కొత్త రెవెన్యూ చట్టం.. విమర్శలు.. డిమాండ్లు

తెలంగాణ ప్రభుత్వం  అసెంబ్లీలో సెప్టెంబర్ 9 వ తేదీన  “తెలంగాణ  భూమి  హక్కులు, పట్టాదార్  పాస్  పుష్టకాల  బిల్లు, 2020”ను ప్రవేశ పెట్టింది.  ఇంత  ముఖ్యమైన  బిల్లును  హడావిడిగా  ఎటువంటి  సంప్రదింపులు  లేకుండా రెండు రోజులు అసెంబ్లీ  లో  చర్చించి  ఆమోదించాలన్న  ప్రభుత్వం  చర్య  అత్యంత  అప్రజాస్వామికమైనది.  ఇది ప్రధానంగా   చిన్న, సన్నకారు రైతుల , మహిళా రైతుల, కౌలు రైతుల, ఆదివాసీల హక్కులను పరిగణించకుండా కేవలం రెవిన్యూ శాఖలో ప్రబలి ఉన్న అవినీతిని కొంతవరకు నియంత్రించడానికి మాత్రమే దృష్టిలో పెట్టుకుని తయారుచేయబడినదిగా అగుపిస్తున్నది. అలాగే ప్రభుత్వ వైఖరి రెవిన్యూ శాఖ ఉద్యోగులు కేవలం భూమికి సంబంధించిన లావాదేవీలను మాత్రమే చూస్తారన్న భ్రమలో ఉండటం కూడా హాస్యాస్పదమే. ఈ బిల్లును ప్రజా అసెంబ్లీ సభ్యులు పరిశీలించి స్పందిస్తూ, ముఖ్యమైన ప్రజాస్వామికమైన వ్యాఖలను చేస్తూ కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఇటువంటి అప్రజాస్వామిక మైన బిల్లును ప్రవేశపెట్టే ముందు ఈ కింది విమర్శనాత్మక వ్యాఖ్యలను పరిశీలించి ప్రభుత్వం  పరిగణనలోకి  తీసుకోవాలి.  .  .  రెవిన్యూ బిల్లు పై విశ్లేషణాత్మక విమర్శలు ఈ కొత్త రెవిన్యూ చట్టం ఉద్దేశం భూమి చుట్టూ జరిగే లావాదేవీలను, వ్యాపారాన్ని సులభతరం చేస్తుంది అని ప్రభుత్వమే ప్రకటించింది.  ఈ కొత్త బిల్లు భూ రికార్డులను నవీకరించటం గానీ లేదా వాటికి   ఖచ్చితత్వాన్ని కల్పించటానికి కాక  అది  ఎన్కుంబరెన్సీలను (లను) తొలగించి మార్కెట్ లో భూమి వ్యాపారానికి మార్గం సుగమంచేయటానికే రూపొందించబడింది. బడా పారిశ్రామికవేత్తల భూసేకరణ కోసం ఈ బిల్లు మార్గాన్ని సుగమం  చేస్తుంది.   తెలంగాణ ప్రభుత్వం అవినీతి నిరోధం అంటూ ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి పారిశ్రామిక రంగానికి అనువుగా రచించిన బిల్లు ఇది. ఈ బిల్లు చిన్న సన్నకారు పేద రైతులకు ఏ విధంగానూ సహాయపడదు, ప్రస్తుతం వారు కొత్తగా  భూములను కొనుగోలు చేసే పరిస్థితిలో లేరు. వారి ఆన్లైన్ రికార్డులను సరిచూసుకోలేరు కాబట్టి భూ రికార్డుల కంప్యూటరీకరణ విధానంలో వారికి పెద్ద  నష్టం ఏర్పడుతుంది. ఎందుకంటే  భూ రికార్డులను సరిచూసుకోవటం, నవీకరించటం వంటి అంశాల పని భూ యజమానులపైనే ఉంటుంది. చదువుకొని స్మార్ట్ ఫోన్ లు, కంప్యూటర్ లు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండి, వాటి పైన సాంకేతిక నైపుణ్యం కలిగి ఉన్నవారు మాత్రమే వాటిని చేయగలుగుతారు. ధరణి వెబ్ సైట్ నిర్వహణ సామాన్యులకు అందుబాటులో ఉండదు సరికదా అర్థం కూడా కాదు. నిరక్షరాస్యులైన పేద రైతులకు ఈ అవకాశం ఉండదు. చాలా కాలంగా ఆస్తి, యాజమాన్యం కేంద్రంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో భాగంగానే ఇది ముందుకొచ్చింది, వ్యవసాయ భూ యజమానులను రక్షించటమే దీని లక్ష్యం. నిరక్షరాస్యులైన బడుగు పేద వర్గాలనుద్దేశించి కాదు. ఇది అప్రజాస్వామికం. దీనిలో ప్రకటించని ఉద్దేశం ఏమిటంటే, గతంలో తెచ్చిన సవరణకు అనుగుణంగా  సాగుదారులను తొలగించటమే.  అటవీ భూములకు సంబంధించి ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేయకపోవటమే పెద్ద సమస్య.  అటవీ భూములను  సాగు చేస్తున్న వారందరికీ, ఆర్ ఓఎఫ్ ఆర్ పట్టాలు వున్న వారందరికీ కూడా  ఈ కొత్త చట్టం ప్రకారం పట్టాదార్ పాస్ పుస్తకాలు  టైటిల్ డీడ్ లు ఇవ్వటానికి ఈ  విధమైన  అనుసంధానం  తప్పనిసరిగా చేయాలి. అటవీ భూములను ప్రభుత్వం అభివృద్ధి పేరుతో పరిశ్రమలకు ఇచ్చే ప్రమాదం ఉంది. ఇది అటవీ హక్కుల ఉల్లంఘన. దీనికే ఈ బిల్లు ద్వారా పునాది వేస్తున్నట్టు ఉంది. గ్రామ రెవెన్యూ  అధికారులు (VRO)లు, గ్రామ రెవెన్యూ అసిస్టెంట్లు (VRA)ల వ్యవస్థ  తొలగించటం తో  MROల చేతిలో  భూ  రికార్డులు నిర్వహించటం, రిజిస్ట్రేషన్  చేయటం  ఈ  రెండిటికీ  సంబంధించి అధిక  అధికారాలు  కేంద్రీకరించబడతాయి.   ఇది  మరింత  అవినీతి పెరగటానికి  దారి తీస్తుంది.     ఈ  కొత్త  చట్టం ప్రతిపాదిస్తున్నటువంటి   సవరణలు భూవ్యవస్థను ప్రజలకు  మరింత  అందుబాటులోకి  తెచ్చి  జవాబుదారీ తనాన్ని  పెంచి అవినీతిని  తొలగిస్తుంది  అనే దాఖలాలు  ఎక్కడా  లేవు.   చివరగా సాగుదారులు, కౌలుదారులను  తొలగించటం  ద్వారా  భూయజమానులు  భూమిని  సరుకుగా  మార్కెట్  చేయటానికి  మార్గం  సుగమం చేస్తుంది.  సాదా భైనామా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదాలు పరిష్కారం కాలేదు. వక్ఫ్, దేవాదాయ, భూదాన్ భూముల వివాదాలు అలాగే ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఈ బిల్లులో ప్రస్తావనే లేదు. ఇప్పుడున్న భూవివాదాలను పరిష్కరించడానికి తాత్కాలికంగా జిల్లా స్థాయి ట్రిబ్యునల్స్ ఏర్పరిచినా, అవి పరిష్కారం అయ్యాక భూ వివాదాలు పరిష్కారానికి సివిల్ కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది. అది సన్న, చిన్న కారు రైతులకు మరింత కష్టం.  ఈ చట్టాన్ని కింది స్థాయి ఉద్యోగులను అవినీతి ఆరోపణల నెపంతో తొలగించడానికి చేసినట్టు ఉంది. VRO లకు ఇతర డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఎప్పటికి ఇస్తారన్నది స్పష్టంగా లేదు. వీరి ఇతర విధుల నిర్వహణ ఎవరు చేస్తారనేది కూడా స్పష్టంగా లేదు. గ్రామ స్థాయి రెవెన్యూ అధికారులు కేవలం  భూమికి  సంబంధించిన లావాదేవీలతో పాటు అనేక సంక్షేమ పధకాల అమలు లో కూడా కీలకమైన పాత్రవహిస్తారన్న విషయం మరచినట్టు ఉన్నది ప్రభుత్వ వైఖరి. ఈ బిల్లులో మూడు స్థాయిల న్యాయ వ్యవస్థను రద్దు చేశారు. తక్షణ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకునే సమస్యలను ఇప్పుడు జిల్లా స్థాయికి తీసికుని వెళ్ళవలసిన అగత్యం ఎదురవుతుంది.   రెవెన్యూ అధికారుల న్యాయ అధికారాలు తొలగించిన తరువాత, పోలీసుల ప్రమేయం ఆజమాయిషీ పెరిగే  ప్రమాదం ఉంది. సంరక్షించే బదులు నియంత్రించే పరిస్థితి చోటుచేసుకోవచ్చు. గ్రామ స్థాయిలో కనీస వేతనం, భూఆక్రమణ, ప్రకృతి వైపరీత్యాలు, data collection వంటి బాధ్యతలు  VRO లేకుండా జరగవు. దాదాపు 5400 మంది VROలు ఇప్పుడు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు  రెవెన్యూ అధికారుల జోక్యం చాలా అవసరం.. ఇప్పుడు ఆ యంత్రాంగం నిర్వీర్యం అయితే పిల్లల భవిష్యత్తు అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా  ఉంది. వెట్టి చాకిరీ నిర్మూలన చట్టం ప్రకారం Release Certificate పొందిన కార్మికులకు భూమి పంపిణీ కలెక్టర్ ఆదేశానుసారంగా, MRO చేస్తారు. ఇప్పుడు అలాంటి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో తెలియదు.  సాగుదారులను గుర్తించటం అనేది పూర్తిగా తొలగించాక, భూమి హక్కులు లేకుండా వ్యవసాయం చేస్తున్న  కౌలు రైతులు,  మహిళా రైతులు తీవ్రంగా నష్టపోతారు. వాస్తవ సాగు దారుల, భూమిలేని పేదల జీవనోపాధికి ఉపయోగ పడాల్సిన భూమి, డబ్బున్న వాళ్లకు మార్కెట్ సరుకుగా అందుబాటులోకి తేవడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశ్యం. భూమి యాజమాన్యం కలిగి వున్నవారే రైతులుగా గుర్తించబడుతున్న దుర్మార్గపు వ్యవస్థ మరింత గట్టిపడుతుంది. ప్రస్తుతమున్న రైతుబంధు కూడా ఇటువంటి  పరిస్థితుల్లో అమలుచేస్తున్నారు. ధరణి వెబ్ సైట్ లో అవకతవకలను సరిచేయకుండా రెవిన్యూ డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయడం సమంజసం కాదు. ఇప్పుడు దరణిలో ఉన్న తప్పుడు తడకల సమాచారాన్ని బాగుచేయకుండా దాని ఆధారంగా రెవెన్యూ రికార్డులకు శాశ్వతత్వం కల్పిస్తామని చెప్పడం మరిన్ని వివాదాలు పెరగడానికి కారణ మవుతుంది. అసైన్డు భూములను సాగు చేస్తున్నవారిలో చాలా  తక్కువ శాతం మందికి  మాత్రమే 1971 చట్టం ప్రకారం కొత్త పాస్ పుస్తకాలు అందాయి. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే వారు కొత్త పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్ అందుకోవటానికి ఈ కొత్త చట్టంలో ఎటువంటి ప్రస్తావనా లేదు. క్రింది స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఒక పారదర్శక యంత్రాంగం లేకపోతే పేద రైతులకు చాలా ఇబ్బంది.అవినీతి పేరుతో వీళ్ళను రద్దు చేసినంత మాత్రాన, అన్ని చోట్లా ఉండే అవినీతి తగ్గిపోతుందని భావించడం తప్పు. పైగా డబ్బున్నవాళ్ళ పక్షాన మరింత పెరిగే ప్రమాదం వుంది. అవినీతితో జరిగే పనులలో పై వారికి ఇక అడ్డుండదు. అన్నింటినీ మించి కొద్ది భూమి గల పేద రైతులు కూలీలు గా పనులు వెతుక్కుంటూ పోవలసి వస్తుంది. భూమి స్వీయ గౌరవ సాధనం కదా పేద తెలంగాణ గౌరవం సమస్య అవుతుంది. ఈ చట్టం అనేక విపరినామాలకు దారి సుగమం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత చట్టంతో ఏమెరకునా జరిగిన భూ వికేంద్రీకరణ ఇక కేంద్రీకరణ వైపు అడుగులు వేస్తుంది. కలవారికి ఇది ఉపయోగం ఈ బిల్లు కౌలు రైతులకు ఎలా ఉపయోగపడుతుందో  వివరించలేదు. అసలే గుర్తింపు లేని కౌలు రైతుల సమస్యలు ఇంకా క్లిష్టరమయ్యే ప్రమాదం ఉంది. నోటీసుల  విధానం  అనేది తప్పులు  జరగకుండా అడ్డుకోవటానికి. రెవెన్యూ  యంత్రంగం  తప్పులు  చేస్తే అప్పీల్  చేసుకునే  అవకాశం ప్రజలకు  ఉండాలి. చట్టాల్లో  అప్పీల్  వ్యవస్థ  లేకపోవటం ప్రాధమిక  హక్కులను హరించినట్లే అవుతుంది.  డిమాండ్లు :  అత్యంత  ముఖ్యమైన, విస్తృతమైన  ప్రభావాన్ని  కలిగించే ఈ కొత్త రెవెన్యూ  చట్టం పై   చర్చలు  జరపకుండా  అసెంబ్లీ లో  ప్రవేశపెట్టి  రెండు  మూడు  రోజులలో  ఆమోదించటం  అప్రజాస్వామిక  చర్య.. ఈ  బిల్లు  ఆమోదాన్ని  వాయిదా  వేసి  ప్రజలలోకి  తీసుకెళ్లి   అన్ని సెక్షన్ల  రైతులు, రైతు  సంఘాలు, ప్రజా  సంఘాలతో విస్తృతంగా  సంప్రదింపులు  జరిపి వాటినుండి వచ్చిన  అభిప్రాయాలను  పరిగణన లోకి  తీసుకోవాలి.  ఈ  బిల్లును  రెవెన్యూ  మరియు  న్యాయ  నిపుణులతో  కూడిన  ఒక   నిపుణల  కమిటీకి  పంపాలి,  దీనిపై    ప్రజా సంప్రదింపుల  ప్రక్రియ  చేపట్టాలి.  సమగ్ర భూ సర్వే  జరిపి  మాగాణి,మెట్ట భూముల విస్తీర్ణాన్ని తేల్చాలి. దాని ఆధారంగా మిగులు భూములను తేల్చాలి.అసలైన  భూ యజమానులు గుర్తించి రికార్డు చేయాలి. ఈ సర్వే  ద్వారా  వెలువడే గణాంకాల ప్రకారం భూ గరిష్ట పరిమితి కంటే అదనంగా  వున్న భూమిని 1973 భూ సంస్కరణల చట్టం ప్రకారం భూమి లేనివారికి పంపిణీ చేయాలి.  ఆర్ ఓఎఫ్ ఆర్ రికార్డులను రెవెన్యూ రికార్డులతో అనుసంధానం చేసి   అటవీ  భూములకు  హక్కు  పత్రాలు వున్న  వారందరికీ కొత్త  పట్టాదారు  పాసు పుస్తాకాలు  ఇవ్వాలి, వారందరికీ  ప్రభుత్వ  వ్యవసాయ  పధకాలను  అందుబాటులోకి  తేవాలి.  తెలంగాణ  రాష్ట్రంలో  వాస్తవ  సాగుదారులను  గుర్తించాలి - కౌలు రైతులు, మహిళా  రైతులు, పోడు వ్యవసాయం  చేసే  రైతులను  గ్రామ స్థాయిలో  రిజిస్టర్  చేసి భూ  యాజమాన్యంతో  సంబంధం  లేకుండా   గుర్తింపు  కార్డులు  ఇవ్వాలి.    ధరణి  వెబ్ సైట్ ద్వారా  రిజిస్ట్రేషన్,  ఆ వెంటనే మ్యుటేషన్ జరగటం వివాదాల్లేని రైతులకు మేలు  చేయవచ్చు  కానీ పేద  రైతులు, భూ  వివాదాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను మరింత  ఇబ్బంది  పెట్టినట్లే  అవుతుంది. భూ  వివాదాల  పరిష్కారానికి  శాశ్వత  ట్రిబ్యునల్ ను  గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు  చెయ్యాలి  భూ  సమస్యల  విషయంలో అప్పీలు  వ్యవస్థను రద్దు చేయటం సరైనదికాదు. ఉన్న రెవెన్యూ అధికారుల జవాబుదారీతనం  పెంచి  పారదర్శకంగా  తయారు చేయా

మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు 

ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని కొద్దీ రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల మంత్రి అయి ఉండి తనను లారితో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారని అయన పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న నాని తమను తమ పార్టీ అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారని అయన పేర్కొన్నారు. ఇదే కేసులో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా అయన ఫిర్యాదు చేశారు.   సీఎం జగన్ మెప్పు పొందటానికే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి రైతులు, దళితులను, న్యాయ విభాగంలో ఉన్నవారిని వైసిపి నాయకులు తిడితే కేసులు ఉండవని ఉమా అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద దాడి చేస్తే ఇప్పటివరకు చర్యలు లేవని విమర్శించారు. దీనిపై డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. తాను గతంలోనూ ఎన్నో ప్రభుత్వాలను విమర్శించానని.. అయితే అప్పుడు ఎవరూ తనను బెదిరించలేదని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అయన వాపోయారు. ఇదంతా పూర్తిగా సీఎం జగన్ ప్రోత్సాహంతోనే జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు.   టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చెప్పారు. ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జగన్ అరాచకపాలనపై ప్రజలు తిరగబడతారని అయన అన్నారు.

జగన్ తో హాయ్.. కేసీఆర్ తో కటీఫ్.. బీజేపీ నయా స్టాండ్!

టీఆర్ఎస్, బీజేపీ మధ్య గ్యాప్ పెరిగిందా?.. టీఆర్ఎస్ కలిసిరాకున్నా కేంద్రంలో నష్టం లేదని కమలం భావిస్తుందా?.. గులాబీ బాస్ బీజేపీని టార్గెట్ చేస్తోంది అందుకేనా? అంటే అవుననే సమాధానమే  వస్తోంది. గతంలో కేంద్ర బిల్లుల ఆమోదానికి, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు తీసుకుంది ఎన్డీఏ సర్కార్. కాని ప్రస్తుతం మాత్రం సీన్ మారింది. టీఆర్ఎస్ మద్దతు అవసరం లేదనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే త్వరలో జరగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతు కోరడం లేదు  ఈ నెల 14 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుతం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్న జేడీయూ ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన్నే మరోసారి  అభ్యర్ధిగా నిలబెట్టింది ఎన్డీయే. ఎగువసభలో తమకు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయనకు మిగతా పార్టీల  మద్దతు కూడగడుతోంది బీజేపీ కూటమి. రాజ్యసభలో ఆరుగురు సభ్యుల బలం ఉన్న వైసీపీ మద్దతు కోరింది. హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు మద్దతివ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ ఫోన్‌ చేశారు. గతంలో హరివంశ్‌ను డిప్యూటీ ఛైర్మన్‌ చేసేందుకు వైసీపీమద్దతిచ్చింది. దీంతో మరోసారి తమ మద్దతు కొనసాగించాలని నితీశ్‌ కోరగా.. జగన్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది.  రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఏడుగురు సభ్యులున్నారు. అంటే వైసీపీ కంటే ఒకరు ఎక్కువే. కాని ఇంతవరకు ఎన్డీయే కేసీఆర్ ను మద్దతు కోరలేదు. బీహార్ సీఎం నితీశ్ తో కేసీఆర్ కు వ్యక్తిగతంగానూ మంచి సంబంధాలున్నాయి. అయినా నితీశ్ కుడా టీఆర్ఎస్ మద్దతు కోసం ప్రయత్నించడం లేదు. బీజేపీ సూచనల ప్రకారమే జగన్ తో మాట్లాడిన నితీశ్.. కేసీఆర్ తో కాంటాక్ట్ కాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కు కారు పార్టీ ఎంపీలు మద్దతిచ్చారు.  గత ఆరేండ్లుగా కేంద్రంలో మోడీ సర్కార్ తో మంచి సంబంధాలు కొనసాగించింది టీఆర్ఎస్. పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు మద్దతు ఇచ్చింది. అయితే కొన్ని రోజులుగా రెండు పార్టీల మధ్య తేడాలు వచ్చినట్లు సమాచారం.  గతంలో ప్రధాని మోడీని ప్రశంసించిన సీఎం కేసీఆర్.. ఇటీవల మాత్రం కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారని, న్యాయంగా రావాల్సిన నిధులు ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో కేంద్రంతో సమరానికి సిద్ధమంటున్నారు గులాబీ బాస్. బీజేపీతో తనతో సరిగా వ్యవహరించడం లేదనే కారణంగానే కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలను గమనిస్తున్న బీజేపీ.. ఆయన్ను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఎస్ సపోర్ట్ అవసరం లేదనే భావనలో బీజేపీ.. కేంద్రంతో పోరాడాలనే యోచనలో కారు పార్టీ ఉన్నట్లు కనిపిస్తోంది.  మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో విపక్షాల తరఫున మనోజ్‌ ఝాను నిలబెట్టాలని కాంగ్రెస్‌తో పాటు దాని మిత్రపక్ష పార్టీలు భావిస్తున్నాయి. ఆయనకు కాంగ్రెస్‌, ఆర్జేడీతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, వామపక్షాలు మద్దతివ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే రాజ్యసభలో ప్రస్తుతం బీజేపీకి 87, కాంగ్రెస్ కు 40 మంది సభ్యులున్నారు. బలాబలాల ప్రకారం మరోసారి ఎవ్డీయే అభ్యర్ధికే విజయావకాశాలు కనిపిస్తున్నాయి.  

దారుణం... పన్నెండేళ్ల బాలికను ఎత్తుకెళ్లి రేప్ చేశారు

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహారాజ్ గంజ్ జిల్లాలో 12 ఏళ్ల బాలికను అపహరించి తీసుకువెళ్లిన ఇద్దరు మృగాళ్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు‌.  ఒకవైపు రామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణం జరుగుతుండగా మరోవైపు ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో కొందరు విమర్శలు చేస్తున్నారు. రామ రాజ్యం అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అత్యాచార ఘటనలు వార్తల్లో నిలుస్తూ ఉన్నాయి. ఇటీవల కరోనా సోకిన మహిళపై అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మరువకముందే 12 ఏళ్ల బాలిక కామందుల కాటుకు గురికావడం శోచనీయం

జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి

వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'పెద్ద బిచ్చగాడు, అడ్డ గాడిద, ఉమక్క, నాలంటోడైతే లారీతో తొక్కిస్తాడు' అంటూ మాజీ సీఎం చంద్రబాబు మరియు మాజీ మంత్రులపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా TNSF మాజీ అధ్యక్షుడు బ్రహ్మం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. మంత్రి ఉపయోగించిన భాషతోనే సమాధానం చెప్పారు. దీంతో బ్రహ్మంపై అక్రమకేసులు పెట్టి వేదిస్తున్నారు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.   రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా? అని నిలదీశారు.   మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని మండిపడ్డారు. బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో? దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు.

చిరంజీవిని సీఎం చేయడమే సోము వీర్రాజు లక్ష్యం 

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన  వ్యాఖ్యలు చేశారు. అంతర్వేది ఆలయం రాజోలు నియోజకవర్గంలో ఉందని..  రాజోలులో జనసేన రెబల్ రాపాక వరప్రసాదరావు ఎమ్మెల్యేగా ఉండటం వల్లే జనసేన, బీజేపీలు అంతర్వేది ఘటనని రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ ద్వారా రాజోలు నియోజవర్గంలో కాపు కులాన్ని రెచ్చగొడుతున్నారని అన్నారు.    బీజేపీ మతాభిమానంతో, జనసేన కులాభిమానంతో కుళ్లిపోయాయని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకి కులాభిమానం ఎక్కువని, చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయాలనేది ఆయన లక్ష్యమని అన్నారు. చిరంజీవి కుటుంబానికి సోము వీర్రాజు హనుమంతుడిలా మారిపోయారని ఎద్దేవా చేశారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఎంపికైన తరువాత సోము వీర్రాజు.. చిరంజీవిని ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేసుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   సీఎం వైఎస్ జగన్ పై కూడా హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఒక్కో కులానికి, ఒక్కో మతానికి ఒక్కోలా జగన్ నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. అంతర్వేది రథం ఘటనను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన జగన్.. దళిత యువకుడికి శిరోముండనం కేసును సీబీఐ చేత ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. దళితులపై సీఎం జగన్‌ కు చిత్తశుద్ధి ఉంటే.. శిరోముండనం ఘటనపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

మతిస్థిమితం లేనివారు దోషులంట.. మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా.. ఎంపీ రఘురామరాజు ఫైర్

ఏపీలో కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా వైసిపి ఎంపీ రఘురామకృష్ణం రాజు గాంధేయ పద్ధతిలో ఈ రోజు ఉదయం 9 గంటలకు తన ఢిల్లీ నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ‌తి స్థిమితం లేని వారు కేవ‌లం హిందూ దేవాల‌యాల‌ను, ర‌థాల‌ను మాత్ర‌మే ల‌క్ష్యంగా చేసుకుంటున్నారా అంటూ అయన జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏపీలో హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతోన్న దాడులపై జగన్ స‌ర్కారు చెబుతున్న స‌మాధానం స‌రికాద‌ని ఆయన మండిప‌డ్డారు. అంతేకాకుండా రాష్ట్ర దేవాదాయ మంత్రి వెల్లంపల్లి మ‌తిలేకుండా మాట్లాడుతున్నార‌ని రఘురామరాజు విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న చేస్తూ ప్రస్తుత క‌రోనా విప‌త్తు స‌మ‌యంలోనూ దీనికి సంబంధించి ప్ర‌జ‌లు త‌మ నిర‌స‌న‌ తెలియ‌జేసేందుకు రోడ్ల మీద‌కు వ‌స్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.   ఈ సందర్బంగా అయన విడుదల చేసిన ప్రకటన సారాంశం: గడచిన సంవత్సరకాలంలో ఏపీలో వరుసగా మొత్తం 15 దేవాలయాలపై దాడులు జరిగాయి. పిఠాపురం, కొండబిట్రగుంట తాజాగా అంతర్వేదిలలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇవి యాధృచ్ఛికంగా జరిగినవి కావని స్పష్టం అవుతుంది. ఇటువంటి సంఘటనలను మతిస్థిమితం లేనివారి పని, తేనె పట్టు కోసం చేసిన పని అంటూ ఒక రకంగా వీటిని సమర్ధించే ప్రయత్నం చేయడం నవ్వులాటగా కనిపిస్తున్నది. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం సమయంలోనే ప్రభుత్వం సరిగా స్పందించి ఉంటె మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగి ఉండేదా అని ఒక సారి ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరం ఉంది. వరుస సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో పెద్దలు మద్దతుతోనే అవి జరుగుతున్నట్లు భక్తులు భావించే పరిస్థితి కూడా ఏర్పడుతున్నది. హిందూ దేవాలయాల వద్ద అన్యమత ప్రచారం జరుగుతూ ఉండడం, హిందూ దేవాలయాల భూములపై పలుకుబడి గలిగిన వారు కన్నేసి కైవసం చేసుకొనే ప్రయత్నం చేస్తుండడం గమనిస్తే ఈ దాడులు ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు వెల్లడి అవుతుంది. ప్రస్తుతం ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు నేడు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తగు నష్ట నివారణ చర్యలు తీసుకోని పక్షంలో పరిస్థితులు అనూహ్యమైన మలుపు తీసుకొనే అవకాశం ఉంటుందని గ్రహించాలి.   సాక్షాత్తూ దత్తాత్రేయ స్వరూపుడయిన శ్రీపాద శ్రీ వల్లభుడు పుట్టిన పిఠాపురంలో.. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన పీఠంలో ఈ సంఘటనల పరంపర ప్రారంభమైనది. అలాంటి చోట దుర్గాదేవి విగ్రహాలను, గణపతి విగ్రహాలను, సాయిబాబా విగ్రహాలను ధ్వంసం చేశారు. అది ఎవరు చేశారు అంటే అపుడు ఒక మతిస్థిమితం లేని వ్యక్తి చేశాడు అన్నారు. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో స్వామి వారి రథాన్ని తగులబెట్టేస్తే దాన్ని కూడా మతిస్థిమితం లేని వాడు తగులపెట్టేశాడన్నారు. ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్నా సమాధానం మాత్రం ఒకే రకంగా ఉండడంతో, అవ్వన్నీ ఒక పధకం ప్రకారం జరుగుతున్నట్లు భావించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విజయవాడలోని శ్రీ కాశీవిశ్వేశ్వరాలయం భూములకు సంబంధించి, అలాగే సింహాచలం మాన్సాస్ ట్రస్ట్ కి సంబంధించి వివాధాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సీఎం జగన్ మోహన్ రెడ్డిగారు వరుసగా జరుగుతున్న దాడులను తీవ్రమైన అంశంగా పరిగణించి, తక్షణం తగు చర్యలు తీసుకోవడం ద్వారా హిందువుల మనోహభావాలకు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి. టిటిడి భూములను అమ్మివేసే ప్రయత్నం జరిగినప్పుడు ప్రజలనుండి పెద్ద ఎత్తున ఎదురైన ఆగ్రవేశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి, ఆ మొత్తం పక్రియను రద్దు చేయడంతో ఒక పెద్ద ఉపద్రవాన్ని నివారింప గలిగారు. ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నం చేయవలసి ఉంది. లేని పక్షంలో పరిస్థితులు అదుపు తప్పవచ్చనే ఆందోళన కలుగుతున్నది.   అంతర్వేది వద్ద భారీ సంఖ్యలో హిందూ సంస్థలకు చెందిన వారు ఆగ్రవేశాలతో దేవాలయాన్ని చుట్టుముట్టినపుడు మంత్రులు లోపల గంటలపాటు నిలబడవలసి రావడం గమనిస్తే ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని పక్షంలో వచ్చే తీవ్ర పరిణామాలకు సంకేతం ఇచ్చిన్నట్లయింది. కేవలం హిందూ మతం విషయంలో మాత్రమే ప్రభుత్వం స్పందించడం లేదని అభిప్రాయం ప్రజలలో బలంగా నెలకొనడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఏ మతంపై చెందినవైనా ప్రార్ధనా మందిరాల పట్ల ప్రజల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంకు ఉంటుంది. ప్రభుత్వం కేవలం ఒక ప్రత్యేక మతం చెందిన వారిని ఆదరిస్తూ మిగిలిన వారి పట్ల నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తున్నదని అభిప్రాయం కలగడం ఏ లౌకిక ప్రభుత్వంకు కూడా మంచిది కాదు. రాజకీయంగా తీవ్ర మూల్యాన్ని చెల్లించే పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని దేశంలో నేడు పలు చోట్ల జరుగుతున్న పరిణామాలను చూసైనా గ్రహించాలి. చెప్పుకోదగిన ఆస్తులు, ఆదాయాలున్న దేవాలయాలను ఎంపిక చేసి, వాటి లక్ష్యంగా దాడులు జరుపుతూ, వాటిని కైవసం చేసుకొనే ప్రయత్నం రాజకీయ నాయకత్వం మద్దతుతోనే జరుగుతున్నట్లు ఈ సందర్భంగా ప్రజలలో అనుమానాలు చెలరేగడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. వరుసగా జరుగుతున్న సంఘటనలను యాదృచ్చికంగా జరిగినవిగా కాకుండా, వాటి మధ్య గల సంబంధాన్ని గుర్తించి, వాటి వెనుక ఉన్న శక్తులను కనిపెట్టేందుకు ప్రభుత్వం నిష్పాక్షికంగా అన్ని సంఘటనలను కలిపి దర్యాప్తు జరిపించాలి.

ఏపీ తొలి కాపు కార్పొరేషన్ చైర్మన్ కరోనాతో మృతి

టీడీపీ సీనియర్ నేత, కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ చ‌ల‌మ‌ల‌శెట్టి రామాంజ‌నేయులు తుదిశ్వాస విడిచారు. కరోనా లక్షణాలతో ఇటీవల ఆయ‌న విజయవాడ జీజీహెచ్ లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో నాలుగు రోజులుగా వెంటిలేటర్ మీద ఉంచి ఆయ‌న‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఉద‌యం ఆరోగ్యం మరింత విషమించడంతో రామాంజనేయులు కన్నుమూశారు.     రామాంజనేయులు స్వస్థలం  ప‌శ్చిమగోదావ‌రి జిల్లా కలిదిండి మండలం అవ్వకూరు. 2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తొలిసారి కాపు కార్పొరేష‌న్ ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి ఛైర్మ‌న్ గా రామాంజనేయులు వ్య‌వ‌హ‌రించారు. రామాంజనేయులు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీ కాపు కార్పొరేషన్ తొలి చైర్మన్ గా కార్పొరేషన్ కు ఉత్తమ సేవలందించిన చలమలశెట్టి మరణం విచారకరం అన్నారు చంద్రబాబు. పార్టీకి, కాపుల పురోగతికి, సంక్షేమానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఏపీలో కోటి మందికి తెలియకుండానే కరోనా వచ్చి పోయింది.. తేల్చిన లేటెస్ట్ సర్వే

ఏపీ ప్రస్తుత జనాభా 5 కోట్లకు పైగా ఉంది. ఐతే అధికారికంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు దాటింది. అయితే రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 19.7 శాతం మందికి, అంటే ఏకంగా కోటి మందికి కరోనా వైరస్‌ సోకి తగ్గిపోయిందని సీరో తాజా సర్వేలో తేలింది. మన రక్తంలోని సీరంలో ఉన్న యాంటీ బాడీస్‌ ఆధారంగా కరోనా వైరస్‌ సోకిందా లేదా అనే విషయాన్ని గుర్తించే అవకాశం ఉంది. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి తీవ్రతను గుర్తించేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తాజాగా సీరో సర్వే నిర్వహించింది. ముందుగా తొలిదశలో అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించగా... 15.7 శాతం మందికి వైరస్‌ సోకి, తగ్గిపోయినట్లుగా తేలింది. తాజాగా రెండో దశలో మిగిలిన తొమ్మిది జిల్లాల్లోనూ సర్వే చేశారు. ఆ సర్వే ఫలితాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ మీడియాకు తెలిపారు.   తాజాగా జరిపిన సిరో సర్వేలో భాగంగా ఒక్కొక్క జిల్లా నుంచి 5 వేల మంది చొప్పున మొత్తం 45వేల మంది నుండి శాంపిల్స్‌ సేకరించారు. వారిలో 19.7 శాతం మందికి తెలియకుండానే కరోనా వైరస్‌ సోకి దానంతట అదే తగ్గిపోయినట్టుగా తేలింది. అంతేకాకుండా వైరస్‌ సోకిన వారిలో పైకి ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇక జిల్లాల వారీగా చూస్తే విజయనగరం జిల్లా లో అత్యధికంగా 30.6 శాతం మంది నమూనాల్లో కరోనా యాంటీ బాడీ్‌సను గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో కర్నూలు జిల్లా 28.1 శాతం, శ్రీకాకుళం జిల్లా 21.5 శాతం, చిత్తూరు జిల్లాలో 20.8 శాతం, విశాఖపట్నంలో 20.7 శాతం, కడపలో 19.3 శాతం, గుంటూరు జిల్లాలో 18.2 శాతం, ప్రకాశం జిల్లాలో 17.6 శాతం మందిలో యాంటీబాడీస్‌ కనిపించాయి. ఇక కరోనా యాంటీ బాడీస్ విషయంలో 12.3 శాతంతో పశ్చిమ గోదావరి చివరి స్థానంలో ఉంది.   ఈ సర్వేను బట్టి తేలిందేంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, కడప జిల్లాల్లో కూడా వైరస్‌ ఉధృతి పెరగవచ్చు. అయితే ఇదే సమయంలో విజయనగరం, కర్నూలు జిల్లాల్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి.   కరోనా వైరస్‌ వ్యాప్తి ఏయే జిల్లాలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించినట్లుగా కమిషనర్‌ భాస్కర్ తెలిపారు. ఈ సర్వే ఫలితాలు వ్యాధి సంక్రమణ తీవ్రతను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్‌ కార్యాచరణకు ఉపయోగ పడతాయి. దీనికి అనుగుణంగా ఆయా జిల్లాల్లో కొవిడ్‌ ఆసుపత్రుల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టవచ్చుఅని అయన తెలిపారు. తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన సీరో సర్వేలో 29.8 శాతం రిజల్ట్‌ వచ్చిందని దని తరువాత నుండి ఢిల్లీలో కరోనా వైరస్‌ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ఇక మన రాష్ట్రంలో తొలిదశలో నిర్వహించిన సీరో సర్వేలో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా సంబంధిత యాంటీబాడీలు కనిపించాయి.. అప్పటి నుండి ఈ జిల్లాలో కూడా కరోనా వ్యాప్తి క్రమంగా కొంత తగ్గుముఖం పట్టింది.

కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు కల్పనాచావ్లా పేరు

అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయమహిళా వ్యోమగామి కల్పనాచావ్లా పేరును ఒక కమర్షియల్ కార్గో స్పేస్ క్రాఫ్ట్ కు పెట్టాలని అమెరికాకు చెందిన నార్త్ రాప్ గ్రూమన్ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఏడాది స్పేస్ లోకి పంపనున్న సిగ్నస్ క్యాప్య్సూల్ కు ఎస్ఎస్ కల్పనా చావ్లా అని నామకరణం చేసినట్టు సంస్థ ప్రకటించింది. గ్లోబల్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ సేవలను అందించే  నార్త్ రాప్ గ్రూమస్ సంస్థ తన అధికార ట్విట్టర్ లో వెల్లడించింది. కల్పనా చావ్లాను గౌరవిస్తున్నాం. ఆమె తొలి భారత మహిళా వ్యోమగామిగా నాసాలో చరిత్ర సృష్టించారు. హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్స్ అభివృద్ధిలో ఆమె ఎంతో సేవ చేశారని, ఎన్జీ-14 సిగ్నస్ ఎయిర్ క్రాఫ్ట్ కు కల్పనా చావ్లా పేరును పెట్టడాన్ని నార్త్ రాప్ గ్రూమన్ గర్వంగా భావిస్తోంది. ప్రతి సిగ్నస్ కూ అంతరిక్ష సేవలందించిన వారి పేర్లను పెట్టాలని కూడా నిర్ణయించాం. స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా తన ప్రాణాలను పోగొట్టుకున్న ఆమె సేవలను ఎన్నో తరాలు గుర్తు పెట్టుకుంటాయి.   ఆన్ బోర్డ్ రీసెర్చ్, వ్యోమగాముల ఆరోగ్యం, స్పేస్ ఫ్లయిట్ లో సేఫ్టీ తదితర ముఖ్యమైన అంశాలపై ఎంతో సమాచారాన్ని ప్రపంచానికి కల్పనా చావ్లా అందించారని కంపెనీ వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈనెల 29న కల్పనా చావ్లా పేరుతో అంతరీక్షంలోకి వెళ్లే స్పేస్ క్రాఫ్ట్ దాదాపు 3,629 కిలోల బరువైన వస్తువులను స్పేస్ స్టేషన్ కు చేర్చడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 29న ఈ స్పేస్ క్రాఫ్ట్ వర్జీనియాలో ఉన్న నాసా వాలోప్స్ ఫ్లయిట్ ఫెసిలిటీ నుంచి గగనతలంలోకి పంపిస్తారు. దాదాపు 80 పరిశోధనలు.. కల్పనాచావ్లా అంతరీక్షయానం చేసిన మొదటి భారతీయ మహిళ. ఆమె హర్యానాలోని కర్నాల్ లో 17 మార్చి 1962న జన్మించారు. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి 1982లో ఎయిరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత  ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి మాస్టర్స్ డిగ్రీని, కొలరాడో యూనివర్శిటీ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను, సర్టిఫైడ్ ఫ్లయిట్ ఇన్ స్ట్రక్టర్ హోదాను అందుకున్న ఆమె 1988లో నాసాలో తన కెరీర్ ను ప్రారంభించారు. 1994లో నాసా  అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత రెండేండ్లకు STS-87  కొలంబియా వ్యొమనౌక లో ఆకాశయానం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె మొదటి అంతరిక్ష ప్రయాణం 1997 నవంబర్ 19 న ఆరు వ్యోమగాములతో మొదలైంది. దాంతో తొలిసారిగా అంతరిక్షానికి  వెళ్లిన భారత మహిళగా చరిత్ర సృష్టించారు. రెండవసారి అంతరిక్ష యానాన్ని చేసే అవకాశం కూడా ఆమెకు లభించింది.  2001లో ఎస్టీఎస్-107 క్రూ మెంబర్ గా ఎన్నికయ్యారు. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనల కోసం ఆమె అంతరిక్షంలోకి వెళ్ళారు. ఈ రెండు ప్రయాణాల్లో ఆమె దాదాపు 80 పరిశోధనలను పూర్తి చేశారు. స్పేస్ క్రాఫ్ట్ లో తిరిగి భూమ్మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అంతరిక్షయానంలో భారత మహిళ పేరును చరిత్రలో తొలిసారి లిఖించి ఎందిరో స్ఫూర్తిదాయకంగా మారారు.  ఆమె జ్ఞాపకార్ధం ప్రపంచవ్యాప్తంగా అనేక విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు అవార్డులను, స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. మొదటిసారి కమర్షియల్ స్పేస్ క్రాఫ్ట్ కు ఆమె పేరు పెడుతున్నారు.  "పరిస్థితులు ఎలాగున్నా... కన్న కలల్ని నిజం చేసుకోవడమే అంతిమ లక్ష్యం " అంటూ చెప్పే కల్పన చిన్నతనంలో ఆకాశంలో విహరించాలన్న తన కలను నిజం చేసుకున్నారు. 31రోజుల 14గంటల,54నిమిషాలు అంతరిక్షంలో ఉన్న ఆమె చివరికి తన ఊపిరి కూడా ఆకాశంలోనే వదిలారు. ఎందరిలోనూ స్ఫూర్తి రగిలించి చిరంజీవిగా మిగిలారు. 

 ప‌దునైన మోడీ..గాంభీర్య మోడీ!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ..డెబ్బ‌య్ ఏళ్ల వ‌య‌స్సు...ప్ర‌ధానిగా రెండో ట‌ర‌మ్‌లోనూ ప‌ద‌హారు నెల‌లు కావ‌స్తున్న‌ది. క‌రోనా ద‌రిమిలా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీ ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం..మెడ‌చుట్టూ కండువా..అదే మాస్కుగాను ఉప‌యోగం..వీలైనంత‌వ‌ర‌కు మౌన‌మునిలా క‌నిపిస్తున్నారు. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు, ప్ర‌భుత్వ ప్రొటోకాల్ స‌మావేశాల్లో త‌ప్ప ఇత‌ర‌త్రా ఆయ‌న హ‌డావుడి పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు.వినిపించ‌డం లేదు. ఉప‌న్యాసాలు కూడా వీలైనంత‌వ‌ర‌కు క్లుప్తంగా ఉంటున్నాయి. ఎందుకీ మార్పు? ఆయ‌న  అంత‌రంగంలో ఏముంది? ఆయ‌న లోలోన ఏమి ఆలోచిస్తున్నారు?  ఆయ‌నొక‌ హావ‌భావాల సునామీ.. కాని ఈమ‌ధ్య కాలంలో ఎందుకు మౌనాన్ని ఆశ్ర‌యిస్తున్న‌ట్టు? స‌భ‌లు, స‌మావేశాలైనా..అంత‌ర్జాతీయ వేదిక‌లైనా ప్ర‌ధాని మోడీ భావోద్వేగాల‌తో అవి ఊగిపోయేవి. విదేశీ అధిప‌తులు ఆయ‌న ముందు మోక‌రిలిన‌ట్టే అనిపించేది. ఆయ‌న మాట్లాడుతుంటే త‌లూపుతూ వింటూ మంత్ర‌ముగ్దుల్లా అయిపోవాలి త‌ప్ప వారికి వేరే మార్గం ఉండేది కాదు. అగ్ర‌రాజ్యాధిప‌తి ట్రంప్ అయినా అంతే. చేతిలో చెయ్యేసి ట్రంప్ మాట్లాడ‌టం కాదు. మోడీయే ట్రంప్ చేతిమీద చెయ్యేసి జోకేసి మాట్లాడితే ట్రంప్ కూడా న‌వ్వుతూ ఔన‌న్న‌ట్టు త‌లూప‌డ‌మే చూశాం. గ‌తంలో ఒబామాతోనైనా అవే స‌న్నివేశాలు. స‌రికొత్త‌గా చాయ్‌పే అంటూ ఒక సంద‌ర్భాన్ని క్రియేట్ చేసుకుని ద్వైపాక్షిక సంబంధాల మీద ఒక అవ‌గాహ‌న‌కు రాగ‌లిగిన సమ‌య‌స్ఫూర్తి మోడీ సొంతం.అంతేకాదు.  పార్ల‌మెంటు స‌భాప‌ర్వ‌మైతే ఇక చెప్పేదేముంది? అంతా ఏక‌ప‌క్ష‌మే. మాట‌ల దాడి ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఎదురుదాడి అంటే ఇంకా ఇష్టం. అల‌వోక‌గా ప‌దాల గార‌డీతో వ్యంగ్య‌బాణాలు సంధిస్తూ అక్ష‌రాల అల మీద సునాయాసంగా ఈత కొడ‌తారు.  ఆయ‌‌న వాగ్దాటి అలాంటిది. ఆయ‌న త‌త్వం అలాంటిది. ఆయ‌న హావ‌భావాల్లో రివ్వున ఎగిరే ప‌క్షుల రెక్క‌ల చ‌ప్పుడు వినిపిస్తుంది. ఆయ‌న శారీర‌క భాష‌లో ఉద్వేగ‌పు దొంత‌ర‌లు తార‌ట్లాడతాయి. అలాంటిది ప్ర‌ధాని మోడీ ఈమ‌ధ్య మిత‌భాషిలా క‌నిపిస్తున్నారు. ఆ చొర‌వ‌లో వేగం కాస్తంత నెమ్మ‌దించిన‌ట్టు అనిపిస్తున్న‌ది. జాతీయ స‌మ‌స్య‌లు, అంత‌ర్జాతీయ అంశాల మీద ఆయ‌న నోటి నుంచి విన‌వస్తున్న మాట‌లు ప‌రిమిత‌మ‌య్యాయి. ప్ర‌ధానిగా తొలి ట‌ర‌మ్ లో మోడీ అంద‌రికీ ఇప్ప‌టికీ గుర్తే. ఆ వేగం..ఆ ప‌దును..ఆయ‌న ప్ర‌తిచ‌ర్య‌లోనూ క‌నిపించేవి. వాటి ప్ర‌తిధ్వ‌నులు వినిపించేవి. ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు చారిత్రాత్మ‌కం. సాహ‌సోపేతం. ఆ నిర్ణ‌యాల్లో ప‌దును మ‌న‌సుల‌కు తాకేది. కాలం చెల్లిన‌, తుప్పుప‌ట్టిన కొన్ని వ్య‌వ‌స్ధ‌ల‌కు ఆయ‌న మంగ‌ళం పాడిన‌ప్పుడు యావ‌జ్జాతి స‌మ్మ‌తించింది. ఆ ఆలోచ‌ల్లోని తెగువ చూసి ముచ్చ‌ట‌ప‌డింది. ప్లానింగ్ క‌మిష‌న్ని బుట్ట‌దాఖ‌లా చేయ‌డం..2016 న‌వంబ‌రులో పెద్ద‌నోట్ల రద్దు..2017 జులైలో జీఎస్టీ..2016 సెప్టెంబ‌రులో పాకిస్తాన్ మీద స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్సు..ఇలా మొద‌టి ట‌ర‌మ్ అంతా సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో సాగింది. అంతేకాదు. ఆయ‌న జ‌రిపిన ప్ర‌తి విదేశీ ప‌ర్య‌ట‌న ఒక ప‌ర్వ‌దినంగా వెలిగింది. స్ధానిక భార‌తీయుల స‌మ్మేళ‌నాలు జ‌రిగాయి. ఆ బ‌హిరంగ వేదిక‌ల మీద ఆయా దేశాల అధిప‌తుల‌తో క‌లిసి మోడీ చేసిన ప్ర‌సంగ విన్యాసాలు అంత‌ర్జాతీయ వేదిక‌ల‌ను ఆక‌ర్షించాయి. ఇక రెండో ట‌ర‌మ్‌..అదొక సాహ‌స క్రీడ‌. ఆర్టిక‌ల్‌370 ర‌ద్దు..రామాల‌య నిర్మాణం..త్రిపుల్ త‌లాక్‌..సిటిజెన్ షిప్ యాక్టు..ఇర‌వై ల‌క్ష‌ల కోట్ల ప్యాకేజీ..ఇలా ఒక్కొక్క‌టీ ఒక్కో చారిత్రాత్మ‌క నిర్ణ‌యం. ఇవ‌న్నీ మోడీ సాహ‌సోపేత నాయ‌క‌త్వానికి చిహ్నాలుగా శాశ్వతంగా చ‌రిత్ర‌లో నిలిచిపోతాయి. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఒక దుర్ద‌శ మొద‌లైంది. అదే క‌రోనా కాలం. క‌‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌దేశంలోకి ప్ర‌వేశించిన తొలినాళ్ల‌లో ప్ర‌ధాని మోడీ కార్యోన్ముఖుల‌య్యారు. దేశ ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణ క‌ర్త‌వ్యాన్ని బోధించ‌డంలో వినూత్న ప‌ద్ద‌తుల‌తో ముందుకొచ్చారు. లాక్‌డౌన్ కాలంలో దేశ‌ప్ర‌జ‌లంద‌రిచేతా కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల‌ను మ‌న‌సా వాచా అమ‌లుచేయించ‌డంలో విజ‌యం సాధించారు. లాక్‌డౌన్ వ‌ల్ల దేశం ఎదుర్కొన్న ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 2014లో ప్ర‌ధాని మోడీ తొలిసారి ప్ర‌ధానిగా ప‌ద‌వీబాధ్య‌త‌లు స్వీక‌రించాక అయిదేళ్ల‌పాటు వ్య‌వ‌హ‌రించిన తీరు ఒక ర‌కం. రెండోద‌ఫా ప్ర‌ధాని అయ్యాక వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు మ‌రొక ర‌కం. మొద‌టి ట‌ర‌మ్ లో వినూత్న‌పంథాలో అడుగులేశార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది. రెండో ట‌రమ్‌లో ఆయ‌న‌లో మ‌రింత ప‌రిప‌క్వ‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది. అది ఆయ‌న ఆహార్యంలో ప్ర‌తిబింబిస్తున్న‌ది. పొడ‌వాటి గ‌డ్డం అంద‌రూ గుర్తించేలా ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్న‌ది. ఆయ‌న‌లో మునిపుంగ‌వుడు ద‌ర్శ‌న‌మిస్తున్నాడ‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆరేళ్ల భార‌త‌దేశ సార్వ‌భౌమ‌త్వ బాధ్య‌త‌ల నిర్వ‌హ‌ణ అనంత‌రం ఆయ‌న‌లో ఈ మార్పు దేశ ప్ర‌గ‌తికి ఒక చిహ్న‌మ‌న్న భావ‌న క‌లుగుతున్న‌ది. పాకిస్తాన్ తో ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరుకు, చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుకు పొంత‌న లేద‌న్న విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతున్న‌ది. అయితే ఆ రెండు దేశాల‌తో మ‌న‌కున్న వివాదాల గుణ‌గ‌ణాలు వేరు. రెండింటినీ పోల్చి చూడ‌డం భావ్యం కాదు. కాని పాకిస్తాన్ విష‌యంలో మెరుపుదాడుల‌తో ఆయ‌న తీవ్రంగా వేగంగా స్పందించిన విష‌యాన్ని విశ్లేష‌కులు ఇక్క‌డ గుర్తు చేస్తున్నారు. అదే చైనా ద‌గ్గ‌ర‌కొచ్చేస‌రికి ఆయ‌న‌లో నిగ్ర‌హం క‌నిపిస్తున్న‌ది. చైనా సైనికులు ల‌డ‌ఖ్ లోని పాంగాంగ్లో మ‌న జ‌వాన్ల‌ని వ‌ధించినందుకు మొద‌టి ట‌ర‌మ్ మోడీ అయితే ఏమి చేసి ఉండేవార‌న్న విశ్లేష‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోలేదు. అయితే   చైనాతో వ్య‌వ‌హ‌రిస్తున్న‌తీరు విదేశాంగ విధానంలో ఆచితూచి అడుగులేయాల‌న్న ప్రాథ‌మిక సూత్రానికి అనుగుణంగా ఉంది. శ‌త్రుశిబిరం దుందుడుకుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా..భార‌త్ మాత్రం చ‌ర్చ‌ల‌కే ప్రాధాన్య‌మిస్తున్న‌ది. చైనాతో ద‌శాబ్దాల మైత్రి ఒక వంక మోడీని క‌ట్టిప‌డేస్తున్న‌ది. భార‌తీయ సంప్ర‌దాయ‌క మైత్రీభావ‌న‌ను చెక్కుచెద‌ర‌నీయ‌కూడ‌ద‌న్న మోడీ భావ‌న ఆయ‌న‌లోని ప‌రిప‌క్వ‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్న‌ది. ఈ ప‌రిప‌క్వ‌త‌కు అనుగుణంగానే క్ర‌మ‌బ‌ద్దంగా ఆయ‌న ఆహార్యంలో మార్పు కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తున్న‌ది!

సరిహద్దులో టెన్షన్ల మధ్య భారత, చైనా దేశాల మధ్య కీలక ఒప్పందం

భారత చైనాల మధ్య లడాఖ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడి నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణ వాతావరణాన్ని సాకుగా చూపుతూ చైనా భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నాలు చేస్తుండటంతో భారత సైన్యాలు వాటిని తిప్పి కొడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణానికి ముగింపు పలికే దిశగా భారత్, చైనా మధ్య మాస్కోలో అత్యున్నత స్థాయి చర్చలు జరిగాయి. ప్రస్తుతం మాస్కో‌లో షాంఘై సహకార సంస్థ సమావేశాల వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ గురువారం చర్చలు జరిపారు. ఇద్దరు మంత్రులు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించే అంశంపై సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిపారు. ఈ చర్చలలో ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనికోసం ఐదు అంశాలతో కూడిన ఒక ప్రణాళికను ఈ సమావేశంలో ఖరారు చేశారు. ప్రస్తుతం సరిహద్దులలో నెలకొన్న పరిస్థితులు రెండు దేశాలకు కూడా మంచిది కాదని రెండు దేశాలు అంగీకరించాయి. ప్రస్తుతం ఎల్‌ఏసీ వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను వెంటనే తగ్గించాలని రెండు దేశాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇదే సమయంలో రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగించడం, అలాగే వెంటనే సైన్యాలను వెనక్కి రప్పించడంతో పాటు ఎల్ఏసీ నుంచి సమదూరం పాటిచడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలని ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చాయి. నిన్న జరిగిన ఈ సమావేశంలో చైనా తీరుపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొన్ని సంవత్సరాలలో ఎపుడు లేనంతగా ఎల్‌ఏసీ సమీపంలో చైనా బలగాలు భారీగా ఆయుధాలను తరలించడాన్నిఅయన ప్రశ్నించారు. అంతేకాకుండా 1993, 1996 లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని ఎప్పుడూ మోహరించలేదని.. అసలు ఆ పరిస్థితులు ఎందుకొచ్చాయని అయన నిలదీయగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అయితే రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రెండు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదరడం ఒక మంచి పరిణామంగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  

జడ్జీల పైన సోషల్ మీడియాలో కామెంట్స్ పై కేంద్ర మంత్రి సీరియస్..

ఏపీ‌లో వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టుల నుండి వ్యతిరేక తీర్పులు వస్తున్నాయి. దీంతో కొద్ది రోజుల క్రితం హైకోర్టు జడ్జిల మీద కూడా కొందరు సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకరమైన భాషలో విమర్శలు చేశారు. ఈ తీవ్ర విమర్శలు చేసిన వారి మీద కేసులు నమోదు చేయాలంటూ హైకోర్టు కూడా ఆదేశించింది. ఐతే ఇందులో కొందరు వైసీపీ ప్రజాప్రతినిధులు మరియు వైసీపీ కార్యకర్తలు కూడా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో తమ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసంటూ వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. అంతేకాకుండా గత ఎన్నికలలో ఓడిన టీడీపీనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేయిస్తోందని కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తునారు.   తాజాగా ఇదే విషయంపై కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటివాటిని ఒప్పుకోబోమని అయన అన్నారు. తాజాగా ఒక జాతీయ దినపత్రికకు రాసిన వ్యాసంలో మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై స్పందించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా నెగిటివ్ ప్రచారం చేయడాన్ని ఈ వ్యాసం ద్వారా ఆయన తప్పుపట్టారు. ముందుగా "ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు..  పిల్ దాఖలు చేయడం, తరువాత కేసులకు సంబంధించి ఎలాంటి తీర్పు ఇవ్వాలో కూడా సోషల్ మీడియా వేదికగా జడ్జిలకు నిర్దేశించడం, ఒకవేళ తమకు వ్యతిరేకంగా తీర్పు వస్తే అదే జడ్జిల మీద దుష్ప్రచారం చేయడం" సరికాదని అయన స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌‌‌ను అభిశంసించాలన్న కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ న్యాయవాదులు చేసిన ప్రయత్నం ఈ మధ్యకాలంలో జ్యుడీషియరీ స్వయంప్రతిపత్తి మీద జరిగిన అతిపెద్ద దాడి అని అయన వ్యాఖ్యానించారు. ఈ మధ్యకాలంలో "అయితే నా మాట వినాలి. లేకపోతే బయటకు పంపేస్తాం" అనే విధానం న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తికి పెద్ద సవాలుగా మారుతోందన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా బీజేపీలోని చాలా మంది నేతలు న్యాయవ్యవస్థ స్యయంప్రతిపత్తిని కాపాడుకునేందుకు ప్రయత్నించారని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం న్యాయవ్యవస్థ పైన పెరుగుతున్న దాడి తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు.

ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చినా ఫైనల్ గా ఆ టెస్ట్ చేయాల్సిందే... కేంద్రం ఆదేశం

మనదేశంలో రోజువారీ నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా కరోనా టెస్టుల పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు ఉన్న వారికి ఒకవేళ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మరోసారి ఆర్టీ-పిసిఆర్ విధానంలో తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి కేవలం ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయితే, ఆ టెస్టులో నెగిటివ్ వస్తే ఆర్టీ-పిసిఆర్ టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టుగా తెలిపింది. దీంతో జ్వరం, దగ్గు, శ్వాస కు సంబంధించిన సమస్యలతో కూడిన లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వచ్చినా మళ్లీ ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పకుండా చేయాలి.   అంతేకాకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల గడిచిన తరువాత కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా ఆర్టీ-పిసిఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాలి. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వారిని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం తాజాగా హెచ్చరించింది. ఈ తాజా ఆదేశాలను పాటించడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, అంతేకాకుండా ఈ వైరస్ మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కరోనా టెస్టుల్లో ఆర్టీ-పిసిఆర్ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

విజయసాయికి నోటీసులు ఇస్తారా?.. లేక మన ఎంపీ గారేలే అని ఊరుకుంటారా? 

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుకు 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని నోటీసులు పంపిన పోలీసులు.. ఇప్పుడు వైసీపీ విజయసాయి రెడ్డికి కూడా నోటీసులు పంపుతారా? అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య అటు పోలీసు శాఖని, ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే లాజిక్ ని తెరమీదకు తీసుకువచ్చారు.    చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే దళిత యువకుడు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని చంద్రబాబు ఆరోపించారు. అంతేకాదు, దీనికి సంబంధించి ఆయన డీజీపీకి కూడా లేఖ రాశారు. అయితే, ఓం ప్రతాప్ మృతి కేసులో చంద్రబాబుకు సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. ఓం ప్రతాప్ మృతిపై సాక్ష్యాధారాలు ఉంటే ఇవ్వాలని, వారంలోగా కార్యాలయానికి హాజరై ఆధారాలు ఇవ్వాలని డీఎస్పీ సదరు నోటీసుల్లో పేర్కొన్నారు.    చంద్రబాబుకి పోలీసులు నోటిసులు ఇవ్వడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దర్యాప్తు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరితే.. సాక్ష్యాలివ్వండి, విచారిస్తామని.. పోలీసులు అనడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ నేత వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ తీరు కారణంగానే ఏపీలో హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని విపక్ష నేతలు విరుచుకుపడుతుండగా.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపించారు.    "తునిలో రైలు, అమరావతిలో తోటలు తగలబెట్టించి, విజయవాడలో గుడులు కూల్చి, అమరేశ్వరుడి భూములు మింగి, పుష్కరాల్లో 7వేల కోట్లు ఆరగించి, దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించి, అంతర్వేదిలో రథానికి నిప్పు పెట్టించాడు. పాప భీతి, దైవ భక్తి ఏనాడూ లేనివాడు. ఆ బాబే హిందుత్వంపై దాడులకు మూలకారకుడు." అంటూ చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేస్తూ విజయసాయి ట్వీట్ చేశారు.   విజయ సాయి వ్యాఖ్యలపై స్పందించిన వర్ల రామయ్య.. పోలీసులకి, ప్రభుత్వానికి చురకలు వేశారు. అంతర్వేది రధానికి నిప్పు పెట్టింది చంద్రబాబు అని ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి గారికి, 91 సీఆర్పీసీ క్రింద సాక్ష్యములు చూపించాలని పోలీసులు నోటీసులు ఇస్తారా? లేక మన ఎంపీ గారేలే అని వూరుకుంటారా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతి పక్షాలకు ఒక న్యాయమా? ఇదేనా మీ ప్రభుత్వ విధానం? అని వర్ల రామయ్య నిలదీశారు.   మరి అప్పుడు.. వైసీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఓం ప్రతాప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ.. దర్యాప్తు చేయాలని చంద్రబాబు కోరితే.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని పోలీసులు నోటీసులు పంపారు. మరి ఇప్పుడు.. తునిలో రైలు ఘటన నుంచి అంతర్వేదిలో రథానికి నిప్పు వరకు చంద్రబాబే చేశారని విజయ సాయి అన్నారు. మరి వర్ల రామయ్య కోరినట్టు.. 91 సీఆర్పీసీ కింద సాక్ష్యాలు చూపించాలని విజయ సాయికి నోటీసులు పంపి పోలీసులు తమ విశ్వసనీయతని కాపాడుకుంటారో లేక అధికార పార్టీకి ఒక రూల్, ప్రతి పక్షాలకు ఒక రూల్ అని విమర్శలపాలవుతారో చూడాలి.

బీజేపీ నేతలు ఈ విషయాన్ని మరిచినట్టున్నారే!!

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం ఘటన ఏపీలో ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం, నెల్లూరులో వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు, ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయానికి చెందిన ముఖ ద్వారం కూల్చివేత, తాజాగా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం దగ్ధం.. ఇలా వరుస ఘటనలు జరగడంపై విపక్షాలు అధికార పార్టీపై విరుచుకుపడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఓ వైపు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. మరోవైపు గత టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తోంది.   తాజాగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో అనేక దేవాలయాలను కూలగొట్టారని అన్నారు. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ మతంపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఒక ఘటన జరిగిన వెంటనే నేరస్తులను పట్టుకుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదన్నారు. మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని అని చెప్పడం దారుణమని.. మతిస్థిమితం లేని వ్యక్తి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటన ఎక్కడా లేదని అన్నారు. అసలైన దోషులను పట్టుకోకుండా ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. అసలు దోషులను పక్కన పెట్టేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని అన్నారు. అసలు దోషులను పట్టుకునే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అలాగే, గత ప్రభుత్వం హయాంలో కూలగొట్టిన దేవాలయాలను ప్రస్తుత ప్రభుత్వం నిర్మించాలని కన్నా డిమాండ్ చేశారు.   కన్నాతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంతో పాటు గత టీడీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే ఎవరి తీసుకున్న గోతిలో వారే పడ్డట్టు.. బీజేపీ నేతలు కూడా టీడీపీ మీద విమర్శలు చేస్తూ తమని తామే నిందించుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వంలో 2018 వరకు బీజీపీ కూడా భాగస్వామిగా ఉంది. అంతేకాదు, అప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా దివంగత బీజీపీ నేత మాణిక్యాలరావు పనిచేశారు. దీంతో ప్రస్తుతం కొందరు బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే పరోక్షంగా తమని తామే నిందించుకున్నట్టు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

హక్కుల బావుటా చాకలి ఐలమ్మ

'ఈ భూమి నాది.. పండిన పంట నాది. తీసుకెళ్లడానికి ఆ దొర ఎవడు' అంటూ బడుగుజీవుల రక్తాన్ని పీల్చే దొరలకు ఎదురొడ్డి నిలబడిన ధీశాలి చాకలి ఐలమ్మ. దొరల గుండెల్లో మంటలు రేపిన అగ్నికణం ఆమె. తన హక్కుల కోసం ఆమె జరిపిన పోరాటం, ప్రతిఘటన మహిళాలోకానికి, యువతరానికి ఆదర్శం. భూమి కోసం.. భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాటపటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరవనిత. ఆమె పేరులేనిదే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేదంటే అతిశయోక్తి కాదు. ప్రశ్నిస్తే ప్రాణాలు పోతాయన్నంత భయంతో బతుకుతున్న నేటితరానికి ఆమె మార్గదర్శి.   చాకలి ఐలమ్మ 1895 లో వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఓరుగంటి మల్లమ్మ, సాయిలు. ఆమెకు పదకొండేండ్లకే పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో పెళ్ళి అయ్యింది. వారికి ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. ఐలమ్మ కుటుంబం ఆంధ్రమహాసభలో సభ్యత్వం తీసుకోవడంతో పాటు తమ ఇంటిలోనే సంఘం కార్యాలయాలన్ని ఏర్పాటుచేశారు. ఆమె ఇంటిని కేంద్రంగా చేసుకుని పాలకూర్తిలో ఆంధ్రమహాసభ కార్యక్రమాలు జరిగేవి.    పాలకుర్తికి పక్కనే నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని కుంటుంబమంతా కష్టపడేవారు. సంఘం కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్న ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలన్న ఆలోచనతో ఆ ఊరి దొర రామచంద్రారెడ్డి అనేక విధాలుగా వేధించాడు. కౌలు భూమిలో పండిన పంట తీసుకుపోవడానికి తన అనుచరులను పంపించాడు. ఆంధ్ర మహాసభ కార్యకర్తలు ఐలమ్మ కుటుంబానికి అండగా నిలిచారు. కొంగు నడుముకు చుట్టి రోకలిబండ చేతపట్టుకుని దొర అనుచరులను ఆమె తరిమికొట్టారు. ఐలమ్మ సాహసంతో సాయుధపోరు ప్రారంభమైంది. రాజీ పేరుతో ఐలమ్మను గడీకి పిలిపించి ‘నిన్ను ఇక్కడ చంపితే దిక్కెవరు’ అని భయపెట్టే ప్రయత్నం చేసిన దొరకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది. ‘నన్ను చంపితే నా కొడుకులు నిన్ను బతకనీయరు. నీ గడీల గడ్డి మొలస్తది’ అని అదురుబెదురు లేకుండా చెప్పింది. ఆమె ధైర్యం చూసి దొరే ఖంగు తిన్నాడు. నిజాం పాలనకు, దొరల ఆగడాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి అయ్యింది. ఆమె స్ఫూరి కారణంగా ఊపు అందుకున్న ఉద్యమం ఫలితంగా దాదాపు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది. గడీల గడ్డి మెులవాలన్న ఆమె మాటలకు దేవతలు కూడా తథాస్తు అన్నట్లు దొరల రాజ్యం పోయింది, గడీల గడ్డి మొలిచింది. అగ్నికణంగా దొరల గుండెల్లో మంటలు పుట్టించిన ఐలమ్మ 1985 సెప్టెంబర్‌ 10న మరణించింది. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అన్న శ్రీశ్రీ మాటలకు ఆమె జీవితమే నిదర్శనం.

రాజు మారినప్పుడల్లా రాజధాని మారదు

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని విషయమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. రాజధానిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నదే చెప్పిందని వ్యాఖ్యానించారు. రాజధానిపై రాష్ట్రాలదే నిర్ణయమని, రాష్ట్రం ఇప్పటికే ఆ నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజధానిపై ఒకసారి నిర్ణయం తీసుకున్నాక మళ్లీ మార్చడం కుదరదని అన్నారు. దీనిపై రాజధాని రైతులు, మహిళలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులో విశాఖ పేరులేదని గుర్తుచేసారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని పేర్కొన్నారు. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని, రాయలసీమకు తరలిపోదని రఘురామ కృష్ణరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.