాత్రమే అనుమతించారు. సభా ప్రాంగణాల్లో శానిటైజర్, థర్మల్ స్కానర్లు, ఆక్సీమీటర్లతో సహా అవసరమైన వైద్య పరికరాలను, వైద్యసిబ్బందిని సిద్ధంగా ఉంచారు.   రాష్ట్ర ప్రణబ్ ముఖర్జీకి సభ సంతాప తీర్మానం చేసిన తర్వాత ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డికి సభ నివాళుల‌ర్పించింది. ఇటీవల మరణించిన మాజీ స‌భ్యులు సున్నం రాజ‌య్య‌, ఎడ్మ కిష్టారెడ్డి, పి రామ‌స్వామి, కావేటి స‌మ్మ‌య్య‌, జువ్వాడి ర‌త్నాక‌ర్ రావు, పోచ‌య్య‌, మ‌స్కు న‌ర్సింహ‌, బి కృష్ణ‌, మాతంగి న‌ర్స‌య్య మృతి ప‌ట్ల స‌భ నివాళుల‌ర్పిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఆ తర్వాత సభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

వలసలతో కాషాయ జోరు.. కారుకు కష్టమేనా! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో అక్కడ బైపోల్ అనివార్యమైంది. అధికార పార్టీగా ఉండటం, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ తో టీఆర్ఎస్ గెలుపు ఈజీగానే ఉంటుందని మొదట అందరూ భావించారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డ్ కూడా అద్భుతంగా ఉంది. గతంలో జరిగిన చాలా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది. ఇలా అన్నిఅనుకూలంగా ఉండటంతో దుబ్బాకలో వార్ వన్ సైడ్ గానే ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమయింది. అయితే ప్రస్తుతం దుబ్బాకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. విపక్షాలు సవాల్ గా తీసుకోవడంతో కారు పార్టీకి టఫ్ ఫైట్ ఉండే సూచనలు కన్పిస్తున్నాయి.    బీజేపీ నుంచి సీనియర్ నేత రఘునందన్ రావు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. వరుసగా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి కూడా ఉంది. మరోవైపు సోలిపేట కుటుంబంపై స్థానికంగా వ్యతిరేకత కనిపిస్తోంది. ఇలా అన్ని అంశాలు కలిసి వస్తుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు రఘునందన్ రావు. ఇప్పటికే ఆయన సగానికి పైగా గ్రామాలు చుట్టేశారు. యువత టార్గెట్ గా ఆయన ముందుకు పోతున్నారు. బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. యువకులు, యూత్ సంఘాలు రఘునందన్ రావుకు మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో రోజు రోజుకు దుబ్బాకలో బీజేపీ బలం పుంజుకుంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.    కాంగ్రెస్ కూడా దుబ్బాక ఉపఎన్నికలను సీరియస్ గా తీసుకుంది. మెదక్ మాజీ ఎంపీ విజయశాంతిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది.  ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు విజయశాంతి వ్యక్తిగత ఇమేజ్ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాములమ్మ మెదక్ ఎంపీగా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాపై ఆమెకు మంచి పట్టుంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. పార్టీలకతీతంగా అన్ని పార్టీలతో ఆమెకు సంబంధాలున్నాయి. గత ఎన్నికలో దుబ్బాక నుంచి కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి లేకున్నా రెండో స్థానం కైవసం చేసుకోగా బీజేపీకి మూడో స్థానం వచ్చింది. విజయశాంతిని బరిలోకి దింపితే అన్ని రకాలుగా కలిసి వస్తుందని హస్తం పార్టీ లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది.     2019 మార్చిలో జరిగిన ఉత్తర తెలంగాణ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఎన్నికల్లో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఉద్యోగులు, యువకుల్లో టీఆర్ఎస్ పట్ల పెరిగిన వ్యతిరేకత ఆ ఎన్నికల్లో కన్పించింది. ఇప్పుడు అంతకు మించి కేసీఆర్ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కాంగ్రెస్, బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. కేసీఆర్ కు షాకిచ్చేందుకు జనాలు ఉత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు.    బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాలతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిలో సానుకూలంగా లేవని గ్రహించిన సీఎం కేసీఆర్.. మంత్రి హరీష్ రావును ప్రచార బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్.. ఇప్పటికే నియోజకవర్గంలో పలు సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కరోనా సోకడంతో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. అయినా దుబ్బాక రాజకీయాలను ఆయన నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. హరీష్ డైరెక్షన్ లో మెదక్ ఎంపీతో పాటు జిల్లాకు చెందిన అధికార ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మండలాల వారీగా బాధ్యతలు తీసుకుని కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి గతంలో చాలా ఉప ఎన్నికలను ఈజీగా గెలుచుకున్న టీఆర్ఎస్ కు... దుబ్బాక సవాల్ గా మారిందనే ప్రచారం గులాబీ వర్గాల్లోనూ జరుగుతోంది.

కరోనా ముప్పు పల్లెలకు సోకింది

కరోనా మహమ్మారి పట్టణాలను వదిలి గ్రామల మీద ప్రతాపం చూయిస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం గ్రామాల్లోనే వస్తున్నాయి. దేశంలో మొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నలభై లక్షల కు చేరువలో ఉంది. అసుపత్రి సదుపాయాలు సరిగ్గా లేని గ్రామాల్లో ఈ వైరస్ తన ప్రభావం చూపిస్తోంది. హౌ ఇండియా లివ్స్ వెబ్ సైట్ చేసిన సర్వేలో దాదాపు 94శాతం గ్రామీణ ప్రాంతాల వారు కరోనా బారిన పడ్డారని తెలుస్తోంది. దేశంలోని 714జిల్లాల్లో కరోనా సోకిందని ఈ సర్వే ఫలితాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించే సంఖ్యలో మాత్రం వాస్తవాలు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాపిస్తే పరిస్థితులు ఆందోళన కరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   పిల్లల నుంచే ఎక్కువగా.. కరోనా వ్యాప్తికి కారణాలను అన్వేషిస్తున్న పరిశోధకులు చెప్తున్న విషయాలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. కోవిద్ 19 వైరస్ పిల్లలకు సోకినా వారిలో అంతగా లక్షణాలు కనిపించవి అయితే వారి ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని చెప్తున్నారు. పిల్లలు సరైనా మాస్కులు లేకుండా గుంపులుగా ఆట పాటల్లో నిమగ్నమవుతున్నారు. టీనేజ్ పిల్లల్లో రోగ నిరోధక శక్తి  ఎక్కువగా ఉండటంతో వారిలో కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం ఉండదు. లక్షణాలు కూడా బయటకు కనిపించవు. అయితే వారి ద్వారా పెద్దలకు వైరస్‌ సోకుతుందని  ‘ది జర్మన్‌ సొసైటీ ఫర్‌ వైరాలోజీ’ తాజాగా హెచ్చరించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ సోకినా 60 వేల మందిపై యాండీ బాడీస్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3.4 శాతం పిల్లలు ఉన్నారని, వారందరిలో యాంటీ బాడీస్‌ అభివృద్ది చెందినట్లు గుర్తించారు. లక్షణాలు కనిపించలేదని అజాగ్రత్త చేయవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అన్ లాక్ 4 మార్గదర్శకాలను విడుదల చేసిన ఏపీ సర్కార్

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4 మార్గదర్శకాలను ఏపీ సర్కార్ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు విద్యా సంస్థల బంద్ కొనసాగనుంది. అయితే ఈ నెల 21 నుండి 9, 10, ఇంటర్ విద్యార్థులు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరిగా పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లకు కూడా ఈ నెల 21 నుండి అనుమతి ఇచ్చింది. అలాగే పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులు తరగతులకు హాజరయ్యేందుకు అనుమతిని ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.    ఈ నెల 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మత పరమైన, పొలిటికల్ సమావేశాలు జరుపుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ నెల 20 నుండి పెళ్ళిలకు 50 మంది అతిథులతో అనుమతినిచ్చింది. అలాగే, అంత్యక్రియలకు 20 మందికి అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్‌కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌ లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. 

వీఆర్వో వ్యవస్థ రద్దు.. రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు!

తెలంగాణలో గ్రామ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధానంగా గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వోల) వల్ల ప్రభుత్వం బద్‌నాం అవుతోందని ఆయన భావిస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలంటే వీఆర్‌వో వ్యవస్థ రద్దు ఒకటే మార్గమని సీఎం స్పష్టం చేశారు. వీఆర్‌వోలను ఇతర శాఖల్లో కలిపేయాలన్నారు.   ఇప్పటికే వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం సాయంత్రం కల్లా రికార్డులు స్వాధీనం చేసుకుని, రిపోర్ట్‌ పంపాలని సీఎస్ కలెక్టర్లకు ఆదేశించారు.   అయితే, దీనిపై మాకు చాలా అనుమానాలు ఉన్నాయని, మా అనుమానాలను ప్రభుత్వం నివృత్తి చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. మా సర్వీస్ పరిస్థితి ఏంటి? మేం ఏ శాఖలో ఉద్యోగులం అవుతామో చెప్పాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.

అధిష్టానంతో పెట్టుకుంటే అంతే.. యూపీ సీనియర్ నేతలకు షాక్!

అధిష్టానంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ మరో సారి రుచి చూపించింది. యూపీ సీనియర్ కాంగ్రెస్ నేతలను అదును చూసి దెబ్బ కొట్టారు అధినేత్రి. మరో రెండేళ్లలో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏడు కమిటీలను ఏర్పాటు చేసింది. సీనియర్ నేతలైన రాజ్ బబ్బర్, జితిన్ ప్రసాదతో పాటు మరి కొందరికి వీటిలో చోటు దక్కలేదు. క్రియాశీల నేత, పూర్తికాలపు అధ్యక్షుడు కావాలంటూ లేఖ రాసి సంతకాలు పెట్టిన 23 మంది నేతలలో వీరిద్దరు కూడా ఉన్నారు. జితిన్ ప్రసాద యూపీఏ హయాంలో కేంద్ర మంత్రి. రాజ్ బబ్బర్ నిన్న మొన్నటి వరకు యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్నారు. ఏడు కమిటీల్లో ఏ ఒక్క దానిలో కూడా వీరికి చోటు దక్కపోవటాన్ని బట్టి చూస్తే సోనియా వీరిపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థమవుతోంది.   హైకమాండ్ నిర్ణయంపై యూపీ కాంగ్రెస్ నేతలు వేరేలా బావిస్తున్నారు. వారు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నందున అదనపు భారం మోపటం ఇష్టం లేకే వారిని కమిటీలకు దూరంగా పెట్టిందని, అంతకు మించి అధిష్టానిని వారిపై ఏ దురుద్దేశం లేదని పార్టీ నాయకులు కొందరు అంటున్నారు.   కాంగ్రెస్ అధిష్ఠానం యూపీ మేనిఫెస్టో కమిటీని కూడా ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ దీనికి నాయకత్వం వహిస్తారు. పి.ఎల్. పూనియా, సుప్రియా శ్రీనాతే, అర్ధానా మిశ్రా, ప్రమోద్ తివారీ, ఇమ్రాన్ మసూద్ తదితరులు ఖుర్షీద్ టీమ్ లో ఉన్నారు. వీరు ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోను రూపొందిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లో పార్టీ ఇన్‌చార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఇప్పటికే పలు ఎన్నికల బృందాలను ఏర్పాటు చేయడం ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.   గత ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందే ప్రియాంకకు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యతలు అప్పగించారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె అట్టర్ ఫ్లాప్ అయ్యారు. కేవలం రెండే రెండు సీట్లు గెలిచింది కాంగ్రెస్. రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చెత్త పర్ఫామెన్స్ అదే. సోనియా గాంధీ రాయ్ బరేలిని నిలుపుకున్నప్పటికీ, బిజెపి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ అమేథిలో ఘోర పరాజయం చవిచూశారు. ఇప్పుడు భవిష్యత్ లోకి చూడటమే ముఖ్యమని భావించి అధిష్టానానికి ఎంతో దగ్గరివాడైన సల్మాన్ ఖుర్ఫీద్ పై పెద్ద బాధ్యతలు పెట్టినట్టు తెలుస్తోంది. అలీగఢ్ లో జన్మించిన ఖుర్షీద్ ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈయన మాజీ రాష్ట్రపతి జాకీర్ హుస్సేన మవనడు.

కరోనా మందు.. ఎవరికి ముందు

ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్న నానుడి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో జరుగుతున్న చర్చల తీరు గమనిస్తుంటే ఈ నానుడిని మరోసారు గుర్తుకు చేసుకోవల్సిందే. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా వందకు మించి ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో చాలా వరకు క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్నాయి. అవి విజయవంతమై ఉత్పత్తిని ఇంకా ప్రారంభించనే లేదు. ఇంతలోనే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోన్నే వ్యాక్సి న్ విజయవంతమైతే ముందుగా ఎవరికీ ఆ వ్యాక్సిన్ ఇవ్వాలి అన్న అంశంపై అంతర్జాతీయంగా చర్చజరుగుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలకు ప్రాధాన్యతనిస్తూ టీకా పంపిణీ చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే సంపన్న దేశాలకు సూచించింది.   ఈ వైరస్ ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలను, మరణాల రేటు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 19 మంది అంతర్జాతీయ ఆరోగ్య నిపుణులు ఒక బృందంగా ఏర్పడి కొన్ని సూచనలు చేశారు. ఈ బృందానికి పెన్సిల్వేనియా యూనివర్సిటీకి చెందిన ఎజెకీల్‌ జే ఎమ్మన్యూల్‌ నేతృత్వం వహిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే  మూడు దశల్లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయాలంటూ కొన్ని సూచనలు చేశారు. వాటిలో కొన్నింటి పరిశీలిస్తే.. కోవిద్ 19 వైరస్ కారణంగా అత్యధికంగా మరణాలు సంభవించే దేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. వైరస్‌తో పోరాడుతూనే ఆర్థికంగా ముందుకు వెళుతున్న దేశాలకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేయాలని సూచించారు. కరోనా తో ఊహించిన దానికంటే ముందుగా మరణాలు నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు.   అయితే అక్టోబర్ చివరికల్లా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని, అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలంటూ సీడీసీ డైరెక్టర్ రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఓ లేఖలో పేర్కొన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ఇప్పటికే అమెరికాలో నవంబర్ 1వ తేదీ నుంచి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభిస్తామంటున్నారు.  వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ (AstraZeneca) ఆమోదానికి చేరువలో ఉందని ఇటీవల ప్రకటించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగాలని ఆయన భావిస్తున్నారు.   ఇప్పటివరకు ప్రయోగశాలను దాటి క్లినికల్ ట్రయల్స్ లోనే ఉన్న వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమై మార్కెట్ లోకి వస్తే తప్ప కరోనా మందు ఎవరికీ ముందు అన్న విషయంపై స్పష్టత రాదు. అప్పటివరకు ప్రయోగాలతో పోటీ పడి అంతర్జాతీయ వేదికలపై ఇలా చర్చలు జరగడం మాములే..! ఎందుకుంటే కరోనా చేసిన నష్టం, కలిగించిన కష్టం ఇంతంత కాదు కదా..!

బెంబేలెత్తిస్తున్న కరోనా.. ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్.. 

భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. తాజాగా గడచిన 24 గంటల్లో 90,802 మందికి కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 42,04,614కు చేరుకుంది. నిన్న మరో 1016 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 71,642కు చేరుకుంది. అయితే దేశంలో ఇప్పటివరకు 32,50,429 మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,82,542కి చేరింది.   ఇది ఇలా ఉండగా ప్రపంచంలోనే ఒక దేశంలో ఒకే రోజు 90వేల పాజిటివ్ కేసులు నమోదవడం ఇదే మొదటి సారి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. అంతేకాకుండా కొత్త కేసుల నమోదులో భారత్ 32 రోజులుగా టాప్ పొజిషన్‌లో కొనసాగుతోంది. ఇక మరణాల విషయంలో అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియా మూడో స్థానంలో ఉంది.

లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేని విమాన ప్రయాణికులకు శుభవార్త

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో విమాన సర్వీసులన్నీ రద్దు చేశారు. మార్చి 25  నుంచి మే 3 మధ్య దేశీయ, విదేశీయ విమాన ప్రయాణాల కోసం ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులకు శుభవార్త చెప్తున్నాయి విమానయాస సంస్థలు. ప్రయాణీకులు బుక్ చేసుకున్న టికెట్ మొత్తాన్ని పూర్తిగా రిఫండ్ ఇస్తామంటున్నారు. వచ్చే ఏడాది అంటే 2021 మార్చి 31లోగా అదే టిక్కెట్ పై ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారు.    లాక్ డౌన్ సమయంలో ప్రయాణం చేయలేనివారి తరపున ప్రవాసీ లీగర్ సెల్ ఎన్జీవో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈ విషయంపై సమాధానం చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్రాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో టిక్కెట్ బుక్ చేసుకున్నవారికి విమానయాన సంస్థలు కనుక రిఫండ్ ఇవ్వకుంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు అదే టికెట్‌పై మరోమారు ప్రయాణించే అవకాశం (క్రెడిట్ షెల్) లభిస్తుందని కేంద్రం వివరించింది.  క్రెడిట్ షెల్ వినియోగించుకోని ప్రయాణికులకు పూర్తిస్థాయి రిఫండ్ ఇస్తుందని అత్యున్నత ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. విమాన ప్రయాణికులు తమ టికెట్‌ను వేరేవారికి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంది. దీంతో కరోనా సమయంలో ప్రయాణం చేయలేకపోయిన వారికి కాస్త ఊరట కలిగింది.

ప్రపంచ అనారోగ్య సంస్థ కబంధ హస్తాల నుంచి విముక్తి ఎపుడో..

ప్రపంచ మానవాళిని గత కొద్ది నెలలుగా పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా. ఇప్పటివరకు లక్షణాలతో, కొత్త కేసులతో భయపెట్టిన ఈ వ్యాధి ఇప్పుడు చాపకింద నీరుగా విస్తరిస్తూ బయటకు కనిపించకుండానే ప్రాణాలు తీస్తుంది. ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. ఇందుకు కారణం కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో వైద్యపరీక్షలు చేయించుకోకపోవడం. ఒక వేళ నమోదు అవుతున్నా తక్కువ సంఖ్యలోనే బయటపడుతున్నాయి.  45 శాతం దేశాల్లో రోజుకి వెయ్యి లోపు  కేసులే కొత్తగా నమోదు అవుతున్నాయి. కొత్త కేసుల విషయం లో భారతదేశం మొదటి స్థానంలో ఉండగా (ఆదివారం ఒక్కరోజే 91723 కొత్త కేసులు నమోదు అయ్యాయి) అమెరికా రెండవ స్థానంలో (31110 కొత్తకేసులు)వుంది. మరో రెండుమూడు వారాల్లో అమెరికాలో కరోనా కేసుల సంఖ్య అయిదు వేల కంటే తక్కువగా పడి పోతుంది అని వైద్య బృందాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు దాదాపు 15 వేల కేసులు తో బ్రెజిల్ మూడవ స్థానం లో వుంది. ఇక్కడ కూడా కేసులు వేగం గా తగ్గిపోతున్నాయి. మరో రెండు వారాల్లో ఈ సంఖ్య చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. అంటే  ఈనెల చివరి నాటికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్య 98 శాతం సమసి పోతుంది అనుకోవచ్చు.   ప్రపంచ అనారోగ్య సంస్థ సూచనల్ని బేఖాతరు చేసిన స్వీడన్ , థాయిలాండ్, వియత్నాం లాంటి అనేక దేశాలు కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించాయి. మాస్క్ లు , భౌతిక దూరం లాంటివి ఇప్పుడు అక్కడ అవసరం లేకుండా పోయింది. అన్నట్టు మన దాయాది దేశం పాకిస్థాన్ లో నిన్న నమోదైన కొత్త కేసులు 500 లోపే.. నిబంధనలు పాటించకుండా వారు చేసిన రంజాన్ షాపింగ్ పుణ్యమా అని వారికి హెర్డ్ ఇమ్మ్యూనిటి త్వరగా వచ్చేసింది.   సెప్టెంబర్ ఇరవై తరువాత కొత్త గా కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అయ్యే ఏకైక దేశంగా ఇండియా మిగిలిపోతుంది అనడంతో ఏ మాత్రం సందేహం కనిపించడం లేదు. ఆదివారం ఒకరోజే 91వేలకు పైగా కేసులు నమోదు కాగా.. నేడో, రేపో కొత్త కేసుల సంఖ్య లక్షను చేరుతుంది అన్నది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచంలో రోజూ లక్ష కొత్త కేసులు నమోదు అయిన దేశంగా రికార్డు సృష్టించబోతున్నది భారతదేశం. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇంతగా పెరగడానికి, ఇది రావణ కాష్టంలా సాగడానికి ప్రధాన కారణం మనలో చాల మంది ప్రపంచ అనారోగ్య సంస్థ(మన పాలిట అనారోగ్య సంస్థే) మాటల్ని విపరీతమైన భక్తి తో పాటించడమే ! కోవిడ్ 19 వైరస్ కేసులు నమోదు అయిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు ప్రపంచ అనారోగ్య సంస్థ చేసిన ప్రకటనలు చూస్తే ఏది వాస్తవం, ఏది అవాస్తవం అన్నది మనం స్పష్టంగా తెలుసుకోలేని అయోమయపరిస్థితి. ఇంటి నుంచి కాలు బయట పెడితే కరోనా వైరస్ సోకుతుంది, ఒకసారి వైరస్ శరీరంలోకి వచ్చిందంటే మరణమే శరణమని నమ్ముతున్నాం. ప్రాణాలు తీసే కరోనా బారిన పడకుండా నాలుగుగోడల మధ్య బందీగా మారారు.  ప్రపంచ అనారోగ్య సంస్థ చెప్పే ప్రతి మాటను మూఢభక్తి తో నమ్ముతున్న ప్రజలున్న ఏకైక దేశం మనదే! భయం తో ఉన్న వారినే చూసి కాటెయ్యడం కరోనా ప్రపంచ వ్యాప్తంగా చూపిన లక్షణం.      కోటి జనాభా ఉన్న స్వీడన్ "నేను హెర్డ్ ఇమ్మ్యూనిటి మార్గంలో వెళుతాను.. ప్రకృతి సిద్ధమైన రోగనిరోధక శక్తినే నమ్ముకొంటాను .. ప్రపంచ అనారోగ్య సంస్థ సైన్స్ పేరుతొ చెబుతున్న బూటకపు మాటల్ని కాదు" అని ముందుకు వెళ్ళింది. ఆ దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కావడంతో పాటు ఇప్పటివరకు కేవలం అయిదు  వేల మరణాలతో కరోనా పై నూటికి నూరు శాతం విజయం సాధించింది.   కళ్ళుండీ చూడలేని మనుషులున్న ప్రపంచం మనది. అంతరీక్షంలోకి మరో దశాబ్దాలంలో మనుషులు వెళ్లగలిగేంత అభివృద్ధిని సాధిస్తున్నాం. మరోవైపు సైన్స్ పేరుతో మధ్య యుగం నాటి మూఢ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారు. కరోనా ఎలా వస్తుందో, ఎందుకు వస్తోందో స్పష్టంగా చెప్పలేకపోయినా ప్రపంచ అనారోగ్య సంస్థ  చెబుతున్న విషయాలను  మనం గుడ్డిగా నమ్మాల్సిందే. కాదని ఎవరైనా ప్రశ్నించినా  సరైన సమాధానం ఆ సంస్థ వద్ద లేదు. అందుకే వింతవింత కారణాలు, పొంతనలేని విషయాలు చెప్పుతూ నాటకాలు ఆడుతున్నది ప్రపంచ అనారోగ్య సంస్థ. జీవితాలను బందీ చేస్తున్న ఈ సంస్థ కబంద హస్తాల నుంచి మనకు విముక్తి ఎప్పుడో?

నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారిన పడిన మహిళ

కరోనా నుంచి కోలుకున్నాం, ఇక మాకు తిరుగులేదు అనుకుంటే పొరపాటే. అనేకమంది రెండోసారి కూడా కరోనా బారినపడుతున్నారు. ఇటీవల మనదేశంలో కూడా రెండోసారి కరోనా బారిన పడుతున్న ఘటనలు బాగానే వెలుగు చూస్తున్నాయి. ఏపీలో టీటీడీ ఉద్యోగి రెండోసారి కరోనా బారిన పడిన ఘటన మరువకముందే.. బెంగళూరులో ఓ మహిళ నెల రోజుల వ్యవధిలో రెండోసారి కరోనా బారినపడడం కలకలం రేపుతోంది. 27 ఏళ్ల మహిళ కరోనా సోకడంతో జులై మొదటి వారంలో ఆసుపత్రిలో చేరింది. చికిత్స అనంతరం నెగటివ్ రావడంతో అదే నెల 24న ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే, నెల రోజుల తర్వాత కరోనా లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరింది. దీంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. బెంగళూరులో రెండోసారి కరోనా సోకిన తొలి వ్యక్తి ఆమే కావడం గమనార్హం.   కాగా, ముంబై లోనూ ఇటీవల నలుగురు వైద్యులు రెండోసారి కరోనా బారినపడ్డారు. నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాలలోనూ రెండోసారి కరోనా బారినపడిన కేసులు వెలుగుచూస్తున్నాయి. రెండోసారి కరోనా సోకడంపై ఇప్పటికే పలు పరిశోధనలు జరుగుతున్నాయి. కోలుకున్న తర్వాత వారి శరీరంలో మిగిలి ఉన్న వైరస్ అవశేషాలతో తిరగబెట్టిందా? లేక అది కొత్తగా సోకిందా? అన్న విషయంలో ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో స్పష్టత లేదు. 

మంచైతే మనదే.. టీడీపీ, వైసీపీ డబుల్ గేమ్.. ఏపీలో రచ్చ

మంచి జరిగితే తమ ఖాతాలో వేసుకోవడం, చెడుదయితే ఇతరులకు అంటగట్టడం. ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు ఇదే పంథా అనుసరిస్తున్నాయి. తమ డబుల్ స్టాండర్ట్ విధానాలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు హిట్ అయితే తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫెయిల్ అయితే మాత్రం.. విపక్షాలకు అంటగడుతుంటారు. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్, రైతు ఆత్మహత్యలపై వచ్చిన ర్యాంకులు, నివేదికలు వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్దానికి దారి తీశాయి.    కేంద్ర సర్కార్ నిర్వహించే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ ర్యాకింగ్స్ లో దేశంలోనే ఏపీకి తొలిర్యాంకు ద‌క్కింది. ర్యాంకులు విడుదలైన వెంటనే చంద్రబాబు, టీడీపీ టీమ్.. ఈ ఘనతను  ఫుల్‌గా త‌న ఖాతాలోనే  వేసుకునే ప్రయత్నాలు చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే.. EODBలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేషన్ ట్వీట్ చేశారు. 2018- 2019‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి మొదటి ర్యాంకు రావటం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనం అని  ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా తాము ప్రారంభించిన కొత్త పారిశ్రామిక విధానాల వల్లే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని గొప్పలు చెప్పుకున్నారు.    దేశంలో రైతు ఆత్మహత్యలపై ఇటీవలే ఓ సంస్థ నివేదిక ఇచ్చింది. 2019లో రైతు ఆత్మహత్యలు గతంలో కంటే భారీగా పెరిగాయి. దీంతో టీడీపీ నేతలు జగన్ సర్కార్ టార్గెట్ గా ఆరోపణలు చేశారు. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని నారా లోకేష్ ట్వీట్ చేశారు. విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక చేతులెత్తేసింది. అసమర్థ వైకాపా ప్రభుత్వం. అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే మూడో స్థానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు. వైసీపీ నేతలు కూడా ఘాటుగాగే స్పందించారు. చంద్రబాబు ఐదేండ్ల పాలనలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురైందని, అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.    2019 మే వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. జూన్ నుంచి జగన్ పాలన మొదలైంది. ఈ లెక్కన 2019లో ఏం జరిగినా రెండు ప్రభుత్వాలకు లింక్ ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ స‌ర్వే 2019 ఆగ‌స్టు వ‌ర‌కు జ‌రిగిందని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది. దీనిని బ‌ట్టి మేలోనే పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన జ‌గ‌న్‌కు కూడా దీనిలో భాగం ఉంద‌నే చెప్పాలి. ఇక‌ ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన‌.. ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు పాలించారు కాబ‌ట్టి చంద్ర‌బాబు కూడా ఫిఫ్టీ ప‌ర్సెంట్ ద‌క్కుతుంది. కాని ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. రైతు ఆత్మహత్యలకు రెండు ప్రభుత్వాల బాధ్యత ఉంటుంది. కాని ఎవరూ ఆ పని చేయడం లేదు.    ఇక‌ జ‌గ‌న్ సర్కార్ విద్యుత్ సంస్క‌ర‌ణ‌లు అంటూ రైతులు వినియోగించే విద్యుత్ కు మీట‌ర్లు పెడ‌తామ‌ని చెబుతున్నారు. మంత్రి పేర్ని నాని.. కేబినెట్‌లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించిన వెంట‌నే స్పందించిన చంద్ర‌బాబు.. ఇది నా ఆలోచ‌నే! అంటూ ప్ర‌చారానికి దిగారు. సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడు తానేన‌ని ప్ర‌క‌టించుకున్నారు. ఓ రెండు గంట‌లు గ‌డిచిన త‌ర్వాత ఇది అక్ర‌మం, అన్యాయం అంటూ.. గొంతు స‌వ‌రించుకున్నారు చంద్రబాబు. రైతుల‌కు శాప‌మంటూ తిట్ట‌దండ‌కం అందుకున్నారు. ఇలా అన్ని విష‌యాల్లోనూ టీడీపీ, వైసీపీలు.. మంచిని తమ ఖాతాలో వేసుకుంటూ.. చెడును ఇతర పక్షాలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతలు డబుల్ గేమ్ ఆడుతుండటంపై స‌ర్వ‌త్రా విమర్శలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ పాఠ్యాంశం.. కేసీఆర్ డేర్ .. బాబు ఢీలా! జగన్ నిర్ణయం... 

రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట. పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఎత్తులు వేస్తూ ముందుకు పోతుంటారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన ఎప్పటికప్పుడు కార్యాచరణ మారుస్తూ వెళ్లారు. తనకు నచ్చిన ఆలోచనలు, వ్యూహాలు వెంటనే అమలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిగానూ ఆయన తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇబ్బంది అవుతుందని తెలిసినా కొన్ని విషయాల్లో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గరు. సమగ్ర సర్వే, కాళేశ్వరం ప్రాజెక్టు,  భూముల సర్వే.. ఇలా అన్నివిషయాల్లో విపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా కేసీఆర్.. ఎవరిని పట్టించుకోకుండా తాను అనుకున్నది చేస్తూ పోయారు. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో చేర్చారు  కేసీఆర్. సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని... పేదలకు రూ.2కే కిలో బియ్యం,మధ్యాహ్నం భోజన పథకం,మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్‌ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ  కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.    కేసీఆర్ నిర్ణయంతో చంద్రబాబు వ్యవహారశైలిపైనా ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, తన మామైన ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యంశంగా చేర్చాలని చంద్రబాబు ఆలోచన చేయలేకపోయారనే వాదన వస్తోంది. అయితే చంద్రబాబు ఏ నిర్ణయాన్ని డేర్ గా తీసుకోలేరని, ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే విపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన ఆలోచించి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. చంద్రబాబు ఆ డిమాండ్ ను కూడా నేరవెర్చలేదు. ప్రస్తుత సీఎం జగన్ మాత్రం జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందే. ఎన్టీఆర్ పేరును ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు వాడుకున్నారని ఆయన వ్యతిరేకులు మరింత ప్రచారం చేసే అవకాశం ఉంది.    మొత్తానికి పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అన్నగారి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తల ప్రశంసలు అందుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. అయితే ఎన్టీఆర్ పాఠ్యాంశంపై తెలంగాణలోని ఇతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఉద్యమ సంఘాల నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్నారు. మొత్తానికి  రాజకీయాల్లో కేసీఆర్ రూటే సెపరేటు కదూ..

ఇది భారత్ కి చైనాకి తేడా.. మనవాళ్ళు కాపాడారు.. వాళ్ళు కిడ్నాప్ చేశారు

భారత బలగాలు, చైనా బలగాలు మధ్య వ్యత్యాసం ఏంటో తాజాగా జరిగిన రెండు సంఘటనలు తెలియజేస్తున్నాయి. ఒకవైపు చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులను భారత బలగాలు రక్షించగా.. మరోవైపు ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి.   ఉత్తర సిక్కిం ప్రాంతంలో సముద్ర మట్టానికి దాదాపు 17,500 అడుగుల ఎత్తైన ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న చైనాకు చెందిన ముగ్గురు వ్యక్తులు దారి తప్పి భారత భూభాగంలోకి ప్రవేశించారు. అయితే భార‌త్- చైనాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు ఉన్న వేళ కూడా భారత సైనికులు వారిని రక్షించి మానవత్వాన్ని, మన దేశ గొప్పతనాన్ని చాటారు. భార‌త సైనికులు మొదట వారిని అడ్డుకుని ప్ర‌శ్నించి.. పొర‌పాటున దారి తప్పార‌ని నిర్ధారించుకున్న అనంత‌రం వారికి ఆక్సిజన్ తో పాటు మెడిక‌ల్ సాయం అంద‌చేశారు. అలాగే వారికి ఆహారం ఇచ్చారు. చలిని త‌ట్టుకునేందుకు వీలుగా వారికి వెచ్చ‌టి దుస్తులను కూడా ఇచ్చి.. వారు చైనా వెళ్లేందుకు మార్గం చూపి సాగ‌నంపారు.   ఐతే ఒకవైపు చైనా వ్యక్తులను భారత సైనికులు రక్షిస్తే.. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్ లో మన దేశానికి చెందిన ఐదుగురిని చైనా సైనికులు అపహరించడం గమనార్హం. భారత్- చైనా సరిహద్దుల్లో ఉన్న ఎగువ సుబాన్‌సిరి జిల్లాలోని అడవుల్లో శుక్రవారంనాడు వేటకు వెళ్లిన ఐదుగురు భారతీయులను చైనా బలగాలు అపహరించుకుని వెళ్లాయి. వేటకు వెళ్లిన గ్రూపులోని ఇద్దరు ఎలాగో తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనపై వాస్తవాలను నిర్ధారణ చేసుకుని, తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా నాచో పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి ఆఫీసర్‌ ను ఆదేశించినట్టు పోలీస్ సూపరింటెండెంట్ తరు గుస్సార్ తెలిపారు.

బ్రేకింగ్.. చంద్రబాబుకు త్రుటిలో తప్పిన ప్రమాదం!!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాదుకు రోడ్డు మార్గంలో వస్తుండగా.. ఆయన కాన్వాయ్‌ లోని వాహనానికి ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.    కాన్వాయ్ కి ఓ ఆవు అడ్డురావడంతో ఎస్కార్ట్‌ వాహనం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ లో ముందు ఉన్న ఎస్కార్ట్ వాహనాన్ని బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా ఢీ కొట్టింది. ఆ తర్వాతి వాహనంలోనే చంద్రబాబు ఉన్నారు. ఈ ప్రమాదంలో చంద్రబాబు సహా, ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేవలం వాహనాలు మాత్రమే స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి. ఈ ఘటన అనంతరం కాన్వాయ్ అక్కడి నుంచి హైదరాబాదు వైపు కదిలింది.

ప్రభుత్వ చర్యలు ఎండగట్టేందుకు వ్యూహం

తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు కరోనా.. మరోవైపు కరెప్షన్ రాజ్యమేలుతున్నాయి. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యను ప్రభుత్వం దాచి పెట్టిందని హైకోర్టు కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతాపార్టీ అనేక సార్లు విమర్శలు చేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ కూడా కరోనా ను అడ్డుకోవడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఈ విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ తమ వ్యూహాలను  సిద్ధం చేస్తున్నాయి.   ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మరో అంశం అవినీతి. రాష్ట్రంలో భూముల అక్రమణ, రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే ప్రభుత్వం ముందుగానే ప్రతిపక్షం నుంచి వచ్చే సవాళ్లను పసికట్టి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలోనూ, మీడియా ముందుకు వెళ్ళకుండా నియంత్రించడంలోనూ వ్యుహరచన చేస్తోంది. కరోనాను కట్టడి చేయలేకపోయినా ప్రభుత్వ అలసత్వంపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు సీనియర్ నేతలు.

ప్రతిపక్షాల గళం నొక్కే ప్రయత్నం

మీడియా పాయింట్ ఎత్తేయడం పై విమర్శలు   తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బిసీల పార్టీగా ఉన్న టిడిపీ ఒక్కస్థానానికే పరిమితం అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం హోదా ఏ పార్టీకి లేకపోవడంతో అధికార పార్టీ తన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శాసన సభలో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ కొద్ది మంది సభ్యులకు కూడా సమావేశాలలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చాలాసార్లు వారి తమ గోడునంతా మీడియా పాయింట్ వద్ద మీడియాతో పంచుకుంటారు. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి కరోనా సాకుగా చూపిస్తూ అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ను రద్దు చేశారు. దాంతో ప్రతిపక్ష నేతలు తమ గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. సభలో మాట్లాడినప్పుడల్లా మైక్ కట్ చేయడం చేసే అధికార పార్టీ ఈ సమావేశాల్లో ఏకంగా మీడియాకు ప్రతిపక్షాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోంది అని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు.   అసెంబ్లీ సభా సమావేశాలు నిర్వహించడానికి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యక్రమాలు నిర్వహించడానికి అడ్డురాని కరోనా నిబంధనలు మీడియా పాయింట్ విషయంలోనే అడ్డు వస్తున్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత భరించలేని ప్రభుత్వం గతంలో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు తమ గళం వినిపించే వేదికైన ధర్నాచౌక్ ను ఎత్తేసింది. ప్రశ్నించే గళానికి వేదిక లేకుండా చేసింది. అయితే కొన్ని పౌర సంఘాలు హైకోర్టుకు వెళ్లడంతో ధర్నాచౌక్ ను తిరిగి అనుమతి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ లో ప్రతిపక్షాలు తమ గళం వినిపించడానికి ఉన్న ఏకైక వేదిక మీడియా పాయింట్ ను ఎత్తేయడం ప్రతి పక్షాల గొంతులు నొక్కే కుట్రలో భాగమే అని మండిపడుతున్నారు.  మీడియా పాయింట్ లేకుండా చేయడం ద్వారా ప్రతిపక్షం మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్న అవకాశం లేకుండా చేయవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని విమర్శిస్తున్నారు.  ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు కరోనా నిబంధనలను అమలు చేసినట్లు మీడియా పాయింట్ వద్ద కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తే సరి పోయే దానికి మీడియా పాయింట్ ను చేయాల్సిన అవసరం లేదని సీనియర్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం పథకం ప్రకారం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.