గొంతు కేన్సర్ వచ్చి పోతావ్.. ఏపీ మంత్రికి దేవినేని ఉమా స్ట్రాంగ్ కౌంటర్
posted on Sep 4, 2020 @ 6:37PM
ఏపీలో వైసిపి టీడీపీ నేతల మధ్య తాజాగా మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబును పెద్ద బిచ్చగాడని, అలాగే మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అడ్డగాడిద అంటూ ఈరోజు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మరో మాజీ మంత్రి దేవినేని ఉమా ను ఏకంగా లారీతో తొక్కిస్తానని హెచ్చరించిన సంగతి తెల్సిందే. తాజాగా మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు దేవినేని ఉమ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ.. మంత్రి కొడాలి నాని తాటాకు చప్పుళ్లకు భయపడేవారు టీడీపీలో ఎవరూ లేరని హెచ్చరించారు. "కొడాలి నాని ఏ మాత్రం చదువు, సంస్కారం లేకుండా మాట్లాడారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి చంద్రబాబుపై సంస్కార హీనంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు వయస్సు గురించి.. మా చావులు గురించి మాట్లాడితే మీరు చేసిన తప్పులు కనపడకుండా పోతాయా? మీ అసమర్థతను, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే చిల్లర రాజకీయాలు, గల్లీ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబును, దేవినేని ఉమాను బూతులు తిట్టి దాంతో మీ అసమర్థత కప్పిపుచ్చుకోవచ్చని భావిస్తున్నారా? నీకు రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై హీనంగా మాట్లాడినందుకు గొంతు క్యాన్సర్‌తో పోతావ్" అని మంత్రి కొడాలి నాని పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. అంతేకాకుండా లారీలతో గుద్దిస్తానన్న కొడాలి బెదిరింపులపై డీజీపీ సుమోటోగా కేసు నమోదు చేయాలి అని ఉమా కోరారు. జగన్ ప్రభుత్వానికి సంపద సృష్టి చేతకాక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని ఉమా అన్నారు.