ప్రభుత్వ చర్యలు ఎండగట్టేందుకు వ్యూహం
posted on Sep 5, 2020 @ 6:38PM
తెలంగాణ రాష్ట్రంలో ఒక వైపు కరోనా.. మరోవైపు కరెప్షన్ రాజ్యమేలుతున్నాయి. కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్యను ప్రభుత్వం దాచి పెట్టిందని
హైకోర్టు కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని భారతీయ జనతాపార్టీ అనేక సార్లు విమర్శలు చేసింది. రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్యరాజన్ కూడా కరోనా ను అడ్డుకోవడంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ఈ విషయం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.
ఇక ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే మరో అంశం అవినీతి. రాష్ట్రంలో భూముల అక్రమణ, రెవెన్యూ విభాగంలో పేరుకుపోయిన అవినీతిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శ్రీశైలం ఎడమ గట్టు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీయడానికి సమాయత్తం అవుతున్నారు. అయితే ప్రభుత్వం ముందుగానే ప్రతిపక్షం నుంచి వచ్చే సవాళ్లను పసికట్టి వారికి మాట్లాడే అవకాశం ఇవ్వడంలోనూ, మీడియా ముందుకు వెళ్ళకుండా నియంత్రించడంలోనూ వ్యుహరచన చేస్తోంది. కరోనాను కట్టడి చేయలేకపోయినా ప్రభుత్వ అలసత్వంపై ప్రశ్నించే ప్రతిపక్షాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది అంటూ విమర్శిస్తున్నారు సీనియర్ నేతలు.