అది ‘కమ్మ’రావతి కాదు.. అమరావతే!

300 రోజుల ఉద్యమంలో మెరుపులు- మరకలు   కమలం కప్పగంతులకు తెరపడేదెన్నడు?   రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఏపీలో... రాజధాని నగరంగా అమరావతి నగరాన్ని ఎంపిక చేశారు. దాని శంకుస్థాపన కార్యక్రమానికి దేశ ప్రధాని, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులతోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అంటే ఇంతమంది వచ్చినందున, బుద్ధి-బుర్ర ఉన్న ఎవరయినా రాజధాని నగరం అక్కడే ఉంటుందనుకోవడం సహజం. అంతకుముందు విపక్షనేతగా ఉన్న జగన్ కూడా, అమరావతిలోనే రాజధానిని స్వాగతిస్తున్నామని నిండు సభలో స్పష్టం చేశారు. ఆ తర్వాత కొత్త నగర నిర్మాణానికి కేంద్రం కూడా నిధులిచ్చింది. ఆ పరిసర ప్రాంతాల్లో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ భ వనాలు, ప్రైవేటు యూనివర్శిటీలకూ స్థలం కూడా మంజూరు చేశారు. అందులో కొన్ని ప్రైవేటు యూనివర్శిటీలూ వచ్చాయి. హైకోర్టు, సచివాలయం-అసెంబ్లీ- ఉద్యోగుల క్వార్టర్లు కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. ఇన్ని వేల ఎకరాలన్నీ ప్రభుత్వం భూసేకరణలో కొనుగోలు చేసినవి కాదు. రైతుల నుంచి సేకరించినవి. దానికోసం వారికి కొన్ని రాయితీలు ఇచ్చింది. ప్రతి ఏటా కౌలుకు నిధులు కూడా కేటాయించింది. ఇదీ స్ధూలంగా అమరావతి నగర నిర్మాణ కథ!   అమరావతిలో రాజధానిని స్వాగతించిన వైసీపీ- దాని అధికార మీడియా, మరోవైపు అందులోని అక్రమాలను ప్రస్తావించింది. అందులో తప్పులేదు. అది రాజకీయపార్టీగా దాని హక్కు. మంత్రులు-టీడీపీ ఎమ్మెల్యేలు-వారి బంధువులు బినామీల పేరుతో, రైతుల నుంచి తక్కువ ధరకు వందల ఎకరాలు కొనుగోలు చేశారని వైసీపీ-దాని మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. రాజధాని ఎక్కడో ముందే తెలుసుకుని, బినామీలతో భూములు కొనుగోలు చేయించిందని ఆరోపించింది.  సాక్షిలో అయితే సర్వే నెంబర్లు సహా ప్రచురించింది. వాటిపై ఇప్పుడు విచారణ జరుగుతోంది.   నిజంగా బినామీల పేర్లతో, భూమలు కొనుగోలు చేసి ఉంటే వారు శిక్షార్హులే. ఆ అక్రమార్కుల సంగతి తేల్చాల్సిందే.  అయితే ప్రభుత్వ సంస్థలకు ఎక్కువ రేట్లకు అమ్మిన అవే భూములు, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం కారుచౌకగా ఇచ్చారని, అందులో కమ్మ వర్గానికి చెందినవే ఎక్కువ ఉన్నాయన్న వైసీపీ ఆరోపణలను మాత్రం,  టీడీపీ ఖండించలేకపోయింది. న్యాయమూర్తులకు తక్కువ ధరకు ఇచ్చారన్న, వైసీపీ ఆరోపణల్లో పెద్దగా పస కనిపించలేదు. ఎందుకంటే జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ సహా ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌లకూ ప్రభుత్వం భూమి కేటాయించింది.   సరే.. అక్కడ ఇంత జరిగిన తర్వాత రాజధాని అమరావతి బదులు, విశాఖలో ఉండాలన్న జగన్ ప్రభుత్వ ప్రయత్నాలపై, అమరావతి రైతులు 300 రోజుల నుంచి వివిధ రూపాల్లో శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అయినా ప్రభుత్వంలో చలనం లేదు. అక్కడి రైతులను మంత్రులు బూతులు తిడుతున్నా, పెయిడ్ ఆర్టిస్టులని దూషిస్తున్నా రైతులు సహనం పాటిస్తున్నారు. బీజేపీ కూడా రైతుల ఆందోళనలో పాల్గొంది. రాజధాని అమరావతిలోనే ఉండాలని ఆ పార్టీ తీర్మానం కూడా చేసింది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తర్వాతనే ఆ పార్టీ పిల్లిమొగ్గలు వేస్తోంది. జీవీఎల్ అయితే, అమరావతిపై నిర్ణయం కేంద్ర పరిథిలో లేదని చాలాసార్లు చెప్పగా.. కన్నా-పురందీశ్వరి లాంటి నేతలు మాత్రం పార్టీ వైఖరికే కట్టుబడ్డామని చెప్పారు. ఇప్పుడు అమరావతి రైతుల ఆందోళనలో కమలదళాలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఆ పార్టీ, మొహమాం ముసుగు ఎప్పుడు తీస్తుందన్నది వేరే కథ.   ఇక ఇప్పుడు అమరావతి చుట్టూ అల్లుకున్న కులం కథలోకి వెళ్దాం. సంఖ్యాబలం తక్కువయినప్పటికీ, అమరావతి పరిసర ప్రాంతాల్లో కమ్మవారి పట్టు-ప్రభావం ఎక్కువ కాబట్టి, టీడీపీ రాజధానిని అక్కడే ఎంచుకున్నది వైసీపీ-దాని సోషల్ మీడియా దళాల అసలు అనుమానం. ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం కూడా కమ్మ వర్గం నడిపిస్తుందే తప్ప, అందులో మిగిలిన వారెవరూ లేరన్నది మరో ప్రచారం. తెరపైకి వస్తున్న నాయకులంతా ఆ వర్గానికి చెందిన వారే కాబట్టి, అలాంటి ప్రచారం జరగడం సహజం. కానీ, రాజధాని కోసం భూములిచ్చిన వారిలో కమ్మ వారి శాతం తక్కువ కాగా, కమ్మేతరులు ఇచ్చిన భూములే ఎక్కువ న్న వాస్తవం, బయట ప్రపంచానికి తెలిసింది బహు తక్కువ.   ఇప్పుడు రాజధాని నగరం.. అక్కడ ఉండదంటున్న ప్రభుత్వం ముందు, రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం లేదు. మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం ఇచ్చిన రైతులకు, ప్రభుత్వం ఆర్ధికంగా బాగానే లబ్థి చేకూర్చింది. నిజానికి కర్నూలు రాజధాని నగరంగా ఏర్పడినప్పుడు గానీ, శ్రీశైలం వంటి భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందు గానీ, అంత భారీ ప్యాకేజీ ఇచ్చిన చరిత్ర లేదు. ఆ విషయంలో అమరావతి రైతులు వందరెట్ల మేళ్లు పొందారు. అందుకే ... రైతులు భూములు ఉచితంగా ఏమైనా ఇచ్చారా? భారీ ప్యాకేజీ, కమర్షియల్ ప్లాట్లు, కౌలు తీసుకుంటున్నారు కదా? ఇన్ని తీసుకుని ఏదో త్యాగం చేశామని ఆందోళనలు ఎందుకు చేస్తున్నారన్న ప్రశ్నలను,  వైసీపీ వర్గాలు విస్తృతం చేస్తున్నాయి. అందులో నిజం లేకపోలేదు.   కానీ, రాజధానిగా ప్రకటించకముందే అక్కడ భూములకు మంచి గిరాకీ ఉంది. పైగా రాజధానికి భూములిచ్చిన తర్వాత, ప్రభుత్వం వాటిని చదును చేసింది. ఇప్పుడు ఏ భూమి ఎవరిదో తేల్చుకోవడం అసంభవం. ఇప్పుడు అక్కడ రాజధాని నగరం లేదంటే, భూములిచ్చిన రైతుల జీవనాధారం ఏమిటన్నది ప్రశ్న. ఏదేమైనా.. ఏ కులానికి చెందిన రైతులయినా, భూములిచ్చింది చంద్రబాబునాయుడుకో, లోకేష్‌కో, హెరిటేజ్‌కో కాదు. ప్రభుత్వానికి!  ఒప్పందం జరిగింది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి-రైతులకే తప్ప.. పార్టీలకూ రైతుల మధ్య కాదన్నది, మనం మనుషులం అన్నంత నిజం. పాలకుల ఆలోచనా విధానం-నిర్ణయాలు కూడా ఆ కోణంలేనే ఉండాలి.   ఆ కోణం లేకపోగా, కులం కోణాన్ని తెరపైకి తీసుకురావడమే వివాదానికి కారణం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన అమరావతిని.. ‘కమ్మరావతి’గా ప్రచారం చేయడం ప్రారంభించారు. ఈ  మైండ్‌గేమ్ ఎన్నికల ముందు, ఆ తర్వాత చాలాకాలం పనిచేసింది. భూములన్నీ కమ్మవారికి దోచిపెట్టడానికే.. అక్కడ రాజధానిని తీసుకువచ్చారన్న ప్రచారాన్ని గురజాల నుంచి ఇచ్చాపురం వరకూ.. అనంతపురం నుంచీ నెల్లూరు వరకూ తీసుకువెళ్లడంలో, వైసీపీ వ్యూహబృందం విజయం సాధించింది. దానిని తిప్పికొట్టడంలో టీడీపీ వైఫల్యం చెందింది. వైసీపీ ఆరోపణలకు తగ్గట్లుగానే టీడీపీ సర్కారు కూడా, తన కులానికి చెందిన వారికే అన్ని రంగాల్లో పట్టం కట్టింది. ఫలితంగా వైసీపీ వ్యూహబృందం ఆరోపణలను, ఇతర ప్రాంతాలకు ప్రజలు సులభంగా నమ్మేశారు. మిగిలిన కులాలలో కమ్మ వ్యతిరేక భావన నాటేందుకు వైసీపీ వ్యూహబృందం ఆ రకంగా విజయం సాధించింది.   నిజానికి అమరావతి రాజధాని కోసం భూములిచ్చినవారిలో కమ్మేతరులే ఎక్కువ. ఇటీవల దీనిపై దళిత సంఘాలు, ఆ వివరాలను కోర్టుకూ సమర్పించాయి. అమరావతిలో రాజధానికి భూములిచ్చిన వారిలో.. దళితులు-గిరిజనులు  32 శాతం మంది ఉన్నారు. ఇక తర్వాత స్థానం రెడ్లది.  రాజధాని కోసం రెడ్లు ఇచ్చిన భూములు 23  శాతం. కమ్మ వారిది ఆ తర్వాత స్థానం. వారు ఇచ్చిన భూములు 18 శాతం. బీసీలు 14, కాపులు 9, మైనారిటీలు 3, ఇతరుల ఒక్క శాతం భూమి ప్రభుత్వానికి ఇచ్చారు. అంటే ఎక్కువ భూములిచ్చి నష్టపోయింది.. దళిత-గిరిజనులేనన్నది సుస్పష్టం పైగా 95 శాతం చిన్న కారు రైతులే, సర్కారుకు భూములిచ్చారన్నది మరో నిజం. కేవలం ఒక్క ఎకరం ఉన్న  20,490 మంది రైతులు, 10,035 ఎకరాల భూమిని సర్కారుకు ఇచ్చారు. 20-25 ఎకరాలున్న 12 మంది రైతులు, 269 ఎకరాలిచ్చారు. ఇక 25 ఎకరాలకు పైనున్న ఐదుగురు రైతులు మాత్రమే, 151 ఎకరాలు ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. దీన్ని బట్టి చిన్నకారు, మధ్య తరహా రైతులే ఎక్కువ భూములివ్వగా, భూస్వాముల సంఖ్య కేవలం 17 మాత్రమేనని స్పష్టమవుతోంది.   అందులో కూడా ప్రచారంలో ఉన్న, కమ్మ వర్గం ఇచ్చిన భూములు కేవలం 18 శాతమే. దీన్నిబట్టి ఇప్పుడు జరుగుతున్నది ‘కమ్మ’రావతి ఉద్యమం కాదని, అమరావతి ఉద్యమమేనని.. మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అయితే, ఈ అంశంలో వస్తున్న ఆరోపణలను ఖండించి, వాస్తవాలు వెల్లడించడంలో కమ్మ వర్గంతోపాటు, ఆ కులానికి  ప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ కూడా  విఫలమయింది. ఎంతసేపూ ఒక నారాయణ, మరో పుల్లారావు, ఇంకో సుబ్బారావును కాపాడే ప్రయత్నమే చేసింది. ఫలితంగానే అది ‘కమ్మరావతి’ అన్న ప్రచారానికి అవకాశం ఇచ్చినట్టయింది. ప్రస్తుతం అమరావతి కథకు సంబంధించిన పరిణామాలన్నీ.. కేవలం చంద్రబాబునాయుడు లక్ష్యంగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తుండటం, అమరావతి అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా చేయడం వల్ల జగన్ సర్కారు.. అమరావతి కోసం ఏం చేసినా దాని వచ్చే కీర్తి అంతా బాబు ఖాతాకే వెళుతుందన్న రాజకీయ కోణంలో మౌనంగా ఉన్నట్లు అర్ధమవుతుంది. అంటే అమరావతి అంశానికి.. చంద్రబాబు కొంత మైనస్- మరికొంత ప్లస్‌గా మారారన్నది అర్ధమవుతూనే ఉంది.     ఇప్పుడు  రాజధాని కోసం భూములిచ్చిన వారిలో... కమ్మ రైతుల కంటే రెడ్లే ఎక్కువ ఉన్నందున, మరి దానిని రాజకీయ రొచ్చు భాషలో ‘రెడ్లావతి’ అని అనలేం. ఎందుకంటే వారికంటే, దళిత-గిరిజన రైతులు ఎక్కువ శాతం భూములిచ్చారు కాబట్టి! సరే.. భూములకు- కులాలకు సంబంధం లేదు కాబట్టి.. భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సింది పాలకులే కాబట్టి, ఈ చచ్చు పుచ్చు ఇచ్చకాలకు తెరదించి, పాలకులు వారికి న్యాయం చేసే పని మొదలుపెట్టడం మంచిది. -మార్తి సుబ్రహ్మణ్యం

పుస్తకాలు, బెల్ట్ పై పార్టీ రంగులు! గుండు పిన్నును వదలరా అంటూ సెటైర్లు

ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల కోసం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. సంక్షేమ పథకాలు అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేసేది అదే. అది వాళ్ల బాధ్యత కూడా. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం.. బాగా అతి చేస్తోంది. ప్రభుత్వంగా చేయాల్సిన చిన్న చిన్న పనులను కూడా గొప్పగా చెప్పుకుంటోంది. అంతటితో ఆగకుండా ప్రజా ధనం దుర్వినియోగం చేస్తూ ప్రచారం చేసుకుంటోంది. ప్రజలకు అందించే ప్రతి వస్తువుపైనా పేర్లు ముద్రించుకుంటూ చీఫ్ పబ్లిసిటీ చేసుకుంటుందనే ఆరోపణలు వస్తున్నాయి.      జగనన్న విద్యాకానుకతో దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. వందల కోట్ల రూపాయలతో జాతీయ మీడియా ఛానెళ్లలోనూ ప్రకటనలు ఇచ్చింది. అయితే జగనన్న విద్యాకానుకలో అందించిన వస్తువులపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులకు అందించిన వివిధ రకాల వస్తువులపై వైసీపీ జెండాను పోలిన రంగులను ముద్రించడంపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది.    విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌పై జగనన్న విద్యాకానుక అని ముద్రించారు. బెల్ట్ ను కూడా వదలకుండా పార్టీ జెండా రంగులు ముద్రించారు. పుస్తకాల్లోనూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ సిలబస్ పెట్టారు. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. జగన్ సర్కార్ తీరుపై సోషల్ మీడియాలో భారీగా విమర్శలు వస్తున్నాయి. గుండు పిన్నును కూడా వదలవా ముఖ్యమంత్రి జగన్ అంటూ కొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు   జగనన్న విద్యాకానుక పథకంపై టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గతంలో చంద్రన్న కానుక , చంద్రన్న తోఫా అంటూ తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు అమలు చేస్తే పేరు మార్చి జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. అయినా విద్యార్థులకిచ్చే పుస్తకాలు, బెల్టులపై పార్టీ జెండా రంగులు ముద్రించడమేంటని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. తమ హయాంలో చాలా పథకాలు అమలు చేశాం.. కాని ఏనాడు ఇలాంటి చిల్లర పనులు చేయలేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇలాగే ఆలోచిస్తే రాష్ట్రంతా ఎల్లో రంగులోనే కనిపించేదంటున్నారు టీడీపీ నేతలు. విద్యార్థులకు ఇచ్చిన వస్తువులపైనా పార్టీ జెండా రంగులు వేయడంపై ఇతర విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.    ఇటీవలే వైఎస్సార్ జలకళ పేరుతో కొత్త స్కీం తెచ్చారు. ఇందు కోసం బోరు బండ్లను కొనుగోలు చేశారు. ఆ లారీలకు కూడా వైఎస్సార్ పార్టీ జెండా పోలేలా కలర్స్ వేశారు. దానిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రంగుల విషయంలో గతంలో ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు చివాట్లు పెట్టింది. గ్రామ సచివాలయాలకు మొత్తం పార్టీ జెండా రంగులు వేశారు. ఇందు కోసం దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన న్యాయస్థానం.. ప్రభుత్వ తీరును ఎండగట్టింది. సచివాలయాలకు వెసిన రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. జగన్ సర్కార్ నిర్ణయం వల్ల రంగులు వేయడానికి ..మళ్లీ తొలగించడానికి.. తిరిగి కొత్త రంగులు వేయడానికి నాలుగు, ఐదు వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైందని చెబుతున్నారు.    ప్రభుత్వానికి పాలనపై దృష్టి ఉండాలి కాని రంగులపై ఏంటనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. అన్ని పథకాలకు ఇలా రంగులు వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మంచివైతే .. అవే ప్రజల్లోకి వెళతాయని.. వాటి కోసం ప్రత్యేకంగా ఇలా పార్టీ రంగులు వేసి ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.  

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో విచారణ   హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో వచ్చేనెల 9న విచారణ   వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణపై నిర్ణయం తీసుకోనున్న కోర్టు   హైదరాబాద్ లోని సీబీఐ, ఈడీ కోర్టుల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా, గత శుక్రవారం ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం నేటికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టులో విచారణ జరిగింది.   అలాగే, హైకోర్టులో స్టే ఉన్న మరికొన్ని కేసుల్లో విచారణను వచ్చేనెల 9న కోర్టు చేపట్టనుంది. ఈ కేసుల్లో విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని ఏపీ సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఇప్పటికే కోర్టును కోరారు. అయితే, దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

మంత్రి బొత్స కళ్ళు దొబ్బాయా అంటూ రాజధాని రైతుల తీవ్ర వ్యాఖ్యలు 

ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాజధానిని అమరావతి నుండి తరలించాలని నిర్ణయించి దానికి తగినట్లుగా అసెంబ్లీలో బిల్లును కూడా పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీలు నిరసనలు, ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ ఆందోళనలు ప్రారంభమై 300 రోజులు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ తీరుకి నిరసనగా రైతులు నల్ల బెలూన్లను గాలిలోకి‌ వదిలారు. ఈ సందర్భంగా రాజధాని రైతులకు మద్దతుగా కృష్ణాయపాలెంలో టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్, గల్లా జయదేవ్, తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు ఉద్యమానికి మద్దతుగా మాట్లాడారు.    ఈ సందర్భంగా రాజధాని రైతులు మాట్లాడుతూ.. అమరావతి ఉద్యమానికి పార్టీలకు అతీతంగా తమకు మద్దతు ఇస్తున్నందుకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే పార్టీ పేరులో సైతం రైతు అని పెట్టుకున్న వైఎస్సాఆర్ సిపి రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ముందుగా పార్టీ పేరులో ఉన్న రైతు అనే పదం పీకేయండని రైతులు ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతే కాకుండా అమరావతిలో పండుగ చేసుకుంటున్నారని బొత్స చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆయన కళ్లు ఏమైనా దొబ్బాయా అని ఆ రైతులు ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ‘‘మమ్మల్ని లకారాలతో మాట్లాడుతున్న వారు నోళ్లు అదుపులో పెట్టుకోవాలి. మేము కూడా మాట్లాడగలం.. కానీ మాకు మా పెద్దలు సంస్కారం నేర్పారు. రైతు అనే వాళ్లు లేకుంటే... మీకు భవిష్యత్తు లేదనేది గుర్తించండి. రైతులను కన్నీళ్లను పెట్టించిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. జగన్ మీ మోనార్క్ పాలన ఆపకపోతే.. బుద్ధి చెబుతాం. మేము పెయిడ్ ఆర్టిస్టులమా... లేక డబ్బులు తీసుకుని మాట్లాడే మీరా... పెయిడ్ ఆర్టిస్టులు? ఆనాడు వైసీపీకి మద్దతు ఇస్తే మహిళా రైతు అని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు జగన్ తప్పును ప్రశ్నిస్తే.. మేము పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నామా? సీఎం జగన్ మనసు మార్చుకో.. అమరావతినే రాజధానిగా కొనసాగించు’’ అని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.

అంధకారంలో ముంబై.. ఎక్కడికక్కడ స్తంభించిన జనజీవనం

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో కరెంటు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించింది. నగరానికి విద్యుత్ ను అందించే టాటా పవర్ యూనిట్ దెబ్బతినడంతో సమస్య మొదలైంది. దీంతో ఒక్కసారిగా మహా నగరంలో కరెంటు పోయింది. ఎక్కడికక్కడ ప్రజా రవాణా ఆగిపోయింది. రైళ్లు నడవట్లేదు. పనులన్నీ నిలిచిపోయాయి. రోడ్డు జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయక పోవడంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలబడిపోయింది. ముంబై నగరానికి టాటా పవర్ కంపెనీ లిమిటెడ్ లోని విద్యుత్ జనరేషన్ యూనిట్ నుంచి పవర్ సప్లై అవుతుంది. అయితే దాన్లో టెక్నికల్ సమస్యలు రావడంతో... ఒక్కసారిగా కరెంటు పోయింది. దీంతో సగానికి పైగా నగరం ఇప్పుడు కరెంటు లేక అల్లాడిపోతోంది. దీంతో ప్రజలు ఈ ఉదయం నుంచి తీవ్ర అవస్థలు పడుతున్నారు. సాంకేతిక సమస్య రావడంతో... పవర్ సప్లై జరిగే చాలా ఫీడర్లను కంపెనీ స్విచ్ఛ్ ఆఫ్ చేసింది. దాంతో... కరెంటు సరఫరా ఆగిపోయింది.   ఇదిలా ఉండగా ముంబైకి విద్యుత్ ను అందించే ప్రధాన సంస్థల్లో ఒకటైన టాటా పవర్ విఫలం కావడమే సమస్యకు కారణమని పశ్చిమ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద పవర్ ఫెయిల్యూర్ ఇదేనని, ఈ ఉదయం 10.05కు సమస్య మొదలైందని, మరికాసేపట్లో సమస్య పరిష్కారం కావచ్చని అధికారులు వెల్లడించారు.   ముంబై నగర ప్రజలకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని బెస్ట్ (బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్ పోర్ట్) ట్వీట్ చేసింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా ఈ సమస్య ఏర్పడిందని, సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో విభాగాలు ప్రయత్నిస్తున్నాయని వెల్లడించింది. సాధ్యమైనంత త్వరలోనే రైళ్లు తిరిగి నడుస్తాయని, ప్రజలు సమస్యను అర్థం చేసుకోవాలని సెంట్రల్ రైల్వేస్ ట్వీట్ చేసింది.   ఇదిలావుండగా, టాటా తరువాత ముంబైకి అత్యధిక విద్యుత్ ను సరఫరా చేస్తున్న అదానీ ఎలక్ట్రిసిటీ స్పందించింది. ప్రస్తుతం అత్యవసర విభాగాలకు కరెంటు సరఫరాను తాము పునరుద్ధరించామని, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరింది. కాగా, విద్యుత్ నిలిచిపోగానే, వేలాది మంది సామాజిక మాధ్యమాల్లో తమ కామెంట్లు పెట్టారు. ప్రభుత్వం విఫలమైందని, ఆర్థిక రాజధానిలో ఏం జరుగుతుందో తెలియడం లేదని, ఎవరి ఇంట్లోనైనా కరెంట్ ఉందా?అని ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.   టాటా పవర్ వద్ద సమస్య కారణంగా... నగర పశ్చిమ శివారు ప్రాంతాల్లో పవర్ సప్లై చేసే రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌కి కూడా సమస్యలు తలెత్తాయి. టాటా పవర్ వల్ల తమ ట్రాన్స్‌మిషన్ కారిడార్‌కి కూడా కరెంటు సప్లై సమస్యలు తలెత్తినట్లు రిలయన్స్ తెలిపింది. జరిగిన దానికి చింతిస్తున్నాం. పరిస్థితిని వీలైనంత త్వరగా చక్కదిద్దేందుకు టాటా పవర్ వారితో టచ్‌లో ఉంటున్నాం అని రిలయన్స్ ఇన్‌ప్రాస్ట్రక్చర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఘనవిజయం

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తరుఫున పోటీ చేసిన సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికలో ఒక అభ్యర్థి గెలవడానికి మేజిక్ ఫిగర్ 413 ఓట్లు కాగా, ఆమెకు అంతకు మించి ఓట్లు పోలవడంతో మొదటి రౌండ్ కౌంటింగ్‌లోనే కవిత విజయం పక్కా  అని తేలింది. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఈ ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. మొత్తం ఇక్కడ 824 మంది ఓటర్లు ఉండ‌గా, 823 మంది ప్ర‌జాప్ర‌తినిథులు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. పోలైన మొత్తం 823 ఓట్లలో టీఆర్ఎస్ అభ్యర్థి కవితకు ఏకంగా 728 ఓట్లు పోలయ్యాయి. మిగిలిన ఓట్లు కాంగ్రెస్, బీజేపీకి పోల్ అయ్యాయి. దీంతో మరికొద్ది సేపట్లో తన గెలుపుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని అధికారుల నుండి కవిత అందుకోనున్నారు.

కరోనా సోకిన వారికి ఆ లక్షణాలు ఉంటే లక్కీనే.. లేటెస్ట్ స్టడీ

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. సామాన్య ప్రజల నుండి సీఎం లు, పీఎం లు, దేశాధ్యక్షులు దీని బారిన పడుతున్నారు. అయితే ఈ వైరస్ బారిన పడిన వారు రెండు వారాల తరువాత కోలుకుంటుండగా మరి కొంత మంది ఈ వైరస్ ధాటికి తట్టుకోలేక కన్నుమూస్తున్నారు. ఎవరికైనా కరోనా వైరస్ సోకిందని గుర్తించడానికి జలుబు, దగ్గు, తలనొప్పితో పాటు వాసనలను గుర్తించలేకపోవడం, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయట పడతాయి. అయితే తాజాగా దీని పై ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారం.. మిగిలిన లక్షణాల సంగతి ఎలా ఉన్నా... వాసనలు గుర్తించలేకపోయే వారికి మాత్రం కరోనా పెద్దగా హాని చేయకుండానే తగ్గిపోతోందని తేలింది. అంతేకాకుండా ఈ వాసనలను గుర్తించలేకపోవడం అనే లక్షణం కరోనా వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత కనిపిస్తోంది. దీనిని వెంటనే గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకున్నవారికి ఎటువంటి హాని లేకుండా తేలికగానే తగ్గిపోతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు   కరోనా బారిన పడిన వారిలో.. ఎవరైతే వాసన కోల్పోతున్నారో వారు త్వరగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్నిఇరాన్‌లోని టెహ్రాన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ పరిశోధకులు, అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సంస్థలు చేసిన అధ్యయనాల్లో కూడా ఈ విషయమే తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (who) గుర్తించిన జామా జర్నల్‌... అక్టోబరు 8న రిలీజ్ చేసిన పరిశోధనా పత్రంలోకూడా ఈ విషయాన్ని చెప్పింది.

జడ్జి రమణపై…జగన్ ‘జంగ్’!

‘సుప్రీం’ సీజే కాకుండా అడ్డుపడటమే జగన్ ధ్యేయమా?   సర్కారు ‘అధికార సమరాని’కి అదే సంకేతమా?   బీజేపీ అనుమతితోనే జగన్ తెగిస్తున్నారా? ‘‘జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేందుకే, సీఎం జగన్ కోర్టులపై చాలకాలం నుంచి యుద్ధం ప్రకటించారు. చంద్రబాబు వల్ల న్యాయమూర్తి అయిన జస్టిస్ రమణ సీజే అయితే జగన్‌కు ఇబ్బందులు తప్పవు’’- ఇది నిన్నటి వరకూ రాజకీయ వర్గాలు, వివిధ పార్టీల కార్యకర్తలు, మీడియాను ఫాలో అయ్యే వర్గాలందరూ జనాంతికంగా చర్చించుకున్న మాట! కానీ దానిని ఇప్పుడు జగన్ నిజం చేశారు. ముసుగులో గుద్దులాటకు తెరదించారు. మొహమాటాలు పక్కనపెట్టి, మనసులో మాట బయటపెట్టారు. సుప్రీంకోర్టు జడ్జితో తాడోపేడో తేల్చుకునేందుకే జగన్ సిద్ధమవుతున్నారు. జగన్ అసలు లక్ష్యం అదే. ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి మీడియా ముందుకొచ్చి చదివిన ప్రకటన సంకేతం కూడా అదే.   జగన్ సామాన్యుడు కాదు. పులివెందుల పగ-ప్రతీకారం- పోరాటం-మొండితనానికి నిలువెత్తు నిదర్శనం. అవును.. ఏపీ సీఎం జగ న్మోహన్‌రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నూతలపాటి వెంకటరమణపై, నేరుగా యుద్ధం ప్రకటించారు. రాష్ట్ర హైకోర్టు శరపరంపరగా ఇస్తున్న ప్రభుత్వ వ్యతిరేక తీర్పుల వెనుక, జస్టిస్ రమణ ఉన్నారన్న విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లంరెడ్డి నోటి నుంచి చెప్పించారు. ‘అమరావతి భూ కుంభకోణం కేసులో ప్రభుత్వం ఇచ్చిన జీఓపై జస్టిస్ సోమయాజులు స్టే ఇచ్చారు. మాజీ అడ్వకేట్ జనరల్ కేసులో, హైకోర్టు ఏకంగా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ జోక్యం చేసుకుంటున్నారని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీజే బోబ్డేకి అక్టోబర్ 8న ఫిర్యాదు చేశాం’- ఇదీ సలహాదారు కల్లంరెడ్డి మీడియా ముందుకు వచ్చి, ప్రభుత్వం తరఫున చేసిన అధికారిక ఆరోపణ.   అంతేనా?.. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరిని, సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారన్న మరో బాంబు పేల్చారు. ‘ ‘జస్టిస్ రమణ జోక్యం తర్వాత, హైకోర్టులో పరిణమాలు మారిపోయాయి. చంద్రబాబు కోరుకున్నట్లుగా కీలకమైన కేసులు జస్టిస్ శేషసాయి, జస్టిస్ సత్యనారాయణ మూర్తి, జస్టిస్ సోమయాజులు, జస్టిస్ రమేష్, జస్టిస్ కె.లలిత బెంచ్‌కు మారిపోయాయ’ని ఆరోపించారు. ఈ వివరాలన్నీ ఆధారాలతో సహా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చామని కల్లం రెడ్డి వెల్లడించారు. ఎన్‌వి రమణను అడ్డుపెట్టుకుని, చంద్రబాబునాయుడు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారన్న మరో తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు.   ప్రభుత్వం తరఫున సలహాదారు చేసిన ఆరోపణలు చూస్తే.. జగన్మోహన్‌రెడ్డి నేరుగా జస్టిస్ ఎన్వీ రమణపై యుద్ధానికి తెరలేపినట్లేనన్నది విస్పష్టం. కల్లంరెడ్డి ఆరోపణలు పరిశీలిస్తే.. జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ రాకేష్‌కుమార్ వంటి వారిని మినహాయిస్తే.. రోజువారీ కేసులలో తీర్పులిస్తున్న, కీలకమైన న్యాయమూర్తులందరిపైనా ఫిర్యాదు చేసినట్లు స్పష్టమవుతూనే ఉంది. తమ సర్కారుకు వ్యతిరేకంగా ఎవరైతే తీర్పులిస్తున్నారో, వారందరి పేర్లు ఉటంకించడం ప్రస్తావనార్హం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఇచ్చిన ఫిర్యాదులో… జస్టిస్ రమణ ఆస్తుల లావాదేవీలు, 2013-2016 మధ్య కాలం నాటి ఆస్తుల వివరాలు కూడా పేర్కొనడం బట్టి.. జస్టిస్ రమణనే లక్ష్యంగా చేసుకుని, సీఎం జగన్మోహన్‌రెడ్డి దేనికయినా తెగించేందుకు సిద్ధపడుతున్నట్లు స్పష్టమవుతోంది.   నిజానికి జస్టిస్ రమణపై గతంలో విద్యార్ధి నేతగా ఉన్నప్పటి కేసు, హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయి సందర్భంలో ఇచ్చిన, సెల్ఫ్ డిక్లరేషన్ వివాదమయింది. కానీ అవి కోర్టులో నిలబడలేదు. ఇక అప్పటి నుంచీ చంద్రబాబు నాయుడు వ్యతిరేక వర్గం, పరోక్షంగా రమణను దృష్టిలో పెట్టుకుని పరోక్ష ప్రచారం కొనసాగిస్తూనే ఉందన్నది బహిరంగ రహస్యమే. అయితే, ఈ రకంగా నేరుగా జిస్టిస్ రమణ పేరు పెట్టి ఆరోపించిన వారెవరూ లేరు. ఆ ధైర్యం చేసిన సీఎంగా జగన్మోహన్‌రెడ్డి, న్యాయచరిత్రలో నిలిచిపోతారు. ఇప్పటివరకూ తమకు గిట్టని జడ్జిలపై, ఆకాశరామన్నల పేరుతో ప్రధాన న్యాయమూర్తులకు, లేఖ రూపంలో ఫిర్యాదు చేసే సంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రే స్వయంగా, సుప్రీంకోర్టు జడ్జిపై చీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు చేయడం దేశంలో ఇదే తొలిసారి.   అయితే.. జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు జడ్జి రమణను ఎందుకు ప్రధాన లక్ష్యంగా చేసుకున్నారన్న చర్చ రాజకీయ, న్యాయ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో సీనియరయిన, జస్టిస్ రమణకు సీజే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఆ పదవిలో 18 నెలలు ఉంటారని చెబుతున్నారు. ఒకవేళ ఆయన చీఫ్ జస్టిస్ అయితే, జగన్మోహన్‌రెడ్డికి కష్టకాలమేనని వైసీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రధాన చర్చ. ఆందోళన కూడా!   ఎందుకంటే.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ 9 నెలల్లో తేల్చాయాల్సి ఉంది. వాటిని రోజువారీ విచారణ ద్వారా పూర్తి చేయాలని, సుప్రీంకోర్టు ఇదివరకే ఆదేశించింది. అందులో భాగంగానే.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న సీబీఐ- ఈడీ కేసులు మళ్లీ విచారణకు వచ్చాయి. ఈ కేసుల్లో ప్రస్తుతానికి జగన్‌కు, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ వాటిని 9 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.   ఒకవేళ జస్టిస్ రమణ సీజే అయిన పక్షంలో.. జగన్మోహన్‌రెడ్డిపై ఉన్న కేసులలో వ్యతిరేక తీర్పులు వచ్చి, మళ్లీ ఆయన జైలులు వెళతారన్న ఆందోళన, ఆ కోణంలో చర్చ వైసీపీ వర్గాల్లో బహిరంగంగానే జరుగుతోంది. అదే జస్టిస్ రమణను సీజే కాకుండా నిలువరించినట్టయితే.. జగన్ బయటపడతారన్న భావన కూడా, ఆ పార్టీ వర్గాల్లో ఉందన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణాలతోనే జగన్మోహన్‌రెడ్డి, ఇప్పటినుంచే జస్టిస్ రమణపై బహిరంగ యుద్ధం ప్రకటించినట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.   ఇప్పటికే హైకోర్టు తీర్పులపై.. స్పీకర్ నుంచి ఎమ్మెల్యే-ఎంపీల వరకూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వైనంపై, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అటు జగన్ సర్కారు-వైసీపీ నేతలు కూడా.. జస్టిస్ రమణ రిటైరయ్యే వరకూ, ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందన్న మానసిక పరిస్థితికి వచ్చినట్లు కనిపిస్తోంది. తాజాగా అజయ్‌కల్లం రెడ్డి ప్రెస్‌మీట్ పరిశీలిస్తే.. జగన్ కేసులపై ముందస్తు వ్యూహానికి తెరలేచినట్లు అర్ధం చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ రేపు కోర్టులు.. సీబీఐ-ఈడీ కేసులలో, జగన్‌కు వ్యతిరేక తీర్పు ఇస్తే, ఫలానా వ్యక్తి కారణంగానే జగన్ జైలుకెళ్లారన్న ప్రచారానికి, ఇప్పటినుంచే రంగం సిద్ధం చేసుకున్నట్లు, వైసీపీ వ్యూహం అర్ధమవుతోంది. ఇదంతా వైసీపీ సహజ మైండ్‌గేమ్‌లో భాగంగానే కనిపిస్తోందని, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.అయితే..కేంద్రంలోని బీజేపీ మద్దతు లేకుండా, జగన్ ఇంత పెద్ద సాహసానికి ఒడిగడతారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవల జగన్ కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో జగన్.. జస్టిస్ రమణపై ఫిర్యాదు చేయగా, వ్యవస్థల జోలికి వెళ్లవద్దని అమిత్‌షా మందలించినట్లు ‘ఆంధ్రజ్యోతి’లో కథనం వెలువడింది. దానిపై సమాచార శాఖ కమిషనర్ ఆ పత్రికపై కేసు నమోదు చేశారు. అది వేరే విషయం! నిజంగా అమిత్‌షా సీఎం జగన్‌కు నచ్చచెప్పి ఉంటే, జగన్ ఇంత సాహసానికి శ్రీకారం చుట్టే ధైర్యం చేయరు. తర్వాత జగన్ ప్రధాని మోదీని కలిసినప్పుడూ, జస్టిస్ రమణ వ్యవహారంపైనే ఫిర్యాదు చేశారని, ఆయనతోపాటు హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులపైనా ఫిర్యాదు చేశారన్న వార్తలు వచ్చాయి. జగన్ ఢిల్లీకి వెళ్లిన తర్వాతనే ఏపీ హైకోర్టు సీజేను బదిలీ చేస్తారన్న ప్రచారం మొదలవడం గమనార్హం.   నిజంగా న్యాయవ్యవస్థ జోలికి వెళ్లవద్దని బీజేపీ నేతలు, జగన్‌ను హెచ్చరించి ఉంటే.. జగన్ ఇప్పుడు జస్టిస్ రమణపై ఆరోపణలు ఎందుకు ఎక్కుపెట్టారన్నది ప్రశ్న. ఒకవేళ బీజేపీ నాయకులు జగన్‌ను హెచ్చరించి ఉంటే, జగన్ అంత ధైర్యం చేసేవారు కాదన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అంటే దీన్నిబట్టి.. ఈ వ్యవహారంలో బీజేపీ సహకారం లేదని భావించడం కష్టమేనని, రాజకీయ వర్గాలు అనుమానిస్తున్నాయి. బీజేపీ దృష్టిలో.. ప్రధాన న్యాయమూర్తి పదవి ఎంపికలో, మరొకరు ఉండివచ్చన్న విషయాన్ని కొట్టిపారేయలేమంటున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే, కాగల కార్యాన్ని జగన్మోహన్‌రెడ్డితో కానిస్తున్నారన్న మరో చర్చ కూడా జరుగుతోంది. నిజం నరేంద్రుడికెరుక? -మార్తి సుబ్రహ్మణ్యం

సెంటిమెంటే ఆశ.. సెంటిమెంటే భయం! కారుకు కొత్తటెన్షన్ 

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సెంటిమెంట్ రాజకీయాల చుట్టే తిరుగుతోంది. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో .. అధికార పార్టీ నుంచి ఆయన సతీమణి సుజాత పోటీ చేస్తోంది. రామలింగారెడ్డి చనిపోయారన్న సానుభూతి తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ఆయనపై కూడా ప్రజల్లో సెంటిమెంట్ ఉందని కమలం కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. తన తండ్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి పేరుతో ప్రచారం చేస్తూ సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారు. మంత్రిగా ముత్యం రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనులు తనకు ప్లస్ అవుతుందని శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ పండిస్తూనే ప్రచారం చేస్తున్నాయి.   సోలిపేట రామలింగారెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతి తమకు లాభిస్తుందని చెబుతున్న అధికార పార్టీని మరో సెంటిమెంట్ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత పరిణామాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయలేదు. చనిపోయిన నేతల కుటుంబ సభ్యులు పోటీ చేసినా ప్రత్యర్థి పార్టీనే గెలిచింది. నారాయణ్‌ఖేడ్‌ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్‌ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్‌ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్‌ పార్టీపై రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది.   ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నికలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్‌ పోటికి పెట్టింది. సెంటిమెంట్ ను కాదని తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్‌ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్‌ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు.‌    దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ కావొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. టీఆర్‌ఎస్‌ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది.టీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుజాత గెలిచినా నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగం ఉండదనే ప్రచారాన్ని విపక్ష పార్టీలు నియోజకవర్గంలో జోరుగా నిర్వహిస్తున్నాయి. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్‌ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తుండటంతో విజయంపై టీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.

భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జయరాం బాధితుడా... లేక..?

ఏపీ మంత్రి జ‌య‌రాంకు సంబంధించి గత కొద్ది రోజులుగా పలు వివాదాస్పద వ్యవహారాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయన భూముల కొనుగోలు అంశం రాజకీయంగా తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణం అవుతోంది. ఇప్పటికే ప్ర‌తిప‌క్ష నేత‌లు దీని పై ఆధారాల‌తో స‌హా ఆరోప‌ణ‌లు చేయ‌గా… నిన్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలు నిగ్గు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఈ అంశం మ‌రో కీలక మ‌లుపు తిరిగింది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో తమ‌ను మోసం చేశారంటూ మంత్రి జ‌య‌రాం భార్య రేణుక పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.   ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీకి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు. అయితే మంజునాథ్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి తప్పుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ లెటర్ తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు కూడా రిజిస్టర్ చేసేశారు.   అయితే ఇప్పుడు మంత్రిగారు భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో.. మొత్తం వ్యవహారం అంతా రివర్స్ అయింది. అంత పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని.. అలాగే కొత్తగా వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసేటపుడు పెద్ద మొత్తంలో క్యాష్ చెల్లించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒక పక్క మంత్రి గారు దొంగ పత్రాలతో బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తానే ఒక బాధితుడినన్నట్లుగా చెపుతూ.. మోసపోయానని ఫిర్యాదు చేశారు.   ఇది ఇలా ఉండగా.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ ఆ భూముల్ని తనకు కూడా అమ్మిందంటూ కరణం పద్మనాభరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు విక్రయించిన పొలాన్నే మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఇట్టినా కంపెనీ ఎండీ, మాజీ డైరెక్టర్‌ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   ఇంతకూ మంత్రి గారికి నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేశారా.. లేకపోతే బెదిరించి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారా అన్నది పొలిసు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఏడాదికి కేవలం మూడు లక్షల ఆదాయం ఉన్న మంత్రి జయరాం, పదవి చేపట్టిన కొంత కాలానికే.. అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఇప్పటికే టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం వైపు నుండి మాత్రం కనీస స్పందన కూడా లేదు. అయితే దీని పై.. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ.. మొత్తం కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి.

ప్రభుత్వాన్ని విమర్శించిన మరుసటి రోజే జేసీ దివాకర్ రెడ్డి మైనింగ్ పై కేసు..

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై మైనింగ్ విషయంలో తాజాగా ఒక కేసు నమోదైంది. దీనికి సంబంధించి ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను జేసీ దివాకర్‌ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో మైనింగ్ నిర్వహిస్తున్న జేసీ దివాకర్ రెడ్డి కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదని తెలిపారు. మినరల్ మేనేజర్ పర్యవేక్షణలో జరగాల్సిన మైనింగ్ పనులు అలా జరగడం లేదని.. దీంతో నిబంధనలు పాటించని మైనింగ్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన ఈ రెండు క్వారీల్లో నిబంధనలు ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అంతేకాకుండా తమకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవని మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్వీ రమణారావు వ్యాఖ్యానించారు.   అయితే చాలాకాలం తరువాత నిన్న జేసీ దివాకర్ రెడ్డి గనుల కార్యాలయానికి చేరుకుని కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తానని పరోక్షంగా సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొద్దిరోజుల క్రితం వరకు తన సోదరుడిని టార్గెట్ చేసిన ప్రభుత్వం... ఇప్పుడు తనను టార్గెట్ చేస్తోందని  ఆయన ధ్వజమెత్తారు. జేసీ దివాకర్ రెడ్డి అటు ప్రభుత్వం ఇటు అధికారులపై విమర్శలు చేసిన మరుసటి రోజే... ఆయనకు నోటీసులు జారీ కావడం గమనార్హం.

పవన్ 'పవర్' చూపిస్తారా..?

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ ప్రభావమెంత?   ఇంట గెలవలేని పవనన్నయ్యు.. రచ్చ గెలిచే ప్రయుత్నాలు ప్రారంభిస్తున్నారు. ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి, రెండుచోట్లా గుడ్లుతేలేసిన జనసేనాధిపతి పవన్ కల్యాణ్.. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తన పార్టీని బరిలోకి దింపేందుకు సిద్ధవువుతున్నారట. అదీ వార్త. ఆ మేరకు ఆయున 50 డివిజన్లలో పార్టీ కమిటీలు కూడా ప్రకటించేశారు.   నవంబర్-డిసెంబర్‌లో జరిగే, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన ఎవ‘రెడీ’గా ఉందట. ఎలాగూ బీజేపీతో పొత్తు ఉన్నందున, జనసేన ఆ పార్టీతో కలిసే పోటీ చేస్తుంది. అయితే, జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారో స్పష్టత లేకున్నా, కనీసం 30- 40 స్థానాలు కావాలని పవనన్నయ్యు తమ్ముళ్ళు పట్టుదలతో ఉన్నారు. అదంతా బీజేపీ దయూధర్మాలపైనే ఆదారపడి ఉంటుంది. ప్రస్తుత కరోనా కాలంలో పవనన్నయ్యు ఫాంహౌసులోనే ఉండి, ప్రకటనలతో సందర్భానుసారంగా ట్వీటుతున్నారు. ఏపీకి కూడా వెళ్లడం లేదు. ప్రస్తుతానికి ఆయున కార్యస్థానం హైదరాబాదే.   త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో, జనసేన బరిలోకి దిగాలని నిర్ణయించింది. అంటే ఆ ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా దిగుతారన్నమాట. తెలంగాణలో బీజేపీకి, నేమ్-ఫేమ్ ఉన్న పెద్ద స్టార్ క్యాంపెయినర్ లేరు కాబట్టి.. ఉభయులకూ ఇప్పుడు, పవనన్నయ్యే మెగా స్టార్ క్యాంపెయినర్ అన్నవూట. ఎంతలేదన్నా పవన్ సినివూ స్టార్. కాబట్టి ఆయున సభలకు జనాలు బాగానే వస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో జరిగిన పవన్ ఎన్నికల సభలకూ జనం విరగబడ్డారు. తోసుకున్నారు. కొన్ని సందర్భాల్లో ఫ్లెక్సీలు కడుతుండగా అభివూనులు చనిపోయూరు. కానీ.. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోగా, ఒక్కరు వూత్రమే గెలిచి గట్టెక్కారు. అంటే పవన్ కల్యాణ్ ఇంట ఓడిపోయూరన్న మాట.   ఇక గ్రేటర్ హైదరాబాద్‌లో పోటీ చేస్తే, పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్న. ఇప్పటివరకూ నగరంలో జనసేనకు బలం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ పరిస్థితే, హైదరాబాద్ నగరంలో అగమ్యగోచరంగా ఉంది. మరి కొత్తగా పుట్టిన జనసేన సంగతి ఏమిటన్నది, సహజంగానే తెరపైకొచ్చే సందేహం. నగరంలోని సెటిలర్ల ఓట్లలో సింహభాగం ఓట్లు, జనసేనకు పడతాయున్నది ఆ పార్టీ ఆశలా కనిపిస్తోంది. దానివల్ల టీఆర్‌ఎస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. ఒకరకంగా మరింత నష్టపోయేది టీడీపీనే. ఎందుకంటే దాని బలం అంతో ఇంతో సెటిలర్లు ఉన్న ప్రాంతాల్లోనే కాబట్టి! విపక్షాల ఓట్లు ఎంత చీలితే, టీఆర్‌ఎస్‌కు అంత లాభం. అదీ లాజిక్కు!   సెటిలర్లు తాము ఎంతగానో ప్రేమించే టీడీపీనే కాదని, టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నప్పుడు.. అసలు ఉనికి లేని జనసేనకు ఓట్లేస్తారన్నది అనువూనమే. మరోవైపు, పవన్ ప్రచారబరిలో దిగితే,  కాపు-మున్నూరు కాపు ఓట్లు సాధించవచ్చన్న ఆలోచన బీజేపీ-జనసేన నేతల్లో కనిపిస్తోంది. అయితే, ఈ అంచనా కూడా ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి. ఎందుకంటే.. ఏపీలో కాపుల పార్టీగా ముద్రపడిన జనసేన అభ్యర్ధులెవరూ గెలవలేదు. కాపుల సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ, పవన్ కూడా విజయం సాధించలేకపోయూరు. కులపిచ్చి బాగా ఉన్న ఆంధ్రాలోనే కాపుల ఓట్లు సాధించలేని జనసేన.. ఎలాంటి కులపిచ్చి లేని హైదరాబాద్ నగరంలో, వేసే కులం కార్డు ఎంతవరకూ ఫలిస్తుందన్నది ప్రశ్న. ఇంట ఓడిన పవనన్నయ్యు, రచ్చ ఎలా గెలుస్తారో చూడాలి! -మార్తి సుబ్రహ్మణ్యం

మహారాజా కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి

విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. మహారాజా కళాశాల చారిత్రక నేపథ్యం ఉన్న విద్యాసంస్థ అన్నారు. వందేళ్ల క్రితమే విశాఖలోనూ విద్యాసదుపాయాలు లేని రోజుల్లో విజయనగరం మహారాజా కళాశాల ప్రముఖ విద్యాకేంద్రంగా బాసిల్లిందని తెలిపారు. వీవీ గిరి వంటి ప్రముఖుడు రాష్ట్రపతి హోదాలో ఆ కళాశాలకు విచ్చేశారని గుర్తుచేశారు.    ఇప్పటి ప్రభుత్వ హయాంలో ఆ కళాశాలని భ్రష్టు పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ కళాశాల పూర్వ విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారన్న ఆయన.. వారు ఇళ్లల్లో కూర్చుని వాట్సాప్ గ్రూపుల్లో సందేశాలతో సరిపెట్టకుండా, రోడ్లపైకి వచ్చి పోరాడాలని రఘురామకృష్ణరాజు సూచించారు.    "అర్ధరాత్రి ఎవర్నో తీసుకువచ్చి ట్రస్టులో కూర్చోబెట్టి తప్పు చేశారు. మా ప్రభుత్వం ఆ తప్పును సరిదిద్దుకునే పరిస్థితి కనిపించడంలేదు. ఈ పరిస్థితిని మార్చాల్సింది మహారాజా కళాశాల పూర్వ విద్యార్థులే. ట్రస్ట్ నియామవళి ప్రకారం ఎవరికైతే అర్హత ఉందో, ఆ నిజాయతీపరుడైన ట్రస్టీని మళ్లీ తీసుకువచ్చేవరకు పోరాడండి. మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలను, సింహాచలం దేవస్థానంలో జరిగే అన్యాయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. న్యాయం తప్పకుండా జరుగతుంది." అని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు.   మరోవైపు.. మహారాజా కళాశాల అధ్యాపకులు, పూర్వ అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు, మహారాజా కళాశాల పరిరక్షణ సమితి ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. మహారాజా కళాశాల పరిరక్షణకు సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఈ సందర్భంగా మహారాజా కళాశాల రిటైర్డ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ శివరామమూర్తి మాట్లాడుతూ.. మహారాజా కళాశాలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం అన్యాయమని, ఈ నిర్ణయంతో పేద విద్యార్థులకు విద్య దూరమైనట్టేనని ఆవేదన వ్యక్తం చేశారు.    మహారాజా కళాశాల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ సురేష్‌ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మహారాజా కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి మహారాజా కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయం.. పోరాటానికి దారితీసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అత్యాచార కేసుల విచారణ 2 నెలల్లో పూర్తిచేయాలి.. కేంద్రం తాజా మార్గదర్శకాలు 

మహిళలపై జరిగే నేరాల్లో పోలీసులు అనుసరించాల్సిన విధివిధానాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విధివిధానాలను అనుసరించాలని తెలిపింది.   ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్ లో 19ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో పోలీసులు తీరుపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. మహిళలపై జరిగే నేరాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవడం లేదని కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం విధివిధానాలను విడుదల చేసింది.   మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, పోలీసుస్టేషన్‌ పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి.. నేరస్థుల్ని అరెస్టు చేసే తీవ్రత గల నేరాల విషయంలో  చర్యలు తీసుకోని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అత్యాచార కేసుల విచారణను రెండు నెలల్లో పూర్తిచేయాలని పేర్కొంది.  

పాతబస్తీలో బతుకమ్మ సందడి! గ్రేటర్ ఎన్నికల ఎఫెక్ట్ 

తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణి ప్రారంభమైంది. గత నాలుగేండ్లుగా దసరా ముందు బతుకమ్మ చీరలను పంచుతున్నారు. అయితే ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో బతుకమ్మ చీరల పంపిణిలో సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నేతలు ఎక్కువ హడావుడి  చేస్తున్నారు. కరోనా భయపెడుతున్నా పట్టించుకోకుండా అట్టహాసంగా చీరల పంపిణి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓల్డ్ సిటీలోనూ జోరుగా చీరల పంపిణి జరుగుతోంది. గతంలో డివిజన్ కు ఒకటి, రెండు చోట్ల మాత్రమే చీరల పంపిణి జరిగేది. కాని ఈసారి కాలనీలు, గల్లీలో సభలు పెట్టి చీరల పంచుతున్నారు నేతలు.  ఓల్డ్ సిటీలో ఎంఐఎం నేతలు కూడా చీరల పంపిణిలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీనంతటికి త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే కారణమంటున్నారు. బతుకమ్మ చీరల పంపిణిని తమకు అనుకూలంగా మలుచుకుంటా ఎన్నికల ప్రచారం మెదలుపెడుతున్నారు కొందరు నేతలు.            ఓల్డ్ సిటీలో బతుకమ్మ చీరల పంపిణి హడావుడి కనిపించడం కొత్తగా కనిపిస్తోంది. నిజానికి హిందువులు జరుపుకునే దసరా పండగ సందర్భంగా పంచే బతుకమ్మ చీరలను వేరే మతస్తులకు ఇవ్వడంపై మొదటి నుంచి ఆరోపణలున్నాయి. రంజాన్ , క్రిస్టమస్ సమయంలో ఆయా వర్గాల వారీకే దుస్తులు పంపిణి చేస్తున్నారని, దసరాకు మాత్రం అన్ని వర్గాల వారికి ఇవ్వడమేంటనీ కొందరు ప్రశ్నించారు. అయినా కేసీఆర్ సర్కార్ మాత్రం తన తీరు మార్చుకోలేదు. ప్రతి ఏటా దసరా ముందు రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులుగా ఉన్న మహిళలందరికి చీరను కానుకగా ఇస్తోంది. గత నాలుగేండ్లుగా చీరల పంపిణి జరుగుతున్నా... ఓల్డ్ సిటీలో పెద్ద హడావుడి ఉండేది కాదు. పాతబస్తీలో పట్టున్న ఎంఐఎం నేతలు చీరల పంపిణిని పెద్దగా పట్టించుకునే వారు కాదు.    ఈసారి మాత్రం గతానికి భిన్నంగా ఓల్డ్ సిటీలో కొత్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంఐఎం ప్రజా ప్రతినిధులు, నేతలు బతుకమ్మ చీరల పంపిణిలో జోరుగా పాల్గొంటున్నారు.గల్లీ గల్లీకి సభలు ఏర్పాటు చేసి హంగామా చేస్తున్నారు. ఎెంఐఎం పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలు కూడా బతుకమ్మ చీరల పంపిణిలో పాల్గొంటుండటం చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ ఎన్నికల కోసమే వీరంతా చీరల పంపిణిలో పాల్గొంటున్నారనే చర్చ పాతబస్తీలో జరుగుతోంది. ఓల్డ్ సిటీలో ఎక్కువగా పేదలు ఉంటారు. వారికి సర్కార్ ఇచ్చే  బతుకమ్మ చీరను పెద్ద కానుకగా భావిస్తారు. ఇదే సెంటిమెంట్ ను తమకు ప్రయోజనం కలిగేలా నేతలు మలుచుకుంటున్నారు. చీరలు పంపిణి చేస్తూ.. లబ్దిదారుల ఓట్లను తమకు మద్దతుగా  మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.    గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో ఓల్డ్ సిటీలో ఈసారి బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఓ వర్గం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓల్డ్ సిటీలో సరికొత్త దృశ్యాలు కనిపించేలా ఉన్నాయి. ఎంతకైనా ఎన్నికల కోసం పార్టీలు ఏమైనా చేస్తాయనడానికి, నేతలు తమకు నచ్చని పనులు కూడా చేస్తారన్నదానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీ పరిణామాలే ఉదాహరణగా నిలుస్తాయని మరికొందరు చెబుతున్నారు.

వేల కోట్లు లూటీ చేసి, చిప్పకూడు తిన్న జగన్ గారిది విజన్ అంటారా.. బుద్ధా ఫైర్

ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన తీవ్ర విమర్శలతో మొదలైన ఈ ఫైట్ టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్ తో మరింత వేడెక్కింది. ముందుగా విజయసాయిరెడ్డి బాబును టార్గెట్ చేస్తూ.. "రాజధాని ఇటుకల కోసం స్కూలు పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబు గారూ? రియల్ ఎస్టేట్ భూముల విలువ పెంచుకునేందుకు పసివాళ్లని కూడా వదల్లేదు కదా? మీరు వాళ్ల జేబులు ఖాళీ చేస్తే, ఇప్పుడు అదే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు జగన్ గారు.. తేడా తెలుస్తోందా?" అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.   అంతేకాకుండా "పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్ల రూపాయలు ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్ బుక్స్, టెస్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్ల రూపాయలు. ఏది విజన్ ? ఏది దుబారా?" అని విజయసాయిరెడ్డి చంద్రబాబును నిలదీశారు.   అయితే విజయసాయిరెడ్డి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. "43 వేల కోట్ల ప్రజాధనం లూటీ చేసి,16 నెలలు చిప్పకూడు తిన్న జగన్ రెడ్డి గారిని విజన్ ఉన్న నాయకుడు అంటారా?" అంటూ ట్విట్టర్ వేదికగా విజయ్ సాయి రెడ్డిపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా "పోలవరం యాత్రకు ధనం వృధా చేసి ఉంటే మీ సైకో బ్యాచ్ ఊరుకుంటుందా? పోలవరం అనేది 7 దశాబ్దాల రాష్ట్ర ప్రజల కల. 70 శాతం చంద్రబాబు గారు పూర్తి చేసారు కాబట్టి, కల సాకారం అవుతున్న దృశ్యాన్ని ప్రజలకు చూపించారు. మీ లాగా ఢిల్లీ వాళ్లకు 'ఫుట్ మసాజ్' చేయకుండా, రాష్ట్ర సమస్యల పై కేంద్రంతో పోరాడారు. ఖర్చుల్లో తేడా ఉంటే, ఏమి పీక్కుంటావో పీక్కో" అంటూ మండిపడ్డారు.   అసలు "స్కూల్ పిల్లలు వేసుకునే బెల్ట్ కి,సాక్స్ లకు కూడా వైకాపా రంగులు వేసుకునే నువ్వు దుబారా గురించి మాట్లాడుతున్నావా? అంటూ విజయ్ సాయి రెడ్డిని ఎద్దేవా చేశారు. 4 వేల కోట్ల తో పంచాయతీలకు వైకాపా రంగుల దుబారా మర్చిపోయావా? తాడేపల్లి ఇంటి కోసం రూ.16 కోట్లు, నాయన సమాధి కోసం రూ.27 కోట్లు, చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులకు 60 కోట్లు, సిబిఐ కోర్టుకు వెళ్లడానికి ప్రతీ వారం 60 లక్షలు, మీ కక్షలు తీర్చుకోవటానికి లాయర్ల ఫీజులంటూ వందల కోట్లు, మీ అవినీతి పత్రికకు వందల కోట్లు, మీరు చేసే వేల కోట్ల దందాలు మొత్తం లెక్క తీస్తే, 10 పోలవరం ప్రాజెక్టులు కట్టవచ్చని" అన్నారు.   ఇదే అంశం పై స్పందించిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు "పేదలకు ఐదు రూపాయలకు అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని పీకేసిన జగన్ రెడ్డి రంగులు వేయడానికి... తీయడానికి 4000 కోట్లు తగులబెట్టారు. మేం పేదల కడుపు చూస్తాం. మీరు రంగుల లోకంలో విహరిస్తారు" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

గుడ్ న్యూస్.. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్ 

మనదేశంలో కరోనా విలయ తాండవం సృష్టిస్తున్న సమయంలో క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ కు చెందిన ఫార్మా కంపెనీ భార‌త్ బ‌యోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు భార‌త ఔష‌ధ నియంత్ర సంస్థ (డీసీజీఐ) అనుమ‌తి ఇచ్చింది. మొద‌టి రెండు ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ కు సంబంధించిన ప్రాథ‌మిక స‌మాచారాన్ని అంచ‌నా వేసిన డీసీజీఐ నిపుణుల క‌మిటీ… వ్యాక్సిన్ తో ఎటువంటి ఇబ్బందులు లేవ‌ని దృవీక‌రించి, వ్యాక్సిన్ ట్రయల్స్ లో కీల‌క‌మైన మూడో ద‌శ ట్రయల్స్ ‌కు ఓకే చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ రెండో దశలోని భద్రత, ఇమ్యునోజెనిసిటి డేటా ఆధారంగా తగిన మోతాదులో మూడో దశ ట్రయల్స్ ప్రారంభించాలని ఎస్​ఈసీ తెలిపింది.

ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందే: ఆర్ఎస్ఎస్ చీఫ్

ఇండియాలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఓ హిందీ మ్యాగజైన్‌కు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనదేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ అన్ని మతాల ప్రజలు కలిసి ఒకటిగా నిలబడి దేశాన్ని రక్షించుకున్నారని అయన ప్రశంసించారు. అంతేకాకుండా ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అయన అన్నారు. పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి ఎటువంటి హక్కులు ఉండవని అయన అన్నారు. గతంలో మేవార్‌ రాజు మహారాణా ప్రతాప్‌ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్‌ చక్రవర్తి అక్బర్‌ కి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.   అయితే ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని.. అయితే, ఇకపై ఎవరైనా ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని అయన తేల్చి చెప్పారు. ఈ దేశంలో ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, ఇది భారతదేశ స్వభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. తమ స్వార్థ ప్రయోజనాలకు దెబ్బ తగిలిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.

ప్రత్యక్ష ఎన్నికకు ఫికరెందుకు?

అన్నీ అనుకూల అంశాలే   ‘మేయర్’పై టీఆర్‌ఎస్ వెనుకడుగు ఎందుకు?   చేతిలో అధికారం.. ప్రజల దన్ను.. సెటిలర్ల సపోర్టు.. ఇన్ని అంశాలు సానుకూలంగా కనిపిస్తున్నా.. ప్రత్యక్ష ఎన్నికలకు, టీఆర్‌ఎస్ సర్కారు వెనుకడుగు వేయడమే ఆశ్చర్యం. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో పోటీ ఇచ్చిన టీడీపీ కనుమరుగయిపోగా, కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే ఉంది. ఇక బీజేపీ బలం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాగూ పాతబస్తీలో మజ్లిస్ దన్ను ఉండనే ఉంది. అయినా మేయర్ ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దిగేందుకు, కేసీఆర్ సర్కారు భయపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.   నవంబర్-డిసెంబర్‌లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగనుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. నగరంలో ఒక్క బీజేపీ స్థానం తప్ప, మిగిలిన  అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్-మజ్లిస్ శాసనసభ్య్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మజ్లిస్ ఎలాగూ తెరాసకు మిత్రపక్షమే. గతంలో జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో, టీడీపీ దాదాపు రెండవ స్థానంలో నిలిచింది. అయితే, చంద్రబాబు నాయుడు ఓటుకునోటు కేసు కారణంగా.. కేసీఆర్ సర్కారుకు భయపడో-రాజీ కుదిరిన మేరకో, పదేళ్ల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ నుంచి, విజయవాడకు పారిపోయారన్న అభిప్రాయం సెటిలర్లలో బలంగా ఏర్పడింది. అందుకే తన రక్షణ కోసం వెళ్లిన టీడీపీని కాదని, స్థానిక పార్టీ అయిన టీఆర్‌ఎస్‌కే సెటిలర్లు తమ రక్షణ కోణంలో జైకొట్టారు. అదీ అసలు రహస్యం.   టీఆర్‌ఎస్ కూడా గత ఎన్నికల్లో, సెటిలర్లకు కార్పొరేటర్ల సీట్లు ఇచ్చింది. ఎన్నికల్లో సెటిలర్లు అదే సంప్రదాయం, గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పాటించారు. మొత్తంగా సెటిలర్లు భయానికో-ప్రేమకో-ప్రత్యామ్నాయం లేకనో- టీడీపీ అధినేత ఆంధ్రాకు పారిపోవడం వల్లనో- అనివార్య పరిస్థితిలోనో, తెరాసకు మద్దతునిస్తున్నారన్నది నిర్వివాదం. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెరాస అధికారంలోకి వచ్చినప్పటికీ, ఇప్పటి వరకూ ఒక్క సెటిలర్‌పై ఎక్కడా దాడి జరిగిన దాఖలాలు లేవు. పైగా తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టుల సహా, అనేక పనులన్నీ సింహభాగం ఆంధ్రా కాంట్రాక్టర్లే చేస్తున్నారు. బహుశా తెరాసపై వ్యతిరేకత లేకపోవడానికి ఇదీ ఒక కారణం కావ చ్చు.   గతంలో జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు.. 14,68,618 ఓట్లు, 43.85 శాతం ఓట్లు సాధించి 100 సీట్లు సాధించింది. సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి, సనత్‌నగర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, జూబ్ళీహిల్స్ నియోజకవర్గాల్లో,  మెజారిటీ డివిజన్లు టీఆర్‌ఎస్ ఖాతాలోకే వెళ్లాయి. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఈ నియోజకవర్గాల్లో సెటిలర్లంతా కారు ఎక్కడం చూస్తే... రాజధాని నగరంలో సెటిలర్లంతా తెరాసకే జై కొడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇక పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం ఉత్తరాది- సీమాంధ్ర సెటిలర్లు జాతీయ కోణంలో ఓటేశారు. ఫలితంగా బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి విజయం సాధించగలిగారు.   కానీ అదే సెటిలర్లు, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం.. స్థానిక పరిస్థితుల దృష్ట్యా, టీఆర్‌ఎస్‌కే జై కొట్టడం ప్రస్తావనార్హం. గుజరాతీ-రాజస్థానీలు ఎక్కువగా నివసించే సనత్‌నగర్‌లో.. అసెంబ్లీకి తలసాని శ్రీనివాసయాదవ్‌కి ఓటేసిన ఉత్తరాది ఓటర్లు, లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రెడ్డిని గెలిపించడం విశేషం. అటు పాతబస్తీలోని ఉత్తరాది వారు కూడా ఇదే సూత్రం అవలంబించారు. లేకపోతే అసెంబ్లీలలో ఒక్క సీటు కూడా లేని బీజేపీ, ఏకంగా ఎంపీ సీటు గెవలవడం అసాధ్యం.   మరి నగరంలో ఇంత తిరుగులేని బలం ఉన్న టీఆర్‌ఎస్.. గ్రేటర్ ఎన్నికల్లో పరోక్ష పద్ధతిలో, మేయర్ ఎన్నిక నిర్వహించడమే ఆశ్చర్యం. ఎంసీహెచ్‌గా ఉన్న కార్పొరేషన్‌లో దశాబ్దాల పాటు, మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలోనే జరిగాయి. కానీ చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడు మాత్రం, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలే నిర్వహించి రికార్డు సృష్టించారు.   ఆ ఎన్నికల్లో తీగల కృష్ణారెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించారు. నేరుగా ఎన్నికయిన మేయర్ రికార్డు ఇప్పటికీ , ఆయన పేరిటనే ఉంది. ఒకవేళ రేపు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే, తీగల కృష్ణారెడ్డి అభ్యర్ధి అయితే, తిరిగి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. మళ్లీ తర్వాత జరిగిన ఎన్నికల్లో, పరోక్ష పద్దతిలోనే మేయర్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇప్పుడు నగరంలో టీఆర్‌ఎస్‌కు అనేక కోణాల్లో బలం- సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుండటమే ఆశ్చర్యం. సహజంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో, ప్రజలు  అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితి ఉండదన్న లాజిక్కును, కేసీఆర్ ఎలా విస్మరించారో అర్ధం కావడం లేదంటున్నారు.   ఈ విషయంలో విపక్షాలు సైతం కేసీఆర్ సర్కారుకు సవాల్ విసురుతున్నారు. నిజంగా కేసీఆర్‌కు గ్రేటర్‌పై పట్టు-పలుబడి ఉంటే ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని సవాల్ చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో... గెలిచిన ఇతర పార్టీ కార్పొరేటర్లను కరీంనగర్‌లో మాదిరిగా, కొనుగొలు చేసి అధికారం సాధించవచ్చన్న ముందుచూపుతోనే, మేయర్‌కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు.  -మార్తి సుబ్రహ్మణ్యం