మూడు రాజధానుల నిర్ణయం.. ఆర్ధిక నష్టం అంశాలపై హైకోర్టు నోటీసులు
posted on Oct 8, 2020 @ 2:10PM
ఏపీలో సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల వ్యవహారం పై హైకోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలయ్యింది. ఇప్పటి వరకు అమరావతికి ఎంత ఖర్చు చేశారన్న అంశంపై రాజధాని రైతులు వేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తాజాగా ప్రభుత్వానికి నోటీసులిచ్చింది. రాజధానికి సంబంధించిన వ్యాజ్యంలో రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌ను ప్రతివాదిగా చేర్చాలని కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్‌ను హైకోర్టు ఈరోజు అనుమతించింది. దీనిపై డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్స్, స్టాటిస్టిక్స్‌కు నోటీసులు జారీచేసింది. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ఇప్పటివరకు ఏమయినా ఆర్థిక నష్టం జరిగిందా... జరిగితే ఎంత జరిగిందన్న వివరాలు ఇవ్వాలని న్యాయస్థానం కోరింది. రాజధాని రైతులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ మేరకు హైకోర్టు ఈ నోటీసులిచ్చింది.
రాజధానితో ముడిపడి ఉన్న ప్రధాన వ్యాజ్యాల్లోని అనుబంధ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే. మహేశ్వరి, జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం అంశాల వారీగా విచారణ కొనసాగించింది. మరికొన్ని వ్యాజ్యాలను సోమవారానికి వాయిదా వేసింది. వీటితో పాటు సీఎం క్యాంప్ కార్యాలయం తరలింపు సహా పలు ఇతర అంశాలపై ఈరోజు (గురువారం) విచారణ జరపాల్సి ఉండగా... వాటిని కూడా సోమవారమే విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లులపై జనవరిలో శాసన మండలిలో జరిగిన చర్చలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలను సీడీలు, సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది.