కంచుకోటలోనూ.. భద్రతా వలయం మధ్యనే జగన్.. అంత భయమెందుకంటే.. ?
posted on Jul 8, 2022 @ 12:50PM
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే కాకుండా తనకు, తన కుటుంబానికి కంచుకోట అనుకునే పులివెందులలో, వేంపల్లెలో తిరగాలంటేనే సీఎం జగన్ కు భద్రతా పరమైన భయం పట్టుకున్నట్లుంది. అందుకేనేమో గతంలో ఏనాడూ లేని విధంగా గురువారం ఉదయం నుంచీ పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటించే ప్రాంతాల్లో, మార్గాల్లో అణువణువూ క్షుణ్ణంగా పరిశీలించారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడమే కాకుండా పోలీసులు, వాలంటీర్ల వలయం మధ్యనే జగన్ తిరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వేంపల్లెలోని ప్రధాన రహదారులతో పాటు వీధులన్నీ ఉదయం నుంచీ మూసేశారు. చివరికి వైఎస్ఆర్ పార్క్ చుట్టూ పరదాలు ఏర్పాటు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ కోసం ఆయన కంచుకోటలోనే ఇంతటి విస్తృతస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడాన్ని చూసిన జనం అవాక్కయ్యారు.
నిజానికి పులివెందుల, వేంపల్లె వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా పెట్టని కోటలు. అయితే.. వేంపల్లెలో వైఎస్ఆర్ పార్కును ప్రారంభించేందుకు జగన్ వస్తున్న నేపథ్యంలో ఇంతటి పకడ్బందీ భద్రత ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, తమను ఇంతలా ఇబ్బంది పెట్టాల్సిన అగత్యం ఏమి వచ్చిందంటూ స్థానికులు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా బారికేడ్లు పెట్టడం ఏమిటి? వేలాది మంది పోలీసులను మోహరించడం దేనికని వారు గుస్సా అవుతున్నారు. జగన్ భద్రతకు వచ్చిన ముప్పు ఏముందని ఇంతలా ఆర్భాటం చేశారని వారు దుయ్యబడుతున్నారు.
ఒక్కసారి ఛాన్స్ అంటూ ఏపీ సీఎం అయిన జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టుపట్టించారని, ఎక్కడికి వెళ్లినా తనకు ప్రజల నుంచి వ్యతిరేకత, నిరసనలు, చీదరింపులు ఎదురవుతుండడం వల్లే ఇలా అతి జాగ్రత్తలు తీసుకున్నారని జనం అంటున్నారు. పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ ప్రాంతానికి వచ్చిన సీఎం జగన్ ను కలిసి, సమస్యలపై మొరపెట్టుకునేందుకు కూడా అవకాశం లేకుండా ఈ బందోబస్తు ఏమిటని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనాలోచిత నిర్ణయాలు,పాలనతో యావత్ రాష్ట్ర ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేసిన జగన్ పట్ల జనంలో అంతకంతకూ వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే వైసీపీ ఏ కార్యక్రమం నిర్వహించినా ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదంటున్నారు.
మరో పక్కన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘బాదుడే.. బాదుడు’ కార్యక్రమం చేపట్టినా.. జిల్లాల యాత్రలు చేస్తున్నా అడుగడుగునా జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకు అఖండ స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడ సభ నిర్వహించినా తండోపతండాలుగా జనం వస్తున్నారు. చంద్రబాబు ప్రసంగాలకు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకో పక్కన జగన్ కానీ, వైసీపీ కానీ ఏ కార్యక్రమం పెట్టినా ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తున్నాయి. జనం కనిపించడం లేదు. రోజు రోజుకూ చంద్రబాబు ప్రభ వెలిగిపోతోంటే.. అంతకంతకూ జగన్ ప్రభావం కొడిగట్టేస్తోందని జనం చెప్పుకుంటున్నారు.
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ప్రతి ఏటా జులై 8న సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. పులివెందుల వచ్చిన ప్రతిసారీ ఆయన స్థానికులను ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కలుసుకుంటారు. కానీ ఈ సారి మాత్రం పలు ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చారు. కానీ.. వారికి పోలీసులు జగన్ కలుసుకునే అవకాశం ఇవ్వకుండా అడ్డుకోవడం గమనార్హం. తన సమస్య చెప్పుకోడానికి సిద్ధవటం నుంచి వచ్చిన ఓ వృద్దురాలిని కూడా జగన్ ను కలుసుకోనివ్వకుండా అడ్డుకోవడంతో ఆయనకు అంత భయం ఎందుకు పట్టుకుందన్న విమర్శలు స్థానికుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
వృద్ధురాలి నుంచి కూడా జగన్ కు ముప్పు ఉందని భావిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, ఇప్పుడు క్షణక్షణం భయంతో, భద్రతాపరంగా వణికిపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. జగన్ లో ఎంత భయం గూడుకట్టుకుందో ఏమో గానీ చివరికి మీడియా ప్రతినిధులను కూడా అనుమతించపోవడంలోని ఔచిత్యాన్ని వామపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సీఎం జగన్ పులివెందుల, వేంపల్లె పర్యటన ప్రజలకు దూరంగా, కేవలం తమ పార్టీ నేతలను మాత్రమే కలుసుకోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భారీ పోలీసు భద్రత, వలంటీర్ల వలయం, పరదాల చాటున జగన్ తిరగాల్సిన పరిస్థితి రావడం ఆయన జనానికి దూరం అయ్యారనడానికి నిదర్శనంగా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి..