కవిత ఆరోపణల తర్వాత కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ

  మాజీ మంత్రి హరీశ్ రావు  లండన్ నుంచి తిరిగివచ్చిన ఆయన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణల విషయంలో హరీశ్ రావు, కేసీఆర్‌కు పూర్తి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ వివాదంలో బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా హరీశ్‌రావుకు మద్దతుగా నిలవడం గమనార్హం. పార్టీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరీశ్‌రావుకు బాసటగా పోస్టులు పెట్టడంతో ఈ వ్యవహారంలో కేసీఆర్ మద్దతు ఆయనకే ఉందనే ప్రచారం జరుగుతోంది.  ఈ పరిణామాల మధ్య కేసీఆర్, హరీశ్ రావు భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేటీఆర్ కూడా అక్కడే ఉండటంతో ముగ్గురూ సమావేశం అయ్యారు. కవిత ఇటీవల హరీశ్‌రావుతో పాటు ఎంపీ సంతోష్‌రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వారిద్దరూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో టచ్‌లో ఉన్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చి పార్టీని తమ చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ కామెంట్స్ పట్లా బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.  

వైభవోపేతంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం

ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం లక్షలాది మంది భక్తుల సమక్షంగా, గణపతి బొప్పా మోరియా నినాదాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది.  శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జన శోభాయాత్ర భక్త జనసందోహం నిరాజనాల మధ్య మధ్యాహ్నం 12 గంటల సమయానికి టాంక్ బండ్ చేరుకుంది.  69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నవిశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని  గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు ఎస్టీసీ ట్రాన్స్ పోర్టుకు చెందిన26 టైర్ల  ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.   100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకువచ్చారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా మహాగణపతిని చూసేందుకు పోటెత్తిన భక్త జనంతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలన్నీ కిటకిటలాడాయి.   ఎన్టీఆర్ మార్గ్‌లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. పూజల అనంతరం, భారీ క్రేన్ సాయంతో లంబోదరుణ్ణి నెమ్మదిగా హుస్సేన్ సాగర్‌లోకి నిమజ్జనం చేశారు.  

ఆస్పత్రిపాలైన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికారిక పర్యటన కోసం శుక్రవారం (సెప్టెంబర్ 5) హైదరాబాద్ చేరుకున్న ఆయన శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం   శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయన ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ విడుదల చేయాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.   ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ శనివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్ లో పలు  కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉంది.  ముఖ్యంగా అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై తెలంగాణ సర్కార్ లేఖ మేరకు సీబీఐ దర్యాప్తు టేకప్ చేయడంపై అధికారులతో చర్చించాల్సి ఉంది. దీంతో ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్లు తెలుస్తోంది. 

గైర్హాజరే జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెలేలు శిరసావహిస్తారా అన్నదే అనుమానం?!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినా అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సారైనా వైసీపీ సభ్యులు, ముఖ్యంగా జగన్ హాజరౌతారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయ్యింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.  అది పక్కన పెడితే.. చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు ఓ సవాల్ విసిరారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమా అన్నదే ఆ సవాల్. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేలాడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అసెంబ్లీకి గైర్హాజర్ అవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసైనా సరే సభకు హాజరు అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్ స్వయంగా పులివెందులలో ఉప ఎన్నికను ఎదుర్కొంటే పరాభవం తప్పదన్న భయంలో ఉన్నారన్న ప్రచారం సైతం సాగుతోంది. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అయితే ఒక అడుగు ముందుకు వేసి పులివెందులలో ఉప ఎన్నికను స్వాగతిస్తున్నానని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా.. అంటే కనీసం శాసనసభ సభ్యత్వాలను కాపాడుకుందుకైనా వైసీపీ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులు భావించారు. అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇటీవల వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో హోదా లేకుండా సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు.  జగన్ ఈ నిర్ణయం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది.  ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరే వైసీపీ విధానమని జగన్ కుండబద్దలు కొట్టేయడంతో.. ఇప్పుడు ఆయన కాకుండా వైసీపీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎందరు ఆయన నిర్ణయాన్ని సమర్ధించి సభకు హాజరౌతారు? ఎందరు గైర్హాజరౌతారు అన్న విషయంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున  చర్చ జరుగుతోంది. ఇక  రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు, సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో  ఆ హాజరు చెల్లదని తేలింది.  ఆ తరువాత తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  అనర్హత వేటు కోసం భయం వద్దు సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పర్యటించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని జగన్ చేసిన దిశానిర్దేశం వైసీపీ ఎమ్మెల్యేలకు అంతగా రుచించడం లేదంటున్నారు.   ఇంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైనా.. తమతమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలను సభకు పంపారు. అయితే ఈసారి అలా కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రులు స్పష్టం చేశారు.  సభకు రాకుండా ప్రశ్నలు  అడిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రశ్నలకు సభలో సమాధానం ఇవ్వరు. దీంతో అసలు వైసీపీ వాయిసే వినబడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అనర్హత వేటు పడితే... ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించడం సాధ్యం కాదన్న భయం కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నది. చూడాలి మరి ఈ సారి జగన్ గైర్హాజర్ నిర్ణయానికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారో లేదో?

తాడిపత్రి లోకి ప్రవేశించిన పెద్దారెడ్డి

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం (సెప్టెంబర్ 6) తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని  పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  మూడు వందల పోలీసులల భద్రతతో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అయ్యారు.  వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో  తాడిపత్రిలో పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాల కారణంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ కారణంగానే ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత ఓ సారి రహస్యంగా తాడిపత్రిలో అడుగుపెట్టినప్పటికీ, వెంటనే పోలీసులు ఆయనను బయటకు తీసుకువెళ్లారు.  ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా తాడిపత్రిలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు భద్రతా సమస్యలు అని చెప్పడంతో..  తన భద్రతకు అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని పెద్దారెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు.  ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు 15 నెలల తరువాత  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగలిగారు.   ఈ 15 నెలలలో జరిగినదేమిటన్నది ఒక్కసారి చూస్తే.. పంతాలు పట్టింపులు ఎంత కష్టనష్టాలు కలిగిస్తాయో తాడిపత్రి ఘటన చూస్తున్నాం.ఇటీవల  మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఈ పరిస్థితికి కారణం అయింది… ఏడాది కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి పాలన ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 15 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు. దీంతో పెద్దారెడ్డి చేసేది ఏమీలేక  హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలోకి  ప్రవేశించేందుకు అనుమతి పొందారు . ఆ తరువాత పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి తాడిపత్రిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ  స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు జెసి అభిమానులు, ప్రజలు పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే రోజునే జేసీ ప్రభాకరరెడ్డి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా తాడిపత్రి కి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులే కోర్టును ఆశ్రయించి శాంతిభద్రతల సమస్య ఉందని పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించ వద్ధని కోరారు. దీనికి కోర్టు కూడా సమ్మతి  తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రవేశించకుండా  వెనుతిరిగారు. పెద్దారెడ్డి ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పట్టుదలతో  సుప్రీంకోర్టును ఆశ్రయించి  అనుమతి పొందారు. కోర్టు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శనివారం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు.  ఈ సందర్బంగా  ఎటువంటి శాంతి భద్రత సమస్య ఎదురుగా కాకుండా భారీగా  పోలీసులను రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి సుమారు 15 నెలల తర్వాత తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఎడాదిపైగా తాడిపత్రి కి దూరంగా ఉన్న పెద్దారెడ్డి ఎట్టకేలకు తన సొంత ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించలేదని హెచ్చరించిన జేసి ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితులకు  అనుగుణంగా మౌనం దాల్చారు.  ఇంకా కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్న భయంతోనే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కోసం పట్టుపట్టారని చెప్పాల్సి ఉంటుంది.  గత 15 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో తాడిపత్రిలో వైసీపీ ఇన్ చార్జిగా మరో వ్యక్తిని నియమించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలియడంతో పెద్దారెడ్డి తనకు కల్పించే పోలీసు భద్రతకు అయ్యే వ్యయం భరిస్తానని చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి కోర్టు అనుమతి పొందారు. ఇంత కష్టపడి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు. 

ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుడు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. ఈ నెల 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎంపీగా తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్  విచారించిన ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు  చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్ కావాలని ఆదేశిస్తూ మిథున్ రెడ్డికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.  

రికార్డ్ స్థాయిలో ధర పలికిన బాలాపూర్ లడ్డు

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా గణేష్ లడ్డూల వేలం జోరుగా సాగుతోంది. వేలం పాటలో గణేష్ లడ్డూలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు ధర పలికింది. గత ఏడాది వేలంపాట కంటే ఈ ఏడాది ఏకంగా 4.99 లక్షల రూపాయలు అధికంగా పలికింది. గత ఏడాది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో 30.01 లక్షలు పలకగా, ఈ ఏడాది 35 లక్షల రూపాయలు పలికింది. బాలాపూర్ గణేశుడు లడ్డు కు తెలుగు రాష్ట్రాలలోనే ఓ ప్రత్యేకత ఉన్న సంగతి విదితమే..  ఈ సారి బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో 38 మంది పాల్గొనగా, వారిలో   బాలాపూర్ కు చెందిన బిజెపి రాష్ట్ర నాయకుడు శంకర్ రెడ్డి 35 లక్షల రూపాయలకు పాడి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు.   ఇక బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ కమ్యూనిటీలో కూడా ఏటా గణేష్ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ కూడా గణేష్ నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం ఆనవాయితీగా వస్తున్నది.  ఈ ఏడాది జరిగిన వేలంలో లడ్డూ ధర ఏకంగా  2 కోట్ల 31 లక్షల 95 వేలు పలికింది.  గతేడాది ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో లడ్డూ ధర కోటీ 87 లక్షలు పలకగా, ఈ ఏడాది అంతకంటే దాదాపు 45 లక్షల రూపాయలు అధికంగా పలకడం విశేషం.   

టీచ‌ర్ కాబోయి పొలిటీషియ‌న్ అయిన చంద్రబాబు?

కూట‌మి ప్ర‌భుత్వం శుక్రవారంసెప్టెంబ‌ర్ 5న గురుపూజోత్స‌వం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ‌న్ గురించి మాట్లాడిన చంద్రబాబు ఆయ‌న మా జిల్లాలోని రేణిగుంట స్కూల్లో ప‌ని చేసిన‌ట్టు  విన్నాన‌ని అన్నారు. ఆపై ఏయూకి వైస్ ఛాన్స్ ల‌ర్ గా ఆపై ఉప‌రాష్ట్ర‌ప‌తి, రాష్ట్ర‌ప‌తిగా సేవ‌లందించార‌ని అల‌నాటి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఇక ప‌నిలో ప‌నిగా త‌న కుమారుడు లోకేష్ చ‌దువు సంధ్యలు ఎలా సాగాయో కూడా చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. త‌న కుమారుడు మొద‌ట ఎలా ఉండేవారు. ఇప్పుడు ఎలా ఉన్నార‌న్న కామెంట్ చేశారు. మాములుగా అయితే రాజ‌కీయ నాయ‌కుల పిల్ల‌లు పెద్ద‌గా చ‌ద‌వ‌క పోయేవార‌ని.. కానీ లోకేష్ అలాక్కాదు.. బుద్ధిగా చ‌దువుకుని.. స్టాన్ ఫోర్డ్ స్థాయికి మెరిట్ ద్వారా వెళ్లారు. అక్క‌డి  నుంచి వ‌ర‌ల్డ్ బ్యాంక్, సింగ‌పూర్ సీఎం ఆఫీస్ వంటి చోట్ల ప‌ని చేసే రేంజ్ కి ఎదిగారు. ఇదంతా ఆయ‌న స్వ‌యం కృషి. లోకేష్ ని ఈ విధంగా తీర్చిదిద్ద‌డంలో ఆయ‌న త‌ల్లి భువ‌నేశ్వ‌రి పాత్ర ఎంతో ముఖ్య‌మైన‌ద‌ని అన్నారు సీఎం చంద్రబాబు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో తాను లెక్చ‌ర‌ర్ కావ‌ల్సింద‌ని అన్నారు. త‌న వ‌ర్శిటీలో ఈ దిశ‌గా వైస్ చాన్స‌ల‌ర్ అడిగార‌ని, అయితే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న‌ట్టు చెప్పాన‌ని అన్నారు. ఆయ‌న త‌న‌ను గెలుస్తావా? అని కూడా అడిగార‌ని.. గెలిచి వ‌చ్చి మీతో మాట్లాడ‌తాన‌ని తాను అన్నాన‌నీ.. అలా తాను ఎమ్మెల్యేగా గెల‌వ‌డం మాత్ర‌మే కాదు మంత్రి  ఆపై ముఖ్య‌మంత్రి కాగ‌లిగాన‌నీ.. లేకుంటే ఈ పాటికి మీలాగ నేను కూడా ఒక టీచ‌ర్న‌యి ఉండేవాడ్న‌ని గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు ఏపీ సీఎం చంద్ర‌బాబు.

ఆమె విజ్ణతకే వదిలేస్తున్నా.. కవిత విమర్శలపై హరీష్ స్పందన

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి అంతా హరీష్ రావుదేనంటూ కల్వకుంట్ల కవిత చేసిన విమర్శలపై ఇంత కాలం మౌనం వహించిన మాజీ మంత్రి హరీష్ రావు ఎట్టకేలకు స్పందించారు. తన విదేశీ పర్యటన ముగించుకుని శనివారం (సెప్టెంబర్ 6) హైదరాబాద్ చేరుకున్న హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తన పాతికేళ్ల రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం అన్నారు. గత కొంత కాలంలో బీఆర్ఎస్ పైనా, తనపైనా కొన్ని రాజకీయ పార్టీలూ, కొందరు నేతలూ చేస్తున్న విమర్శలనే కవిత మళ్లీ చేశారని హరీష్ రావు అన్నారు.    బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు, సంతోష్ రావు లే తెర వెనక ఉండి  కథ నడిపించారు. అంతేకాదు కాంట్రాక్ర్స్ నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారంటూ తనపై తీవ్రస్థాయిలో చేసిన ఆరోపణలపై అంతా ఆమె విజ్ణతకే వదిలేస్తున్నానంటూ హరీష్ ముక్తాయించారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చి ప్రజల కష్టాలు తొలగించడానికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామని హరీష్ అన్నారు.  

ఏపీ మద్యం కుంభకోణం.. సిట్ దర్యాప్తు తుది అంకానికి?

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ చేస్తున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందా? ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు అన్నది సిట్ గుర్తించిందా? అంటే సిట్ దూకుడు చూస్తుంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. తాజాగా జగన్ సోదరుడు, ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ చూసే అనిల్ రెడ్డి పిఏ దేవరాజులును సిట్ మూడు రోజుల పాటు విచారించింది. అతడి ద్వారా మద్యం కుంభకోణం సొమ్ము అంతిమంగా ఎక్కడకు చేరిందన్న కూపీ లాగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నేప థ్యంలోనే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తును సిట్ చివరి అంకానికి తీసుకువచ్చిందని అంటున్నారు. అంతిమ లబ్ధిదారును గుర్తించి అరెస్టు చేస్తే కేసు దర్యాప్తు పూర్తి అవుతుంది.  ఈ నేపథ్యంలోనే సిట్ మద్యం కుంభకోణం కేసులో మూడో చార్జిషీట్ దాఖలు చేయడానికి సమాయత్తమౌతున్నదని చెబుతు న్నారు. జగన్ సోదరుడు అనిల్ రెడ్డి పీఏ దేవరాజులును ప్రశ్నిస్తున్న సిట్ అధికారులు కీలక  విషయాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను దేవరాజులు ముందు పెట్టి ఆయనను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో దేవరాజులు మద్యం కుంభకోణం సొమ్ము ఎక్కడకు ఎలా చేరిందన్న విషయాన్ని సిట్ అధికారులకు పూసగుచ్చినట్లు చెప్పేశారని అంటున్నారు. మూడు రోజుల పాటు దేవరాజులును సిట్ విచారించిన విషయం శుక్రవారం (సెప్టెంబర్ 5) వెలుగులోనికి వచ్చింది.   దీంతో వైసీపీలో ఖంగారు, భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  

కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు?.. సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రాక!

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు సిఫారసు చేస్తూ తెలంగాణ సర్కార్ పంపిన లేఖకు స్పందనగా సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారు. కోఠీలోని సీబీఐ కార్యాలయంలో అదికారులతో  శుక్రవారం (సెప్టెంబర్ 5) సవావేశమయ్యారు.   కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తు వ్యవహారం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో సీబీఐ ఎలా ముందుకు సాగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరిపి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు లేవు.   అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిషన్ నివేదిక ఆధారంగా కాకుండా మొత్తంగా కళేశ్వరం అక్రమాలపై దర్యాప్తును కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. కోర్టుకు కూడా ఇదే విషయాన్నిచెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సీబీఐ అక్నాలెడ్జ్ కూడా చేసింది.  రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఆ రిపోర్టు ఆధారంగా కాకుండా.. జనరల్ గానే కాళేశ్వరం అక్రమాలపై దర్యాప్తు చేయాలని లేఖ రాసింది.  ఈ నేపథ్యంలోనే సీబీఐ డైరెక్టర్ హైదరాబాద్ రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత సంతరించుకున్న కాళేశ్వరం అక్రమాలు, అవినీతిపై సీబీఐ దర్యాప్తు ఏలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర షురూ!

గణేష్ చతుర్థి నుంచి భక్తుల పూజలందుకున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం ప్రారంభమైంది. 69 అడుగుల ఎత్తు, 50 టన్నుల బరువు ఉన్నవిశ్వశాంతి మహాశక్తి మహాగణపతిని  గంగమ్మ ఒడిలోకి చేర్చేందుకు ఎస్టీసీ ట్రాన్స్ పోర్టుకు చెందిన26 టైర్ల  ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు.   100 టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్న ఈ భారీ ట్రాలీపై మహాగణపతిని నిమజ్జన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. గణపతికి ఇరువైపులా ఉన్న పూరీ జగన్నాథ్ స్వామి, లలితా త్రిపుర సుందరి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, గజ్జలమ్మ దేవత విగ్రహాలను మరో వాహనంపై ఊరేగిస్తున్నారు. శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటల సమయానికి ట్యాంక్ బండ్ లోని ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నంబర్ క్రేన్ వద్దకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.    ఖైరతాబాద్ నుంచి ఆరంభమైన న ఈ శోభాయాత్ర రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఇక్బాల్ మినార్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక క్రేన్ సహాయంతో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యాహ్నం 2 గంటల సమయానికి పూర్తి అవుతుందని భావిస్తున్నారు.  

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్త జనసంద్రంగా మారింది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. దీంతో తిరుమల గిరి నిత్యం భక్తుల రద్దీతో కిటకిట లాడుతుంటుంది. శనివారం (సెప్టెంబర్ 6) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ శిలాతోరణం వరకూ సాగింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోంది.   క్యూలైన్‌లోని భక్తులకు టీటీడీ అన్న ప్రసాదం, జల ప్రసాదం, పాలు అందిస్తున్నారు.  ఇక శుక్రవారం(సెప్టెంబర్ 5) శ్రీవారిని మొత్తం 69 వేల 531 మంది దర్శించుకున్నారు.  శ్రీవారిని 69,531 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 1,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం  3 కోట్ల 49 లక్షల రూపాయలు వచ్చింది.  

హైదరాబాద్ మహిళా పోలీసుల్లో అశ్విక దళం, డాగ్ స్క్వాడ్ విస్తరణ

    హైదరాబాద్ నగర పోలీసులు ఈరోజు ఒక చారిత్రాత్మక మైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ సిపి సి.వి. ఆనంద్ మహిళా హార్స్ రైడర్స్‌ను ప్రవేశపెట్టారు. పదిమంది సాయుధ రిజర్వ్  మహిళా కానిస్టే బుళ్లు రెండు నెలల పాటు గోషామహల్ మౌంటెడ్ యూనిట్‌లో శిక్షణ పొంది, ఇప్పుడు గుర్రపు పోలీసు దళంలో భాగమయ్యారు. దేశంలోనే ఇదొక కీలకమైన నిర్ణయం అని హైదరాబాద్ కమిషనర్ తెలిపారు. ఈ మహిళా కానిస్టేబుళ్లను బందోబస్తు, విఐపిల భద్రత, పెట్రోలింగ్ వంటి విధులకు వినియోగించనున్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకు న్నామని, మహిళా మౌంటెడ్ పోలీసులు గస్తీలో మొదటిసారి గా పాల్గొనబోతు న్నారని హైదరాబాద్ సిపి పేర్కొన్నారు.హైదరాబాద్ నగర పోలీసులు తమ డాగ్ స్క్వాడ్‌ను కూడా విస్తరిస్తు న్నారు. కిస్ ఇన్వెస్టిగేషన్ చేయడంలో శునకాలు ఎంత గానో సహాయప డుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్న 34 శునకాల తో పనిభారం ఎక్కువగా ఉన్నం దున, ఆ సంఖ్యను 54కు పెంచాలని నిర్ణయించుకున్నారు. అదనపు శునకాలను ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ లో విస్తృత శిక్షణ పొందిన తర్వాత బృందంలో చేర్చుకుంటామని సిపి అన్నారు.  ఇంకా బాంబులు, మాదక ద్రవ్యాలు, మరియు నేరస్తుల గుర్తింపు వంటి వాటిలో వీటిని వినియోగిస్తాము.శునకాల నాణ్యత ను మెరుగుపరచడా నికి ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దేశవ్యాప్తంగా ఉన్న డాగ్ బ్రీడర్ల నుండి నాణ్యమైన శునకా లను ఎంపిక చేస్తోంది. మొదటి దశలో 12 శునకా లను సేకరించారు. భవిష్యత్తులో మరికొన్నిటిని తీసుకుంటామని సిపి తెలిపారు. ప్రస్తుతం నూతన ఉస్మా నియా జనరల్ హాస్పిటల్  నిర్మాణానికి సంబంధించిన ఇటీవలి పరిణా మాల నేపథ్యంలో, గోషామహల్ పోలీస్ స్టేడియం ఆవరణ లోని గుర్రపు మైదానం మరియు అశ్విశాల వంటివా టిని కొత్త ప్రదేశానికి మార్చుతున్నారు.  ఈ కొత్త మౌలిక వసతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్‌లో సిటీ సెక్యూరిటీ వింగ్ కోసం కొత్త భవ నాలు, స్వాధీనం చేసుకున్న వాహ నాల నిలుపుదల ప్రదేశాలు, కొత్త గుర్రపు శాలలు, మరియు పెరేడ్ గ్రౌండ్ వంటివి ఉంటాయని సి.వి ఆనంద్ తెలిపారు.11.5 ఎకరాల విస్తీర్ణంలో 60 శునకాల కోసం డాగ్ కెనాల్స్ మరియు మౌంటెడ్ యూనిట్‌ ను నిర్మిస్తాము. ఈ ప్రాజెక్టుకు సంబం ధించిన టెండర్లు సెప్టెంబర్ 8న పూర్తవుతాయని సిటీ కమిషనర్  తెలిపారు. రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషనర్  తెలిపారు.సుమారు 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుందని, ట్యాంక్ బండ్ వద్ద మాత్రమే 50 వేల విగ్రహాల నిమజ్జనం జరుగుతుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా ముందస్తు జాగ్రత్తగా అన్నిచోట్ల పటిష్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేశాము. మొత్తం 29 వేల మంది పోలీసులు షిఫ్టుల లో విధులు నిర్వర్తి స్తారు. నిమజ్జన మార్గాలను పర్యవేక్షించడానికి సిసి కెమెరాలతో పాటుగా అదనంగా 250 సిసి కెమెరాలు మరియు 6 డ్రోన్‌ లను కూడా వినియోగిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరాల్లో డీజేల కారణంగా చాలా మంది యువకులు మరణించారని, వారి ఆరోగ్యం దెబ్బతింటుందని కమిషనర్  పేర్కొన్నారు. అందుకే ఈ సంవత్సరం డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. భక్తిలో మతం కాకుండా ప్రజల ఆరోగ్యం ప్రధానమని, ఈ విషయంలో భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి కూడా పోలీసులకు సహకరిస్తోందని చెప్పారు. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల లోపు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.  

ధూల్ పేట్ లఖన్ సింగ్‌పై పీడీ యాక్ట్

  ధూల్ పేట్ ను అడ్డగా మార్చుకుని గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న లేడీ డాన్ పై పీడియాక్ట్ నమోదుచేసి జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే దూల్పేట్ లో గంజాయి వ్యాపారం చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాది స్తున్న మరో వ్యాపా రిపై కలెక్టర్ పీడి యాక్ట్  నమోదు చేయాలంటూ  ఆదేశాలు జారీ చేశారు...గంజాయి హోల్  సెల్ వ్యాపా రిగా ఎదిగిన ఓ వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో,ఎక్సైజ్ స్టేషన్లో 30కి పైగా  కేసులు నమోద య్యాయి..పోలీసులు ఒక మారు, ఎక్సైజ్ రెండో మారు లకాన్ సింగ్ పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.. అయినా కూడా అతని ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ తిరిగి గంజాయి దందా  కొనసాగిస్తూనే ఉన్నాడు.. దూల్పేట్ లో నివాసం ఉంటున్న లఖన్ సింగ్ ఒరిస్సా లోని గంజాయి సాగు, అమ్మకం  బడా వ్యాపారులతో సంబంధాలు పెట్టుకున్నాడు. అంతే కాకుండా సులభ పద్ధతిలో డబ్బులు సంపాదిం చాలని ఆలోచించిన లఖన్ సింగ్ ఒరిస్సా నుంచి నేరుగా 25 కిలోల నుంచి 100 కేజీల వరకు గంజా యిని పోలీసుల కంట పడకుండా ధూల్పేటకు తెప్పించి స్థానిక వ్యాపారులకు అమ్మకాలు జరుపుతూ...హాయిగా గంజాయి  దందా కొనసాగిస్తున్నాడు.    ఎనిమిది నెలల్లోనే  లఖాన్ సింగ్ మూడుమార్లు 25 కేజీల, 27,26 కేజీల గంజాయిలతో ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ టీం లీడర్ అంజిరెడ్డి బృందానికి పట్టుపడ్డాడు. అంతే కాదు ఇతనిపై మంగళ హార్ట్, దూల్పేట్, నారాయణగూడ తో పాటు మరో స్టేషన్లో పదికి పైగా పెద్ద మొత్తంలో గంజాయి పట్టు కున్న కేసులు నమోదయ్యాయి. దూల్పేట్ లో గంజాయి లేడీ డాన్ అంగూర్ భాయ్ పై కూడా పీడీ యాక్ట్ పెట్టడంతో నిందితు రాలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా లఖాన్ సింగ్ పై కూడా హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన పీడియాట్ ఇంపోస్ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం పిడి యాక్ట్ పెట్టాలని చేసిన సిఫార్సు మేరకు కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ ఇచ్చినటు వంటి పీడీ యాక్ట్ ఉత్తర్వులను దూల్పేట్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ మధుబాబు లఖాన్ సింగ్ కు యాక్ట్ నోటీసులను అందించారు.  

గురువులను జీవితంలో మర్చిపోలేము : సీఎం చంద్రబాబు

  దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు  సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే అని చంద్రబాబు అన్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సూచించారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.  ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగో ర్యాంక్ రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతు మా ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంతో బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లాని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నానని మా నాన్న బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. నారాయణని పిలిపించి నాకు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత యూనివర్శిటీలో రాజిరెడ్డి ఆధ్వర్యంలో చదువుకున్నాను. సమయానికి హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని తెలియదని లోకేశ్ తెలిపారు, తల్లిని ఆ తర్వాత నా ఉపాధ్యాయులనే గౌరవిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే... స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. జీరో ఇన్వెస్టిమెంట్-హై రిటన్స్ అని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచిన టీచర్లూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి తెచ్చామని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారనే అంశాన్ని పేరెంట్సుకు అర్థమయ్యేలా చెప్పేందుకు పేరెంట్-టీచర్ మీటింగ్ పెట్టాం.. దీన్ని కొనసాగిస్తామన్నారు. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం... అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టామన్నారు. వేదిక మీదున్న బోర్డులోనూ సీఎం ఫొటో కూడా పెట్టలేదు. పిల్లలకు అందించే పుస్తకాలు, కిట్ల పైనా ఎవ్వరి ఫొటోలు వేయలేదన్నారు.  

సోనియా తలుపు తట్టిన...ఓటు చోర్ వివాదం !

  కాంగ్రెస్ అధినాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పై ఏక కాలంలో కత్తులు దూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వంతో కుమ్ముక్కై, ఓటు చోరీ (ఓట్ల దొంగతనం)కి పాల్పడుతోందని ఆరోపిస్తూ,ఆటం బాంబు పేల్చారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్’లో, ఓట్ చోర్ – గడ్డీ చోడ్’ నినాదంతో, పక్షం రోజుల పాటు, ఓటరు అధికార యాత్ర సాగించారు. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబుతో మరో బ్రహ్మాండం బద్దలు కొడతానని రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే,కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దేదించడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ సాగిస్తున్న ఓటు చోరీ యుద్ధ తత్రం ఎంతవరకు ఫలిస్తుంది, ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనేది. ఈ సంవత్సరం చివర్లో, జరిగే  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెల్చేస్తాయి.     అయితే, ఓ వంక  కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై యుద్ధం చేస్తుంటే, మరో వంక కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ’ కథలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, పవన్ ఖేరా,అయన సతీమణి ఇద్దరి పేర్లు రెండేసి నియోజక వర్గాల ఓటరు జాబితాలో ఉన్నాయని, బీజేపీ ఐసెల్’ చీఫ్ అమిత్ మాలవీయ బయట పెట్టారు. కేవలం నోటి మాటలతో కాకుండా. పవన్ ఖేరాకు దేశ రాజధాని ఢిల్లీలోని జంగుపుర, న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గాల ఓటరు జాబితాలలో నమోదైన ఎపిక్ నెంబర్’తో సహా జారీ అయిన ఓటరు  గుర్తింపు కార్డును బయట పెట్టారు.  మాలవీయ ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల  సంఘం, విచారణ చేపట్టింది. పవన్ ఖేరాకు నోటీసులు జారీ చేసింది.   అదలా ఉంటే, రాహుల్ గాంధీ ఓటు చోర్’ నినాదం, ఆయన కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్య సభ సభ్యురాలు,సోనియా గాంధీ ఇంటి తలుపులు తట్టింది. సోనియా గాంధీ,భారతీయ పౌరసత్వం పొందక ముందే,1980లోనే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. 1983లో సోనియా అధికారికంగా భారత పౌరసత్వం పొందినట్లు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. కానీ అంతకు ముందే ఆమె ఓటరు ఎలా అయ్యారనే సందేహంతో, వికాస్ త్రిపాఠి అనే వ్యక్తి సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ ద్వారా ఈ పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు.  ఇందులో ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం సోనియా గాంధీ 1983 ఏప్రిల్ 30న భారత పౌరసత్వం పొందారు. కానీ 1980లో న్యూఢిల్లీలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు నమోదైంది. 1982లో ఆ పేరు జాబితా నుంచి తొలగించారు 1983లో మళ్లీ ఆమె పేరు జాబితాలో చేరింది. దీనిపై పిటిషనర్ అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెకు అప్పట్లో ఏ డాక్యుమెంట్లు ఉన్నాయని, ఆ సమయానికి పౌరసత్వం లేని స్థితిలో ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సీనియర్ అడ్వకేట్ పవన్ నారంగ్ కోర్టులో మాట్లాడుతూ ఇది సరైన ప్రక్రియ కాదని, ఇందులో ఏదో తేడా ఉందన్నారు. ఓటరుగా నమోదు కావడానికి భారత పౌరసత్వం తప్పనిసరి. ఆ సమయానికి ఆమె పౌరురాలు కాకపోయినా, ఆమె పేరు ఎలా జాబితాలోకి వచ్చిందని ప్రశ్నించారు. ఇందులో వేరే వ్యక్తులు ప్రమేయం ఉండొచ్చని, ఎలక్షన్ కమిషన్ అధికారులపై కూడా అనుమానం ఉందన్నారు. ఇది ఓ పబ్లిక్ అథారిటీని మోసం చేసే ప్రయత్నంగా పరిగణించి దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ అంశాన్ని విచారించిన ఢిల్లీ కోర్టు, తదుపరి విచారణను సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. ఆ రోజున తదుపరి విచారణ జరగనుంది. అయితే, ఇది కోటగా వెలుగు చూసిన విషయం కాదు, గత కొంత కాలంగా, సోనియా ఒరు చోర్’ వ్యవహరం సోషల్ మీడియాలో, వైరల్ అవుతూనే వుంది. కాంగ్రెస్ పార్టీ, ‘బుల్ షీట్’  అంటూ కొట్టేసింది. అయితే ఇప్పడు,సోనియా ఓటు చోర్’ ఫిర్యాదును విచారణకు స్వీకరించడంతో, కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తి నెలకొంది.

సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  సెప్టెంబర్ 18 నుంచి వర్షకాల శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం అవుతున్నాయి. ఈ మేరకు గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడి విడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. ఈ సారి కూడా అసెంబ్లీ సమావేశాలకు హజరు కాబోమని ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే, వరుసగా 60 అసెంబ్లీ పని దినాలు హజరుకానిపక్షంలో అనర్హత వేటు పడుతుందని ఇప్పటికే డిప్యూటి స్పీకర్ రఘురామకృష్ణంరాజు వైసీపీ నేతల్ని హెచ్చరించారు. ఇలా ఉండగా, తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా శాసన సభ్యులకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు ఏపీ సభాపతి అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ కార్యక్రమాన్నికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు