కేసీఆర్ తో రైతు ఉద్యమ నేత రాకేశ్ తితాయత్ రహస్య భేటీ..? ఆంతర్యమేమిటి?

కేసీఆర్ వ్యూహాలేమిటి? ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ దాటి బయటకు రాకుండా ఆయనేం చేస్తున్నారు? టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఈ సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆయన తన జాతీయ రాజకీయ ప్రవేశంపై వ్యూహాలకు పదును పెడుతున్నారనీ, ఎన్ని అవాంతరాలెదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా ముందుకే అడుగేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన వాళ్లు చెబుతుంటారు. ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభ  మసకబారుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ రాకను స్వాగతించే వారెవరూ కనిపించడం లేదు. అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదు. మరేం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సంపూర్ణంగా కాకున్నా..  ఏదో ఒక మేరకు బదులు అనిపించే ఉదంతం ఒకటి గురువారం సంభవించింది. మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసనగా   సుదీర్ఘ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్, ఆయన అనుచరుడు యుధ్వీర్ సింగ్ లో కలిసి గురువారం సాయంత్రం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రంయలో దిగిన వీరిరువురూ అక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే వీరిని స్వయంగా పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు.  భేటీ అనంతరం వీరు ఇరువురూ సీఎం క్యాంప్ ఆపీసులోనే బస చేశారు.ఇంతకీ రెండున్నర గంటల పాటు అత్యంత రహస్యంగా జరిగిన భేటీలో ఏం చర్చించారు? ఆ వివరాలు, అసలు భేటీ వివరాలూ బయటకు రాకుండా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదంటున్నారు. ప్రగతి భవన్ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ భేటీలో రైతు సమస్యలపై రైతులతో చైతన్యం తీసుకురావడం, గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమలో అనుసరించిన పంథా, రైతులను మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏకం చేయడం ఎలా అన్న విషయాలపై వీరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు.  మొత్తంగా మోడీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ శక్తులు కలిసి రాకున్నా రైతులను చైతన్య వంతులను చేసి వారిని ఉద్యమోన్ముఖులను చేసి వారికి నాయకత్వం వహించేలా కేసీఆర్ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్, యుధ్వీర్  సింగ్ లను పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో రహస్యంగా భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా శుక్రవారం సాయంత్రం కూడా కేసీఆర్ తో వీరిరువురూ మరోసారి భేటీ అయినట్లు సమాచారం.  

ప్లీనరీ కాదు.. విజయమ్మ వీడ్కోలు సభ.. రఘురామకృష్ణంరాజు

వైసీపీ ప్లీనరీని జగన్ తల్లి విజయమ్మ వీడ్కోలు సభగా ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అభివర్ణించారు. విజయమ్మ రాజీనామాపై వైసీపీలోనే అసంతృప్తి పెల్లుబుకుతోందనీ, అమ్మ రాజీనామానా అమ్మతో రాజీనామానా అని పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయన్నారు. విజయమ్మ రాజీనామా తాను ముందే ఊహించానని చెప్పిన రఘురామ రాజు.. రాజీనామా చేయడానికి ముందు ప్లీనరీలో ఆమెకు సముచిత ఆసనం కూడా ఇవ్వలేదని రఘురామరాజు ఎత్తి చూపారు. గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె చిన్న కుర్చీలో కూర్చున్నారని, కొంచం పెద్ద కుర్చీ వేస్తే ఒకింత గౌరవంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. విజయమ్మ రాజీనామా ఎంత కరెక్టో.. విజయమ్మతో రాజీనామా కూడా అంతే కరెక్టన్నారు. అక్రమాస్తుల కేసులో జగన్ జైలులో ఉన్నప్పుడు దేహీ అన్నట్లుగా ఆమె ఇల్లిల్లూ తిరిగారనీ, కుమారుడికి బెయిలు కోసం సోనియా కాళ్లు పట్టుకున్నారన్న సమాచారం కూడా తన వద్ద ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా పార్టీని సొంత జాగీరుగా చేసుకోజాలరని అన్న రఘురామకృష్ణం రాజు శాశ్వత అధ్యక్షుడు అన్న కాన్సెప్టే  ఉండదన్నారు. అసలు దేశంలో ఎక్కడైనా ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు ఉన్నారా అని ప్రశ్నించారు.  తానూ పార్టీ సభ్యుడినేనన్న రఘురామకృష్ణం రాజు సంస్థాగత ఎన్నికలు జరిగి తీరాల్సిందేననీ, ఒక వేళ ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదేళ్లు మాత్రమే ఉండాలన్నారు. పార్టీ శాశ్వత  అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళతానని స్పష్టం చేశారు.  ఆ విషయాన్ని కోర్టే తెలుస్తుందన్నారు.  

రాజ్యాంగ పుస్త‌కానికి  కాయితం ఇచ్చిన హెచ్ ఎం పిఐ

దేశంలో అన్ని ప్రాంతాల్లో  ప్ర‌జ‌లు, రాజ‌కీయ‌నాయ‌కులు అంద‌రూ ఏదో ఒక సంద‌ర్భంలో రాజ్యాంగం గురించి ప్ర‌స్థావిస్తుంటారు. కానీ రాజ్యాంగాన్ని పుస్త‌క‌రూపంలోకి తేవడంలో ఏ కాయితాన్ని ఉప‌యోగించారో  తెలుసా? మ‌హాక‌ట్ట‌డాల కూలీల పేర్లు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ రాజ్యంగాన్ని పుస్త‌కంగా చేసిన‌పుడు  ఉప యోగించిన కాయితం మాత్రం పూణెలోని హాండ్‌మేడ్ పేప‌ర్ ఇన్‌స్టిట్యూట్ (హెచ్ ఎం పిఐ) ఆ  కాయితా న్ని అంద‌జేసింది. ఇది 1940లో పూణెలో స్థాపిత‌మైంది. క‌నీసం వంద సంవ‌త్స‌రాలైనా  చెక్కుచెద‌ర‌ని ప‌త్తి గుడ్డ‌ల‌తో త‌యార‌యింద‌ట ఆ కాయితం! పూణె శివాజీన‌గ‌ర్‌లో ఈ హెచ్ ఎంపిఐ లో కాయితం త‌యారీకి ఎన్న‌డూ చెక్క‌ను వినియోగించ‌క‌పోవ‌డం చిత్రం. స్వాతంత్య్రం ముందు నుంచి ఈ సంస్థ వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు ఎలాంటి హానీ క‌లిగించ‌ని  హ్యాండ్ మేడ్  పేప‌ర్ త‌యారీలో ఎంతో ప్ర‌సిద్ధి పొందింది.  పూణెలో ఏ ఆర్భాట‌మూలేని, చాలా సాధార ణంగా క‌నిపించే ఈ ఫ్యాక్ట‌రీ నుంచే బ్రిటీష్ వారికి కావ‌ల‌సిన కాయితం కూడా వెళ్లింది. ఈ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు వెనుక మ‌హాత్మాగాంధీ స్వ‌దేశీ ఉద్య‌మ స్పూర్తి వుంది. పూణెకి చెందిన ప్ర‌ముఖ సైంటిస్ట్ కె.బి. జోషీ పేర వున్న రోడ్డులోనే ఈ ఫ్యాక్ట‌రీ వుంది. జోషీ 1930ల్లో మ‌న దేశంలో మొట్ట‌మొద‌టిసారిగా  హ్యాండ్‌మేడ్  కాయి తం త‌యారీలో ఎంతో కృషి చేసిన శాస్త్ర‌వేత్త‌గా ప్ర‌సిద్ధి. 1936లో ఆయ‌న కొన్ని శాంపిల్స్ గాంధీగారికి పం పించి ఆయ‌న మెప్పు పొందిన త‌ర్వాత ఆ కాయితాన్ని వార్దా పేప‌ర్ సెంట‌ర్‌కి పంపేర‌ట‌. అక్క‌డ  ప్రాం తీయుల స‌హాయ‌స‌హ‌కారాల‌తో, ప‌నివాళ్ల‌తో త‌యారీని కొన‌సాగించాల‌నుకున్నారు. కానీ అక్క‌డి ప‌రిస్థితు లు ఆయ‌న‌కు సంతృప్తినివ్వ‌లేదు. అందుక‌నే 1940 ఆగ‌స్టు 1 న పూణె ఆగ్రిక‌ల్చ‌ర్ కాలేజీ ఆవ‌ర‌ణలోనే త‌న ఫ్యాక్ట‌రీని ఆరంభించారు.  హ్యాండ్ పేపర్‌మేకింగ్ ప్రక్రియ త‌మాషాగా వుంటుంది. పేపర్ వంద‌ శాతం ప‌త్తి గుడ్డ‌ల నుండి తీసుకోబ డింది, వస్త్ర పరిశ్రమ నుండి వ్యర్థ ఉత్పత్తి , ఫార్మా పరిశ్రమల నుండి ఉపయోగించని పత్తి నుండి తీసు కోబడింది. పత్తి గుడ్డ‌లు బహుళ వనరులు, కర్మాగారాల నుండి వస్తాయి. అవి సేకరించి క్రమబద్ధీకరిస్తారు. సుమారుగా ఏకరీతి పరిమాణంలో కత్తిరించి, శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తర్వాత, కాటన్ రాగ్‌లు చిన్న ముక్కలుగా ముక్కలు చేయబడతాయి. ఈ ముక్కలను నీటిలో కలిపి బీటర్ లో కలుపుతారు. యంత్రంలో 20 శాతం పత్తి , 80 శాతం నీటి నిష్పత్తిని అనుసరిస్తారు. బీటర్‌లో  బ్లేడ్‌లు ఉంటా యి,  ఇవి  దూది ముక్క లను గుజ్జుగా  మార్చడానికి  నీటితో కలపడానికి వాటిని కత్తిరించి వాటి పరిమాణాన్ని మరింత తగ్గిస్తాయి. మొత్తం ప్రక్రియ దాదాపు 18 గంటల పాటు కొనసాగుతుంది.  గుజ్జును నిల్వ ట్యాంక్‌లో పోస్తారు, అవసరమైన విధంగా కాగితాన్ని సిద్ధం చేయడానికి తీసివేయవచ్చు. “కాగితాన్ని సిద్ధం చేయడానికి, గుజ్జును నెట్టెడ్ చెక్క చట్రంపై పోస్తారు, సమానంగా విస్తరిస్తారు. అప్పుడు గుజ్జు నీటిని హరించడానికి చల్లగా నొక్కి ఉంచబడుతుంది మరియు సెట్ చేయడానికి అనుకూలిస్తుంది.  తరువాత, ఇది ఉన్ని పెల్ట్‌లపై హైడ్రాలిక్ ప్రెస్‌లో కుదించబడుతుంది, ఇక్కడ మిగిలిన నీరు ప్రవహి స్తుంది. తడిగా చేతితో తయారు చేసిన కాగితపు షీట్ ఎండలో ఆరిపోతుంది. అని కార్తీక్  అనే నిపుణుడు చెప్పారు. అయితే, ఎండిన కాగితపు షీట్‌లో మడతలు ఉన్నాయని కార్తీక్ అంటారు. అది సరిదిద్దడానికి  నేరుగా ఏకరీతి ఆకారాన్ని ఏర్పరచడానికి, ఎండిన కాగితపు షీట్ రోలర్ మెషీన్‌పై నొక్కబడుతుంది. ఇక్కడ కాగితం దాదాపు సిద్ధంగా ఉంది. కానీ కొన్ని సమయాల్లో, ఈ షీట్లు కీటకాలు, మరకలు లేదా తొలగించా ల్సిన కొన్ని కణాలను పట్టుకుంటాయి. అందువల్ల, షీట్లను తీసివేయడానికి మరియు శుభ్రం చేయడానికి మరొక మాన్యువల్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. ఇప్పుడు షీట్లను కావలసిన పరిమాణంలో కత్తిరించ వచ్చు అని ఆయ‌న అన్నారు. .  

నాన్నిచ్చిన ధైర్యాన్ని నా నుంచి లాక్కోలేరు.. ఉద్ధవ్

 ఎట్టి పరిస్థితుల్లోనూ శివసేన ఎన్నికల గుర్తును తిరుగుబాటు దారులు ఉపయోగించుకోనివ్వనని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే అన్నారు. తన తండ్రి బాల్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీని వారు తీసుకోగలరేమో కానీ.. ఆయన ఇచ్చిన ధైర్యాన్ని తన నుంచి ఎవరూ లాక్కోలేరని ఆయన అన్నారు. ఏక్ నాథ్ షిండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్ థాక్రే తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొన్న ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన దమ్ముంటే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని షిండే కు సవాల్ విసిరారు. ప్రజా మద్దతు చూరగొని అధికారం చేజిక్కించుకునే ధైర్యం లేక దొడ్డిదారిన అధికారం చేపట్టారని విమర్శించారు.   దమ్ముంటే తక్షణమే మధ్యంతర ఎన్నికలు నిర్వహించండి.. మేం తప్పు చేస్తే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని ఎవరూ విడదీయలేరన్నారు.  గత రెండున్నరేళ్లలో బిజెపి తనను, అతడిని టార్గెట్ చేసిందని, అందుకు తమ పార్టీలోని కొన్ని గ్రూపులు సహకారం అందించాయనీ ఉద్ధవ్ ఆరోపించారు. అతను వారితో టచ్ లో వుంటూ సొంత పార్టీ కి ద్రోహం చేసారని ఉద్ధవ్ థాక్రే   షిండే పేరు ప్రస్తావించకుండానే ఆరోపణలు గుప్పించారు.  బెదిరింపులు వచ్చినా బెదరకుండా నిలిచి నాతో   ఉన్నఎమ్మెల్యేలను చూసి గర్విస్తున్నానని ఉద్ధవ్ థాక్రే ఉద్వేగంగా చెప్పారు.  సుప్రీంకోర్టు శివసేన భవిష్యత్తును మాత్రమే కాకుండా భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

నవరత్నాలపై పవన్ నవ సందేహాలు!

ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో, జగన్ రెడ్డి ఏలుబడిలో జరుగుతున్న అవకతవకలు, అవినీతిపై సందర్భం చిక్కినప్పుడల్లా విమర్శలు ఎక్కుపెడుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా నవ రత్నాలు అమలుపై ‘నవ’ సందేహాలు వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలపై నవ సందేహాలు అంటూ పవన్ కళ్యాణ్  ట్వీట్ చేశారు. నవరత్నాలు పేర  జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, అమ్మ ఒడి, పింఛన్లు, సంపూర్ణ మద్యపాన నిషేధం, జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్ మెంట్, పేదలందరికీ ఇళ్లు, ఆసరా పథకాలపై జనసేనాని ప్రశ్నాస్త్రాలు సంధించారు. నవరత్నాల్లోని ‘మొదటి రత్నం’ రైతు భరోసాతో 64 లక్షల మంది రైతులకు మేలు అని చెప్పిన జగన్ రెడ్డి సర్కార్ 50 లక్షల మందికి మాత్రమే భరోసా ఇవ్వడం నిజం కాదా? పవన్ తన ట్వీట్ లో ప్రశ్నించారు.  వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 7 వందల మందికి మాత్రమే ఆర్థిక సాయం పరిమితం చేయలేదా? అని నిలదీశారు. ఇక ‘రెండో రత్నం’ అమ్మ ఒడిని 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి, 83 లక్షల మందికి ఇచ్చినట్లు ఎందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. ‘మూడో రత్నం’ పింఛన్ల విషయంలో  పింఛనర్ల జాబాతాను కుదించి, 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?, అలాగే ‘నాలుగో రత్నం’ సంపూర్ణ మద్యపాన నిషేధంపై జనసేనాని ప్రశ్నలు సంధించారు. మద్యం ఆదాయం 2018- 19లో 14 వేల కోట్లు ఉంటే.. 2021-22లో 22 వేల కోట్ల రూపాయలకు పెరగాడాన్ని సంపూర్ణ మద్యనిషేధం అంటారా?  ఈ ఆదాయం చూపించి 8 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు అమ్మలేదా? అంటూ ఎత్తి చూపారు. అలాగే ‘ఐదో రత్నం’ జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టుకును ‘యుద్ధ ప్రాతిపదికన’ ఎప్పుడు పూర్తిచేస్తారో చెబుతారా? అన్న జనసేనాని ‘ఆరో రత్నం’ ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆస్పత్రులు ఎందుకు పక్కకు తప్పుకుంటున్నాయి? సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు’, ‘ఏడో రత్నం’ ఫీజు రీయింబర్స్ మెంట్ లో పీజీ విద్యార్థులకు ఎందుకు  చెల్లింపులు నిలిపేశారని నిలదీశారు, రీయింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్లను ఆయా విద్యా సంస్థలు ఆపేస్తున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు.   ‘ఎనిమిదో రత్నం’ పేదలందరికీ ఇళ్లలో భాగంగా చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిధులు మంజూరు చేయలేదని జనసేనాని నిలదీశారు. చివరిగా ‘తొమ్మిదో రత్నం’ ఆసరాలో ఏటేటా పొదుపు సంఘాల సంఖ్యను లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారని పవన్ నిలదీశారు. అభయ హస్తం నిధులు 2 వేల కోట్ల రూపాయలు ఎటు పోయాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.

ధరణి .. టిఆర్ ఎస్ అన‌ర్ఘం..ప్ర‌జ‌ల‌కు త‌ల‌భారం

సంస్క‌ర‌ణ‌లు ప్ర‌జాహిత‌మైన‌విగా వుండాలి. ఏదో త‌మ పేరు ప్ర‌తిష్ట‌ల‌కోసం గొప్ప సంస్క‌ర‌ణ చేప‌ట్టామ‌ని భ‌జ‌న చేయించుకుంటే ఆన‌క ప్ర‌జ‌ల నుంచీ వ‌చ్చే తిర‌స్కారాలు, చీవాట్ల‌ను కూడా ప్ర‌భుత్వం ఎదుర్కొన డానికి సిద్ధ‌ప‌డాలి. కానీ తెలంగాణా ప్రభుత్వం ధ‌ర‌ణి పోర్ట‌ల్‌తో ఇపుడు నానా ఇబ్బందులు ఎద‌ర్కొంటోం ది. ధ‌ర‌ణి పోర్ట‌ల్ ఆరంభించిన‌పుడు దాని వ‌ల్ల రెవిన్యూ స‌మస్య‌లు చాలామటుకు ప‌రిష్కారం అవుతాయ ని న‌మ్మ‌కంగా ప్ర‌చారం చేసేరు. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆరంభించిన ధ‌ర‌ణితో ఆదిలోనే స‌మ‌స్య‌లు తెచ్చింది. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌క‌పోగా భూవివాదాలు రెండింత‌లు చేశాయి. ఇలా వివాదాల‌కు కేంద్రం గా మారిన ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ర‌ద్దు చేయాల‌ని తెలంగాణా కాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశా రు. విడ్డూర‌మేమంటే, ధ‌ర‌ణి లో ల‌క్ష్మాపూర్ గ్రామంలోని చాలా భూముల వివరాలు లేనేలేవని ప్రభుత్వ మే భూ క‌బ్జాల‌కు పాల్ప‌డుతోంద‌ని రేవంత్ ఆరోపిస్తున్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ధ‌ర‌ణి ని ర‌ద్దు చేస్తామ‌న్నారు. సిసిఎల్ ఏ ప‌ట్టాదార్లు వివ‌రాల న‌మోదులో త‌ప్పిదాలు  ధ‌ర‌ణిలో స‌రిచేయ‌డానికి వీలు లేక‌పోయింది. రెవిన్యూ సిబ్బంది పొర పాట్ల వ‌ల్ల ఆధారాలు  మీసేవ  ద్వారా స‌మ‌ర్పించిన త‌ర్వాత జిల్లా క‌లెక్ట‌ర్‌ని సంప్ర దించాల్సి వ‌స్తోంది. ధ‌ర‌ణి అంటేనే ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితులున్నాయి.  కేసీఆర్ ప్ర‌భుత్వం హ‌రిత‌హారం పేరు మీద గిరిజ‌నుల భూమిని లాక్కుంటున్నార‌ని, భూ నిర్వాసితుల‌కు న‌ష్ట‌ప‌రిహారం కూడా ఇవ్వ‌కుండా అరెస్టు చేయించ‌డం జ‌రుగుతోంది. రాష్ట్రంలోకి  స‌రికొత్త భారీ వ్యాపార‌, ఫ్యాక్ట‌రీల‌ను ఆహ్వానించ‌డంలో టిఆర్ ఎస్ పేరును బాగా ప్ర‌చారం చేసుకుంటున్నారు. కానీ అందుకు కావ‌ల‌సిన మౌలిక స‌దుపాయాలు, భూముల ఏర్పాటుకు మాత్రం గిరిజ‌న భూముల‌ను, వీల‌యినంత త‌క్కువ ధ‌ర‌కు అందిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు విన‌ప‌డుతున్నాయి. ఐకియా కంపెనీకి 19 ఎకరాల భూమిని అతి తక్కువ ధరకు కట్టబెట్టారు. ఎకరా రూ. 50కోట్లు పలికే 15 ఎకరా ల భూమిని ఎలాంటి టెండర్లు లేకుండానే ఐకియాకు కట్టబెట్టారు. డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లకు జాగా లేదం టున్న కేటీఆర్‌.. ఐకియాకు ఇచ్చిన భూమిలో వాటిన నిర్మించొచ్చు కదా అన్న అభిప్రాయాలు వ్య‌క్త అవు తున్నాయి. ఇప్పటికే  కేసీఆర్‌ కుటుంబం రూ. లక్ష కోట్లు దోచుకుంద‌ని  ధరణి  పోర్టల్‌కు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించింది.                                                                ధరణి పోర్టల్‌ భూ సమస్యలకు సంబంధించి లక్షకు పైగా ప్రభుత్వానికి  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. భూము ల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దారుణాలు చేస్తోందని విప‌క్షాలూ ధ్వజమెత్తాయి. భూ యజమానులను కేసీ ఆర్‌ సర్కార్‌ జైల్లో పెట్టించ‌డం మ‌రీ దారుణం. తెలంగాణ లో భూ సమస్యలు పెరిగిపోయాయి  ధరణి వచ్చాక ప్రజలు  మ‌రీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణిలో వారసత్వ భూములు గల్లంతయ్యాయ నే అభియోగాలున్నాయి.  ఓటేసిన పాపానికి ప్రభుత్వమే తమ భూములను.. కొల్లగొడుతోందని బాధితులు రోదిస్తున్నారు. ఓఆర్‌ఆర్‌, ప్రాజెక్టులు, ఫార్మాసిటీలు, ట్రిపుల్‌ ఆర్‌ పేరుతో కొల్లగొడుతున్నారని  విప‌క్షాల వారు దుయ్య బట్టారు.  రైతులు కన్న బిడ్డల్లా చూసుకునే భూములను కేసీఆర్‌ సర్కారు  అన్యాయంగా గుంజుకుంటోందని ఆరోప‌ణ‌లు స‌ర్వ‌త్రా విన‌ప‌డుతున్నాయి.  పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములను సైతం వివిధ కారణాలు చెప్పి ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని మండిపడ్డారు. తరతరాలుగా వస్తున్న భూముల్ని సర్కారే స్వయంగా లాక్కోవడం సిగ్గుచేటనాలి.   ధరణి అద్భుతమని, సర్వరోగ నివారిణి అని కేసీఆర్‌ చెప్పిన మాటల్నీ అబద్దాలని ప్రస్తుత పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. ధరణి రికార్డుల్లో అసలు యజమాని పేరు కాకుండా ఎవరెవరి పేర్లు ఉంటున్నాయని, లేదంటే సర్కారు భూమి అని చూపిస్తోందని ప్ర‌జ‌లు వాపోతున్నారు.  పేదలు ఆత్మగౌరవంతో బతకాలని కాంగ్రెస్‌ 25లక్షల ఎకరాల భూములు పంచితే.. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 30 లక్షల ఎకరాలు మాయమయ్యాయని విప‌క్షాలు ఆరోపించాయి. ముఖ్యమంత్రి తీరుతో 5 లక్షల ఎకరాల పోడు భూములు కూడా ఆగమవుతున్నాయు. గౌరెల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుకే చెల్లింది. 

అన్నా చెల్లెళ్ల మధ్య కానరాని అనుబంధం.. ఆత్మీయత..

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద శుక్రవారం ఉదయం సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ప్రతి ఏటా ఇలా వైఎస్సార్ కు జయంతి రోజున, వర్ధంతి రోజున ఇలా నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వైఎస్ కుటుంబం మొత్తం ఒక్కటై నిర్వహిస్తుంది. ఇడుపులపాయలో గత ఏడాది నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల విడివిడిగా పాల్గొన్నారు. ఈ సారి మాత్రం ఒకేసారి పాల్గొన్నా.. ఇద్దరూ వైఎస్సార్ సమాధి వద్ద కాస్త దూరం దూరంగానే కూర్చోవడం గమనార్మం. వైఎస్ షర్మిల, ఆమె కొడుకు దగ్గర దగ్గరగా కూర్చుంటే.. జగన్ మాత్రం మరికాస్త దూరంలో కూర్చోవడాన్ని అందరూ గమనించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అన్నా చెల్లెలు మాట్లాడుకుంటారేమో, ఒకవేళ మాట్లాడుకుంటే ఏమి మాట్లాడుకుంటారో అనే ఉత్కంఠ అక్కడ ఉన్నవారిలో కనిపించింది. అయితే.. కాస్త దూరంగానే కూర్చున్నా.. ఒకేసారి తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా జగన్- షర్మిల ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోవడంతో విస్తుపోవడం అందరి వంతు అయింది. అంటే ఎంతో అన్యోన్యంగా ఉండే అన్నా చెల్లెలు జగన్- షర్మిల మధ్య అంతలా సంబంధాలు చెడిపోయాయనేది ఈ సంఘటనతో చెప్పకనే చెప్పినట్లయిందంటున్నారు. అన్న జగన్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో షర్మిల వేరు కుంపటి పెట్టుకుని తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనం మధ్యలోకి వెళ్తున్నారు. మరో పక్కన జగన్ రోజు రోజుకూ జనానికి దూరమైపోతున్నారు. జగన్ జైలులో ఉండగా ‘అన్న వదిలిన బాణాన్ని’ అంటూ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అన్న కోసం చెల్లెలు షర్మిల అంతలా కష్టపడితే.. ఇప్పుడు ఆమెకు జరిగిందేంటో.. కుటుంబంలో ఎందుకు ఇంతలా విభేదాలు వచ్చాయో వారే స్వయంగా పెదవి విప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు. ముక్తాయింపు ఏంటంటే.. వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచీ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేయడం. మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంటే.. ముందు నుంచీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు అటు చెల్లిని బయటికి గెంటేసిన జగన్ తల్లికి కూడా నామం పెట్టారా? అందుకే ఆమె వైసీపీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జనసేనకు ఈసీ షాక్.. నెలాఖరులోగా ఆదాయ, వ్యయ వివరాలు సమర్పించాలని నోటీసు

ఏపీ రాజకీయాలలో చురుకుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ ఈసీ నిబంధనల మేరకు ఆదాయ వ్యయాలను సమర్పించలేదని తేలింది. ఎవరైనా సరే నాకు మద్దతు ఇవ్వాల్సిందే అంటూ ఏపీ రాజకీయాలలో హల్ చల్ చేస్తున్న జనసేన అధినేతకు ఈడీ షాక్ ఇచ్చింది. జనసేన పార్టీ ఆదాయ వ్యయాలను ఈ నెలాఖరు లోగా సమర్పించాలని నోటీసులు జారీ చేసింది. ఒక వేళ వాటిని సమర్పించడంలో విఫలమైతే పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని ఆ నోటీసులో ఈసీ హెచ్చరించింది. అయితే ఇలా నోటీసులు అందుకున్న పార్టీ ఒక్క జనసేన మాత్రమే కాదు.  తెలుగు రాష్ట్రాలకు చెందిన 119 రాజకీయ పార్టీలకు ఈ నోటీసులు జారీ చేసింది. ఈసీ నోటీసులు అందుకున్న పార్టీలలో  జనసేనతో పాటు   కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజా శాంతి పార్టీ, తెలంగాణ జన సమితి, లోక్ సత్తా,  తెలంగాణ ఇంటి పార్టీ, నవ తెలంగాణ,  ప్రజా రాజ్యం పార్టీ,  తల్లి తెలంగాణ పార్టీ, సమాజ్వాది ఫార్వర్డ్ బ్లాక్,  జై స్వరాజ్, మన తెలంగాణ పార్టీ, జన రాజ్యం పార్టీలు కూడా ఉన్నాయి. రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖను గతంలోనే కోరిన సంగతి తెలిసిందే. అయితే ఈసీ వినతిపై కేంద్రం నుంచి ఇంకా ఎటువంటి సమాధానం రాలేదు. అయితే ఈ లోపే ఎన్నికల కమిషన్ ఆదాయ వ్యయాలను సమర్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పార్టీలకు నోటీసులు జారీ చేసి షాక్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా పార్టీ ఆదాయ వ్యయాలను సమర్పించకుంటే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని నోటీసుల్లో పేర్కొంది.  ఇన్ కమ్ టాక్స్ ఎగ్జంప్షన్  కోసమే చాలా పార్టీలు రాజకీయ పార్టీలుగా రిజిస్టరు చేసుకుంటున్నాయని ఈసీ భావిస్తోంది.  ఈ క్రమంలోనే ఆదాయ వ్యయ వివరాలు సమర్పించని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. అసలు ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకే కొందరు రాజకీయ పార్టీలను రిజిస్టర్ చేస్తున్నారనీ, అటువంటి పార్టీలను నియంత్రించాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా ఈసీ కోరుతున్న సంగతి తెలిసిందే.

హేమంత్ సొరేన్ స‌న్నిహితుల నివాసాల‌పై ఇ.డి. దాడులు

ఝార్ఖండ్‌లో ఒక మైనింగ్ లీజు త‌న‌ప‌రం చేసుకోవ డానికి, అలాగే ఒక ప్లాట్ ఆయ‌న భార్య‌పేరున రిజిష్ట‌ర్ చేయించుకున్నార‌న్న అవినీతి అభియోగాల‌ను సొరేన్ ఎదుర్కొంటున్న స‌మ‌యంలో శుక్ర‌వారం ఇ.డి. దాడులు జ‌రిగేయి. ఇ.డి. ఝార్ఖండ్‌లో మొత్తం 17 ప్రాంతాల్లో ఝార్ఖండ్ ముఖ్య‌మంత్రి సోరేన్ స‌న్నిహితుడు, సాహిబంజ్ ఎమ్మెల్యే పంక‌జ్ మిశ్రా సంబం ధించిన నివాసాల‌పై దాడులు చేప‌ట్టింది.  అయితే ఈ దాడులు మిశ్రాపై తాజాగా రిజిస్ట‌ర్ అయిన నిధుల దుర్వినియోగం పై శుక్ర‌వారం ఎఫ్ ఐ ఆర్ రిజిస్ట‌ర్ అయింది. దీని  ఆధారంగానే  ఈ దాడులు సాహిబ్‌గంజ‌, బార్హాత్‌, రాజ‌మ‌హ‌ల్ ప్రాంతాల్లో చేప ట్టామ‌ని ఇ.డి. అధికారులు తెలిపారు. అయితే ఈ కేసుకి, రాష్ట్ర మైనింగ్ శాఖ కార్య‌ద‌ర్శి పూజా సింఘాల్ పై వున్న కేసుకీ సంబంధం లేద‌న్నారు. కొత్త‌గా రిజిస్ట‌ర్ అయిన కేసు 2020 జూన్ లో సాహిబ్‌గంజ్ బ‌ధ్వారా పోలీస్ స్టేష‌న్‌లో టొల్‌టాక్స్ కాంట్రాక్ట‌ర్ చేసిన ఫిర్యాదు మేర‌కు రిజిస్ట‌ర్ అయిన‌ది. జూన్‌లో సోరేన్ ప్ర‌భు త్వంలో మంత్రిగా వున్న మిశ్రా ఆదేశాల మేర‌కే దాడులు జ‌రిగినట్టు ఫిర్యాదు పేర్కొన్న‌ది. అది కూడా బ‌ధ్వారా న‌గ‌ర పంచాయ‌తీలోకి వ‌చ్చే వాహ‌నాల టోల్ వ‌సూళ్ల పై ర‌గిలిన వివాదంతోనే గొడ‌వ‌లు, దాడు లు జ‌రిగాయి.    ఈ ఏడాదిలో ఇంత‌కుముందు ఇ.డి. జార్ఖండ్‌లో 18 ప్రాంతాల్లో దాడులు నిర్వ‌హించింది. ఇవ‌న్నీ కూడా సింఘాల్  మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ‌ట్టం నిధుల‌ను రాష్ట్రంలో దుర్వినియోగం చేసిన కేసుకు సంబంధించి జ‌రిపిన‌వే. ఆమెను క‌డా ఇ.డి. అరెస్టు చేసింది.  కాగా, హేమంత్ సోరేన్ మైనింగ్ లీజు కేటాయింపుల్లో అవినీతికి పాల్ప‌డ్డార‌న్న అభియోగంపై శుక్ర‌వారం ఇ.డి. దాడులు చేప‌ట్టిం ది. ఎన్నిక‌ల క‌మిష‌న్ (ఇసిఐ)  ఇప్ప‌టికే సోరేన్ సోద‌రుడు రాష్ట్ర ఎమ్మెల్యే బ‌సంత్ సొరేన్‌కి మైనింగ్ లీజు ల వ్య‌వ‌హారంలో నోటీసులు పంపింది. దుమ్కా ఎమ్మ‌ల్యే అయిన బ‌సంత్ పై వ‌చ్చిన అవినీతి ఆరోప‌ణ‌ల అంశంలో త‌మ వైఖ‌రిని వ్య‌క్తం చేయ‌మ‌ని ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇప్ప‌టికే హేమంత్ సొరేన్‌కు నోటీసు జారీ చేసింది. 

ఆత్మస్తుతి పరనింద.. ప్లీనరీలోనూ పాత పాటే!

ఒక్క వైసీపీకనే కాదు,ఏ పార్టీకి అయినా, ప్లీనరీ వంటి విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు జరుపుకోవడం ఒక మంచి సంప్రదాయం. ఒక మంచి అవకాశం. ఆత్మ పరిశీలన చేసుకోవడం, అద్దంలో తమను తాము చూసుకోవడం వలన దిద్దుబాటు చర్యలకు అవకాశం చిక్కుతుంది. అదే విధంగా వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ ప్రణాళికను రచించుకోవడం, అన్ని పార్టీలకు  అవసరం. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు, ప్లీనరీ వంటి సమీక్షా సమావేశాలు జరుపుకోవడం, మరింత అవసరం.  అయితే, అదొక మొక్కుబడి తంతుగా, పార్టీ అధినాయకత్వం నిర్ణయాల మంచి చెడులతో సంబంధం లేకుండా, ‘మమ’ అనిపించే క్రతువుగా ముగిస్తే, మొక్కుబడి ఫలితాలు మాత్రమే వస్తాయి. అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చుకుకున్నా,వెక్కెక్కి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సహజంగా, అధికారంలో ఉన్న పార్టీలకు, మరీ ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి తరహాలో అధినాయకత్వం చెప్పు చేతల్లో నడిచే ప్రాంతీయ,కుటుంబ పార్టీలలో, అధినేత తప్పులను ఎత్తి చూపే, ‘సాహసం’ ఎవరు చేయరు. అందుకే, ప్రాంతీయ, కుటుంబ పార్టీల సమావేశాలలో సాధారణంగా దేవతా వస్త్రాల కథ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్నికలలో ఓడి పోయిన తర్వాతనో, ఇంకేదో ఉపద్రవం సంభవించిన తర్వాతనో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, ఇలా ఏలా జరిగింది అని విస్తుపోవడం మినహా చేయగలిగింది మరొకటి ఉండదు.  ఇక సుదీర్ఘ విరామం తర్వాత, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో మొదటిసారిగా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) నిర్వహిస్తున్న రెండు రోజుల ప్లీనరీ విషయానికి వస్తే, వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ముందు నుంచి కూడా ‘ఆయన సీతయ్య ఎవరి మాట వినరు’ అని ముద్ర పడిపోయింది. గత మూడేళ్ళ పరిపాలనలోనూ,ఆయన తీరు మారలేదు. ఈ నేపధ్యంలో, వైసీపీ ప్లేనరీ నుంచి అద్భుతాలను ఆశించలేము. అలా ఆశిస్తే, అయితే అది మన అజ్ఞానం, కాదంటే మన అవివేకం అవుతుందే కానీ, మరొకటి కాదు.  గడచిన మూడు  సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం, ఏమి చేసింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే, మెరుపులకంటే మరకలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, దురదృష్టం ఏమంటే, ముఖ్యమంత్రి ప్లీనరీ ప్రారంభంలోనే, ‘అంతా బాగుంది’ అనే ముందు మాటతోనే ప్రారంభోపన్యాసం మొదలు పెట్టారు. ఇచ్చిన హామీలలో 95 శాతం పూర్తి చేశామనే పాత పాటనే వినిపించారు. అంతే కానీ, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి కానీ, రాష్ట్ర ప్రజలు మనసా వాచా కోరుకునే, ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్ట్  గురించి కానీ, చివరకు మద్యం, ఇసుక పాలసీలు తెచ్చిన అనర్ధాల గురించి కానీ, ఒక్క మాట చెప్పారా అంటే లేదు. పోనీ, తమ మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో, రాష్ట్ర ప్రజల నెత్తిన పెరిగిన అప్పుల భారం ఎంతో అదైనా చెప్పారా, లేదు.  అసలు సమస్యల ప్రస్తావనే లేదు. పైగా, ఎవరో సృష్టించిన అవరోధాల వలన తమకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆత్మవంచనా శిల్పాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.   అంతే కాదు, 2019 ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరధం పట్టారనే భ్రమలోంచి ముఖ్యమంత్రి జగన్  రెడ్డి ఇంకా , బయటకు రాలేదు. మూడేళ్ళ క్రితం జరిగన ఎన్నికలలో ప్రజలు, ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు తమను మెచ్చి ఇచ్చిన తీర్పనే భ్రమల్లోనే ఉన్నారు. అందుకే వైసీపీని  151 సీట్ల భారీ మెజారిటీతో గెలిపించారని, ప్రతిపక్ష టీడీపీని 23 సీట్లకే  పతిమితం చేశారని, అదంతా తమ ఘనతే అని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తమ అక్కసు అంతా వెళ్లగక్కారు. ఆలాగే, నిజాలను నిర్భయంగా ఎత్తి చుతున్న  మీడియాను ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియా  అంటూ దెప్పి పొడిచారు. చివరకు  ప్లేనరీ ప్రధాన లక్ష్యం, ఆత్మపరిశీలన పక్కన పెట్టి, ఆత్మస్తుతి, పరనిందతో సిగ్నేచర్  ట్యూన్ సెట్ చేశారు. సో.. రెండు రోజుల వైసీపీ ప్లీనరీ అద్భుత ఫలితాలు ఇస్తుందని ఆశించడం,ఇంతకు ముందే అనుకున్నట్లుగా మన అజ్ఞానం, కాదంటే మన అవివేకం అవుతుందే కానీ, మరొకటి కాదు.  నిజానికి, వైసీపీ ప్రకటిత నిబంధనలు, నియమావళి ప్రకారం, ప్రతి రెండేళ్లకు ప్లీనరీ నిర్వహించవలసి ఉంటుంది. అయితే, పదమూడేళ్ళ ప్రస్థానంలో వైసీపీ జరుపుకుంటున్న మూడవ ప్లీనరీ ఇది. ఈ మూడు సందర్భాలలోనూ ఎన్నికలకు ముందు మాత్రమే ప్లీనరీ, జరుపుకోవడం ఆ పార్టీ ఆనవాయితీగా వస్తోంది. ఎప్పుడు ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటే అప్పుడు మాత్రమే ప్లీనరీ జరుపుకోవడం వైసీపీలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్లీనరీ కూడా అంతే, ఇదీ ఎన్నికల ప్లీనరీనే.  అయితే ... రాజదాని మొదలు. మద్యం  పాలసీ వరకు ఇచ్చిన మాట తప్పి, మూడేళ్ళలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన జగన్ పాలనకు, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పుచేశామని తలలు పట్టు కుంటున్న జనం , జగన్ రెడ్డి తమ తప్పులు తెలుసుకోకుండా, దిద్దుబాటు చర్యలు లేకుండా  మరొక ఛాన్స్ .. అంటే .. జనం ఇస్తారనుకుంటే మాత్రం .. అది అయ్యే పనికాదు.  ఇచ్చిన చక్కని అవకాశాన్ని, ఇంచక్కా వదిలేసుకున్న వైసీపీ, ప్లీనరీలో ఎన్ని ప్రవచనాలు ప్రవచించినా, ఫలితం మాత్రం గోడ మీద రాతలా స్పష్టంగానే వుంది.  బై .. బై .. జగన్.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. ఇప్పుడు జగన్ సర్కార్ ఏం చెబుతుందో?

రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెడితే నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసి మీటర్లు పెట్టేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. ఇతర జిల్లాల్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతు మెడ మీద కత్తి పెట్టి మరీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తోందో ఎవరికీ తెలియని రహస్యం కాదు. అలా బిగిస్తే రుణాలు అందుతాయని కేంద్రం చెప్పడం వల్లే. అయితే ఈ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.  రైతుల మోటార్లకు కరెంట్ మీటర్లు పెడితే నాణ్యమైన విద్యుత్ వస్తుందని ఏపీ ప్రభుత్వ పెద్దలు ఘనంగా ప్రచారం చేసి మీటర్లు పెట్టేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పెట్టేశారు. ఇతర జిల్లాల్లో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. అయినా పట్టించుకోవడం లేదు. కానీ ప్రభుత్వం ఇలా రైతు మెడ మీద కత్తి పెట్టి మరీ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగిస్తోందో ఎవరికీ తెలియని రహస్యం కాదు. అలా బిగిస్తే రుణాలు అందుతాయని కేంద్రం చెప్పడం వల్లే.   రైతుల్లో వ్యతిరేకత తెస్తుందని భావించినా వ్యవసాయ మీటర్ల విషయంలో ముందుకే  వెళ్లారు.  మీటర్లు పెట్టి ఊరుకోరనీ, వినియోగించిన విద్యుత్ కు బిల్లులు వేస్తారనీ విపక్షాలు విమర్శిస్తే ఔను  బిల్లులుస్తాం కానీ .. డబ్బులు రైతులకు నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. జీతాల కోసం ప్రతీ నెలా అప్పు చేయాల్సిన పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ప్రతి నెలా ఠంచన్‌గా బిల్లులు ఇస్తుందంటే రైతుల్లోనూ నమ్మకం కలగడం లేదు. అయినా ప్రభుత్వం వారి నమ్మకాలతో పని లేకుండా ముందుకే వెళుతోంది. కేంద్రంపై భక్తి? జగన్ ప్రభుత్వాన్ని అలా నడిపించింది. అయితే ఇప్పుడు కేంద్రమే విద్యుత్ మోటార్లకు మీటర్లు వద్దని యూటర్న్ తీసుకుంది. అలా ఎందుకు తీసుకుందంటే వ్యవసాయ మీటర్లకు  మోటార్లు బిగించడాన్ని రాష్ట్రంలో అత్యధిక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఎక్కువ ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక  కేంద్ర మోటార్ల విషయంలో వెనక్కు తగ్గింది. ముందు వెనుకలు ఆలోచించకుండా కేంద్రం చెప్పింది.. చేసేస్తున్నాం అన్న చందంగా జగన్ సర్కార్ వ్యవసాయ మీటర్ల విషయంలో ముందుకే సాగడంతో ఇరుకున పడింది. బీజేపీ పాలిత రాష్ట్రాలే వ్యతిరేకించిన కేంద్రం విధానాన్ని జగన్ సర్కార్ ఆఘమేఘాల మీద ఆచరణలో పెట్టేసింది. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతుంది. విద్యుత్ సంస్కరణల్లో మోటార్లకు మీటర్లు పెట్టాలనే నిబంధన తొలగిస్తున్నట్లుగా కేంద్ర స్పష్టం చేసేసింది.  మోటార్లకు పెట్టే బదులు ట్రాన్స్ ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడితే చాలని కేంద్రం నిబంధన మార్చడానికి రెడీ అయ్యింది. ఇప్పుడు  కేంద్రం నిర్ణయం వల్ల   ఇబ్బందుల్లో పడేది ఏ ఇతర రాష్ట్రం కన్నా ఏపీ మాత్రమే. ఎందుకంటే పొరుగున ఉన్న సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణ మీటర్ల విషయంలో ససేమిరా అంటూ కేంద్రాన్ని వ్యతిరేకించి నిలబడితే.. జగన్ సర్కార్ మాత్రం జీ హుజూర్ అంటూ కేంద్రం ముందు సాగిల పడింది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకించిన విధానాన్ని భుజాన వేసుకుని మరీ సమర్ధించింది.  మీటర్లతో   రైతులకు మేలనే  వాదనను వినిపిస్తూ వచ్చింది. మీటర్లు మేలు అంటూ    కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసిన నోటితోనే ఇప్మీపుడు మీటర్లు అవసరం లేదని చెప్పాల్సిన పరిస్థితిని జగన్ సర్కార్ కొని తెచ్చుకుంది.    

వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ రాజీనామా

సంచలనం ఏమీ లేదు.. అనూహ్యమేమీ సంభవించలేదు. అంతా పక్కాగా, జగన్ స్క్రిప్టు ప్రకారమే జరిగిపోయింది. ప్లీనరీ వేదికగా వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ వైదొలిగారు. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. వైసీపీ ప్లీనరీ విజయమ్మ రాజీనామాతోనే ఆరంభమౌతుందని తెలుగు వన్ ముందే చెప్పింది. అదే విధంగా జరిగింది. అయితే తన రాజీనామా ప్రకటన సందర్భంగా విజయమ్మ మాట్లాడిన మాటలే ఒకింత నర్మగర్భంగా ఉన్నాయి. కన్న తల్లిగా తన మద్దతు తన బిడ్డలిద్దరికీ ఉందని చెబుతూనే తన భర్త వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం తెలంగాణ కోడలిగా తన కూతురు చేస్తున్న కృషికి మద్దతివ్వాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు. జగన్ సమక్షంలోనే ఆమె ప్రసంగించారు.  తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి తెలంగాణలో వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్న షర్మిలకు అండగా నిలవడం కోసమే తాను వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. విజయమ్మ రాజీనామా ప్రకటన అందులోనూ ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా కొనసాగలేనంటూ చేసిన వ్యాఖ్య సంచలనంగా మారాయి. ఎంత జగన్ స్క్రిప్ట్ ప్రకారమే రాజీనామా ప్రకటన చేసినా.. ఆ ప్రకటన సందర్భంగా చేసిన ప్రసంగంలో మాత్రం ప్రస్తుత పరిస్థితులు అంటూ  చేసిన వ్యాఖ్యలను విశ్లేషకులు ఎత్తి చూపుతున్నారు. రాజీనామా కోసం ఆమెపై వచ్చిన ఒత్తిడికి ఆ వ్యాఖ్యలే నిదర్శనమని విశ్లేషిస్తున్నారు. 

రాజ్‌బ‌బ్బ‌ర్‌కు రెండేళ్లు జైలు శిక్ష‌

బాలీవుడ్ న‌టుడు, కాంగ్రెస్ నాయ‌కుడు రాజ్ బ‌బ్బ‌ర్‌కు ల‌క్నో కోర్టు రెండేళ్లు జైలు శిక్ష విధించింది. 1996 ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ అధికారి ప‌నికి అడ్డుప‌డ‌ట‌మే కాక ఆయ‌న‌పై దాడిచేసిన కేసులో ల‌క్నో కోర్టు శుక్ర‌వారం శిక్ష‌ను ఖ‌రారు చేసింది. జైలు శిక్ష‌తో పాటు రూ.8,500 జ‌రిమానా కూడా విధించింది. తీర్పు ప్ర‌క‌టించే స‌మ‌యంలో రాజ్ కోర్టులో వున్నారు.   పోలింగ్ అధికారిని డ్యూటీ చేయ‌కుండా అడ్డుకోవ‌డం, దాడి చేయ‌డం అంశాల‌ను బ‌బ్బ‌ర్ కూడా అంగీక రించారు. 1996 మేలో  ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన దాడిపై అప్ప‌టి పోలింగ్ అధికారి ల‌క్నో వ‌జీర్‌గంజ్ పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. రాజ్ బబ్బ‌ర్ 1990ల్లో రాజ‌కీయా ల్లోకి వ‌చ్చారు. 1994లో స‌మాజ్‌వాది పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ‌కు ఎన్నిక య్యారు. ఆయ‌న హోమ్ మంత్రిత్వ శాఖ‌, పౌర‌విమాన‌యాన శాఖల అనేక క‌మిటీల్లో ఆయన పాల్గొన్నారు. 1999 ఆగ్రా నియోజ‌క‌వ‌ర్గంలో  బిజెపీ అభ్య‌ర్ధి బిఎస్ రావ‌త్ పై లోఆ 10వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2008లో బ‌బ్బ‌ర్ కాంగ్రెస్‌లో చేరారు. 2009లో ఎంపీగానూ వున్నారు. కాగా 2014, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి చవిచూశారు. 150కిపైగా చిత్రాల్లో, 30 నాట‌కాల్లోనూ రాజ్ బ‌బ్బ‌ర్ న‌టించారు. సాజీష్‌, ఆంఖే, ద‌లాల్‌, ద గాంబ్ల‌ర్‌, అందాజ్‌,  యారానా, బ‌ర్సాత్‌, జిద్ది మొద‌లైన చిత్రాలు ఆయ‌న న‌టించిన చిత్రాల్లో ప్ర‌ముఖంగా చెప్పుకుంటారు.     

కంచుకోటలోనూ.. భద్రతా వలయం మధ్యనే జగన్.. అంత భయమెందుకంటే.. ?

దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే కాకుండా తనకు, తన కుటుంబానికి కంచుకోట అనుకునే పులివెందులలో, వేంపల్లెలో తిరగాలంటేనే సీఎం జగన్ కు భద్రతా పరమైన భయం పట్టుకున్నట్లుంది. అందుకేనేమో గతంలో ఏనాడూ లేని విధంగా గురువారం ఉదయం నుంచీ పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో, మార్గాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడమే కాకుండా పోలీసులు, వాలంటీర్ల వలయం మధ్యనే జగన్ తిరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  వేంపల్లెలోని ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ ఉదయం నుంచీ మూసేశారు. చివరికి వైఎస్ఆర్ పార్క్ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ కోసం ఆయన కంచుకోటలోనే ఇంతటి విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని చూసిన  జనం అవాక్కయ్యారు. నిజానికి పులివెందుల, వేంపల్లె వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా పెట్టని కోటలు. అయితే.. వేంపల్లెలో వైఎస్ఆర్ పార్కును ప్రారంభించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో ఇంతటి పకడ్బందీ భద్రత ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తమను ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అగత్యం ఏమి వచ్చిందంటూ స్థానికులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడం ఏమిటి? వేలాది మంది పోలీసులను మోహరించడం దేనికని వారు గుస్సా అవుతున్నారు. జగన్ భద్రతకు   వచ్చిన ముప్పు ఏముందని ఇంతలా ఆర్భాటం చేశారని వారు దుయ్యబడుతున్నారు. ఒక్కసారి ఛాన్స్ అంటూ ఏపీ సీఎం అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని, ఎక్కడికి వెళ్లినా తనకు ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలు, చీదరింపులు ఎదురవుతుండడం వల్లే ఇలా అతి జాగ్రత్తలు తీసుకున్నారని జనం అంటున్నారు. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్ ను కలిసి, సమస్యలపై మొరపెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఈ బందోబస్తు ఏమిటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనాలోచిత నిర్ణయాలు,పాలనతో యావత్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేసిన జగన్ పట్ల జనంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే వైసీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదంటున్నారు. మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం చేపట్టినా.. జిల్లాల యాత్రలు చేస్తున్నా అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ సభ నిర్వహించినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్కన జగన్ కానీ, వైసీపీ కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. జనం కనిపించడం లేదు. రోజు రోజుకూ చంద్రబాబు ప్రభ వెలిగిపోతోంటే.. అంతకంతకూ జగన్ ప్రభావం కొడిగట్టేస్తోందని జనం చెప్పుకుంటున్నారు.  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జులై 8న సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పులివెందుల వచ్చిన ప్రతిసారీ ఆయన స్థానికులను ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కలుసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. కానీ.. వారికి పోలీసులు జగన్ కలుసుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం గమనార్హం. తన సమస్య చెప్పుకోడానికి సిద్ధవటం నుంచి వచ్చిన ఓ వృద్దురాలిని కూడా జగన్ ను కలుసుకోనివ్వకుండా అడ్డుకోవడంతో ఆయనకు అంత భయం ఎందుకు పట్టుకుందన్న విమర్శలు స్థానికుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. వృద్ధురాలి నుంచి కూడా జగన్ కు ముప్పు ఉందని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు క్షణక్షణం భయంతో, భద్రతాపరంగా వణికిపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ లో ఎంత భయం గూడుకట్టుకుందో ఏమో గానీ చివరికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించపోవడంలోని ఔచిత్యాన్ని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ పులివెందుల, వేంపల్లె పర్యటన ప్రజలకు దూరంగా, కేవలం తమ పార్టీ నేతలను మాత్రమే కలుసుకోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారీ పోలీసు భద్రత, వలంటీర్ల వలయం, పరదాల చాటున జగన్ తిరగాల్సిన పరిస్థితి రావడం ఆయన జనానికి దూరం అయ్యారనడానికి నిదర్శనంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి..

ఆ ఉంగ‌రం.. చంద్రబాబు ఆరోగ్య మీట‌ర్‌

ఆ మ‌ధ్య మా వూరికి ఓ పెద్ద సాములోరు వ‌చ్చారు. మెడ‌లో రుద్రాక్ష‌లు, రెండుచేతి వేళ్ల‌కీ ఉంగ‌రాలు అట్ట హాసంగా వున్నారు. భ‌యం భ‌యంగానే ద‌ణ్ణం పెట్టేరు. చేతివేళ్ల‌కి అలా నిండుగా బంగారం, వెండి మ‌రేదో ఉంగ‌రాలు ధ‌రించిన‌వారు ఇటీవ‌లి కాలంలో చాలామందే ద‌ర్శ‌న‌మిస్తారు. రాజ‌కీయ‌నాయ‌కుల‌కు రెండు మూడు ఉంగ‌రాలు త‌ప్ప‌కుండా క‌న‌ప‌డ‌తాయి. అస్స‌లు అటువంటి ఆర్భాటాలేవీ లేని రాజ‌కీయ నాయ కుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, టిడీపీ అధినే నారా చంద్ర‌బాబు నాయుడు. అయితే మొన్నీ మ‌ధ్య‌నే  ఆయ‌న ఒక చేతికి ఉంగ‌రం ద‌ర్శ‌న‌మిచ్చింది.  ఆ ఉంగరం కూడా ఎడమ చేతి చూపులు వేలికి పెట్టుకున్నారు. ఇదేమిటీ.. ఈయ‌న చేతికి వాచ్ కూడా వుండ‌దే.. ఇప్పుడు ఉంగ‌రం ధ‌రించారేమిట‌బ్బా.. అని అంద‌రూ కాస్తంత విస్తుపోయారు. ఈయ‌న కూడా ఉంగ‌రాల మంత్ర తంత్రాల పిచ్చిలోగాని ప‌డ్డారా అన్న అనుమా నాలూ వ్య‌క్త‌మ‌య్యాయి. ఉంగ‌రం ధ‌రించ‌డం గురించి ర‌క‌ర‌కాల ప్ర‌చారం మొద‌లైంది.   అదేం లేదు మీ రెవ్వ‌రూ అలాంటి సందేహాలు పెట్టుకోవ ద్దు, ఇది నా ఆరోగ్య సూచీతో వున్న ప్లాటిన‌మ్ రింగ్ అని టీడీపీ  అధినేత స్వ‌యంగా స్ప‌ష్టంచేశారు.    అన్నమయ్య జిల్లా ప‌రిధిలోని మ‌ద‌న‌ప‌ల్లె లో జ‌రిగిన టీడీపీ మినీ మ‌హానాడులో ఆ ఉంగరం లాంటి దాని గురించి చెప్పారు. త‌ను పెట్టుకున్న‌ది కేవ‌లం ఉంగ‌రం మాత్ర‌మే కాదు. అందులో ఒక చిప్ వుంది. అది ఆయ‌న  ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్పటికప్పు తెలియజేస్తుందన్నారు.   హార్ట్ బీట్‌, స్లీపింగ్ అవ‌ర్స్‌, ఆహారం త‌దిత‌ర అంశాల‌న్నింటినీ రికార్డు చేస్తుందిట‌.  ఈ సమాచారాన్ని ఆయ‌న‌ కంప్యూట‌ర్‌కు పంపుతుంద‌ని చంద్రబాబు చెప్పారు.  రోజూ  ఉద‌యాన్నే కంప్యూట‌ర్‌లోకి ఈ ప్లాటినం ఉంగ‌రం పంపిన రిపోర్ట్ ను చెక్ చేసుకుంటార‌ట‌. రోజువారీగా జ‌ర‌గాల్సిన చర్యల్లో  ఏది త‌ప్పుగా ఉంద‌నే విష‌యాన్ని ఈ చిప్ ఇట్టే చెప్పే స్తుంద‌ని బాబు అన్నారు.  ఆ నివేదిక‌ ఆధారంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలో ఏమ‌న్నా పొర‌పాట్లు వుంటే గ్రహించి మళ్లీ ఆ లోటు పాటు జరగకుండా అప్రమత్తంగా ఉంటానన్నారు.

ఆకుపచ్చ ఆకాశం.. గగనంలో అద్భుత దృశ్యం

శ్రీహరి మేనును నీలాకాశంతో పోలుస్తాం. మబ్బులు పట్టిన ఆకాశం నల్లగా ఉంటుంది. ఎండా వానా కలిసి వచ్చినప్పుడు ఆకాశం సప్త వర్ణాలతో సుందరశోభితంగా విరాజిల్లుతుంది. సాయం సంధ్యలో ఆకాశం ఎర్రగా కనిపించడం సాధారణమే. ఆయితే ఆకుపచ్చని వాతావరణాన్ని ఏ కవీ ఊహించలేదు. ఏ వాతావరణ శాస్త్రవేత్తా ఇప్పటి వరకూ కనుగొన్నదీ లేదు. అలాంటిది అమెరికాలో ఆకాశం ఆకుపచ్చ వర్ణం సంతరించుకుంది. అది అందంగా ఉందా? లేదా అన్నది పక్కన పెడితే ఆకాశం ఆకుపచ్చ రంగు సంతరించుకోవడాన్ని చూసి జనం భయాందోళనలకు గురయ్యారు. వాతావరణ శాస్త్రవేత్తలూ ఇలా ఎందుకు జరిగిందా అన్న పరిశోధనల్లో మునిగి పోయారు. అమెరికాలో  ఎన్నడూ లేని విధంగా ఆకాశం ఆకుపచ్చ రంగు పులుముకుంది.    అమెరికాలోని సౌత్ డకోటా, సియోక్స్ ఫాల్స్ ప్రాంతాల్లో భారీ తుఫాన్ వచ్చింది. ఈ తుఫాన్ తగ్గిన అనంతరం ఆకాశమంతా ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.   అధికారులు  సైతం ఆకాశం ఆకుపచ్చ రంగులోకి మారడం ఇప్పటి వరకూ  చూడలేదన్నారు.  వాతావరణ శాస్త్రవేత్తలు  మాత్రం ఎర్రటి సూర్య కిరణాలు సాయంత్రం వేళలో తుఫాన్ లోని నీరు, ఐస్ అణువులతో కలవడం వల్ల మేఘాలు ఆకుపచ్చ రంగులోకి మారాయనీ, ఇదేమీ విపత్తు సూచిక కాదనీ చెబుతున్నారు.

కాంగ్రెస్’లో చేరికల చిచ్చు.. రేవంత్ వర్సెస్ రాష్ట్ర కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి ... చేరికలతో పాటుగా నిరసన స్వరాలు, వ్యతిరేక నినాదాలు కూడా అదే స్థాయిలో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇంత కాలంగా కొంత  గుంభనంగా  ఉన్న విబేధాలు భగ్గు మంటున్నాయి. ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంతవరకు ఆయన పార్టీపై పట్టు సాధించ లేక పోయారు. పీసీసీ కుర్చీలో కుదరుగా కూర్చున్నది లేదు, అందుకే పార్టీలో విబేధాలు రోజు రోజుకు పై మెట్టుకు చేరుతున్నాయే, తప్ప దిగిరవడం లేదని పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు పరిస్థితిని విశ్లేషిస్తున్నారు.   ఇక కాంగ్రెస్ పార్టీలో చేరికలు రేపుతున్న చిచ్చు విషయానికి వస్తే, పైన అనుకున్న విధంగా ఒక్కొక చేరిక, ఒక్కొక్క కొత్త వివాదానికి తెర తీస్తోంది. తాజాగా, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ నేత  మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆయన్ని, సగౌరవంగా పార్టీలోకి స్వాగతించారు. ఎర్ర శేఖర్ తో పాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. గాంధీభవన్’లో సందడి చేశారు. కానీ, ఆ  సందడి పూర్తిగా సర్డుమణగక ముందే ఎర్ర శేఖర్ చేరికపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల విమర్శలు మొదలయ్యాయి. నేర చరిత్ర కలిగిన ఎర్రశేఖర్‌ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు, అంటూ సీనియర్ నేతలు కొందరు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్టీ స్టార్ క్యాంపైనర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బహిరంగంగానే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని తప్పుపట్టారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.అంతే కాదు, ఎర్ర శేఖర్ ఎంట్రీ పై పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అదలా ఉంటే కొంతకాలం వెనక్కి వెళితే, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే వడ్డేపల్లి రవి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన్ని 2018 ఎన్నికల సమయంలో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తిని, సస్పెన్షన్ ఎత్తివేయకుండా, మళ్ళీ పార్టీలోకి ఎలాతీసుకుంటారని రేవంత్ రెడ్డి వర్గం, కోమటి రెడ్డిని తప్పు పట్టింది. అంతేకాదు, మర్యాద పూర్వకంగా పీసీసీ చీఫ్ కు కలిసేందుకు ఇంటికొచ్చిన వడ్డేపల్లి ముఖం మీదనే రేవంత్ రెడ్డి తలుపులు వేశారు. రవిని రేవంత్ కలవలేదు. గేటు బయటి నుంచే వెనక్కి పంపించేశారు. ఇంకొంత వెనక్కి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. కానీ, తమకు ముందుగా సమాచారం ఇవ్వలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అలిగి కూర్చున్నారు.  అలాగే,ఇటీవల సీఎల్పీ మాజీ నేత, పీజేఆర్ కుమార్తె, తెరాస కార్పొరేటర్ విజయా రెడ్డి, మళ్ళీ సొంత గూటికి చేరారు. పీసీసే చీఫ్ రెంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న, పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన రెడ్డి మాత్రం, సోదరి చేరికను గట్టిగానే వ్యతిరేకించారు. తన సోదరి కాంగ్రెస్ పార్టీలో  చేరే విషయమై పార్టీ నేతలు ఎవరూ తనతో చర్చించలేదన్నారు. అంతే కాకుండా, రెంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను లంచ్ కి ఆహ్వానించి సమాలోచనలు జరిపారు. సోదరి విజయా రెడ్డిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై విష్ణువర్ధన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఆయన సీనియర్లతో సమాలోచనలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ నేపధ్యంలోనే, ఢిల్లీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి, పార్టీలో చేరుతున్న ఎవరికీ, టికెట్ హామీ ఇవ్వడం లేదని ప్రకటించారు. అయితే, రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి కుర్చీలో ముందుగా   కర్చీఫ్ వేసేందుకే, సీనియర్లను పక్కన పెట్టి, ఇతర పార్టీలలో తనకు మద్దతుగా నిలిచే వారిని ఏరి కోరి పార్టీలో చేర్చుకుంటున్నారని,సీనియర్ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే కావచ్చును, రేవంత్ రెడ్డి తాజాగా, సోనియా గాంధీ ఎవరి పేరు చెపితే వారిని, పల్లకీలో భుజాన మోసుకెల్లి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చో పెడతానని ప్రకటించవలసి వచ్చిందని అంటున్నారు. నిజానికి, ఒక్క చేరికల విషయంలోనే కాదు, ఇతరత్రా కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి వర్సెస్ అన్న విధంగానే ఇతర సీనియర్ నాయకుల ప్రవర్తన ఉంటోంది. ఇటీవల రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో  నిర్వహించిన చింతన శిబిర్ లో  ఆమోదించిన తీర్మనాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడం కోసం, రేవంత్ రెడ్డి దేశంలో లేని సమయంలో, సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అధ్వర్యంలో జూన్ 1 నుంచి రెండు  రోజులు హైదరాబద్’లో రాష్ట్ర కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించింది. అలాగే, గతంలో రేవంత్ రెడ్డి,  రెడ్డి సామాజిక వర్గానికి పగ్గాలను అప్పగిస్తేనే పార్టీలకు మనుగడ ఉంటుందంటూ చేసిన వ్యాఖ్యలు కానీ, ఇటీవల ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా రాష్ట్ర పర్యటన సందర్భంగా, కాంగ్రెస్ నాయకులు ఏవరైనా పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే, గోడకేసి కోడతానంటూ చేసిన వ్యాఖ్యలు  కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం సృష్టించాయి.   ఇదలా ఉంటే రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయినా, ఇంకా ఆయన పార్టీఫై పూర్తి పట్టును సాధించలేక పోయారు. సీనియర్లతో సయోధ్యత ఎండమావిగానే మిలిపోయింది. మరో వంక అయన దూకుడు పెంచిన కొద్దీ, పార్టీలో వ్యతిరేకత అదే స్థాయిలో పెరుగుతోంది,  ఎదురు తిరుగుతోంది. మరోవంక రేవంత్ రెడ్డి సారధ్యంలో  జరుగుతున్న చేరికలు ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకునేందుకు పనికోస్తాయే తప్ప పార్టీ ఇమేజ్ ని పెంచేందుకు ఏ మాత్రం పనికొచ్చేవి కాదని, పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నిజానికి, పార్టీలో కొత్తగా చేరుతున్న నేతల వలన నియోజకవర్గ స్థాయిలో సమస్యలు, తిరుగుబాట్లు ఎదురయ్యే  ప్రమాదం ఉందని అంటున్నారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి చేరికతో, గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిండ్ దాసోజు శ్రవణ్  పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. మరో వంక, రేవంత్ రెడ్డికి మొదటి నుంచి దూరంగా ఉంటున్న పీజేఆర్ కుమారడు విష్ణు వర్దన్  రెడ్డి రేపు ఏమి చేస్తారో .. తెలియదు. మొత్తానికి కాంగ్రెస్ లో చేరికల సందడిపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, పార్టీలో చేరికలు చిచ్చుపెడుతున్నాయి అనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయమే వ్యక్తమవుతోందని రాజకీయ పండితులు విశ్లేస్తిస్తున్నారు. అంతే కాదు, రేవంత్ రెడ్డి పార్టీ పాలిట మరో సిద్దూ అవుతారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో హ‌త్య‌ ..ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాల్పులు

జ‌పాన్ మాజీ ప్ర‌ధాని షింజో అబే మృతి చెందారు. ఆయ‌న‌పై శుక్ర‌వారం ఒక వ్య‌క్తి అతి స‌మీపం నుంచి కాల్పులు జ‌రిపాడు. ప‌శ్చిమ జ‌పాన్ నారా ప‌ట్ట‌ణంలో ఎన్నిక‌ల ప్ర‌చారంలో వుండ‌గానే హ‌ఠాత్తుగా ఒక‌వ్య‌క్తి షింజోపై కాల్పులు జ‌రిపిన‌ట్టు జ‌పాన్ అధికారులు తెలిపారు. తుపాకుల దాడుల సంఘ‌ట‌న‌లు క‌నీవినీ ఎరుగ‌ని దేశంలో ఈ సంఘ‌ట‌న యావ‌త్ ప్ర‌పంచ దేశాల‌ను ఆశ్చ‌ర్య‌చ‌కితుల‌ను చేసింది.  శుక్ర‌వారం ఉద‌యం 11.30 స‌మ‌యంలో షింజో ఒక వీధిలో ఎన్నిక‌ల  ప్ర‌చార ప్ర‌సంగం చేస్తుండ‌గా  ఆయ‌న వెనుక నుంచి  ఒక వ్య‌క్తి షాట్‌గ‌న్‌తో కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో షింజో అబే ఛాతిలో బుల్లెట్ త‌గిలింద‌ని తెలిసింది. అబే వెంట‌నే కుప్ప‌కూలిపోయారు.  ర‌క్తం మ‌డుగులోని అబేను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా వుంద ని, కార్డియో ప‌ల్మ‌న‌రీ అరెస్టు స్థితిలో వున్నార‌ని టోక్యో మాజీ గ‌వ ర్న‌ర్ చెప్పారు. సంఘ‌ట‌నా స్థ‌లంలో  41 ఏళ్ల అనుమానితుడిని ఘటనా స్థలంలో భద్రతా సిబ్బంది అడ్డు కుని అదుపులోకి తీసుకున్నారు  అబే పై కాల్పు లు జరిపిన చోట నుంచి పోలీసులు తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారు.శక్తివంతమైన రాజకీ య కుటుంబం నుంచి వచ్చిన షింజో అబే 1993లో జపాన్ దిగువ సభకు ఎన్నికయ్యారు. అబే తొలి సారిగా 2006 లో జపాన్ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే వివాదాల కారణంగా ఒక సంవత్సరం పదవిలో ఉన్న తర్వాత పదవీవిరమణ చేశారు. ప్ర‌ధాని ఫుమియో కిషిదా, ఇత‌ర మంత్రిమండ‌లి స‌భ్యులు త‌మ ప్ర‌చారం నిలిపివేసి వెంట‌నే టోక్యో వెళ్లా రు. ఎల్‌డిపి సుల‌భంగా విజ‌యం సాధించాల్సిన స‌మ‌యంలో ఈ కాల్పుల సంఘ‌ట‌న భారీ ప్ర‌భావం చూపవ‌చ్చ‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  జపాన్‌లో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రి అబే, దీర్ఘకాలిక అనారోగ్యంతో చికిత్స పొందేందుకు ఆగస్టు 2020లో పదవీవిరమణ చేశారు. అయినప్పటికీ, అతను మరింత రక్షణ వ్యయం కోసం రాజకీయం గా ప్రభావవంతంగా ఉన్నాడు మరియు తైవాన్‌పై ఏదైనా దాడి చేస్తే దాని ఆర్థిక వ్యవస్థకు వినాశకరమైన దని చైనాను హెచ్చరించాడు.  జపాన్ ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో కొన్ని కఠినమైన తుపాకీ చట్టాలను కలిగిన‌ దేశం,  కాల్పులు  చాలా అరుదు. కానీ రాజకీయ హింస ఇప్పటికీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది: 2007లో, నాగసాకి మేయర్ ఇట్చో ఇటో  మ‌ర‌ణించ‌డానికి ముందు వ్యవస్థీకృత క్రైమ్ గ్యాంగ్ సభ్యునిచే  రెండుసార్లు తుపాకీ దాడు ల‌ను త‌ప్పించుకున్నారు.  ఆయ‌న  త‌న  పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు దేశ ప‌రిస్థితులు  దశాబ్దాలుగా అత్యంత ప్రతికూలం గా ఉంది. ప్రతి ద్రవ్యోల్బణం చక్రం నుండి జపాన్ తప్పించుకోవడానికి అబే కృషి అన‌న్య‌సామాప్యం అం టారు అక్క‌డి ఆర్ధిక‌వేత్త‌లు.  దేశం ఏకైక సైనిక కూటమిని ప్రశ్నించే ట్రంప్ పరిపాలనను భరిస్తూనే తన అతి పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేశారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ హచ్చరించింది.  నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆఫీస్‌లకు, ప‌నుల‌కు వెళ్లే  వారు ఇబ్బందులు పడుతున్నారు. మరో  మూడు రోజులపాటు తెలంగాణ అంతటా   భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేక చోట్ల, రాయల సీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.   ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 92,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 92,720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 5.80 టీఎంసీలుగా నమోదు అయ్యింది. అటు సరస్వతి(అన్నారం) బ్యారేజ్‌లోని 8 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌ ఇన్ ఫ్లో 7,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,800గా ఉంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 6.01గా కొనసాగుతోంది.