తల్లీ కొడుకుల న్యాయపోరాటం నాన్ స్టాప్.. జగన్ పై చెన్నై ట్రైబ్యునల్ కు విజయమ్మ

ఆస్తుల వ్యవహారంలో తల్లీ కొడుకుల మధ్య న్యాయపోరాటం నాన్ స్టాప్ గా సాగుతోంది. సరస్వతి పవర్ కంపెనీ వ్యవహారంలో ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.  సరస్వతి పవర్ సిమెంట్స్ వ్యవహారాలన్నీ చట్టబద్ధంగానే జరిగాయని పేర్కొంటూ.. కుటుంబ వివాదంపై తన కుమారుడు జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ వేస్తే.. ఎన్సీఎల్టీ విచారించి జగన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంటూ విజయమ్మ చెన్నై ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు.   విషయమేంటంటే.. సరస్వతి పవర్ కంపెనీ విషయంలో జగన్, భారతి  విజయమ్మకు తమ వాటాలను గిఫ్ట్ డీడ్ కింద రాసిఇచ్చి డైరెక్టర్లుగా వైదొలిగారు. అయితే విజయమ్మ షర్మిలకు ట్రాన్స్ ఫర్ చేయడంతో తాము గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వాటాలను వెనక్కు తీసుకుంటామని కోరుతూ జగన్ ఎన్సీ ఎల్టీని ఆశ్రయిం చారు.  దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ  జగన్ కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అసలు జగన్ సరస్వతి పవర్ విషయంలో ఇంతగా పట్టుబట్టడానికి రాజకీయంగా తనను వ్యతిరేకిస్తున్న సోదరి షర్మిలకు తల్లి విజయమ్మ మద్దతు పలకడమేనని పరిశీలకులు అంటున్నారు. కాగా ఎన్సీఎల్టీ  జగన్ కు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ  విజయమ్మ చెన్నై ట్రైబ్యు నల్ ను ఆశ్రయించారు.  దీంతో తల్లి కొడుకుల మధ్య న్యాయపోరాటం కొనసాగుతోందని అర్థమౌతోంది. ఇటీవల వైఎస్ వర్ధంతి సందర్భంగా ఇడుపుల పాయలో తల్లి విజయమ్మతో జగన్ ముభావంగా ఉండటం తెలిసిందే. సరస్వతి పవర్ వాటాల విషయంలో విభేదాలే అందుకు కారణమని భావిస్తున్నారు. 

సీఎం చంద్రబాబు కోసం కొత్త హెలికాప్టర్.. ఎందుకంటే?

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుయడు కోసం కొత్త  ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. గత రెండు వారాలుగా చంద్రబాబు ఈ కొత్త హెలికాప్టర్ లోనే పర్యటనలు చేస్తున్నారు.  గతంలో ఉన్న పాత హెలికాప్టర్ కు స్థానంలో ఈ కొత్త  ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ వినియోగిస్తున్నారు.  ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రయాణించేందుకు అణువుగా ఉండే ఈ హెలికాప్టర్ సీఎం భద్రతకే కాకుండా సమయం ఆదా అవ్వడంలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.  ఇంతకీ పాత హెలికాప్టర్ ను ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే.. ఆ పాత బెల్  హెలికాప్టర్ లో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండదు. భద్రతా పరంగా కూడా బెల్ కంటే ఇప్పుడు తీసుకువచ్చిన కొత్త హెలికాప్టర్ ఎంతో మెరుగు.  ఇక పాత హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యస్థానికి చేరుకునే వారు.  ఆర్థికంగా కూడా ఇది ఎక్కువ వ్యయంతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్త హెలికాప్టర్ ను అధికారులు అందుబాటులోనికి తీసుకువచ్చారు.  ఈ కొత్త హెలికాప్టర్ లో చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసం నుంచి నేరుగా జిల్లాల పర్యటనలకు వెళ్లడానికి వీలవుతుండటంతో ఆర్థికంగా తక్కువ ఖర్చు అవ్వడమే కాకుండా సమయం కూడా ఆదా అవుతోందంటున్నారు.  

తెలంగాణ జాగృతి.. కవిత వ్యతిరేక ఆకృతి!?

ఇప్పటి వరకూ కవితకు బీఆర్ఎస్ లోనే వ్యతిరేకత ఉందని అంతా భావించారు.    ప్రస్తుతం ప్రస్తుతం ఆమె అధ్యక్షత వహిస్తోన్న తెలంగాణ జాగృతిని పూర్తి స్థాయి పార్టీ చేస్తారన్న వార్తలు వెల్లువెత్తాయి. అయితే  ఈ విషయంలో కవిత  చేసిన కామెంట్ ఏంటంటే తన భవితవ్యానికి వచ్చిన తొందరేం లేదని. అంతే కాదు తాను 27 ఏళ్ల వయసులో చిన్న బిడ్డను తీసుకుని ఇక్కడికి వచ్చాననీ.. ఆనాటి నుంచి ఈ నాటి వరకూ తన జీవితం రోడ్డు మీదే ఉందని అన్నారామె. విచిత్రమైన విషయమేంటంటే.. ఇప్పుడు తెలంగాణ జాగృతి నేతలు సైతం ఇదే తరహా కామెంట్ చేశారు. మేడం మీరే కాదు మీరు తీసుకున్న నిర్ణయాల కారణంగా తాము కూడా మళ్లీ రోడ్డు మీద పడ్డట్టయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు  జాగృతి ఫౌండర్, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్. దీంతో కవితకు భారీ షాక్ తగినట్లైంది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆమె రాజీనామా సమయంలో  ఆ సంస్థ ఫౌండర్ గా పేరున్న రాజీవ్ సైతం రివర్స్ కావడంతో.. కవిత భవిత అడకత్తెరలో పోకచెక్కలా మారినట్టు భావిస్తున్నారంతా. ఇప్పటి వరకూ ఆమె వెనక ఉన్నది జాగృతి ఒక్కటే అనుకుంటే.. ఇప్పుడా జాగృతిలోనూ చీలిక రావడంతో.. ఆమె వెనక ఈ సంస్థ కూడా పూర్తిగా లేదన్న విషయం తేట తెల్లమైంది. ఇప్పటికే ఆమె తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లోంచి బీఆర్ఎస్ పార్టీ గుర్తును తొలగించారు. తాను మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ అన్న సవరణలు చేశారు. కేవలం కేసీఆర్ బొమ్మ మాత్రమే ఉంచారు.   ఇప్పటి వరకూ ఎన్టీఆర్, వైయస్ వంటి వారు మరణించాక మాత్రమే వారిని భిన్న వర్గాల వారు ఓన్ చేసుకున్నారు. దాదాపు దేశంలో తొలిసారిగా.. తన తండ్రి ద్వారా సస్పెన్షన్ వేటు ఎదుర్కున్న కవిత.. ఆయన బొమ్మను ఇంకా తన సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో ఉంచుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి కవిత భవితేంటో.

భక్తసంద్రంగా మారిన ఖైరతాబాద్

ఖైరతాబాద్ లో ఉన్న బడా గణేష్ దర్శనానికి  గురువారం(సెప్టెంబర్ 4)  రాత్రి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి  ఉండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఖైరతాబాద్ గణేషుడి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఖైరతాబాద్ భక్త జనసంద్రంగా మారింది. దాదాపు  28 లక్షల మంది ఖైరతాబాద్ గణేషుడిని దర్శించుకున్నారని నిర్వాహకులు తెలిపారు.  ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఖైరతాబాద్ మహా గణపతిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.   ఒకవైపు  భక్తులు పెద్ద ఎత్తున దర్శనానికి తరలి వస్తుంటే... మరోవైపు గణేష్ నిమజ్జనానికి పోలీస్  ఉన్నతాధి కారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం (సెప్టెంబర్ 5)  వినాయక నిమజ్జనం జరగనుంది.   ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంశనివారం (సెప్టెంబర్ 6) మధ్యాహ్నం ఒంటిగంటన్నర లోగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగం టర్గెట్ గా పెట్టుకుంది.   కాగా, జంటనగరాలలో వినాయక నిమజ్జనం సందర్భంగా దాదాపు 302 కిలోమీటర్ల మేర గణేష్ శోభయాత్ర జరుగుతుంది. ఇందు కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇక జీహచ్ఎంసీ గణేష్ నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 13 కంట్రోల్ రూములు ఏర్పాటు చేసింది. 30 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహించనుంది. అలాగే 169 యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దింపుతున్నాయి.  ఇక వినాయక నిమజ్జనం కోసం 20 ప్రధాన చెరురువుల, 72 కృత్రిమ కొలనులు సిద్ధం చేశారు. ఇక పోతే 134 క్రేన్లు, 239 మొబైల్ క్రేన్లు రెడీ చేశారు. ఇక హుస్సేన్ సాగర్ లో 9 బోట్లను రెడీ చేశారు. శానిటేషన్ కోసం 14 వేల 486 మంది సిబ్బందిని నియోగించారు.  శనివారం (సెప్టెంబర్ 6) 50 వేల గణేష్ విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. 

వేలంలో మైహోం భూజా గణేషుడి లడ్డూ ధర అరకోటిపైనే!

 హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవాలలో వాడవాడలా గణేష్ మంటపాలను ఏర్పాటు చేస్తారు. అదే విధంగా.. మండపాలలో కొలువై పూజలందుకున్న గణేషుడి లడ్డూల వేలం కూడా ఒక సంప్రదాయంగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ లడ్డూను వేలం పాటలో దక్కించుకోవడాన్ని భక్తులు ఒక ఘనతగా, ఎంతో గొప్పగా ఫీలౌతుంటారు. గత కొంత కాలం వరకూ గణేష్ లడ్డూ వేలం అంటూ బాలాపూర్ గణపతి లడ్డూ వేలం మాత్రమే గుర్తుకు వచ్చేది. అయితే గత కొన్నేళ్ల నుంచీ పలు మండపాలలో  వేలంలో లడ్డూ ధరల లక్షల రూపాయలు పలుకుతోంది. ఈ ఏడాది హైదరాబాద్ లోని మైహోం భూజా లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో లడ్డూ వేలం ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులనూ తిరగరాసింది.   రాయదుర్గంలోని మై హోమ్ భూజాలోని లడ్డూ వేలంలో   అక్షరాలా 51లక్షల 77 వేల777 రూపాయలు పలికింది.  ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి వేలం పాటలో ఈ ధరకు  లడ్డూను సొంతం చేసుకున్నారు.  

ట్రంప్ విధానాలతో అమెరికా దివాళా.. మొట్టికాయలు వేసిన అప్పీళ్ల కోర్టు!

భార‌త్ అంటే భ‌గ్గుమంటున్నారు ట్రంప్. అంతేనా  ఇండియాపై  యాభై శాతం సుంకాల మోత మోగిస్తున్నారు. దీంతో  భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవ్వాల్సిన సరుకంతా  ఇండియాలోనే డెడ్ చీప్ గా అమ్ముకుని అస‌లైనా స‌రే రాబ‌ట్టుకోవాల్న ఆలోచన చేస్తున్నారు మన వ్యాపారులు.   2024- 25 నాటికి భార‌త్ యూఎస్ ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 131 బిలియ‌న్ డాల‌ర్లు కాగా.. దీనిని  2030 నాటికి 500 బిలియ‌న్ డాల‌ర్లకు పెంచాలని  ఇరు దేశాలూ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈలోగా ట్రంప్ రెండో సారి పీఠ‌మెక్క‌డంతో ప్ర‌పంచంలో ఉన్న అన్ని దేశాల‌ కంటే  భార‌త్ నే   టార్గెట్ గా పెట్టుకున్నారు ట్రంప్.  ప్ర‌స్తుతం అమెరికాలో కంపెనీలకు సీఈఓలుగా, ఇత‌ర ఉన్న‌త స్థానాల్లో ఉన్న భార‌తీయుల నుంచి మొద‌లు పెడితే.. సాదా సీదా ఉద్యోగుల వ‌ర‌కూ అందరినీ  అమెరిక‌న్ కంపెనీలు తొల‌గించాల‌ని ట్రంప్ పిలుపునిచ్చారు. ఇక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితి చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది. అమెరికాలో అమ్ముడు పోతున్న ఐఫోన్లు స‌గానికి స‌గం భార‌త్ లో త‌యార‌వుతున్న‌వే. అలాగే.. భార‌త్ వ‌ల్ల ఏయే అమెరిక‌న్ కంపెనీలు, ఎంతేసి లాభాలు పొందుతున్నాయో.. లిస్ట్ చూస్తే గూగుల్, మెటా అమేజాన్, యాపిల్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఏటా భార‌త్ డిజిట‌ల్ రంగం నుంచి 15 నుంచి 20 బిలియ‌న్ డాల‌ర్ల మేర ల‌బ్ధి పొందుతున్నాయి. అదే విధంగా  మెక్ డొనాల్డ్, కోకాకోలా స‌హా ఇత‌ర కంపెనీలు ఇక్క‌డి నుంచి మ‌రో 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర సంపాదిస్తున్నాయి.  జేపీ మోర్గాన్, మెక‌స్సీ, గోల్డ్ శాక్స్ వంటి వాల్ స్ట్రీట్ ఫైనాన్షియ‌ల్ క‌న్సెల్టెన్సీలు కేవ‌లం ఫీజుల రూపంలోనే 15 బిలియ‌న్ డాల‌ర్ల మేర వెన‌కేస్తున్నాయ్.  ఇక ఔష‌ధ రంగ పేటెంట్లు, హాలీవుడ్ సినిమాలు, స్ట్రీమింగ్ స‌ర్వీసులు, ర‌క్ష‌ణ ఒప్పందాల నుంచి వ‌చ్చే ఆదాయం   అద‌నం.  ఇదే కాకుండా సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది భార‌తీయ విద్యార్ధులు ఏటా అమెరికాలో పై చ‌దువుల పేరిట అక్క‌డికి వెళ్లి పెడుతున్న ఖ‌ర్చు అక్ష‌రాలా 25 బిలియ‌న్ డాల‌ర్లు. దీన్నిబ‌ట్టీ చూస్తే భార‌త్ అమెరికా నుంచి ఏటా 85 బిలియ‌న్ డాల‌ర్ల మేర ఎగుమ‌తుల రూపేణా పొందుతుంటే.. అంతే స‌మాన స్థాయిలో మ‌న నుంచి ఏదో ఒక రూపంలో  లబ్ధిం పొందుతోంది అమెరికా.  ఈ లెక్క‌న మ‌నం కూడా ట్రంప్ లాగే.. వ్యవహరిస్తే.. దెబ్బ‌కు దెబ్బ..చెల్లుకు చెల్లు అన్నట్లుగా స‌రిపోతుంది. దీంతో గ్లోబ‌ల్ మార్కెట్ దాదాపు స్ట్ర‌క్ అయిపోతుంది. ఈ విష‌యం గుర్తించ‌ని ట్రంప్ పిచ్చిపిచ్చి నిర్ణ‌యాలు తీసుకుంటూ.. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను దివాళా తీయిస్తున్నారని సాక్షాత్తూ అమెరికా అప్పీళ్ల కోర్టు అక్షింతలు వేసింది. ట్రంప్ నిర్ణయాలను తప్పుపట్టింది. అయితే ట్రంప్ సుప్రీం కోర్టును ఆశ్రయించి  త‌న పంతం నెగ్గించుకునే ప‌నిలో బిజీగా ఉండ‌టంతో.. పాపం ఈ కంపెనీల‌కు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ట‌. మ‌నం ఎలా చేశామో స‌రిగ్గా భార‌త్ కూడా అదే చేస్తే.. మా ఆద‌యం ఏం కాను దేవుడా అంటూ   గుండెలు బాదుకుంటున్నాయట‌!

కొంచెం ఇష్టం .. కొంచెం కష్టం!

స్వాతంత్య్ర దినోత్సవ వేళ దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభవార్త చెప్పారు. ఈసారి దీపావళి రెండింతల ఆనందాన్ని తీసుకురాబోతున్నది అంటూ.. వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కొత్త తరం సంస్కరణలను తీసుకువస్తున్నామని వెల్లడించారు. అందుకు తగ్గట్టుగానే,    బుధవారం(సెప్టెంబర్ 3) జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో అందుకు సంబదించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలపై భారాన్ని తగ్గించే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  ఇకపై జీఎస్టీలో రెండు స్లాబ్‌లు (5, 18 శాతం) మాత్రమే కొనసాగించనున్నారు జీఎస్టీలో ప్రస్తుతం కొనసాగుతున్న 12, 28శాతం స్లాబ్‌లు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40శాతం పన్ను విధించాలని నిర్ణయించారు. సెప్టెంబర్‌ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్‌ రేట్లు అమలులోకి వస్తాయి. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాతో మాట్లాడారు. నెక్ట్స్‌ జనరేషన్‌ సంస్కరణలకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారని తెలిపారు.  రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలను  దృష్టిలో ఉంచుకొని జీఎస్టీలో రెండు స్లాబ్‌లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకున్నామన్నారు. జీఎస్టీ ఫైలింగ్‌ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు.  కొత్త స్లాబ్‌లతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న ఆమె..  చాలా ఆహార పదార్థాలపై జీరో పర్సంట్ జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5శాతం జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18శాతం జీఎస్టీ ఉంటుందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ సహా పలు  రాజకీయ పార్టీలు జీఎస్టీ సంస్కరణలకు స్వాగతం పలికారు.  జీఎస్టీ సంస్కరణలు పౌరుల జీవితాలను మెరుగుపరుస్తుందని  ప్రధాని పేర్కొంటే, జీఎస్టీ సంస్కరణలు సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనకరమనీ, జీఎస్టీ తగ్గింపు పేదలకు అనుకూలమైన, వృద్ధి ఆధారిత నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయం ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన నాణ్యతను ఇస్తుందనిచంద్రబాబు అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వం చేసిన సంస్కరణలు కోట్ల కుటుంబాల కష్టాలను తగ్గిస్తాయని కొనియాడారు.  ప్రజల సంక్షేమంపై స్పష్టమైన దృష్టితో ఈ సంస్కరణలను తీసుకువచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పవన్ కళ్యాణ్  కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి పార్టీల నాయకులు మాత్రం.. కొంచెం ఇష్టం, కొంచం కష్టం అన్నట్లుగా  స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, చిదంబరం జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తూనే, చిన్న మెలిక పెట్టారు.  ప్రస్తుత జీఎస్టీ చట్టంలో లోపాలున్నాయని ప్రతిపక్షాలు చాలా సంవత్సరాలుగా  చెపుతున్నా ప్రధాని మోడీ ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వచ్చిందని, ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం సంస్కరణలు చేపట్టడాన్ని స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అన్నారు.  వివిధ వస్తువులు, సేవలపై జీఎస్టీ రేట్ల తగ్గింపు మంచిదని చెప్పిన చిదంబరం.. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని  కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా జీఎస్టీలో ఈ మార్పులు తీసుకొచ్చిందన్నారు.

జనవరిలో ఏపీ స్థానిక పోరు.. వైసీపీ కనీసం పోటీలోనైనా నిలిచేనా?

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల సందడి షూరూ కానుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించాలని దాదాపుగా ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేంది. వాస్తవంగా మార్చి తరువాత జరగాల్సిన స్థానిక ఎన్నికల షెడ్యూల్ ను మూడు నెలల ముందుకు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఇందుకు సంబంధించిన సన్నాహాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సహానీ ప్రారంభించేశారు. ఈ మేరకు సిబ్బందికి డిసెంబర్ లోగా ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్ ల నిర్ణయం వంటివన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు  స్థానిక ఎన్నికలను షెడ్యూల్ కంటే మూడు నెలల ముందుగానే నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి అవకాశం, అధికారం ఉంది. ఈ మేరకు ఈసీ మూడు నెలలు ముందుగానే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు క్షణం ఆలస్యం చేయకుండా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్ పచ్చ జెండా ఊపేసింది. ఇటీవల జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలలో వైసీపీ అడ్డాలోనే ఆ పార్టీని మట్టికరిపించిన ఉత్సాహంతో ఉన్న తెలుగుదేశం కూటమి సర్కార్.. మూడు నెలల ముందు స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ఇసుమంతైనా వెనుకాడటం లేదు. అన్నిటికీ మించి తెలంగాణలోలా ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎటువంటి చట్టపరమైన ఆటంకాలూ లేవు. గతంలో 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందే స్థానిక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత జరుగుతున్నాయి. ముందుగా పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది.  ఇక రాజకీయంగా చూసుకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక బరిలో వైసీపీ కనీస పోటీ అయినా ఇవ్వడం కష్టమే. అసలు పోటీకే దిగదని కూడా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పోటీ చేసి ఓటమి పాలవ్వడం కంటే.. బహిష్కరించి అధికార కూటమి ప్రభుత్వంపై అధికార దుర్వినియోగం అంటూ అభాండాలు వేయడానికి వైసీపీ మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు.  

అనర్హత వేటు భయం.. అసెంబ్లీకి ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు?

జగన్ పై తిరుగుబాటేనా? వైసీపిలో తిరుగుబాటు జరగనుందా? మరీ ముఖ్యంగా ఇప్పడు వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో ఆరుగురు జగన్ ను ధిక్కరించనున్నారా?  త్వరలో అంటే ఈ నెలలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఆ చర్చ జోరుగా సాగుతోంది. జగన్ ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టుపట్టి కూర్చున్నారు. హోదా ఇస్తే తప్ప తానూ, తన పార్టీ ఎమ్మెల్యేలూ అసెంబ్లీ ముఖం కూడా చూడమని తెగేసి చెబుతున్నారు. హేతురహితంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ హోదా పిచ్చి కారణంగా అసెంబ్లీకి ఈ సమావేశాలకూ గైర్హాజరైతే అనర్హత వేటు తథ్యమన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో జగన్ ను మినహాయిస్తే.. పది మంది ఉన్నారు. వారిలో ఓ ఆరుగురు ఇటీవల రహస్యంగా సమావేశం అయ్యారని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఆ సందర్బంగా ప్రతిపక్ష నేత కోసం జగన్ పట్టుబట్టి ఈ సారి కూడా అసెంబ్లీకి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకుంటే.. జగన్ ను ధిక్కరించైనా సరే అసెంబ్లీ సెషన్ కు హాజరవ్వాలని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది.  ఆ ఆరుగురు ఎవరు అన్నది అలా ఉంచితే.. జగన్ నిర్ణయాన్ని కాదని ఓ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే జగన్ కు ఉన్న అంతంత మాత్రం పరువు కూడా గంగలో కలిసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఆ ఆరుగురూ జగన్ పై తిరుగుబాటు చేసైనా సరే అసెంబ్లీకి హాజరు కావాలన్న నిర్ణయానికి రావడానికి మాత్రం అనర్హత వేటు భయమేనంటున్నారు. అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వచ్చినా మళ్లీ విజయం సాధించే అవకాశాలు ఇసుమంతైనా లేవని వారు భావిస్తున్నారని చెబుతున్నారు.  రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు ,సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో  ఆ హాజరు చెల్లదని తేలింది.  ఆ తరువాత తర్వాత ఏదో రహస్యోద్యమంలా రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు. ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.    అది పక్కన పెడితే స్వయంగా జగన్ కూడా అనర్హతా వేటు పడితే పులివెందుల నుంచి మరోసారి గెలిచే అవకాశాలు అంతంత మాత్రమేనని భయపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రతిపక్ష నేత హోదానా, అనర్హత వేటా తేల్చుకోలేక సతమతమౌతున్నారంటున్నారు. ఆ కారణంగానే సజ్జల చేత ప్రెస్ మీట్ పెట్టించి మరీ అసెంబ్లీకి హాజరయ్యేదీ లేనిదీ జగన్ నిర్ణయిస్తారంటూ చెప్పించారని అంటున్నారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 రోజులు సభకు హాజరుకాకపోతే స్పీకర్ ఆ సభ్యుడిని అనర్హుడిగా ప్రకటిస్తారు.  ఆ సభ్యుడు ప్రాతినిధ్యం వహించే స్థానం ఖాళీగా ఉన్నట్లు ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సభకు దూరంగా ఉంటారా? లేక  ఎమ్మెల్యే పదవిని  కాపాడుకునేందుకు మెట్టుదిగి అసెంబ్లీకి హాజరౌతారా అన్న చర్చ పోలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.  గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండా బహిష్కరించారు.  అయితే నిర్ణీత గడువు అంటే 60 పనిదినాలకు ముందుగానే.. అసెంబ్లీ గడువు తీరిపోయి ఎన్నికలు రావడంతో వారిపై అనర్హత వేటుప్రశ్నే తలెత్తలేదు. అయితే ఇప్పుడు జగన్ విషయంలో ఆ పరిస్థితి లేదు. అసెంబ్లీ గడువు ముగియడానికి ఇంకా మూడున్నరేళ్లకు పైగా సమయం ఉంది. దీంతో ఈ సారి జగన్, ఆయన పార్టీ సభ్యులు అసెంబ్లీకి డుమ్మా కొడితే.. అనర్హత వేటు ఖాయం. ఈ నేపథ్యంలోనే ఓ అరడజను మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ నిర్ణయంతో సంబంధం లేకుండానే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.  గతంలొ మండలి సమావేశాలకు జగన్ ఆదేశాలను ధిక్కరించి మరీ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. దీంతో జగన్ తన నిర్ణయాన్ని పునస్సమీక్షించుకుని మండలిలో విపక్ష హోదా ఉంది కనుక ఎమ్మెల్సీలు హాజరౌతారని ప్రకటించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చింది. తనను ధిక్కరించి ఎమ్మెల్యేలు హాజరయ్యే పరిస్థితి ఉండటంతో జగన్ హోదా కంటే ప్రజా సమస్యలపై చర్చే ప్రధానం అంటూ మెట్టు దిగి అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని పరిశీలకులు అంటున్నారు. ఎమ్మెల్యే పదవి కోల్పోవడం కంటే.. హోదా కోసం పట్టుబట్టడం మానుకోవడమే బెటరని పార్టీ సీనియర్లు కూడా జగన్ కు సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.  మరో వైపు.. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దమ్ముంటే అసెంబ్లీకి రావాలంటూ జగన్ కు సవాల్ విసిరారు.  ప్రతిపక్ష హోదా అన్నది ప్రభుత్వం కాదు, ప్రజలివ్వాలని కుండబద్దలు కొట్టేయడం ద్వారా హోదా ఇచ్చే ప్రశక్తే లేదని తేల్చేశారు.  దీంతో ఇక శాసనసభ సభ్యత్వాన్ని కాపాడుకోవడమా? లేదా? అన్నది తేల్చుకోవలసింది జగనే అన్న పరిస్దితి ఏర్పడింది. పరిశీలకులు మాత్రం జగన్ పట్టు వీడకుంటే.. ఆయనను ధిక్కరించైనా కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం ఖాయమని అంటున్నారు.  

పిల్ల సజ్జల.. మద్యం కుంభకోణంలోనూ పాత్ర?

ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధకారంలో ఉన్న సమయంలో సజ్జల పార్టీనీ, ప్రభుత్వాన్నీ గుప్పిట పట్టి ఓ ఆటాడుకుంటే.. ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల.. అదే నండి సజ్జల్ బార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా వింగ్ కు చీఫ్ గా పెత్తనం చెలయించారు. పిల్ల సజ్జల నేతృత్వంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అసభ్య పోస్టులు, అశ్లీల మార్ఫింగ్ వీడియోల విషయంలో కొత్త పుంతలు తొక్కింది. అయితే ఎప్పుడైతే రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోయిందో.. అప్పటి నుంచీ పిల్ల సజ్జల కనిపించడం లేదు. వినిపించడం లేదు.  సోషల్ మీడియా పోస్టుల విషయంలో  తనపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసులలో  సుప్రీంకోర్టు వరకూ వెళ్లి అరెస్టు కాకుండా తప్పించుకున్న పిల్ల సజ్జల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయారంటున్నారు.  ఏకంగా మద్యం కుంభకోణం సొమ్ములను దాచడానికి, వాటిని అవసరమైన చోటికి తరలించి తిరిగి రప్పించుకోవడానికీ  ఏర్పాటు చేసిన ఓ కంపెనీలో సజ్జల భార్గవ్ రెడ్డి ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు సిట్ గుర్తించింది. మద్యం కుంభకోణం సొమ్ములను రూట్ చేయడానికి ఏర్పాటు చేసిన పలు సూట్ కేస్ కంపెనీల్లో ఒక దానిలో  చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా ఓ డైరెక్టర్ గా ఉన్నట్లు  సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది.  అది కూడా ఎలాగంటే.. మద్యం కుంభకోణం స్కాం కు సంబంధించి గత రెండు రోజులుగా సిట్ అధికారులు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, వారికి చెందిన బినామీల నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే మద్యం కుంభకోణం సొమ్మును తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఒక కంపెనీలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి ప్రద్యుమ్నలు భాగస్వాములుగా ఉన్నట్లు నిర్ధారించే పత్రాలు బయల్పడ్డాయని తెలుస్తోంది. దీంతో  పిల్ల సజ్జల ఇక తప్పించుకునే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.  ఇలా ఉండగా  తిరుపతి జిల్లా తుమ్మలగుంటలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఇంట్లో వరుసగా రెండో రోజు కూడా  సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం(సెప్టెంబర్ 3) వారం హైదరాబాద్ లో మోహిత్ రెడ్డి ఆఫీసుతో పాటు తుమ్మగుంటలో భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలు జరిగాయి. గురువారం వారం  (సెప్టెంబర్ 4)  భాస్కరరెడ్డి ఇంట్లో జరుగుతున్న తనిఖీల్లో సిట్ అధికా రులతో పాటు విజిలెన్స్ అధికారులు పాల్గొన్నారు.  

కల్వకుంట్ల కవిత..కొత్త రాజకీయ అధ్యాయానికి ఆరంభం!

కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ తో  బీఆర్ఎస్ పార్టీలో గత కొంత కాలంగా సంచలనంగా మారి, పార్టీలో సంక్షోభానికి కారణమైన కేసీఆర్ తనయ కథ ముగిసినట్లేనా? అంటే కాదు అన్న సమాధానమే వస్తోంది. పరిశీలకులు బీఆర్ఎస్ లో అసలు కథ ఇప్పుడే మొదలైందంటున్నారు. కవిత కొత్త పార్టీ వార్తలు బీఆర్ఎస్ లో భారీ చీలకకు తెరలేపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఇప్పటికే పార్టీలో క్షేత్ర స్థాయిలో కవితకు మద్దతు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె రాజకీయం, కుటుంబ సెంటిమెంట్ లకు రంగరించి బీఆర్ఎస్ లో అత్యంత కీలకంగా ఉన్న హరీష్ రావు పై సంధించిన అస్త్రాలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.  వాస్తవానికి ప్రస్తుతం అందరూ కవిత పొలిటికల్ గా తీసుకున్న టర్న్ ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో పోలుస్తున్నారు. అయితే అది సరికాదు. షర్మిల తన అన్నతో విభేదించి బయటకు రావడానికి రాజకీయ కారణాల కంటే ఎక్కువగా కుటుంబ వ్యవహారాలే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. కానీ కవిత విషయం అలా కాదు.. కుటుంబ వ్యవహారాలతో పాటు.. బలమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. పార్టీలో  తనకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతున్న విషయాన్ని ఆమె చాలా చాలా బలంగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంతే కాదు.. పార్టీలో ఆమె ఎప్పుడూ కీలకంగానే వ్యవహరించారు. పార్టీ అగ్రనేతలలో ఒకరిగా క్రీయాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆమె  ఏ మాత్రం తక్కువ చేసి చూడడానికి వీలు లేనంతగా మమేకమయ్యారు. తెలంగాణ జాగృతితో ఆమె తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ సారథిగా  బలమైన ముద్ర వేసుకున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే.. పార్టీ ఆమెను సస్పెండ్ చేస్తే.. ఆమె పార్టీకీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికీ క్షణం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసేశారు. అంతే కాదు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న హరీష్ రావుపై విమర్శలు గుప్పించారు. అవినీతి అనకొండగా మాజీ మంత్రి హరీష్ రావును అభివర్ణిస్తూ, ఆయన అవినీతి కారణంగానే కేసీఆర్ రెండో సారి సీఎం అయిన తరువాత హరీష్ కు గతంలో ఆయన నిర్వహించిన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించారని ఆరోపించడం ద్వారా కాళేశ్వరంలో అవినీతికి హరీషే కారణమని ఎస్టాబ్లిష్ చేశారు.  ఇక కేటీఆర్ పై కూడా కవిత సుతిమెత్తగానే అయినా చాలా చాలా బలమైన ఆరోపణలూ, విమర్శలూ చేశారు. అదే సమయంలో తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ ను పన్నెత్తు మాట అనలేదు. తన రాజకీయ ఎదుగుదల సొంత అన్న కేటీఆర్ కే ఇష్టం లేదన్న విషయాన్ని పరోక్షంగానైనా బలంగా చెప్పారు. వాస్తవానికి కవిత తన పొలిటికల్ యాంబిషన్స్ ను ఎన్నడూ  గోప్యంగా ఉంచలేదు. ఒక ఎమ్మెల్సీగానో, లేదా రాజ్యసభ సభ్యత్వంతోనో సరిపెట్టుకోవడానికి తాను సిద్ధంగా లేననీ, పార్టీ  క్రియాశీల, కీలకమైన పోజిషన్ కు ఎదగడమే లక్ష్యమని ఆమె తొలి నుంచీ చాటుతూనే వచ్చారు. అయితే కేటీఆర్ తన సోదరే తనకు పోటీ అని భావించడంతోనే కుటుంబంలో సమస్యలు వచ్చాయనీ, అందుకే కవిత గతంలోనే బాహాటంగా కేసీఆర్ వినా మరెవరి నాయకత్వాన్నీ ఆను ఆమోదించబోనని విస్పష్టంగా చెప్పాల్సి వచ్చిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాగా బుధవారం ఆమె మీడియా సమావేశంలో తన పొలిటికల్ జర్నీని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మాజీ  ముఖ్యమంత్రి షర్మిల జర్నీతో పోల్చడాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. అంతే కాదు.. పోల్చాల్సి వస్తే తనను కేసీఆర్ తో పోల్చాలని కూడా కవిత విస్పష్టంగా తనదైన శైలిలో చెప్పారు.  ఆమె వ్యూహాలు, ఎత్తులు నిశితంగా పరిశీలిస్తే..  కవిత కేసీఆర్ ల పొలిటికల్ స్ట్రాటజీస్ లో సారూప్యత కనిపిస్తుందని అంగీకరించి తీరాలి.  గత కొంత కాలంగా.. అంటు ముఖ్యంగా లిక్కర్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన తరువాత నుంచీ కవిత ప్రణాళికాబద్ధంగా, పకడ్బందీగా బీఆర్ఎస్ కు సమాంతరంగా తెలంగాణ జాగృతిని ఒక ఉద్యమ స్థయి పార్టీకి దీటుగా తీర్చి దిద్దారు. తద్వారా తన బలాన్ని, బలగాన్నీ పెంచుకుంటూ వచ్చారు. ఇక ఇప్పుడు ఆమె తన సొంత పార్టీ ప్రకటించడానికి ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చునన్నది పరిశీలకుల అంచనా. ఒక వేళ వెంటనే పార్టీ ప్రకటన లేకపోతే కనుక.. తెలంగాణ స్థానిక ఎన్నికలలో కవిత.. తెలంగాణ జాగృతి తరఫున అభ్యర్థులను రంగంలోకి దించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. దాని వల్ల తాను నిలబెట్టిన అభ్యర్థుల గెలుపొటములను పక్కన పెడితే.. ఈ పోటీ ప్రభావం బీఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావాన్ని తప్పక చూపుతుంది. ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికలలో ( 2023 అసెంబ్లీ, 2034 సార్వత్రిక) ఓడిపోయిన బీఆర్ఎస్.. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలలో కూడా పరాజయాన్ని మూటగట్టుకుంటే.. ఇక ఆ పార్టీ మళ్లీ తేరుకుని బలం పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉంటాయన్నది కవిత అంచనాగా పరిశలకులు విశ్లేషిస్తున్నారు. ఇక అదే సమయంలో కవిత బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ విఫలమయ్యారని కవిత అన్యాపదేశంగానైనా గట్టిగా చెబుతున్న మాటలు నిస్సందేహంగా పార్టీ క్యాడర్ పై ప్రభావం చూపుతాయి. ఇప్పటికే  నోటి దురుసుతనంతో, తొందరపాటు వ్యాఖ్యలతో  కేటీఆర్  నాయకత్వ పటిమపై ప్రజలలో  సందేహాలు వ్యక్తం అయ్యే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా బాంబులతో కాంగ్రెస్ పేల్చడం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా తాయారైందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను జనమే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా విశ్వసించడం లేదు. కేటీఆర్ ఇటువంటి వైఖరి నిస్సందేహంగా కవితకు కలిసి వచ్చే అంశమేనన్నది పరిశీలకులు విశ్లేషణ.   మొత్తం మీద కవిత రాజకీయ పరిణతి, అవగాహన  ముందు ముందు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్థకం చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాలలో ఓ చర్చ అయితే  నడుస్తోంది.   

టెంపుల్ టౌన్లలో హోం స్టేలకు ప్రోత్సాహం.. పర్యాటక శాఖ సమీక్షలో చంద్రబాబు

టెంపుల్ టౌన్లలో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం (సెప్టెంబర్ 3) పర్యాటక శాఖపై సమీక్షించిన ఆయన  తిరుపతి సహా రాష్ట్రంలోని అన్ని ముఖ్య దేవాలయాల పట్లణాలలో వీటిపై దృష్టి పెట్టాల న్నారు.  కోనసీమలో గ్రామీణ వాతావరణం అనుభూతి చెందేలా హోమ్ స్టేలను అభివృద్ధి చేయాలనీ, వీటిలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు.  ఈ  హోమ్ స్టేలు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలన్నారు. విశాఖ, విజయవాడ, అమరావతి, తిరుపతి, అనంతపురం, కర్నూలు ఇలా వేర్వేరు ప్రాంతాల్లో నిరంతరం ఏదోక టూరిజం ఈవెంట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు స్థలాలను గుర్తించాలని చంద్రబాబు  అధికారులకు సూచించారు.  అనంతపురంలో డిస్నీ వరల్డ్ సిటీ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ప్రతినిధుల్ని సంప్రదించాలన్న చంద్రబాబు..  కొండపల్లి ఖిల్లా లాంటి ప్రాజెక్టులను దత్తత తీసుకునేలా ప్రైవేటు భాగస్వాములను గుర్తించాలన్నారు. ఉండవల్లి గుహల వద్ద లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పాటు, చింతపల్లిలో ఎకో టూరిజం, కుప్పంలో ఏనుగుల సఫారీ, విశాఖలో డాల్ఫిన్ షో వంటి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పర్యాట రంగానికి మరింత శోభ తెచ్చేలా అదనపు ఆకర్షణలు జోడించటంతో పాటు, స్థానికంగా ఉన్న ఉత్పత్తులను కూడా బ్రాండింగ్ చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అన్ని పర్యాటక ప్రాంతాలు, ప్రత్యేకంగా నిర్వహించే ఈవెంట్లలోనూ అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ, అలాగే అరుదైన ఎర్రచందనం బొమ్మలు, ఫర్నిచర్ లాంటి ఉత్పత్తులను కూడా ప్రదర్శించాలన్నారు. 

శ్రీవారి సేవకులకు నిరంతర శిక్షణ కోసం నూతన సాఫ్ట్ వేర్.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నార్ధం విచ్చేసే భ‌క్తుల‌కు మ‌రింత మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ‌వారి సేవ‌కుల‌కు గ్రూప్ సూప‌ర్ వైజ‌ర్లు, ట్రైనర్లతో నిరంత‌ర‌ శిక్ష‌ణ ఇవ్వ‌నున్న‌ట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్   బీఆర్‌నాయుడు తెలిపారు. ఇందు కోసం  నూతన సాఫ్ట్ వేర్ రూపొందించినట్లు చెప్పారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం (సెప్టెంబర్ 3) న ఆయన  ఈవో జె.శ్యామ‌ల‌రావు, అద‌న‌పు ఈవో  వెంక‌య్య చౌద‌రి, సివిఎస్వో  ముర‌ళికృష్ణ‌తో క‌లిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు. తిరుమలలో బిగ్, జనతా క్యాంటిన్లను పారదర్శకంగా కేటాయించినట్లు తెలిపారు.  భక్తులకు మరింత రుచికరమైన, నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోని ప్ర‌ముఖ ఆహార ప‌దార్థ‌ల త‌యారీ సంస్థ‌ల‌కుఈవోఐ ద్వారా పార‌ద‌ర్శ‌కంగా కేటాయించింద‌న్నారు. టీటీడీ  రూపోందించిన నూతన విధానానికి అనుగుణంగా   నిపుణుల క‌మిటీ ఆహార ప‌దార్థాల నాణ్యతా ప్ర‌మాణాలలు, ఇత‌ర అంశాల‌ను ప‌రిశీలించింద‌ని చెప్పారు. అలాగే లాభాపేక్ష లేకుండా భక్తులకు సేవలందించేందుకు ఆయా సంస్ధలు ముందుకు వచ్చాయని బీఆర్ నాయుడు తెలిపారు.   5 బిగ్, 5 జనతా క్యాంటిన్లకు ఈ ఏడాది జూన్ 14న నోటిఫికేషన్ ఇచ్చి సీల్డ్ ఈవోఐ దరఖాస్తులను ఆహ్వానించామనీ.  ఇందులో టీటీడీ నిబంధ‌న‌ల మేర‌కు ఉన్న దరఖాస్తులను ప‌రిశీలించి  కేటాయించామనీ బీఆర్ నాయుడు వివరించారు. 

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టు

హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. గణేష్ నిమజ్జనాలకు ఇప్పటివరకు పోలీసులు ట్యాంక్ బండ్ పై ఎటువంటి ఏర్పాట్లు చేయ లేదని, క్రెయిన్లు కూడా చేయలేదని ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే  గణేశుడి నిమజ్జనం చేయడం కష్టమేనంటున్నారు.   గత 45 ఏళ్ల నుండి ట్యాంకు బండ్ పై గణేష్  నిమజ్జనాలు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్త పద్ధతులు పాటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  వెంటనే గణేష్ నిమజ్జనాలకు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకోకుంటే..  మండపాల నుండి వినాయకులను కదిలించేది లేదని సమితి సభ్యులు హెచ్చరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఉత్సవ సమితి నాయకులు హెచ్చరించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు  పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనదిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.  

చంద్రబాబు ‘సిద్ధం’సవాల్.. సజ్జల పసలేని కౌంటర్?

ఆకుకు అందకుండా పోకకు పొందకుండా మాట్లాడడంలో వైసీపీ సీనియర్ నాయకుడు, జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి సిద్ధహస్తుడు. ఆయన చాలా గ్యాప్ తరువాత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల రాజంపేట పర్యటనలో భాగంగా వైసీపీ అధినేతను ఉద్దేశించి సిద్ధం సవాల్ విసిరారు.  ద‌మ్ముంటే అసెంబ్లీ స‌మావేశాల‌కు రావాలనీ.. ఏ విష‌యంపైనైనా చ‌ర్చించేందుకు తాము ‘సిద్ధం’ అన్నారు. చంద్రబాబు ఈ సవాల్ ద్వారా.. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా  జ‌గ‌న్‌, ఆయన పార్టీ నాయకులు సిద్ధం అంటూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అప్పట్లో సిద్ధం అన్నారుగా,  ఇప్పుడు సిద్ధ‌మేనా? రండి అసెంబ్లీలో తేల్చుకుందామంటూ ఎద్దేవా చేశారు. కోడిక‌త్తి, గుల‌క‌రాయి డ్రామాలు,  వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య ఇలా దేనిపైనేనా చర్చకు సవాల్ అన్నారు చంద్రబాబు.  ఈ సవాల్ కు జగన్ నుంచి ఎటువంటి స్పందనా రాలేదు.. కానీ ఆయన తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ సజ్జల మీడియా ముందుకు వచ్చారు. చాలా చలా విషయాలు మాట్లాడారు కానీ అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వస్తారన్న విషయం మాత్రం చెప్పలేదు. ఆ విషయాన్ని పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారన్నారు. ఇంతోటి దానికి ఆయన మీడియా సమావేశం పెట్టడం ఎందుకన్నది ఆయనకే తెలియాలి. అయితే ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రిగా చంద్రబాబు సవాల్ చేయడమేంటి? అని ప్రశ్నించారు. సవాళ్లు చేస్తే మేం చేయాలి.. కానీ సీఎం చేయడమేంటని ఆశ్చర్యపోయారు. ఇది సరికాదన్నారు.  ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్నార‌న్న సజ్జల తల్లికి వందనం అందరికీ అందలేదని ఆరోపించారు. వర్షాలు, వరదలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. యూరియా కొరత తీవ్రంగా ఉంద న్నారు. ఇన్ని సమస్యలుంటే చంద్రబాబు వాటిని విస్మరించి సవాళ్లు విసరడమేంటని విమర్శించారు. ఈ అంశాలపై తాము చర్చకు సిద్ధమన్న సజ్జల.. వాటిపై చర్చించడానికైనా వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తారా? అంటే మాత్రం ఆ విషయం మా పార్టీ అధినేత జగన్ నిర్ణయిస్తారంటూ మాట దాటేశారు. దీంతో సజ్జల మీడియా సమావేశం తరువాత విలేకరులు అసలీ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? పెట్టారు సరే ఆయన చెప్పిందేమిటి? అంటూ జుట్టు పీక్కునే పరిస్థితికి వచ్చారు.  

కేసీఆర్‌ కూతురిగా పుట్టడం జన్మజన్మల పుణ్యం.. కవిత

బీఆర్ఎస్ నుంచి సస్పెండైన కల్వకుంట్ల కవిత దీటుగా స్పందించారు. పార్టీకీ, పార్టీద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేశారు. తన సస్పెన్షన్ తరువాత తొలి సారిగా బుధవారం (సెప్టెబర్ 3) మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత తన రాజీనామా ప్రకటన చేశారు. అంతే కాకుండా బీఆర్ఎస్ పైనా, ఆ పార్టీకి చెందిన కొందరు నేతలపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని ఓ రేంజ్ లో విమర్శలు కురిపించారు.  పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ తాను ఒకేలా ఉన్నానని చెప్పిన కవిత.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూడా తనను ప్రతిపక్ష ఎంపీగానే చూశారనీ, పార్టీలో ఆరడుగులు బుల్లెట్ గా హరీష్ చెప్పుకుంటారనీ, ఆ ఆరడుగుల బుల్లెట్టే తనను గాయపరిచిందన్నారు. హరీష్ రావు వంటి వారి వల్లనే విజయశాంతి, ఈటల, మైనంపల్లి వంటి పలువురు నాయకులు బీఆర్ఎస్ ను వీడారని కవిత అన్నారు. తనకు పదవులపై ఆశ లేదన్న కవిత పార్టీలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపినందుకే తనపై సస్పెన్షన్ వేటు వేశారన్నారు.  జన్మజన్మల పుణ్యం కారణంగానే తాను కేసీఆర్ కుమార్తెగా పుట్టానని కవిత అన్నారు. అటువంటి కేసీఆర్ ను, ఆయన పెట్టిన పార్టీనీ ఇబ్బంది పెట్టాలని తాను కలలో కూడా అనుకోనన్నారు. బీఆర్ఎస్ ఉంటే ఎంత.. పోతే ఎంత అని తాను అనలేదని వివరణ ఇచ్చారు. కేసీఆర్ ను ఇబ్బందుల పాలు చేస్తున్న పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాత్రమే తాను అన్నానని చెప్పారు. హరీష్ వంటి వారి వల్ల కేసీఆర్  నాయకత్వానికే కాదు.. తన అన్న కేటీఆర్ కు కూడా ముప్పు ఉందని కవిత పేర్కొన్నారు. పార్టీలో జరుగుతున్న తప్పులన్నిటినీ కేసీఆర్ పై మోపుతున్నారని కవిత ఆరోపించారు. ఈ విషయంలో  కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  పార్టీలో  తనపై కుట్రలు జరుగుతుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరేం చేశారని కవిత కేటీఆర్ ను నలిదీశారు. తాను స్వయంగా తనపై కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా కూడా కేటీఆర్ స్పందించలేదని ఆరోపించారు. కొందరు కల్వకుంట్ల కుబుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కవిత.. అందుకే తనను పార్టీ నుంచి బయటకు పంపేశారని కవిత పేర్కొన్నారు. పార్టీని హస్తగతం చేసుకోవాలన్న కొందరు పకడ్బందీగా తనను పార్టీ నుంచి బయటకు పంపారనీ, రేపు ఇదే కేసీఆర్ కు, కేటీఆర్ కు జరుగుతుందన్నదే తన ఆవేదన, బాధ అని కవిత చ చెప్పారు.