వందనాలు సరే వేతనమేది! గ్రామ స్వరాజ్యమంటే ఇదేనా?
posted on Oct 8, 2020 @ 6:09PM
వాలంటీర్లకు వందనాలన్నారు. అద్భుత సేవలు చేస్తున్నారంటూ స్టేట్ మెంట్లు ఇచ్చారు. సచివాలయ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడి కొనియాడారని గొప్పలు చెప్పారు. వారికి మద్దతుగా చప్పట్లు కొడుతూ అధికార పార్టీ నేతలు షో చేశారు. సీఎం జగన్ కూడా ఇంటి బయటికి వచ్చి చప్పట్లు కొట్టారు. మహాత్మగాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం ఆంధ్రప్రదేశ్‌లో సాకారమైందని గొప్పగా చెప్పారు. వాలంటీర్లు కాదు వారియర్స్ అని కీర్తించారు. అయితే సీఎం జగన్ చెబుతున్న వారియర్స్.. ఇప్పుడు వైసీపీ పాలనను ఛీదరించుకుంటున్నారు. తమకు వేతనాలు ఇవ్వాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. ఏడాదిగా తమతో వెట్టి చాకిరి చేయిస్తున్నారంటూ ఫైరవుతున్నారు. 11 నెలలుగా జీతాలు ఇవ్వని జగన్ ప్రభుత్వాన్ని నడి రోడ్డుపై నిల్చుని నిలదీస్తున్నారు గ్రామ, వార్డు వాలంటీర్లు.
వైసీపీ నేతలు గొప్పగా చెబుతున్న సచివాలయ వ్యవస్థ మరో కోణంలో అధ్వాన్నంగా ఉంది. సచివాలయ వ్యవస్థను ప్రారంభించి రెండు లక్షలకు పైగా వాలంటీర్లను నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఏడాదిగా వారి సేవలు ఉపయోగించుకుంటూ.. వారికి వేతనాలు మాత్రం ఇవ్వలేదు. తూర్పు గోదావరి జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లకు ఒక్క నెల వేతనం మాత్రమే ఇచ్చిందని తెలుస్తోంది. వేతనాల కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదట. అందుకే చేసేది లేక వారంతా రోడ్డెక్కారు. జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన 96 మంది వాలంటీర్లు ఆందోళనకు దిగారు. 11 నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ ధర్నా చేశారు. వెంటనే తమ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లానే కాదు రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది. వేతనాల రాక వాలంటీర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. కొన్ని జిల్లాలో ఆరు నెలలు, కొన్ని జిల్లాల్లో 11 నెలల వేతనాలు పెండింగులో ఉన్నాయంటున్నారు. కరోనా టైమ్ లో ప్రమాదకర పరిస్థితుల్లో పనులు చేయించుకుని కూడా వేతనాలు ఇవ్వలేదని వాలంటీర్లు వాపోతున్నారు. సచివాలయ వ్యవస్థ గురించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్న జగన్ సర్కార్.. వారికి వేతనాలు ఇవ్వకపోవడం విస్మయపరుస్తోంది. జగన్ చెబుతున్న గ్రామ స్వరాజ్యం అంటే ఇదేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గ్రామ స్వరాజ్యం పేరుతో ఏడాది క్రితం సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది జగన్ సర్కార్. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల 61 వేల మంది వలంటీర్లను నియమించింది. గ్రామ వాలంటీర్ గౌరవ వేతనాన్నిఐదు వేల రూపాయలుగా ప్రకటించింది. విడతల వారీగా వేతనాలు పెంచుతామని చెప్పారు జగన్. అయితే వేతనం పెంచడం కాదు.... ఇస్తామన్నది ఇవ్వడమే మానేసింది వైసీపీ ప్రభుత్వం. వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు కష్టాలు పడుతున్నారు. తమ బాధలు, సమస్యలు ఎవరితో చెప్పుకోవాలే తెలియక.. ఏం చేయాలో అర్ధంకాక లోలోపలే కుమిలిపోతున్నారు. కొందరు మాత్రం ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. వాలంటీర్లతో పనులు చేయించుకుని జీతాలు ఇవ్వకుండా వేధించడంపై అన్ని వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
కొన్ని గ్రామాల్లో వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. ప్రభుత్వ పథకాలు రావాలంటే తమకు లంచం ఇవ్వాల్సిందేనని బెదిరిస్తున్నారని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయి. రేషన్ కార్డు మంజూరుకు లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కొందరు వాలంటీర్లు ఫింఛనుదార్లను మోసగించి వసూళ్ళకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా పాయకరావు పేటలో పెన్షన్ ఆపేస్తానని బెదిరింది ఓ వాలంటీర్... 70 మంది ఫింఛన్ దారుల నుండి దాదాపు 2 లక్షల రూపాయలు వసూల్ చేసిన వ్యవహారం కలకలం రేపింది. ప్రజల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు తేలడంతో కొందరు వాలంటీర్లను అధికారులు సస్పెండ్ చేశారు. అయితే ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం వల్లే వాలంటీర్లు వక్రమార్గం పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నెలల నుండి వేతనాలు రాకపోవడంతో వాలంటీర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలనే డిమాండ్లు జనాల నుంచి వస్తున్నాయి.
గ్రామ స్వరాజ్యం, గాంధీ కలల పథకం అంటూ గొప్పలు చెప్పడం కాదు.. వ్యవస్థను సక్రమంగా నడిపించాలనే అభిప్రాయం జనాల నుంచి వ్యక్తమవుతోంది. వాలంటీర్ సిస్టమ్ గురించి గొప్పగా చెప్పుకుంటూన్న జగన్ ప్రభుత్వం.. వారికి వేతనాలు ఇందుకు ఇవ్వలేదో చెప్పాలంటున్నారు. చప్పట్లు కొట్టి షో చేయడం కాదు.. వారి సమస్యలు పరిష్కరించాలని సూచిస్తున్నారు. వైసీపీ నేతల ప్రచారం చూసి సచివాలయ వ్యవస్థ గొప్పగా ఉందని భావిస్తున్న వారికి .. వాలంటీర్లకు వేతనాలు కూడా ఇవ్వడం లేదని తెలిస్తే రాష్ట్రం పరువు పోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.