తిరుపతి ఎమ్మెల్యే భూమనకు రెండోసారి కరోనా పాజిటివ్..
posted on Oct 8, 2020 @ 11:21AM
కరోనా మహమ్మారి గురించి ప్రజలలో ఇంకా పూర్తి అవగాహన లేని ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకి తగ్గిన కొంతమందికి మళ్ళీ రెండోసారి సోకుతున్న వార్తలు వింటున్నాం. కొన్ని రోజుల క్రితం తెలంగాణ లోని కొంత మంది వైద్య సిబందికి రెండో సారి కరోనా సోకినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా నుంచి కోలుకున్న వారు తర్వాత సరైన జాగ్రతలు తీసుకోకుంటే మరోసారి వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. తాజాగా వైసిపి నేత, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. మొదటిగా ఆగస్టులో ఒకసారి కరోనా బారినపడిన ఆయన రుయా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న తరువాత కోలుకున్నారు. అయితే నెలన్నర రోజుల తర్వాత ఆయనకు మళ్లీ కరోనా పాజిటివ్ అని తేలింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబులో నిన్న నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తాజాగా నిర్ధారణ అయింది. దీంతో నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, ఫలితాన్ని బట్టి తదుపరి వైద్య సేవలు పొందుతానని ఎమ్మెల్యే తెలిపారు.
ఇది ఇలా ఉండగా ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కరణం బలరాం, బియ్యపు మధుసుధన్ రెడ్డి, ముస్తఫా, అన్నాబత్తుల శివకుమార్, కిలారి రోశయ్య, హఫీజ్ ఖాన్, గంగుల బిజేంద్ర రెడ్డి, అన్నా రాంబాబు, డాక్టర్ సుధాకర్, గొల్ల బాబూరావు కరోనా బారినపడ్డారు. అయితే కరోనాతో వైసీపీ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ మరణించారు. అలాగే సెప్టెంబరు 16న తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ కూడా కరోనాతో కన్నుమూశారు.