‘గ్రేటర్’లో రిజర్వేషన్ లొల్లి

మాకొద్దంటున్న టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు   కేటీఆర్‌కు మొర పెట్టుకుంటున్న నేతలు   నవంబర్ లేదా డిసెంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. దీనితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి మొదలయింది. ఓ వైపు పార్టీలు వ్యూహరచనలో మునిగిపోగా, మరోవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, రిజర్వేషన్ల వ్యవహారం పితలాటకంగా మారింది. 2016 నాటి గ్రేటర్ ఎన్నికల్లో, ఒక ప్రాతిపదిక అంటూ లేకుండా చేసిన రిజర్వేషన్ల ప్రక్రియ, ఇప్పుడు ఇబ్బందిగా పరిణమించిందని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే అంశంపై వారంతా, ఇటీవల నిర్వహించిన ఓ సమావేశంలో.. పార్టీ అగ్రనేత కేటీఆర్‌కు చెప్పి, తమ ఈతిబాధలు వెళ్లబోసుకున్నారట. రానున్న ఎన్నికల్లో ఇప్పుడున్న రిజర్వుడు స్థానాలు మార్చాలని కేటీఆర్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు చెబుతున్నారు.   గత ఎన్నికల్లో నగరంలోని మొత్తం 150 డివిజన్లలో.. ఎస్టీలకు ఒక జనరల్-ఒక మహిళ వార్డు కేటాయించారు. ఎస్సీలకు 5 జనరల్- 5 మహిళా వార్డులు కేటాయించారు. బీసీలకు 25 జనరల్-25 మహిళా వార్డులు; మహిళ (జనరల్)కు 44 వార్డులు; అన్ రిజర్వుడు-44 డివిజన్లు కేటాయించారు. అయితే, అప్పట్లో తెరాస టికెట్ల ఎంపిక కూడా హడావిడిగా జరిగింది. ఎవరంటే వారికి, ముఖ్యంగా ఉద్యమంలో ఉత్సాహంగా పనిచేసిన వారితోపాటు, స్థానిక ఎమ్మెల్యే-ఇన్చార్జులు చెప్పిన వారికి సీట్లు ఇచ్చారు.   ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత, నగరంపై టీఆర్‌ఎస్ పట్టు మరింత పెరిగింది. నగరంలో మజ్లిస్ తప్ప, మరో పార్టీకి స్థానం లేకుండా పోయింది. బీజేపీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. దీనితో కార్పొరేటర్ల సీట్లపై నియోజకవర్గ-ద్వితీయ స్థాయి నేతల ఆశలు పెరిగాయి. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేటర్ల స్థానాల్లో, ఎమ్మల్యేలు ఇప్పటికే తమ అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 75 స్థానాల్లో మహిళా కార్పొరేటర్లే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. వారిలో 90 శాతం వరకూ పెత్తనం చేసేది, వారి భర్తలు లేదా తండ్రులేనన్నది బహిరంగ రహస్యం. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సంకటంలా పరిణమించింది. వారిని గట్టిగా మందలించలేని పరిస్థితి. కొంతమంది మహిళా కార్పొరేటర్లు మాత్రం క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా ఉంటే, చాలామంది కార్పొరేటర్ల పెత్తనాన్ని భర్తలే చెలాయిస్తున్న పరిస్థితి నెలకొంది.     ఈ నేపథ్యంలో, తమ నియోజకవర్గాల వరకూ మహిళా రిజర్వేషన్లు లేకుండా చూడాలని, మహిళా రిజర్వేషన్లు ఉన్న డివిజన్లను సాధ్యమయినంత వరకూ.. బీసీ జనరల్ లేదా జనరల్ రిజర్వేషన్లు వచ్చేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. నగరంలో సికింద్రాబాద్-సనత్‌నగర్ నియోజవర్గాల్లోనే ఎక్కువగా మహిళ జనరల్, ఎస్సీ, బీసీ స్థానాలు రిజర్వు అయ్యాయి. ఇక్కడ పురుష కార్పొరేటర్ల శాతం బహు తక్కువ. దీనితో పార్టీకి పనిచేసిన మగవారికి, అవకాశం కల్పించే పరిస్థితి లేకుండా పోతోందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. గతంలో బీసీలు ఎక్కువగా ఉన్న డివిజన్లను కూడా, ఎస్సీ రిజర్వుగా మార్చారన్న విమర్శలున్నాయి.   అయితే.. మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రం, మహిళలు ఉంటేనే తమకు నెత్తినొప్పి ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. మగవారయితే, ఒకవేళ వారు ఆర్ధికంగా బలంగా ఉంటే.. తమపైనే గ్రూపులు కట్టే ప్రమాదం ఉందని, అదే మహిళలయితే ఆ సాహసం చేయరన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, పార్టీకి చెందిన మహిళా నేతలు మాత్రం, పార్టీలో మొదటి నుంచీ పనిచేస్తున్న తమకు కాకుండా, నేతల భార్యలకు టికెట్లు ఇప్పించుకుంటున్న సంప్రదాయానికి, ఈసారయినా తెరదించాలని కేటీఆర్‌కు మొరపెట్టుకుంటున్నారు.   ఈ ఎన్నికల్లో చాలామంది ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలు.. తమ వారసులను రంగంలోకి దింపాలన్న యోచనలో ఉన్నారు. అయితే, ఇప్పటి రిజర్వేషన్లే మళ్లీ కొనసాగితే.. కొడుకులకు బదులు, కోడళ్లను నిలబెట్టాలన్న నిర్ణయానికి వస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే ఉన్న మునిసపల్ చట్టాన్ని కొనసాగిస్తారా? లేక జీహెచ్‌ఎంసీ చట్టాన్ని కూడా, దానికి వర్తింపచేస్తూ ఆర్డినెన్స్ ఇస్తారా? అన్నది చూడాలి.  -మార్తి సుబ్రహ్మణ్యం

కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కన్నుమూత.. రేపు పాట్నాలో అంత్యక్రియలు

కేంద్ర మంత్రి, లోక్ జన్‌ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ నిన్న రాత్రి కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స జరగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. రాంవిలాస్‌ పాశ్వాన్‌ 8 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రిగా రాం విలాస్ పాశ్వాన్ కొనసాగుతున్నారు.   పాశ్వాన్ భౌతికకాయాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు ఢిల్లీ 12 జన్‌పథ్‌లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం పాట్నకు తరలించనున్నారు. పట్నాలోని లోక్‌జనశక్తి పార్టీ ఆఫీసులో మద్దుతుదారులు, అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా ఆయన భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. రేపు అంటే శనివారం పట్నాలో అధికారిక లాంఛనాలతో పాశ్వాన్ అంత్యక్రియలను నిర్వహించనున్నారు.   రామ్‌విలాస్ పాశ్వాన్ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇది తనకు మాటలకందని విషాదమని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఆయన లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు.

హత్రాస్ కేసులో మరో ట్విస్ట్.. బాధితురాలు నా ఫ్రెండ్ అంటూ నిందితుడు లేఖ!!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అంటూ ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.   యువతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాశాడు. బాధితురాలు, తాను స్నేహితులమని.. తమ స్నేహాన్ని సహించలేక యువతిని ఆమె తల్లి, సోదరులు కొట్టి హింసించారని లేఖలో పేర్కొన్నాడు. యువతిని కలిసేందుకు పొలానికి వెళ్లగా, అక్కడ ఆ యువతితో పాటు ఆమె తల్లి, సోదరులు ఉన్నారని చెప్పాడు. అయితే, వాళ్ళు తనను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తే వెళ్లానని తెలిపాడు. వాళ్ళే ఆ యువతిని కొట్టి చంపి, తనతో పాటు మరో ముగ్గురిపై నేరం మోపారని సందీప్ ఠాకూర్ లేఖలో పేర్కొన్నాడు. అయితే, సందీప్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను బాధితురాలి తల్లిదండ్రులు ఖండించారు.   బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అని.. ఆమె తల్లి, సోదరులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ప్రధాన నిందితుడు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అక్కడి పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం చూస్తుంటే.. కేసుని కేసుని తప్పుదోవ పట్టిస్తూ, కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కవితకు దసరా గిఫ్ట్! ఆ మంత్రికి టెన్షన్

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ముగిసింది. కౌంటింగ్ ఈనెల 12న జరగనున్నా... ఫలితమేంటో అందరికి ముందే తెలిసిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ ఏకపక్షంగానే సాగడంతో సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గెలుపు లాంఛనమే. ఎమ్మెల్సీగా కవిత విజయంపై ఎవరికి అనుమానం లేకున్నా.. ఆమె గురించే ఇప్పుడు మరో చర్చ నిజామాబాద్ జిల్లాలో ఊపందుకుంది. శాసనమండలిలో అడుగుపెట్టబోతున్న కవితకు సీఎం కేసీఆర్ త్వరలోనే మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే చర్చ జిల్లాతో పాటు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా జరుగుతోంది. కవితకు కేసీఆర్ దసరా కానుక ఇవ్వబోతున్నారని ఆమె అనుచరులు, అభిమానులు ప్రచారం మొదలుపెట్టేశారు.   రీ ఎంట్రీతో రాష్ట్ర రాజకీయాల్లో కవిత  కీలకంగా మారనున్నారనే చర్చ టీఆర్ఎస్ పార్టీలోనూ జరుగుతోంది. కవిత ఎమ్మెల్సీ గా మాత్రమే పరిమితం కారని , మంత్రిగా రాష్ట్ర రాజకీయాలలో పని చేస్తారని  నిజామాబాద్ జిల్లా గులాబీ నేతలు కూడా చెబుతున్నారు. అయిదేళ్లపాటు ఎంపీగా పనిచేసి జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత.. ఇకపై రాష్ట్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పబోతున్నారని చెబుతున్నారు.    నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు కవిత. పరాజయం తర్వాత ఆమె పాలిటిక్స్ లో సైలెంట్ అయ్యారు. చాలా రోజుల పాటు బయటికి కూడా రాలేదు. గత సంవత్సరం జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలను పట్టించుకోలేదు. చివరకు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఆమె జోక్యం చేసుకోలేదు. కవిత రాజకీయ భవిష్యత్ పై రకరకాల ప్రచారాలు కూడా జరిగాయి. అయితే ఇంతకాలం రాజకీయాలకు దూరంగా సైలెంట్ గా ఉన్న కవిత.. సడెన్ గా నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ బరిలోకి దిగారు. కవితను ఎమ్మెల్సీగా బరిలోకి దింపిన సీఎం కేసీఆర్.. అంతటితో ఊరుకోరని.. ఆమెకు కచ్చితంగా ప్రమోషన్ ఉంటుందని తెలంగాణ భవన్ లోనూ చర్చ జరుగుతోంది. సమయం చూసే కవితను మళ్లీ యాక్టివ్ చేశారని చెబుతున్నారు. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్.. రాష్ట్ర పాలనా పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే కవితను ఎమ్మెల్సీ చేశారని, కేబినెట్ లోకి  తీసుకుని కేటీఆర్ కు సపోర్ట్ గా ఉంచుతారనే వాదన గులాబీ పార్టీలో వినిపిస్తోంది.    మరోవైపు కవిత రీ ఎంట్రీతో నిజామాబాద్ జిల్లాలో ఆమె అనుచరుల్లో సంతోషం కనిపిస్తుండగా, మరికొందరు గులాబి నేతలలో మాత్రం టెన్షన్ కనిపిస్తుంది. కవితకు మంత్రిగా అవకాశం ఇస్తే నిజామాబాద్ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మంత్రి అవుట్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆ మంత్రి పనితీరుపై పార్టీలోనూ అసంతృప్తి ఉందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతోనూ ఆయనకు సఖ్యత లేదని సమాచారం. అందుకే ఆ మంత్రికి చెక్ పెట్టేందుకే కవితను ఎమ్మెల్సీగా పోటీ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే కొన్ని రోజులుగా  కవిత గెలుపు కోసం ఆ మంత్రి కష్టపడుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ చేరేలా పావులు కదిపారు. చాలా మందిని కారు ఎక్కించారు. ఇన్ని రోజులుగా కవిత గెలుపు కోసం కష్టపడుతున్న ఆ మంత్రికి.. కవిత రూపంలోనే గండం వచ్చిందని జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

వందనాలు సరే వేతనమేది! గ్రామ స్వరాజ్యమంటే ఇదేనా?

వాలంటీర్లకు వందనాలన్నారు. అద్భుత సేవలు చేస్తున్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారని గొప్పలు చెప్పారు. వారికి మద్దతుగా చప్పట్లు కొడుతూ అధికార పార్టీ నేతలు షో చేశారు. సీఎం జగన్  కూడా ఇంటి బయటికి వచ్చి చప్పట్లు కొట్టారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైందని గొప్పగా చెప్పారు. వాలంటీర్లు కాదు వారియర్స్ అని కీర్తించారు. అయితే సీఎం జగన్  చెబుతున్న వారియర్స్.. ఇప్పుడు వైసీపీ పాలనను ఛీదరించుకుంటున్నారు. తమకు వేతనాలు ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఏడాదిగా తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని నడి రోడ్డుపై నిల్చుని నిలదీస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు.     వైసీపీ నేతలు గొప్పగా చెబుతున్న సచివాలయ వ్యవస్థ మరో కోణంలో అధ్వాన్నంగా ఉంది. సచివాలయ వ్యవస్థను ప్రారంభించి రెండు లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఏడాదిగా వారి సేవలు ఉపయోగించుకుంటూ.. వారికి వేతనాలు మాత్రం ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్క నెల వేతనం మాత్రమే ఇచ్చిందని తెలుస్తోంది. వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదట. అందుకే చేసేది లేక వారంతా రోడ్డెక్కారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 96 మంది వాలంటీర్లు ఆందోళనకు దిగారు. 11 నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ ధర్నా చేశారు. వెంటనే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.   తూర్పు గోదావరి జిల్లానే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. వేతనాల రాక వాలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. కొన్ని జిల్లాలో ఆరు నెలలు, కొన్ని జిల్లాల్లో 11 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయంటున్నారు. కరోనా టైమ్ లో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించుకుని కూడా వేతనాలు ఇవ్వలేదని వాలంటీర్లు వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థ గురించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్.. వారికి వేతనాలు ఇవ్వకపోవడం విస్మయపరుస్తోంది. జగన్ చెబుతున్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.    గ్రామ స్వరాజ్యం పేరుతో ఏడాది క్రితం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 61 వేల మంది వలంటీర్లను నియమించింది. గ్రామ వాలంటీర్ గౌరవ వేతనాన్నిఐదు వేల రూపాయలుగా ప్రకటించింది. విడతల వారీగా వేతనాలు పెంచుతామని చెప్పారు జగన్. అయితే వేతనం పెంచడం కాదు.... ఇస్తామన్నది ఇవ్వడమే మానేసింది వైసీపీ ప్రభుత్వం. వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు కష్టాలు పడుతున్నారు. తమ బాధలు, సమస్యలు ఎవరితో చెప్పుకోవాలే తెలియక.. ఏం చేయాలో అర్ధంకాక లోలోపలే కుమిలిపోతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వాలంటీర్లతో పనులు చేయించుకుని జీతాలు ఇవ్వకుండా వేధించడంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.    కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. ప్రభుత్వ పథకాలు రావాలంటే తమకు లంచం ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారని ఇప్పటికే  చాలా ఫిర్యాదులు వచ్చాయి. రేషన్‌ కార్డు మంజూరుకు లంచం డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వాలంటీర్లు  ఫింఛనుదార్లను మోసగించి వసూళ్ళకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా పాయకరావు పేటలో పెన్షన్ ఆపేస్తానని బెదిరింది  ఓ వాలంటీర్... 70 మంది ఫింఛన్ దారుల నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూల్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొందరు వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం వల్లే వాలంటీర్లు వక్రమార్గం పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలల నుండి వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.    గ్రామ స్వరాజ్యం, గాంధీ కలల పథకం అంటూ గొప్పలు చెప్పడం కాదు.. వ్యవస్థను సక్రమంగా నడిపించాలనే అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. వాలంటీర్ సిస్టమ్ గురించి గొప్పగా చెప్పుకుంటూన్న జగన్ ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇందుకు ఇవ్వలేదో చెప్పాలంటున్నారు. చప్పట్లు కొట్టి షో చేయడం కాదు.. వారి సమస్యలు పరిష్కరించాలని సూచిస్తున్నారు. వైసీపీ నేతల ప్రచారం చూసి సచివాలయ వ్యవస్థ గొప్పగా ఉందని భావిస్తున్న వారికి .. వాలంటీర్లకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలిస్తే రాష్ట్రం పరువు పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంశీ చేతిలో, వెంకట్రావు చేయి ఉంచి రాజీ చేసిన సీఎం జగన్.. ఇక అంతా ఓకేనా.. 

గన్నవరం నియాజకవర్గంలో టీడీపీ తరుఫున ఎన్నికైన ఎమ్మెల్యే వంశీ తరువాతి కాలంలో వైసిపిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గంలో అయన పై పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుతో ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో తాను ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటానని వంశీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కృష్ణ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసారు.   ఈరోజు కృష్ణా జిల్లాలో జగనన్న విద్యాకానుక కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సీఎం జగన్ పునాదిపాడుకు చేరుకోగా.. కృష్ణా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు కూడా అందులో పాల్గొన్నారు. అయితే సీఎం స్కూల్ లోకి వెళ్లే సమయంలో జిల్లా ముఖ్య నేతలు అయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కు యార్లగడ్డ వెంకట్రావు అభివాదం చేసారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేతిలో వెంకట్రావు చేతిని ఉంచి ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. అయితే ఇదే సమయంలో యార్లగడ్డ వెంకట్రావు సీఎం జగన్ కు ఏదో చెప్పే ప్రయత్నం చేయగా సీఎం మాత్రం అయన చెప్పే మాటలను వినకుండానే ఆయనను ఆప్యాయంగా పట్టుకొని కలిసి పనిచేయాలని సూచించి అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ మొత్తం తతంగాన్ని పక్కనే ఉన్న ఎమ్మెల్యే వంశీ చూస్తూండిపోయారు.

2021 నాటికి 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి!!

కరోనా మహమ్మారి దెబ్బకి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఎందరో జీవితాలు తలకిందులయ్యాయి. అయితే ఈ మహమ్మారి ప్రభావం భవిష్యత్తుపై తీవ్రంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్‌ హెచ్చరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోతారని హెచ్చరించింది.   కరోనా వైరస్‌ ప్రపంచానికి సవాలు విసురుతోందని, ఈ ఒక్క ఏడాదే కొత్తగా 8 నుంచి 11 కోట్ల మంది తీవ్ర పేదరికంలోకి వెళ్లిపోయే ప్రమాదముందని ప్రపంచ బ్యాంక్‌ తెలిపింది. 2021 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంది. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రపంచంలో పేదరికం మరింత పెరిగనుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ప్రపంచ జనాభాలో సుమారు 1.4 శాతం మంది తీవ్ర పేదరికంలోకి జారుకుంటారని తెలిపింది. ఇప్పటికే పేదరికంలో మగ్గిపోతున్న దేశాలకు రాబోయే రోజులు మరింత కష్టాలను కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాక్సిన్ వస్తే పరిస్థితి మాములుగా మారిపోతుందని అనుకుంటున్నారని.. కానీ, కరోనా తరువాత ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని తెలిపింది.    కాగా, భారత్‌ లో పేదరికంపై ప్రపంచ బ్యాంక్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేదరికం విషయంలో భారత్‌ కు సంబంధించిన సమాచారం లేకపోవడం శోచనీయమని వ్యాఖ్యానించింది. నిరుపేదలు ఎక్కువగా ఉండే భారత్‌ లో ఈ సమాచారం లేకపోవడం కారణంగానే ప్రస్తుత ప్రపంచ పేదరికాన్ని అంచనా వేయలేకపోతున్నామని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. అయితే, ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు విశేష కృషి ప్రపంచ బ్యాంక్‌ ప్రశసించింది.

ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంట్లో సీబీఐ సోదాలు!!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి సీబీఐ షాకిచ్చింది. హైదరాబాదులోని ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ నుండి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు ఈ సోదాలు చేస్తోన్నట్టు సమాచారం. ఇండ్‌ భారత్ కంపెనీతో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం ఆరు గంటల నుండే ఈ సోదాలు జరుగుతున్నట్టు చెబుతున్నారు.    పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ను చీట్‌ చేసిన కేసులో ఈ దాడులు చేస్తున్నారని సమాచారం. రూ.826 కోట్ల లోన్‌ ఫ్రాడ్‌ కేసులో సీబీఐ ఈ సోదాలు చేపట్టింది. దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 6న రఘురామ కృష్ణంరాజుపై ఢిల్లీ సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.   కాగా, రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచినప్పటికీ.. ఆ పార్టీ విధానాలకు వ్యతిరేకిస్తూ గత కొంతకాలంగా గళం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ దగ్గరవ్వడం కోసం వైసీపీపై విమర్శలు చేస్తున్నారని, త్వరలో ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు జరగడం చర్చనీయాంశమైంది. అదీగాక, సీఎం జగన్ ఢిల్లీ పర్యటన జరిగిన తరుణంలో ఈ సోదాలు జరగడం హాట్ టాపిక్ గా మారింది.

స్పీకర్ తమ్మినేనిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. న్యాయవ్యవస్థను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి న్యాయవ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదని హితవు పలికింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీం కోర్టులో ఆశ్రయించాలని.. అలా కాకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.   న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై మీడియా, సోషల్‌ మీడియాలో ప్రజాప్రతినిధులు, వైసీపీ సోషల్ మీడియా విభాగం చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్పీకర్ తమ్మినేని, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీలు విజయసాయిరెడ్డి, నందిగం సురేష్ వ్యాఖ్యలపై విచారణ జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే అరెస్ట్‌లు చేస్తున్నారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై.. హైకోర్టు రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ తెలిపారు. దీంతో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.    స్పీకర్‌ శాసనసభలో ఆ వ్యాఖ్యలు చేశారా? బయట చేశారో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించగా.. తిరుపతి కొండపై మీడియాతో మాట్లాడుతూ స్పీకర్‌ ఆ వ్యాఖ్యలు చేశారని హైకోర్టు స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది తెలియజేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయవ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యం నిలబడాలంటే కోర్టులు అవసరమన్న ధర్మాసనం.. న్యాయస్థానాలు, ప్రభుత్వం, అధికారులు కలిసి పనిచేసుకోవాలని పేర్కొంది.

మూడు రాజధానుల నిర్ణయం.. ఆర్ధిక నష్టం అంశాలపై హైకోర్టు నోటీసులు

ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజ‌ధానుల వ్యవహారం పై హైకోర్టులో తాజాగా మ‌రో పిటిష‌న్ దాఖ‌ల‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌రావ‌తికి ఎంత ఖ‌ర్చు చేశార‌న్న అంశంపై రాజ‌ధాని రైతులు వేసిన అనుబంధ పిటిష‌న్ పై హైకోర్టు తాజాగా ప్ర‌భుత్వానికి నోటీసులిచ్చింది. రాజధానికి సంబంధించిన వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు అనుమతించింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీచేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పటివరకు ఏమయినా ఆర్థిక నష్టం జరిగిందా... జరిగితే ఎంత జరిగిందన్న వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ మేరకు హైకోర్టు ఈ నోటీసులిచ్చింది.   రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది. వీటితో పాటు సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపు సహా పలు ఇతర అంశాలపై ఈరోజు (గురువారం) విచారణ జరపాల్సి ఉండగా... వాటిని కూడా సోమవారమే విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, మూడు రాజ‌ధానుల బిల్లులపై జనవరిలో శాసన మండలిలో జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్‌ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది.

వైసీపీ పరువు తీసిన బీజేపీ సీనియర్ నేత

కొద్ది రోజుల క్రితం ఎన్డీయేలో చేరాలని వైసీపీని బీజేపీ ఆహ్వానించినట్లు.. దీంతో ఇక సీఎం జగన్ నిర్ణయమే పెండింగ్ అనే స్థాయిలో మీడియాలో విపరీతంగా చర్చ జరిగిన సంగతి తెల్సిందే. అంతేకాకుండా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సందర్భంగా దీని పై ఒక నిర్ణయానికి వస్తారని కూడా చర్చ జరిగింది.   అయితే దీనిపై తాజాగా స్పందించిన ఏపీ బీజేపీ ఇంచార్జి సునీల్ దియోధర్.. అవినీతి తో నిండిపోయిన వైఎస్ఆర్ సిపి తో తమకు ఎటువంటి పొత్తు ఉండబోదని వ్యాఖ్యలు చేసారు. తమ ప్రయాణం జనసేన పార్టీ తోనే అని తేల్చి చెప్పిన అయన జగన్ పార్టీ ఎన్డీయేలో చేరబోతోంది అనేవి కేవలం గాలి వార్తలని ఆయన పేర్కొన్నారు.

తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న‌కు రెండోసారి కరోనా పాజిటివ్..

కరోనా మహమ్మారి గురించి ప్రజలలో ఇంకా పూర్తి అవగాహన లేని ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకి తగ్గిన కొంతమందికి మళ్ళీ రెండోసారి సోకుతున్న వార్తలు వింటున్నాం. కొన్ని రోజుల క్రితం తెలంగాణ లోని కొంత మంది వైద్య సిబందికి రెండో సారి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారు తర్వాత సరైన జాగ్రతలు తీసుకోకుంటే మరోసారి వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా వైసిపి నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. మొదటిగా ఆగస్టులో ఒకసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నారు. అయితే నెలన్నర రోజుల తర్వాత ఆయనకు మళ్లీ కరోనా పాజిటివ్ అని తేలింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు.   ఇది ఇలా ఉండగా ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు కరోనా బారినపడ్డారు. అయితే కరోనాతో వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించారు. అలాగే సెప్టెంబరు 16న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కూడా కరోనాతో కన్నుమూశారు.

జగన్-మోదీ.. ఆ విధంగా ముందుకు వెళ్లారు!

ఎన్డీఏలో చేరికపై తుస్సుమన్న ఊహాగానాలు   ఇంకేముంది.. మోదీతో జగన్ డైరెక్టుగా చేతులు కలిపేశారు. పాపం మోదీ-అమిత్‌షా కూడా, చాలా కాలం నుంచి చేరమని చేతులు పట్టుకుని   బ్రతిమిలాడుతున్నారు. అందుకే జగనన్న కరుణించేశారు. మోదీ భయ్యాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జగనన్న, ఎన్టీఏలో చేరడానికి సై అనేశారు. అందుకు ప్రతిఫలంగా విజయసాయిరెడ్డి, సురేష్‌కు మంత్రి పదవులు, మిథున్‌రెడ్డికి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు కమల దళాలు సిద్ధపడ్డాయి. అందుకు ప్రతిగా జగనన్న కూడా, రాష్ట్ర క్యాబినెట్‌లో సోము వీరన్నకు ఓ మంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరించారు. ఇక త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో వైసీపీ కూడా చేరిపోవడం ఖాయం. ఇదీ రెండు రోజుల నుంచి సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన కథనం.   కానీ జగనన్న ఢిల్లీకి వెళ్లారు. మోదీతో మాట్లాడి వచ్చేశారు. మరి ఎన్డీఏలో చేరిక ముచ్చట, దానిపై వైసీపీ సోషల్‌మీడియా దళాలు చేసిన హడావిడి అంతా ఏమైంది? ఇంకేముంటుంది? కాకి ఎత్తుకెళ్లింది! అవును.. అటు, ఇటు ఇద్దరూ దానిపై సైలెన్స్ అయ్యారు. అయినా.. మోదీతో కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన జగన్‌కు, అనవసరమైన హైప్ ఇచ్చిన వైకాపా సోషల్ మీడియా దళాలు.. ఒక్కరోజు వరకయితే ఆ ఉత్కంఠను పెంచి, తమ నాయకుడి ఇమేజ్ పెంచగలిగారు. బీజేపీ నాయకత్వమే వైసీపీని.. కేంద్రంలో చేరమని తెగ బతిమిలాడుతున్నా, మా జగనన్న మాత్రం రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని బిల్డప్ ఇచ్చారు. చివరాఖరకు అది తస్సాదియ్యా, తుస్సుమంది. కారణం.. అక్కడ ఉన్నది మోదీ-అమిత్‌షా జమిలి నాయకత్వం. అద్గదీ సంగతి!   అయినా.. జగనన్న సోషల్‌మీడియా దళాల పిచ్చికాకపోతే.. అసలు వైకాపా ఎన్డీఏలో ఎలా చేరుతుంది? ఎన్డీఏ కూడా వైకాపాను ఎలా తీసుకుంటుంది? అని ఆలోచించాలి కదా? అయినా ఇప్పుడు మోదీ భయ్యా సర్కారుకు, జగనన్న దూరంగా ఏమీ లేరు కదా? రాజ్యసభలో సర్కారు సమస్యల్లో చిక్కుకున్నప్పుడల్లా, ఆపద్బాంధవుడిలా ఆదుకుంటూనే ఉన్నారాయె. మన విజయసాయిరెడ్డి కూడా నిరంతరం పీఎంఓలోనే దర్శనమిస్తూ, కావలసిన పనులు చక్కబెడుతూనే ఉన్నారాయె. రాష్ర్టానికి రావలసిన నిధులన్నీ ఇస్తూనే ఉన్నారాయె. ఇక ప్రత్యేకంగా వైకాపా ఎన్డీఏలో చేరవలసిన అగత్యం ఏముందన్న ప్రశ్న.. బుర్ర-బుద్ధీ ఉన్న ఎవరికయినా వచ్చితీరాలి.   పైగా వైకాపా ఒకవేళ ఖర్మకాలి ఎన్డీఏలో చేరితే.. జగనన్నపై అభిమానం చూపించే ముస్లిం-క్రైస్తవుల ఓట్లు మాయమయిపోవూ? సరే.. క్రైస్తవులంటే, జగన్ తమ బిడ్డ కాబట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా, క్షమించేస్తారు. కానీ, ముస్లిముల అలా కాదు కదా? ఇప్పటికే మోదీపై మండిపడుతున్న ముస్లింలు, జగనన్న మోదీ భయ్యాతో చేరితే ఊరుకుంటారా? వీటికిమించి.. పక్క రాష్ట్రంలో ఉన్న తన అపూర్వ సహోదరుడ యిన కేసీఆర్, ఎన్డీఏతో జత కలిస్తే జగనన్నను ఊరకనే వదిలేస్తారా? ఇన్ని సమస్యలను జగన్ వంటి తెలివైన నాయకుడు ఎందుకు కోరి కొనితెచ్చుకుంటారు?   ఇక పులుకడిగిన ముత్యమయిన బీజేపీ కూడా, నిజాయితీ అనే మడికట్టుకున్న పార్టీ మరి. బోలెడన్ని కేసులున్న జగనన్న పార్టీని ఎన్డీఏలో చేర్చుకుంటే, బీజేపీ నిజాయితీ అనే పాతివ్రత్యం మైలపడిపోదూ? పైగా 9 నెలల్లోగా అన్ని కేసులూ తేల్చేసేందుకు కోర్టులు సిద్ధమవుతున్నాయి. అందులో జగనన్నకు వ్యతిరేకంగా తీర్పు వస్తే, బీజేపీ మరింత మైలపడిపోదూ? వీటికి మించి రాష్ట్రంలో ‘గుర్రం ఎగరావచ్చ’న్న దింపుడుకళ్లెం ఆశతో ఉన్న బీజేపీ.. ఒకవైపు టీడీపీతోపాటు, వైకాపా కూడా.. తమకు అంటరానిపార్టీగానే సోమన్న లాంటి వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో వైకాపాను,  ఎన్డీఏలో చేర్చుకుంటే కమలం కొంప కొల్లేరయి పోదూ? అదన్నమాట అసలు లోగుట్టు! -మార్తి సుబ్రహ్మణ్యం

చర్చి పాస్టరు అత్యాచారంపై మీడియాలో చర్చలేవీ?

విశాఖలో దళిత బాలికపై పాస్టరు అత్యాచారం   చానెళ్లు- పత్రికల హడావిడి, చర్చల పేరంటం ఏదీ?   అసలు తెలుగు మీడియా బుద్ధి పనిచేస్తోందా? దానికి పట్టిన సెక్యులర్ అనే మొహమాటమనే జబ్బు నుంచి ఇక బయటపడదా? కరోనాకు సైతం వ్యాక్సిన్ వస్తుంది గానీ, ఈ సెక్యులర్ మొహమాటమనే జబ్బుకు మాత్రం వ్యాక్సిన్ రాదా? అత్యాచారాలు- హత్యాచార వార్తలను కూడా, ఒక వర్గానికే పరిమితం చేస్తుందా? గంటల తరబడి తీరికూర్చుని, పోచుకోలు కబుర్లతో టీఆర్పీ రేటింగు పెంచుకునేందుకే పనిచేస్తుందా? ఈ అరాచక- పక్షపాత-అష్టావక్ర బుద్ధి నుంచి ఇంకా ఎన్నేళ్లకు బయటపడుతుంది?   గుళ్లు-గోపురాలు-స్వాములు-చివరాఖరకు దేవుళ్ల పేర్లు తగిలించి, వ్యంగ్యాస్త్రాలు వేసే టీవీ చానెళ్ల ఆసాములకు.. మతం మారిన ఒక దళిత బాలికపై, చర్చి పాస్టరు ప్రార్ధన పేరిట చేసిన అత్యాచార యత్నం కనిపించదా? అంటే దళిత బాలిక సమాజంలో మనిషి కాదా? ఆమె మాన ప్రాణాలు టీవీ చానెళ్ల దృష్టిలో, మరీ అంత పనికిరాకుండా పోయాయా? లేక పాస్టరు గారి కామలీలలు చూపిస్తే, యాంకరమ్మలు, టీవీ యజమానులకు  ప్రభువు శిలువ వేస్తాడన్న భయమా? మరి అలాంటి భయం హిందూ దేవుళ్లపై ఉండదేం?.. విశాఖలో పదిహేనేళ్ల దళిత బాలికపై, ఒక చర్చి పాస్టరు అత్యాచారానికి పాల్పడ్డ వార్త, ఏ తెలుగు మీడియాలో కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించనప్పుడు.. సహజంగా తెలుగు మీడియా శీలంపై మెడ మీద తల ఉన్న ఎవరికయినా  వచ్చే సందేహాలే ఇవి!   తెలుగు మీడియా బుద్ధి, వంకర అన్నది బహిరంగ రహస్యం. అది మరీ అవుటర్ రింగురోడ్డంత వంకర అన్నది మరోసారి నిరూపితమయింది. మొన్నామధ్య టీవీ 9లో నారదుడి పాత్రలో నడిపించిన ఒక వెకిలి కార్యక్రమంపై, హిందూ సంఘాలు మండిపడ్డాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాయి. సెక్యులర్ పీఠానికి చాలాకాలం నుంచి అధిపతిగా ఉన్న, సదరు చానెల్‌లో కొన్నేళ్ల నుంచి జాతికి హితోక్తులు వినిపిస్తుంటాయి. దీపావళి వల్ల కాలుష్యం పెరుగుతుందని, వినాయక నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్ పూర్తిగా కాలుష్యయిపోతుంది కాబట్టి మట్టి వినాయకుడిని వాడాలని సుద్దులు చెబుతుంటుంది. పండగల సమయంలో చేసే సౌండ్ల వల్ల శబ్దకాలుష్యం పెరిగిపోతుందని వాపోతుంటుంది. ఇలాంటి సుద్దులు.. మిగిలిన మతాల పండగల విషయంలో చెప్పే ధైర్యం ఉండకపోవడమే ఆశ్చర్యం.   ఇక దేవుళ్లపైనా చర్చల పేరంటం పెట్టి, వాటికి రాంగోపాల్‌వర్మ అనే ‘మర్యాదస్తులతో’పాటు, వామపక్ష-మహిళా అభ్యుదయ నేతలను కూడా పిలిచి, రచ్చబండలో రచ్చ రచ్చ చేయడం ఆ చానెల్ స్పెషాలిటీ. అయితే.. ఈ పైత్యంపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఎన్నిసార్లు అక్కడకు వెళ్లి ధర్నాలు చేసినా, దాని సెక్యులర్ ముసుగు తొలగించనే లేదు. పైగా సదరు చానెల్ యజమాని మహా భక్తుడు. అది వేరే విషయం! సరే ఇక వైసీపీ అధికార సాక్షి మీడియాలో, పాస్టర్ల వ్యవహారాలపై చర్చ జరగదంటే దానిని అర్ధం చేసుకోవచ్చు. దాని మొహమాటం దానిది. మరి మిగిలిన చానెళ్ల జ్ఞానం ఏ జమ్మిచెట్టుపైకెక్కిందన్నది ప్రశ్న!   తాజాగా విశాఖ గాజువాక వాంబే కాలనీలో, నానిబాబు అలియాస్ హెవెల్ అనే పాస్టరు.. మతం మారిన ఓ దళిత బాలికపై, ప్రార్ధన పేరుతో అత్యాచార యత్నం చేసిన వార్త కలకలం సృష్టించింది. అంతలో బాలిక తండ్రి అక్కడికి వెళ్లబట్టి, ఆ బాలిక సురక్షితంగా బయటపడగలిగింది. దీనిపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు పాస్టర్ నానిబాబును అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది.   జరిగిన ఘోరం తెలుసుకున్న టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత, టీడీపీ నేత పళ్లా శ్రీనివాస్, పుచ్చ విజయ్, ఇతర దళిత సంఘాల నేతలు ఆమె కుటుంబానికి ధైర్యం చెప్పారు. పాస్టరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ యువ నేత నారా లోకేష్, ఫోన్‌లో బాలిక- ఆమె తండ్రిని పరామర్శించారు. ఒక అన్నగా అండగా ఉంటానని, ఆమె చదువు బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఇది ఏబీఎన్- ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రసారమయింది. ఇదీ గాజువాకలో జరిగిన పైశాచిక ఘటన.   కానీ, సెక్యులర్ అంశాలపై ఆగమేఘాలపై, పురప్రముఖులతో  చర్చల పేరంటం పెట్టే అలవాటున్న టీవీ 9 సహా, మిగిలిన ఏ చానెలూ దీనిపై చర్చ పెట్టిన దాఖలాలు లేవు. బాధితురాలు క్రైస్తవురాలయినా, ఆమెది మతం మారిన కుటుంబమే కాబట్టి దళితురాలి కిందే లెక్క. అంటే మతం మారిన వారికి రక్షణ లేదన్న మాట. ముఖ్యంగా మతం మారిన దళితుల మాన ప్రాణాలకు, ఆ మతంలోనే రక్షణ లేదన్నది గాజువాక అరాచకం చెబుతూనే ఉంది. మరి ఆ కోణంలో చర్చ పెట్టి, సమాజాన్ని చైతన్యపరచాల్సిన తెలుగు మీడియా మెదళ్లు, మత్తు టాబెట్లు వేసుకున్నంతగా ఎందుకు మొద్దుబారి, సుఖనిద్ర పోతున్నాయన్నది సమాజం సంధిస్తున్న ప్రశ్న. ఇదే మరో మతానికి చెందిన పెద్ద.. ఇలాంటి ఉన్మాదానికి పాల్పడితే, పెద్ద పెద్ద బ్యాంక్‌గ్రౌండ్ మ్యూజిక్కుతో.. చూపిందే చూపించే చానెళ్ల కళ్లు, గాజువాక పాస్టర్ ఘటనలో మూసుకుపోవడమే ఆశ్చర్యం.   పోనీ పాస్టరు చేతిలో అత్యాచార యత్నానికి గురయింది మతం మారిన క్రైస్తవురాలు కాదని కాసేపు అనుకుందాం. దళిత బాలిక అని కూడా పక్కనపెడదాం. కానీ దాడికి గురయింది ఒక పేద బాలిక అన్న స్పృహ కూడా, తెలుగు మీడియాకు లేకపోవడమే దారుణం. ఇక హిందుత్వానికి తామే పరిరక్షకులమని, జబ్బలు చరచుకునే బీజేపీ వస్తాదులు కూడా, రాత్రి వరకూ ఈ ఘటనపై పెదవి విప్పిన పాపాన పోలేదు. అంటే ఇది ఒక మతానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి గాలికొదిలేశారా? లేక కొత్త సారథుల ఏలుబడిలో వికసిస్తున్న సర్కారీ స్నేహం ఎక్కడ చెడిపోతుందోనన్న మొహమాటమా? అయినా.. లోకపరిరక్షకుడయిన,  విశాఖ స్వామి స్వరూపానందుల వారు నడయాడే విశాఖ నగరంలో, ఇలాంటి దారుణం జరగడం మహా ఘోరం! -మార్తి సుబ్రహ్మణ్యం

దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ టీఆర్ఎస్ నాయకుడు..

దుబ్బాక ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థిని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. రెండు రోజుల క్రితం టీఆర్ఎస్ ‌ను వదిలిపెట్టి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరుకు శ్రీనివాస్‌రెడ్డిని తమ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది.   శ్రీనివాస్‌రెడ్డి మంగళవారమే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దుబ్బాక లో టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా సోలిపేట సుజాతను ఎన్నికల బరిలోకి దింపుతుండగా, బీజేపీ రఘునందనరావు పేరును ప్రకటించింది. అయితే, టీఆర్ఎస్ నుండి దుబ్బాక టికెట్‌ను ఆశించి భంగపడిన శ్రీనివాస్‌రెడ్డి ఆ పార్టీ వదిలి కాంగ్రెస్‌లో చేరగా, వెంటనే ఆయనకు కాంగ్ర్రెస్ టికెట్ ఖరారు కావడం విశేషం. దీంట్లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

ఎవరు ఎవరి సంక నాకుతున్నారో చూస్తూనే ఉన్నాం.. రఘురామ రాజు ఫైర్

గత మూడు రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు సొంత పార్టీ పై మరో సారి రెచ్చిపోయారు. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు ముందు నుండి సైలెంట్ అయిన రఘురామ రాజు తాజాగా సొంత పార్టీ నేతల పై దారుణమైన సెటైర్లు వేశారు. ఢిల్లీలోని తన నివాసంలో రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. "బీజేపీలో తన చేరికపై వైసీపీ నేతలు కొందరు పేలుతున్నారని... అయితే ఎవరు ఎవరి సంక నాకుతున్నారో నిన్న మొన్న మీడియాలో చూశామని" తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తాము మంత్రులం అయిపోయామని... వైసీపీ నేతలు బుస్సు కబుర్లు చెబుతున్నారని, నవంబరులో కేంద్రమంత్రి వర్గ విస్తరణ జరిగే వరకు వీళ్లు ఇలాగే చెప్పుకుంటారని" అయన అన్నారు. అయితే వీళ్లు చెప్పేవి అన్నీ అబద్ధాలేనని వచ్చే నెలలో తేలిపోతుందని అయన ఎద్దేవా చేశారు.   "ఇప్పటికే తమకు ఎవరితోనూ జట్టుకట్టే ఉద్దేశం లేదని బీజేపీ స్పష్టంగా చెప్పింది .. కానీ వైసీపీ మాత్రం సొంత ప్రచారం చేసుకుంటోంది. వీళ్లను కేబినెట్‌లోకి రావాలని బతిమాలుతున్నట్టు... అయితే వీళ్ళు మాత్రం ప్రత్యేక హోదా కోసం పట్టుబడుతున్నట్లు కట్టుకథలు అల్లుతున్నారు. ప్రత్యేక హోదాపై జగన్‌కు అంత ప్రేమ ఉందా? ప్రత్యేక హోదా కావాలంటే కేబినెట్‌ నుంచి బయటకు రావాలని... అప్పట్లో టీడీపీని డిమాండ్‌ చేశారు కదా? హోదాపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ ఎంపీలంతా రాజీనామా చేయాలి. వైసిపి ఎంపీలు కనుక ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేస్తే... నేను కూడా వైసీపీకి సహకరించేందుకు సిద్ధం’’ అని అయన అన్నారు.   అయినా దేవాలయాలు నిర్మించే పార్టీ అయిన బీజేపీ... ఆలయాలు కూల్చే వైసీపీతో కలుస్తుందా? అని అయన ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసే వ్యక్తులపై చర్యలు తీసుకోలేని జగన్... ఇప్పుడు బీజేపీతో కలవాలనుకుంటున్నారా? అని అయన నిలదీశారు. సీఎం జగన్‌ చెబుతున్నట్టు 20 ఏళ్లు అధికారంలో ఉండాలంటే... అయన నిర్మాణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలని రఘురామరాజు అన్నారు.

ఆన్ లైన్ వెనక గ్రేటర్ ప్లాన్! విపక్ష నేతలే టార్గెటా? అమ్మ కేసీఆర్..

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ సాగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో జనాల ఆస్తుల లెక్క తేల్చే పనిలో పడ్డారు అధికారులు. అయితే సరైన మార్గదర్శకాలు లేకుండా హడావుడిగా సర్కార్ ఆదేశాలివ్వడంతో.. ఫీల్డ్ లో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తుల కొలతలపై ప్రభుత్వం దగ్గరే క్లారిటీ లేకపోవడంతో.. ఏం చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. గందరగోళంగా, అయోమయంగా ఉన్న ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారన్న చర్చ జనాల్లో జరుగుతోంది. కొన్నేండ్లుగా కొత్త రెవిన్యూ చట్టం తెస్తామని మాత్రమే ముఖ్యమంత్రి చెబుతూ వచ్చారు. కొత్త రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పాస్ కూడా చేయించుకున్నారు. తర్వాత సడెన్ గా ఎవరూ ఊహించని రీతిలో ఆస్తుల ఆన్లై న్ చేపట్టాలని నిర్ణయించారు. అంతే హడావుడిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతో క్లిష్టమైన ఆస్తుల ఆన్ లైన్ పై కేసీఆర్ కు ఎందుకంత తొందర అన్న విమర్శలు వస్తున్నాయి.                      ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ వెనక కేసీఆర్ పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలే టార్గెట్ గా ఆయన ఈ ప్రక్రియను చేపట్టారని సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు గడువుకన్నా ముందే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ ఎన్నికల కసరత్తును కూడా ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం. అధికార పార్టీకి మరింత ప్రాధాన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో కోటి జనాభా, దాదాపు 70 లక్షల మంది ఓటర్లున్నారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో నాలుగో వంతు మంది ఇక్కడే ఉన్నారు. రాష్ట్రంలోని 25 శాతం మంది ప్రజల తీర్పు గ్రేటర్ లో రాబోతోంది. గ్రేటర్ లో వ్యతిరేక ఫలితాలు వస్తే.. అధికార పార్టీపై రాష్ట్రంలోని మెజార్టీ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లే. అది తర్వాత ఆ పార్టీకి గండంగా మారుతుంది. అందుకే  బల్దియా ఎన్నికలను సవాల్ తీసుకున్న కేసీఆర్.. ఎలాగైనా మరోసారి పాగా వేసేలా పావులు కదుపుతున్నారు.  గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే విపక్ష నేతలను టార్గెట్ చేయడమే లక్ష్యంగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెరపైకి తెచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.   గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేస్తే కోట్ల రూపాయల్లోనే ఖర్చు చేాయాల్సి వస్తోంది. పది నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు కూడా కొందరు వెనుకాడరు. గ్రేటర్ లో పోటీ చేయాలనుకునే అశావాహులు.. ఖర్చు కోసం తమ ఆస్తులను అమ్ముతుంటారు. ప్రతి ఎన్నికల ముందు ఇదే జరుగుతుంది. ఈ విషయం తెలిసిన కేసీఆర్.. తెలివిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను తెచ్చారని చెబుతున్నారు. అందరి ఆస్తులు ఆన్ లైన్ చేస్తారు కాబట్టి... ఎవరూ తమ ఆస్తులు అమ్మినా ఇట్టే సర్కార్ కు తెలిసిపోతుంది. దీంతో విపక్ష నేతలెవరు ఆస్తులు అమ్ముతున్నారో తెలుసు కోవచ్చు. తర్వాత వారికి చెక్ పెట్టవచ్చు. తమ దారికి తెచ్చుకోవచ్చు. వినకపోతే అక్రమాస్తులు ఉన్నాయంటూ వేధించవచ్చు. మొత్తంగా తమకు పోటీగా ఉంటారని భావించే నేతలకు ఇలా చెక్ పెట్టవచ్చని కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికలకు ముందు హఠాత్తుగా ఈ ప్రక్రియను తెరపైకి తీసుకువచ్చారని విపక్ష పార్టీల నేతలు కూడా ఆరోపిస్తున్నారు.    రెవిన్యూ సంస్కరణలు,  కొత్త రెవిన్యూ చట్టం, ఆస్తుల ఆన్ లైన్ విధానాలపై సీఎం కేసీఆర్  ఏకపక్షంగా వెళుతున్నారనే చర్చ ఐఏఎస్ ల్లో  జరుగుతుందని చెబుతున్నారు. వీటిపై ఉన్నతాధికారులతోన సీఎం సమగ్రంగా  చర్చిచంలేదని, తన ఆలోచనల ప్రకారమే ఆయన ముందుకు పోతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ చేపట్టబోయే పథకాల గురించి విన్న కొందరు అధికారులు.. సరైన మార్గదర్శకాలు లేకుండా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే చాలా సమస్యలు వస్తాయని సీఎంకు చెప్పాలని చూసినా ఆయన స్పందించలేదట.  అందుకే కొందరు సీనియర్ అధికారులు ముందే జాగ్రత పడి బదిలీపై వేరే శాఖలకు వెళ్లినట్లు చెబుతున్నారు. సిన్సియర్ అధికారిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ చిరంజీవులు కూడా కేసీఆర్ చేస్తున్న పనులు నచ్చకే వేరే శాఖకు వెళ్లారనే చర్చ తెలంగాణ సచివాలయంలో ఉంది. హడావుడిగా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియ చేపడితే  సమస్యలు వస్తాయని సహచర అధికారులతో చిరంజీవులు చెప్పినట్లు చెబుతున్నారు.    గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా ఆస్తుల ఆన్ లైన్ ప్రక్రియను కేసీఆర్ చేపట్టారనే ఆరోపణలు అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. విపక్ష నేతలను ఇబ్బంది పెట్టేందుకు అస్తవ్యస్థ విధానాలు చేపట్టడమేంటనే ప్రశ్న ప్రజా సంఘాల నుంచి వస్తోంది. ప్రజలకు ఆస్తులంటే సెంటిమెంట్. అలాంటి సున్నితమైన విషయంలో హడావుడిగా ముందుకు పోతే మొదటికే మోసం వస్తుందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోతోంది.. కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ టూర్!

ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్డీయేలో చేరే అంశంపై ప్రధాని మోడీతో జగన్ చర్చించారని ప్రచారం జరిగింది. అయితే బీజేపీ నేతలు ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే, విపక్ష నేతలు మాత్రం కేసుల మాఫీ కోసమే జగన్ ఢిల్లీ వెళ్ళారని ఆరోపిస్తున్నారు.   జగన్ ఢిల్లీ పర్యటనపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఘాటుగా స్పందించారు. మీరు ప్రధానితో మాట్లాడింది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అయితే ఎందుకు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. ప్రధానితో 40 నిమిషాల పాటు ఈ విషయం మాట్లాడాను, హోదా ఇవ్వాల్సిందే అని నిలదీశామన్న మాట మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అని నిలదీశారు. పార్లమెంట్‌లో నాలుగో అతిపెద్ద పార్టీగా ఉండి.. ప్రత్యేక హోదాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. హోదా అంటేనే వైసీపీ భయపడి పారిపోయే పరిస్థితి కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. హోదా కోసం పార్లమెంట్‌ ఆవరణలో వైసీపీ ఎంపీలు ఎందుకు పోరాడలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పార్లమెంట్‌లో పోరాడితే మేం మద్దతిస్తాం అని రామ్మోహన్‌ నాయుడు అన్నారు.   ఢిల్లీలో జగన్‌ రాష్ట్ర ప్రయోజనాల గురించి చర్చించలేదని అన్నారు. జగన్ ను రాష్ట్ర ప్రజల తరఫున సూటిగా ప్రశ్నిస్తున్నామని.. ముఖ్యమంత్రిగా మీరు గెలిచింది మీ కేసులు మాఫీ చేయించుకోవడానికా? లేక రాష్ట్ర ప్రయోజనాలపై పోరాటం చేయడానికా? అని నిలదీశారు. "మీపై 11 సీబీఐ కేసులు సహా 31 కేసులు ఉన్నట్టు మీరే అఫిడవిట్ లో రాసుకున్నారు. మరి మీరు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వకుండా ఉంటే అనుమానం రాదా? మీరు వివరణ ఇవ్వకపోతే కేసుల మాఫీ కోసమే వెళ్లారని భావించాల్సి ఉంటుంది. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే మీరు కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేయడం సరికాదు" అంటూ రామ్మోహన్ నాయుడు ఘాటుగా వ్యాఖ్యానించారు.