స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం?

తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు కోర్టు నిర్దేశించిన మూడు నెలల గడువు ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. అయితే ఈ నెలాఖరులోగా స్థానక  ఎన్నికల నిర్వహణ అసాధ్యంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో మారు హైకోర్టును ఆశ్రయించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల అంశం తేలనందున రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని కోరుతూ తెలంగాణ సర్కార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రిజర్వేషన్ల బిల్లు ఆమోదం కోసం గవర్నర్ కు పంపామనీ, ఆయన వద్ద ఆ బిల్లు ఇప్పటికీ పెండింగ్ లో ఉందనీ రేవంత్ సర్కార్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నది.  నిర్వహించడం అసాధ్యంగా కనిపిస్తూండటంతో తెలంగాణ ప్రభుత్వం మరోసారి హైకోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమయింది. రిజర్వేషన్ల అంశం ఇంకా తేలనుందున మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును కోరే అవకాశాలు ఉన్నాయి. రిజర్వేషన్లపై బిల్లు ఆమోదించామని అది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉందని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నారు.  తెలంగాణలో అన్ని స్థానిక సంస్థల గడువు ముగిసిపోయి, స్థానిక సంస్థలన్నీ  ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలు జరగకపోతే ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనప్పటికీ.. రిజర్వేషన్ల వివాదం కారణంగా  ప్రభుత్వం ముందుకు వెళ్లలేకపోతున్నది. 

జగన్ మొహం చాటేసి.. మిథున్ రెడ్డి పరామర్శకు పేర్నిని పంపారా?

మద్యం కుంభకోణం వైసీపీ పునాదులనే కదిపేలా ఉండటంతో ఆ పార్టీలో కంగారు మొదలైంది. మద్యం కుంభకోణంలో అరెస్టై జైలు పాలైన తమ పార్టీ నేతలను కలవడానికి కూడా వైసీపీ అధినేత జగన్ ముందువెనుకలాడుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి వంటి వారిని కూడా ఆయన ఇంత వరకూ జైలుకు వెళ్లి  పరామర్శించింది లేదు. ఈ విషయంలో ఇప్పటికే చెవిరెడ్డి, మిథున్ రెడ్డిలు ఒకింత అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో.. ప్రస్తుతం జగన్ వాయిస్ గా మారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిశారు. మద్యం కుంభకోణంలో అరెస్టైన మిథున్ రెడ్డి దాదాపు గత నెలన్నరగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని యథా ప్రకారంగా ఆవు కథలా గతంలో చెప్పిన మాటలనే మళ్లీ వల్లెవేశారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై  విమర్శలు గుప్పించారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి 40 రోజులు గడుస్తున్నా, ఇంతవరకు ఒక్కరోజు కూడా ఎందుకు కస్టడీకి తీసుకోలేదంటూ నిలదీశారు. కేవలం కక్ష సాధింపు, మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినిక మానసికంగా కుంగదీయాలన్న దురుద్దేశంతోనే అక్రమంగా మద్యం కుంభకోణం కేసులో ఇరికించి జైల్లో పెట్టారని పేర్ని నాని అన్నారు. మద్యం కుంభకోణంలో నిందితులు చెప్పిన మాటల ఆధారంగా ఒక ఎంపీని అరెస్టు చేయడం అన్నది నిస్సందేహంగా రాజకీయ కక్ష సాధింపే అన్నారు. అక్కడితో ఆగకుండా ఓ వారం పది రోజుల్లో మిథున్ రెడ్డి బయటకు వస్తారని జోస్యం చెప్పారు. బయటకు వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తారన్న హెచ్చరిక కూడా చేశారు. మొత్తం మీద జగన్ మిథున్ రెడ్డికి ముహం చాటేసినా.. ఆయన తరఫున పేర్ని నాని వచ్చి కవర్ చేయడానికి ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

బీఆర్ఎస్ ‘స్థానిక’ ఆశలు గల్లంతేనా?

బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతోందా? 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం, ఆ తరువాత గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కనీసం ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవకుండా సాధించిన జీరో రిజల్ట్ తరువాత ఆ పార్టీ ఇప్పటి వరకూ కోలుకున్నట్లు కనిపించదు. దానికి తోడు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయంగా అంతగా క్రియాశీలంగా వ్యవహరించకపోవడం కూడా ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరంగానే పరిణమించింది. అలాగే వరుస కేసులతో ఆ పార్టీ అగ్రనేతలంతా ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు తాజాగా గోరు చుట్టుమీద రోకటి పోటు అన్నట్లుగా కవిత ఎపిసోడ్ తెరమీదకు వచ్చింది. సొంత పార్టీపైనే ఆమె నిరసన గళం ఎత్తడం.. చివరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనీ, అందుకు బాధ్యులు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లే అని ఆరోపణలు గుప్పించడం.. దీంతో పార్టీ ఆమెను సస్పెండ్ చేయడం జరిగిపోయింది. ఎలా చూసినా ఈ పరిణామం బీఆర్ఎస్ కు శరాఘాతమే అని చెప్పాలి.  ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని స్థాపించడమే కాకుండా తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించే అవకాలున్నాయంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కవిత త్వరలో తెలంగాణ రాజ్య సమితి పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్నారు. అదే జరిగితే..  గ్రామీణ తెలంగాణ ఇప్పటికీ ఒక హౌస్ హోల్డ్ బ్రాండ్ గా ఉన్న టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు భారీగా గండి కొడుతుందని పరిశీలకులు అంటున్నారు.  ఇది స్థానిక సమరంలో బీఆర్ఎస్ కు భారీ నష్టం చేకూరుస్తుందనడంలో సందేహం లేదు. 

కేసీఆర్ పై హరీష్ కుట్ర.. వంటేరు సంచలన ఆరోపణ?

భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఆ పార్టీలో గందరగోళానికి దారి తీసింది.  ఆమె మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ లపై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో పార్టీ ఆమెను సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు ఆమె సస్పెన్షన్  నేపథ్యంలో  సీనియర్ నాయకుడు వంటేరు ప్రతాప్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత స మాజీ మంత్రి హరీష్ రావుపై చేసిన ఆరోపణలను సమర్ధించారు. ఇప్పుడు కాదు.. 2018లోనే హరీష్ రావు కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్రపన్నారని ఆరోపించారు. అంతే కాదు.. హరీష్ రావు తన సొంత మామ కేసీఆర్ కి వ్యతిరేకంగా కుట్రకు ప్రయత్నించారని ఆరోపించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో గజ్వేల్ నుంచి పోటీ చేసినప్పుడు హరీష్ రావు తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కేసీఆర్ ను ఓడించడానికి పూర్తి మద్దతు ఇచ్చారని వంటేరు పేర్కొన్నారు.  కేసీఆర్ ఓడిపోతే అంతా మనదే  అని హరీష్ రావు అప్పట్లో  తనకు డబ్బు, మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారని వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు, సంతోష్ రావు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కవిత  చేసిన ఆరోపణలను వంటేరు సమర్ధించారు. హరీష్ రావు తనకు ఫోన్ చేసి కేసీఆర్ ఓటమికి సహకరిస్తానని చెప్పారన్న విషయాన్ని తాను ఏ దేవుడిపైనైనా సరే ప్రమాణం చేసి చెబుతానని వంటేరు అన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా కుట్ర 2018 ఎన్నికలకు ముందే ప్రారంభమైందని వంటే రు చెప్పారు. అప్పట్లో తానీ విషయం చెప్పినా ఎవరూ వినలేదనీ  అన్నారు.  కవిత సస్పెన్షన్ సమయంలో వంటేరు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం రేపడమే కాకుండా అత్యంత ప్రాధాన్యత కూడా సంతరించుకున్నాయి. 

ప్రజా సమస్యలపై పోరాటాలు బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా?.. నిలదీసిన కవిత

తాను ప్రజా పోరాటాలు చేస్తే వాటిని ప్రజావ్యతిరేక కార్యకలాపాలుగా బీఆర్ఎస్ దుష్ప్రచారం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బీఆర్ఎస్ నుంచి తనను సస్పెండ్ చేసిన తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెంబర్ 3)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జై తెలంగాణ నినాదంతో ప్రారంభించిన ఆమె తనను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ విడుదల చేసిన లేఖలోని రెండు అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు.   మద్యం కుంభకోణం కేసులో తాను అక్రమంగా అరెస్టై ఐదు నెలలు తీహార్ జైలులో ఉండి బయటకు రాగానే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడుతున్నానన్న ఆమె.. అలా ప్రజా సమస్యలపై పోరాడటం పార్టీకి వ్యతిరేకమా అని ప్రశ్నించారు. ఓ బిడ్డ హాస్టల్‌లో చనిపోతే అక్కడి వెళ్లాను. గురుకులాల్లో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాను. బీసీలకు జరుగుతున్న అన్యాయం గురిం చి.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన 42 శాతం హామీ కోసం పోరాడాను, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మహిళలకు 2500 రూపాయలు ఇవ్వాలని గళమెత్తాను ఇవన్నీ బీఆర్ఎస్ వ్యతిరేక కార్యకలాపాలా అని ప్రశ్నించారు బీసీల కోసం మాట్లాడితే తనపై దుష్రచారం చేస్తున్నారని కవిత విమర్శించారు.  

ఏపీకి వచ్చే ఐదేళ్లలో రూ.45 వేల కోట్ల పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి  దార్శనికత గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన దార్శనికత, ప్రగతి కాముకత గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పురోగమిస్తున్న తీరును ప్రపంచం గమనిస్తోంది.  గత జగన్ పాలనలో జరిగిన ఆర్థిక, సామాజిక విధ్వంసం నుంచి బయటపడి రాష్ట్రం ఇప్పుడు ప్రగతి పథంలో నడుస్తోంది. ఈ విషయాన్ని ఆయన అభిమానులో, తెలుగుదేశం పార్టీ నేతలో, శ్రేణులో కాదు ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థ ఈ విషయాన్ని చెబుతోంది.  ఆంధ్రప్రదేశ్ లో అనూహ్యమైన అభివృద్ధి జోరందుకుందని పేర్కొన్న ఆ సంస్థ క్లీన్ ఎనర్జీ నుండి ఎలక్ట్రానిక్స్ వరకూ, చమురు నుంచి గ్యాస్  వరకు అన్ని రంగాలలోని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పోటీలు పడుతున్నాయి. వచ్చే ఐదు సంవత్సరాలలో రాష్ట్రాలనికి  45,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రానున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, నారా లోకేష్ ల కృష్టి, విశ్వసనీయతే ఇందుకు కారణమని పేర్కొంది.   

లాస్ ఏంజెల్స్ లో సైన్యం మోహరింపును తప్పుపట్టిన అమెరికా కోర్టు

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో  చుక్కెదురైంది.  దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని మోహరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కాంగ్రెస్ దేశంలో చట్టాల అమలుకు సైనిక బలగాలను ఉపయోగించడంపై ఉన్న నిషేధ చట్టాన్ని ట్రంప్ సర్కార్ ఉల్లంఘించిందని చీవాట్లు పెట్టింది.   ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో లాస్ ఏంజెలెస్‌లో జరిగిన నిరసనలను అణచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డ్ దళాలను, మెరైన్లను మోహరించింది. అయితే, ఇది 'పోసీ కమిటాటస్ యాక్ట్'ను ఉల్లంఘించడమేనని  కోర్టు తీర్పు వెలువరించింది. లాస్ ఏంజిల్స్ లో జరిగినవి నిరసనలు మాత్రమేననీ, తిరుగుబాటు ఎంత మాత్రమూ కాదనీ పేర్కొన్న కోర్టు, ఆ నిరసనలను అదుపు చేయాల్సింది పోలీసులు మాత్రమేననీ స్పష్టం చేసిన కోర్టు.. ఇప్పటికీ అక్కడ నేషనల్ గార్డ్స్ సిబ్బంది మోహరించి ఉండడాన్ని తప్పుపట్టింది. ఈతీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  కాలిఫోర్నియా గవర్నర్ అయితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కోర్టు పరిరక్షించిందని వ్యాక్యానించారు.    ఈ తీర్పును వైట్‌హౌస్  వ్యతిరేకించింది.   దీనిని ఫెడరల్ అప్పీల్ కోర్టులో సవాల్ చేసింది.  

కవిత సస్పెన్షన్.. పొలిటికల్ గా, వ్యక్తిగతంగా కూడా కేసీఆర్ కు బిగ్ ఇష్యూనే!

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె,  ఎమ్మెల్సీ కవితపై సస్పెన్షన్ ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కవిత సస్పెన్షన్ ఒక పొలిటికల్ హీట్ గా మారడానికి   ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని తక్కువ చేస్తే ఆమె గతంలో మాట్లాడిన మాటలు, చేసిన వ్యాఖ్యలు కారణం. సరే ఆ విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు సంబంధించినంత వరకూ కవిత సస్పెన్షన్ కేవలం  సస్పెన్షన్ కాదు.. పార్టీ చీలికకు దారి తీసే ఒక పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి పార్టీ అధినేత.. కేసీఆర్ కవిత సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం మామూలు విషయం కాదనీ అంటున్నారు. కవిత తీరు పట్ల కేసీఆర్ ఎంతగా విసిగిపోయి ఉంటారు, పార్టీ ఉనికికే ముప్పుగా ఆమె వ్యాఖ్యలు చేయడం ఆయనను వ్యక్తిగతంగా ఎంతగా మానసికక్షోభకు గురై ఉటారో.. ఆమెను సస్పెండ్ చేయడం ద్వారా తెలుస్తోందని అంటారు. కవితపై బీఆర్ఎస్ వేసిన సస్పెన్షన్ వేటు కేవలం ఒక క్రమశిక్షణ చర్య మాత్రమే కాదనీ,  భావోద్వేగం, మానసిక వేదనల ఫలితమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి.   కవిత సస్పెన్షన్ తో కేవలం పార్టీలోనే కాదు.. కేసీఆర్ కుటుంబంలో కూడా చీలికకు దర్పణమని చెబుతున్నారు.  కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టకాలం ఇదేనని చెప్పవచ్చు. కుమార్తె తీరుతో పార్టీ ప్రతిష్ట  మసకబారడమే కాకుండా.. ఇలాంటి పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కేసీఆర్ జీర్ణించుకోలేకపోయారంటున్నారు. అందుకే గతంలో అంటే పార్టీ పరాజయం తరువాత ఆమె పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా, నేరుగా సొంత సోదరుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించినా, పార్టీ లైన్ కు భిన్నంగా బీసీ రిజర్వేషన్లను సమర్ధించినా కేసీఆర్ ఆమెపై చర్యలకు ఉపక్రమించలేదు సరికదా.. కనీసం మందలించను కూడా మందలించకుండా వెనకేసుకు వచ్చిన చందంగా వ్యవహరించారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకున్నా.. కవిత సస్పెన్షన్ పార్టీని ఓ కుదుపు కుదిపిందనడంలో సందేహం లేదు.  సొంత కూతురిపై సస్పెన్షన్ వేటు వేయడం ద్వారా కేసీఆర్   కుటుంబ సంబంధాలు, రక్త సంబంధం కంటే పార్టీని రక్షించడమే ముఖ్యమని పార్టీ శ్రేణులకు చాటారని ఎంతగా చెప్పుకుందామని ప్రయత్నించినా జరగాల్సిన డ్యామేజి అయితే జరిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు కవిత సొంత దారి చూసుకుంటున్నారని వినిపిస్తోంది. అంటే సొంతంగా కొత్త పార్టీ పెట్టి రాజకీయంగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. అదే జరిగితే.. తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎప్ ప్రభ మసకబారినట్లేనని అంటున్నారు.  కవితపై విమర్శలు గుప్పించడం, ఆమె విధానాలను తప్పుపట్టడం ఎంత కాదనుకున్నా.. కేసీఆర్, కేటీఆర్ లకు ఒకింత ఇబ్బందికరమేనని చెప్పాల్సి ఉంటుంది.  అన్నిటికీ మించి తెలంగాణ రాజకీయాలలో కవిత సొంత పార్టీ సమీకరణాలను మార్చడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా వ్యవహరించకుండా ఉంటున్న కేసీఆర్.. ఈ పరిణామాలతో మరింత సైలెన్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అదే జరిగితే.. బీఆర్ఎస్ పుంజుకోవడం అంత సులువు కాదని కూడా అంటున్నారు. 

ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకతవకలపై ఈడీ నజర్

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో అవకతవకలు జరిగినట్లుగా బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు ఎఫ్ ఐ ఆర్ లను ఆధారంగా   ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల గ్రామంలో ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్పటి ఎండి అండ్ సీఈఓ అయిన ఉమేష్ చంద్ర ఆసవా కుమారుడు రోహిత్ అసవా పేరు మీద ఉన్న 1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను   తాత్కాలికంగా జప్తు చేసింది.  అప్పటి చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, అప్పటి ఎండి అండ్  సీఈవో ఉమేష్ చంద్ అసవా ,  సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తమ దాస్ మంధాన మరియు ఇతరు లు కలిసి అధికారిక పదవులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. లేని ఆస్తులపై రుణాలు పంపిణీ చేయడం ద్వారా ఆ పంపిణీ  చేసిన మొత్తం రుణ   రెండు శాతం నుండి నాలుగు శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లుగా ఈడి దర్యాప్తులో వెల్లడైంది. ఆ విధంగా వసూలు చేసిన డబ్బులతో కుటుంబ సభ్యుల పేర్లతో అనేక స్థిరాస్తులను సంపాదించినట్లుగా ఈడి గుర్తించింది. ఆ విధంగా  ఉమేష్ చంద్ర తన కొడుకు పేరుతో రెండు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.  ఈ నేపథ్యంలోని ఈడీ అధికారులు ఉమేష్ చంద్ర కుమారుడి పేరుతో పేరుతో ఉన్న 1.1 కోట్ల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. 

ఓయూ లో నకిలీ ఐఏఎస్ ల హల్ చల్!

చదువుల తల్లి కొలువుతీరిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆకతాయిల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాధారణ జనాలకు అనుమతి ఉండడంతో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది.  యూనివర్సిటీ లో విద్యార్థులు వెళ్లలేని ప్రాంతాలలోకి కూడా వెళ్లి హల్ చల్ చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒక ఇన్నోవా కారు ఆపి అక్కడ ఓ నలుగురు మూత్ర విసర్జన చేయడాన్ని ఒక విద్యార్థి అడ్డుకున్నాడు.  ఈ ప్రాంతంలో విద్యా ర్థులు తిరుగుతూ ఉంటారని, ఇక్కడ మూత్రవిసర్జన చేయడం కరెక్ట్ కాదని వారించాడు. దీంతో ఆ నలుగురూ విద్యార్థిపై దాడి చేశారు.. తాము ఐఏఎస్ అధికారు లమని, నేషనల్ హైవే అథారిటీ కోసం పని చేస్తు న్నామని, నేషనల్ హైవే సర్వే కోసం వచ్చామని, ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తే తమని అడ్డుకుంటావా అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నారు..  విద్యార్థిని పరుగులు పెట్టించి మరీ కొట్టారు.. .అయితే విద్యార్థిని కొడు తుంటే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్ళందరూ పరారయ్యే ప్రయత్నం చేశారు.. తోటి విద్యార్థు లంతా కలిసి ఆ నలుగురిని పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు.  తాము ఐఏఎస్ అధికారులమని పోలీసుల ముందు బుకాయించే ప్రయత్నం చేశారు . దీంతో పోలీస్ అధికారులు తమదైన శైలిలో వాళ్ళని ప్రశ్నించ డంతో అసలు విషయం బట్టబయలైంది. ఐఏఎస్ అధికారుల పేర్లు చెప్పుకొని , వీళ్ళు దందా లు చేస్తున్నారని, అంతేకాకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల విచార ణలో బయటపడింది.ఈ నేపథ్యం లో నేషనల్ హైవే అథారిటీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు  కేసు నమోదు చేశారు. అలాగే యూనివర్సిటీలో అసభ్యకర రీతిలో ప్రవర్తించడం,   విద్యార్థిపై దాడి కేసులు కూడా  రిమాండ్ కు తరలించారు.

త్వరలో ఏపీలో లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటు : సీఎం చంద్రబాబు

  ఏపీను తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఓడరేవును జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మార్చేందుకు వీలుగా జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్రమైన కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ కీలక ప్రణాళికతో ఏపీని దేశంలోనే అగ్రగామి లాజిస్టిక్స్ హబ్ గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.   వైజాగ్‌లో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్’కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సహజ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. "మన రాష్ట్రానికి కేవలం మన అవసరాల కోసమే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక వంటి భూపరివేష్టిత రాష్ట్రాల కార్గో రవాణాకు కూడా కీలక కేంద్రంగా మారే అపారమైన అవకాశం ఉంది. వారి సరుకును ఏపీ పోర్టుల ద్వారానే ప్రపంచానికి చేరవేసేలా ఒక పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నాం" అని వివరించారు. ఈ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి, దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్ వంటి అంశాలపై వారితో విస్తృతంగా చర్చించారు. భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పు తీరంలో ఏపీలో మాత్రమే ఉన్నాయని, ఇది మనకు సానుకూల అంశం అని పేర్కొన్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి శ్రీకారం కేవలం రవాణాతోనే ఆగిపోకుండా, పోర్టుల చుట్టూ ఒక పారిశ్రామిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. "రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూలపేట వంటి పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, ఆధునిక టౌన్ షిప్ ల నిర్మాణం కోసం దాదాపు 10 వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నాం. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు త్వరలోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తాం," అని ప్రకటించారు. లాజిస్టిక్స్ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ‘ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు

  తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 03 నుండి 05వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేశారు. సాయంత్రం ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 03న పవిత్రప్రతిష్ట‌ చేపడుతారు. ఉదయం 09 - 11 గం.ల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్నపన తిరుమంజమునకు ఏర్పాట్లు చేపడుతారు. ఉదయం 11 గం.ల నుండి 12.30 గం.ల వరకు కల్యాణ మండపమునందు స్నపన తిరుమంజనం, సేవాకాలము, శాత్తుమొర ఆస్థానం చేపడుతారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7.30 - 9.00 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.    సెప్టెంబరు 04వ తేదీ స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడ వీధులు, శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు. సాయంత్రం 5.30 - 6.30 గం.ల మధ్య ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.సెప్టెంబర్ 05వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర , వేద శాత్తుమొర చేపడుతారు.  రాత్రి ఉత్సవ మూర్తులు కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధిగా వేంచేపు చేస్తారు.పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులు రూ. 500/- చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఒక టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది, ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుంది.  పెద్ద జీయర్, చిన్న జీయర్, ఆలయ డిప్యూటీ ఈవో  వి.ఆర్. శాంతి, ఏఈఓ  ఏబీ నారాయణ చౌదరి,  సూపరింటెండెంట్ లు చిరంజీవి, ఆలయ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  

సుగాలి ప్రీతి మృతి కేసు సీబీఐకి అప్పగింత

  ఏపీలో  సంచలనం సృష్టించిన  పదోతరగతి విద్యార్థి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2017 ఆగస్టు 18న కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. గత వైసీపీ హయాంలో ఈ కేసు సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతల హామీ ఇచ్చారు.  ఈనేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు.. ప్రతిసారి పార్టీ ఆఫీస్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ అడిగాము.. కానీ ఆయన ఇవ్వలేదని సుగాలి ప్రీతి తల్లి వాపోయింది. కొన్ని రోజులుగా ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తెస్తాం : మంత్రి లోకేష్

  కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరిన్ని ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్ర విద్యా ,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కడప జిల్లా, సికె దిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఇఎంసి), లో రూ,231.50 కోట్లతో నూతనంగా ఏర్పాటైన "ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం"ను,ఎంయస్  టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎం ఐ హెచ్) లోని ఎం/యస్  టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను నారా లోకేష్ ప్రారంభించారు.  కార్యక్రమంలో ముందుగా టెక్నో రూమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్  యూనిట్ ను, డార్క్ రూమ్, ఈఎస్డి ప్రొటెక్టెడ్ యూనిట్ లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కంపెనీలో ఉత్పత్తి సామర్థ్యం కంపెనీ ప్రొడక్షన్ వివరాలను అక్కడ యాజమాన్యంతో అడిగి తెలుసుకున్నారు. రూ,55.21 కోట్ల ఏర్పాటైన టెక్నో డోమ్ కంపెనీలో ఉత్పత్తి నిర్వహణ పనితీరు అక్కడి ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ,50 కోట్లతో "టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీ ఉత్పత్తి యూనిట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా టెక్సానా యూనిట్లోని అన్ని విభాగాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం వస్త్ర తయారీ యూనిట్లో మహిళా ఉద్యోగులను పలకరించారు. టైలరింగ్ సంబంధించి పని ఎలా ఉంది, ఉద్యోగం సంతృప్తి గా ఉందా.. అంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా టెక్సానా ఇండియా ప్రయివేటు లిమిటెడ్" కంపెనీలో.. మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ "గెట్ టు గెదర్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవింపబడుతారో అపుడే సమాజం కూడా గౌరవంగా ఎదుగుతుందన్నారు.  మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తేనే ఆ కుటుంబంతో పాటు ఆ సమాజం మొత్తం అభివృద్ధి పథంలోకి వెళుతుందన్నారు. మహిళల అభ్యున్నతితోనే సమాజం అభివృద్ధి చెందుతున్న నిజాన్ని నమ్మిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. గెలుపొందిన సంవత్సరం లోపే హామీలిచ్చిన మేరకు సూపర్-6 పథకాలను సూపర్ సక్సెస్ గా నెరవేర్చగలిగామన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా అణచి వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహోన్నతమైన ప్రణాళికతో పరిపాలన సాగుస్తున్నారన్నారు.  *కొప్ఫర్తికి ప్రపంచ ఖ్యాతిగాంచిన పరిశ్రమలు  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీ ఏఏసి ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కును భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళతమన్నారు. అలాగే లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు మరిన్ని ప్రఖ్యాతి గాంచిన కంపెనీలను తీసుకొస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మహిళా సిబ్బందితో మంత్రి సూపర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టిజి భరత్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్, జెసి అదితి సింగ్, టెక్నో డోమ్ కంపెనీ సిఎండి సాకేత్ గౌరవ్, ప్లాంట్ హెడ్, విక్టర్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ జోష్, పాల్గొన్నారు. వారితో పాటు కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఎర్విన్, ఏపీఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, డీఐసి జీఎం చంద్ బాషా,  సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

రికార్డు స్థాయిలో ఏపీకి ఎరువుల కేటాయింపు

   గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు జరుగుతోంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరుకుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా విక్రయాలు పెరిగాయని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడంతో రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.  కేంద్రం ఇచ్చిన ఎరువులు, యూరియా నిల్వలను మార్క్‌ఫెడ్ సమన్వయంతో రైతులకు సమయానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.  కాకినాడ పోర్టుకు 17,154 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టుకు 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకు 26,547 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది.  ఈ సరఫరాతో పాటు గత 10 రోజుల్లో రాష్ట్రానికి 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా..వచ్చే  10 రోజుల్లో అదనంగా 30 వేల మెట్రిక్ టన్నులు రానున్నట్టు వ్యవసాయ శాఖ తెలియచేసింది.   దీనికి తోడు దేశీయంగా వివిధ కంపెనీల నుంచి సరఫరా అయ్యే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని... రైతులకు ఎరువుల సమస్య తలెత్తే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ కు ఇప్పటి వరకూ 5.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా అయినట్టు వ్యవసాయశాఖ తెలియచేసింది. అటు వచ్చే రబీ సీజన్ కు కూడా మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.  మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాలో 78% వృద్ధి ఖరీఫ్ సీజన్ కు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా  గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు  అన్నీ కలిపి గతేడాది కంటే 1.20 లక్షల మెట్రిక్ టన్నుల మేర అదనంగా మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేశామని అధికారులు తెలిపారు. గతేడాది 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తే... ఈ ఏడాది ప్రస్తుత  సీజన్లో 2,72,000 మెట్రిక్ టన్నుల మేర మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా జరిగిందని వెల్లడించారు.  గతంతో పోలిస్తే ఇది 78 శాతం మేర అధికమని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు  స్పష్టం చేస్తున్నారు. ఇక గత ఏడాదిలో 1,11,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తే ..ఈ ఏడాది 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని వివరించారు. గతాని కంటే అధికంగా 91 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని వివరించారు. ఇక డీఏపీ సరఫరా కూడా గతానికి మించి 85 శాతం జరిగిందని వెల్లడించారు. గత ఏడాది 23,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగా... ఈ ఏడాది 51,700 మెట్రిక్ టన్నుల మేర సరఫరా జరిగిందని స్పష్టం చేశారు.  ఈసారి 28 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సరఫరా చేశామని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఈ స్థాయిలో జరిగిన భారీ కేటాయింపులతో ప్రస్తుత సీజన్ తో పాటు వచ్చే రబీ సీజన్‌లోనూ రైతులకు ఎరువుల కొరత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. యూరియా, ఎరువుల కేటాయింపుల విషయంలో కేంద్రంతో, రైతులకు సరఫరా చేసే అంశంలో మార్క్‌ఫెడ్ తో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

లండన్‌ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి

  కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాది స్తాడని కలలు కన్నా ఓ తల్లిదండ్రులకు విధి విషాదం మిగిల్చింది. లండన్ లో చదువుకోవ డానికి వెళ్లిన తన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లిపో యడాని తెలియ గానే ఆ తల్లిదం డ్రులు  దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లాలోని వేమూరు గ్రామానికి చెందిన రాపోలు రవీందర్ తన కుటుంబ సభ్యుల తో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చి...మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత కాలనీ లో ఉన్న శ్రీసాయి రెసిడెన్సీ లో నివా సం ఉంటూ... ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొన సాగిస్తున్నారు.  రాపోలు రవీందర్ కుమారుడు రాపోలు రిషితేజ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. కేవలం నాలుగు నెలల క్రితం అనగా మే 9వ తేదీన రిషి తేజ్ ఎంబీఏ చదువుకో వడం కోసం లండన్ కి వెళ్ళాడు. ఈస్ట్ లండన్ లోని బీచ్ లో సన్ రైజ్ చూడడం కోసం 2 కార్లు లలో 9 మంది స్నేహితులతో కలిసి  వెళ్తుండగా... ఒక వాహనం అత్యంత వేగంగా వచ్చి వీరి కారును ఢీ కొట్టింది. ఇద్దరు అక్కడి కక్కడే మృతిచెంద గా పలువురికి  గాయాలయ్యాయి. డ్రైవర్ లు సేఫ్ గా ఉన్నారని తెలి పారు. రిషితేజ్ హైదరాబాద్ లో BBA పూర్తి చేసి దిల్ రాజు కు సంబంధించిన  మ్యగో ఛానెల్ లో కొద్దికాలం ఉద్యోగం చేశాడని....పై చదువుల కోసం ఈస్టర్న్ లండన్ యూనివర్సిటీ లో ఎంబీఏ చేయడం కోసం లండన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

బీఆర్‌ఎస్ పార్టీలో కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత : సత్యవతి రాథోడ్

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పేగు బంధం కన్న పార్టీని నమ్ముకున్న కోట్లాది కార్యకర్తలకే  ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో సత్యవతి రాథోడ్‌తో పాటు టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర, నేతలు రజని సాయిచంద్, శీలా‌రెడ్డి, చారులత, నిరోషా తదితరులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతు కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత మూడు నెలలుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూశామని అన్నారు. గులాబీ బాస్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. మూడు నెలలుగా కవిత తన తీరుతో బీఆర్‌ఎస్ పార్టీ‌కి ఎంతో నష్టం చేశారని ఆరోపించారు. ఆమే కామెంట్స్ పార్టీ శ్రేణులకు ఇబ్బందులకు గురి చేశాయని అన్నారు. నేడు కవితను సస్పెండ్ చేస్తూ తమ పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయం అందరినీ, మరీ ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందని సత్యవతి రాథోడ్ అన్నారు. కార్యకర్తల కన్నా ఫ్యామిలీ ఎక్కువ కాదనే విషయం మళ్లీ స్పష్టమైంందని అన్నారు.  కవిత‌కు నచ్చజెప్పాలని చూసినా.. ఆమె వినకపోవడం వల్లే సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పార్టీ లైన్ దాటిటే ఎవరికైనా ఇదే శిక్ష అనే సందేశాన్ని అధినేత ఇచ్చారని తెలిపారు. పార్టీ గులాబీ దళపతి మళ్లీ జనాల్లోకి రావాలని బలంగా కొరుకుంటున్న తరుణంలో కవిత పార్టీని పలు రకాలుగా ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌లు కేసీఆర్‌కు కుడి ఎడమ భుజాల్లాంటి వారని అభివర్ణించారు. వారిద్దరిపై కవిత నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక పీసీ ఘోష్ కమిషన్ కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదని సెటైర్లు వేశారు. శాసన సభలో హరీష్ రావు ఒంటి‌చేత్తో రేవంత్ ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారని కొనియడారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హరీష్ రావు ప్రసంగాన్ని కొనియాడుతుంటే.. ఆయనను కవిత విమర్శించడంతో ఆమె ఏ లైన్లో ఉన్నారో అర్థం అవుతోందని సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్ కూతురుగా కవితకు ఎక్కడికి వచ్చినా ప్రజలు ఘన స్వాగతం పలికారని సత్యవతి రాథోడ్ అన్నారు. కానీ, ఆ గౌరవాన్ని కవిత నిలుపుకోలేకపోయిందని తెలిపారు. పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత అనే మాట మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. అందుకు సమాధానంగా పార్టీ కేడర్ కవిత ఉంటే ఎంత.. లేకపోతే ఎంత అంటూ సమాధానం ఇచ్చిందని అన్నారు.

పెండ్లిమర్రు ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

  వైఎస్ఆర్  కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రులో రూ.12 కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి లోకేష్ బిఎ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనది, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను కోరి తీసుకున్నా. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి మంత్రిగా నేను ఏంచేయాలో చెప్పాల్సిందిగా సూచనలు అడిగారు. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీ పెంచాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తిచేశారు.  కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ అల్లం శ్రీనివాసరావు, విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.