హత్రాస్ కేసులో మరో ట్విస్ట్.. బాధితురాలు నా ఫ్రెండ్ అంటూ నిందితుడు లేఖ!!
posted on Oct 8, 2020 @ 8:01PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటనలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అంటూ ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాయడం కలకలం రేపుతోంది.
యువతి మృతితో తమకు ఎలాంటి సంబంధం లేదని సందీప్ ఠాకూర్ జిల్లా ఎస్పీకి లేఖ రాశాడు. బాధితురాలు, తాను స్నేహితులమని.. తమ స్నేహాన్ని సహించలేక యువతిని ఆమె తల్లి, సోదరులు కొట్టి హింసించారని లేఖలో పేర్కొన్నాడు. యువతిని కలిసేందుకు పొలానికి వెళ్లగా, అక్కడ ఆ యువతితో పాటు ఆమె తల్లి, సోదరులు ఉన్నారని చెప్పాడు. అయితే, వాళ్ళు తనను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్తే వెళ్లానని తెలిపాడు. వాళ్ళే ఆ యువతిని కొట్టి చంపి, తనతో పాటు మరో ముగ్గురిపై నేరం మోపారని సందీప్ ఠాకూర్ లేఖలో పేర్కొన్నాడు. అయితే, సందీప్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను బాధితురాలి తల్లిదండ్రులు ఖండించారు.
బాధిత యువతి, తాను మంచి ఫ్రెండ్స్ అని.. ఆమె తల్లి, సోదరులే కొట్టి చంపారని ఆరోపిస్తూ ప్రధాన నిందితుడు లేఖ రాయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ కేసులో నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అక్కడి పోలీసులపై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం చూస్తుంటే.. కేసుని కేసుని తప్పుదోవ పట్టిస్తూ, కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.