రికార్డ్ స్థాయిలో ధర పలికిన బాలాపూర్ లడ్డు
posted on Sep 6, 2025 @ 11:52AM
తెలుగు రాష్ట్రాల్లో గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇక ఈ సందర్భంగా గణేష్ లడ్డూల వేలం జోరుగా సాగుతోంది. వేలం పాటలో గణేష్ లడ్డూలు రికార్డు ధరలు పలుకుతున్నాయి. బాలాపూర్ లడ్డూ ఈ సారి రికార్డు ధర పలికింది. గత ఏడాది వేలంపాట కంటే ఈ ఏడాది ఏకంగా 4.99 లక్షల రూపాయలు అధికంగా పలికింది. గత ఏడాది బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో 30.01 లక్షలు పలకగా, ఈ ఏడాది 35 లక్షల రూపాయలు పలికింది. బాలాపూర్ గణేశుడు లడ్డు కు తెలుగు రాష్ట్రాలలోనే ఓ ప్రత్యేకత ఉన్న సంగతి విదితమే.. ఈ సారి బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో 38 మంది పాల్గొనగా, వారిలో బాలాపూర్ కు చెందిన బిజెపి రాష్ట్ర నాయకుడు శంకర్ రెడ్డి 35 లక్షల రూపాయలకు పాడి బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకున్నారు.
ఇక బండ్లగూడలోని కీర్తి రిచ్మండ్ విల్లాస్ కమ్యూనిటీలో కూడా ఏటా గణేష్ నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ కూడా గణేష్ నిమజ్జనానికి ముందు లడ్డూ వేలం ఆనవాయితీగా వస్తున్నది. ఈ ఏడాది జరిగిన వేలంలో లడ్డూ ధర ఏకంగా 2 కోట్ల 31 లక్షల 95 వేలు పలికింది. గతేడాది ఇదే కమ్యూనిటీలో నిర్వహించిన వేలంలో లడ్డూ ధర కోటీ 87 లక్షలు పలకగా, ఈ ఏడాది అంతకంటే దాదాపు 45 లక్షల రూపాయలు అధికంగా పలకడం విశేషం.