గురువులను జీవితంలో మర్చిపోలేము : సీఎం చంద్రబాబు
posted on Sep 5, 2025 @ 9:07PM
దేశంలో ఆంధ్రప్రదేశ్‌ను నంబర్ వన్‌గా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. సర్వేపల్లి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ హాల్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ముఖ్యమంత్రి హాజరయ్యారు. ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్‌వన్‌గా నిలవాలి. రాబోయే 22 ఏళ్లపాటు మనమంతా దీనిపై దృష్టి సారిస్తే సాధ్యమే అని చంద్రబాబు అన్నారు. ఇంటర్ చదువుతున్నప్పుడే పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా విద్యార్థులను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు సూచించారు. హాస్టళ్లతో విద్యాశాఖ సమన్వయం చేసుకుంటూ విద్యార్థులను పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేయాలని ఆదేశించారు.
ఇటీవల ఐఐటీలకు వెళ్లిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తనను కలిశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లు సాధించేలా తీర్చిదిద్దాలని తెలిపారు.ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఆంధ్ర యూనివర్సిటీకి నాలుగో ర్యాంక్ రావడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యా శాఖ మంత్రి లోకేష్ మాట్లాడుతు మా ఉపాధ్యాయుల మార్గనిర్దేశనంతో బ్యాక్ బెంచ్ నుంచి స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్లాని పేర్కొన్నారు. కొన్ని అంశాల్లో వీక్ గా ఉన్నానని మా నాన్న బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు.
నారాయణని పిలిపించి నాకు శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత యూనివర్శిటీలో రాజిరెడ్డి ఆధ్వర్యంలో చదువుకున్నాను. సమయానికి హెయిర్ కట్ కూడా చేయించుకోవాలని తెలియదని లోకేశ్ తెలిపారు,
తల్లిని ఆ తర్వాత నా ఉపాధ్యాయులనే గౌరవిస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలని పిలుపిస్తే... స్కూటరుకు మైక్ కట్టుకుని అనౌన్స్ మెంట్ చేస్తూ అడ్మిషన్లు పెంచిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. జీరో ఇన్వెస్టిమెంట్-హై రిటన్స్ అని చెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచిన టీచర్లూ ఉన్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా కొన్ని పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు పెట్టిన పరిస్థితి తెచ్చామని తెలిపారు.
ఎప్పుడూ లేని విధంగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించామని విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారనే అంశాన్ని పేరెంట్సుకు అర్థమయ్యేలా చెప్పేందుకు పేరెంట్-టీచర్ మీటింగ్ పెట్టాం.. దీన్ని కొనసాగిస్తామన్నారు. నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం... అందుకే విద్యా శాఖ బాధ్యతలు తీసుకున్నాని లోకేశ్ పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యలో రాజకీయాలను దూరంగా పెట్టామన్నారు. వేదిక మీదున్న బోర్డులోనూ సీఎం ఫొటో కూడా పెట్టలేదు. పిల్లలకు అందించే పుస్తకాలు, కిట్ల పైనా ఎవ్వరి ఫొటోలు వేయలేదన్నారు.