తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
posted on Jul 8, 2022 @ 11:01AM
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హచ్చరించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్‌లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆఫీస్‌లకు, పనులకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.
మరో మూడు రోజులపాటు తెలంగాణ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతవరణ శాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందున గురువారం కోస్తాలో అనేక చోట్ల, రాయల సీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు లక్ష్మీ(మేడిగడ్డ)బ్యారేజీ 35 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 92,700 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 92,720 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 5.80 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
అటు సరస్వతి(అన్నారం) బ్యారేజ్‌లోని 8 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజ్ ఇన్ ఫ్లో 7,900 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 10,800గా ఉంది. అలాగే బ్యారేజీ పూర్తి సామర్థ్యం 10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 6.01గా కొనసాగుతోంది.