ఆత్మస్తుతి పరనింద.. ప్లీనరీలోనూ పాత పాటే!
posted on Jul 8, 2022 @ 2:32PM
ఒక్క వైసీపీకనే కాదు,ఏ పార్టీకి అయినా, ప్లీనరీ వంటి విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు జరుపుకోవడం ఒక మంచి సంప్రదాయం. ఒక మంచి అవకాశం. ఆత్మ పరిశీలన చేసుకోవడం, అద్దంలో తమను తాము చూసుకోవడం వలన దిద్దుబాటు చర్యలకు అవకాశం చిక్కుతుంది. అదే విధంగా వర్తమానాన్ని సమీక్షించుకుని, భవిష్యత్ ప్రణాళికను రచించుకోవడం, అన్ని పార్టీలకు అవసరం. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు, ప్లీనరీ వంటి సమీక్షా సమావేశాలు జరుపుకోవడం, మరింత అవసరం. అయితే, అదొక మొక్కుబడి తంతుగా, పార్టీ అధినాయకత్వం నిర్ణయాల మంచి చెడులతో సంబంధం లేకుండా, ‘మమ’ అనిపించే క్రతువుగా ముగిస్తే, మొక్కుబడి ఫలితాలు మాత్రమే వస్తాయి. అంతా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చుకుకున్నా,వెక్కెక్కి ఏడ్చినా ప్రయోజనం ఉండదు. సహజంగా, అధికారంలో ఉన్న పార్టీలకు, మరీ ముఖ్యంగా నేనే రాజు నేనే మంత్రి తరహాలో అధినాయకత్వం చెప్పు చేతల్లో నడిచే ప్రాంతీయ,కుటుంబ పార్టీలలో, అధినేత తప్పులను ఎత్తి చూపే, ‘సాహసం’ ఎవరు చేయరు.
అందుకే, ప్రాంతీయ, కుటుంబ పార్టీల సమావేశాలలో సాధారణంగా దేవతా వస్త్రాల కథ రిపీట్ అవుతూ ఉంటుంది. ఎన్నికలలో ఓడి పోయిన తర్వాతనో, ఇంకేదో ఉపద్రవం సంభవించిన తర్వాతనో, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, ఇలా ఏలా జరిగింది అని విస్తుపోవడం మినహా చేయగలిగింది మరొకటి ఉండదు.
ఇక సుదీర్ఘ విరామం తర్వాత, అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలో మొదటిసారిగా, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్ సీపీ) నిర్వహిస్తున్న రెండు రోజుల ప్లీనరీ విషయానికి వస్తే, వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ముందు నుంచి కూడా ‘ఆయన సీతయ్య ఎవరి మాట వినరు’ అని ముద్ర పడిపోయింది. గత మూడేళ్ళ పరిపాలనలోనూ,ఆయన తీరు మారలేదు. ఈ నేపధ్యంలో, వైసీపీ ప్లేనరీ నుంచి అద్భుతాలను ఆశించలేము. అలా ఆశిస్తే, అయితే అది మన అజ్ఞానం, కాదంటే మన అవివేకం అవుతుందే కానీ, మరొకటి కాదు.
గడచిన మూడు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం, ఏమి చేసింది అని వెనక్కి తిరిగి చూసుకుంటే, మెరుపులకంటే మరకలే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, దురదృష్టం ఏమంటే, ముఖ్యమంత్రి ప్లీనరీ ప్రారంభంలోనే, ‘అంతా బాగుంది’ అనే ముందు మాటతోనే ప్రారంభోపన్యాసం మొదలు పెట్టారు.
ఇచ్చిన హామీలలో 95 శాతం పూర్తి చేశామనే పాత పాటనే వినిపించారు. అంతే కానీ, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు గురించి కానీ, రాష్ట్ర ప్రజలు మనసా వాచా కోరుకునే, ప్రత్యేక హోదా గురించి కానీ, పోలవరం ప్రాజెక్ట్ గురించి కానీ, చివరకు మద్యం, ఇసుక పాలసీలు తెచ్చిన అనర్ధాల గురించి కానీ, ఒక్క మాట చెప్పారా అంటే లేదు. పోనీ, తమ మూడేళ్ళ సుందర ముదనష్ట పాలనలో, రాష్ట్ర ప్రజల నెత్తిన పెరిగిన అప్పుల భారం ఎంతో అదైనా చెప్పారా, లేదు. అసలు సమస్యల ప్రస్తావనే లేదు. పైగా, ఎవరో సృష్టించిన అవరోధాల వలన తమకు ఇబ్బందులు ఎదురయ్యాయని ఆత్మవంచనా శిల్పాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
అంతే కాదు, 2019 ఎన్నికల్లో ప్రజలు తమకు బ్రహ్మరధం పట్టారనే భ్రమలోంచి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంకా , బయటకు రాలేదు. మూడేళ్ళ క్రితం జరిగన ఎన్నికలలో ప్రజలు, ఒక్క ఛాన్స్ అని వేడుకుంటే ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు తమను మెచ్చి ఇచ్చిన తీర్పనే భ్రమల్లోనే ఉన్నారు. అందుకే వైసీపీని 151 సీట్ల భారీ మెజారిటీతో గెలిపించారని, ప్రతిపక్ష టీడీపీని 23 సీట్లకే పతిమితం చేశారని, అదంతా తమ ఘనతే అని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తమ అక్కసు అంతా వెళ్లగక్కారు. ఆలాగే, నిజాలను నిర్భయంగా ఎత్తి చుతున్న మీడియాను ఎల్లో మీడియా, ఎల్లో సోషల్ మీడియా అంటూ దెప్పి పొడిచారు. చివరకు ప్లేనరీ ప్రధాన లక్ష్యం, ఆత్మపరిశీలన పక్కన పెట్టి, ఆత్మస్తుతి, పరనిందతో సిగ్నేచర్ ట్యూన్ సెట్ చేశారు. సో.. రెండు రోజుల వైసీపీ ప్లీనరీ అద్భుత ఫలితాలు ఇస్తుందని ఆశించడం,ఇంతకు ముందే అనుకున్నట్లుగా మన అజ్ఞానం, కాదంటే మన అవివేకం అవుతుందే కానీ, మరొకటి కాదు.
నిజానికి, వైసీపీ ప్రకటిత నిబంధనలు, నియమావళి ప్రకారం, ప్రతి రెండేళ్లకు ప్లీనరీ నిర్వహించవలసి ఉంటుంది. అయితే, పదమూడేళ్ళ ప్రస్థానంలో వైసీపీ జరుపుకుంటున్న మూడవ ప్లీనరీ ఇది. ఈ మూడు సందర్భాలలోనూ ఎన్నికలకు ముందు మాత్రమే ప్లీనరీ, జరుపుకోవడం ఆ పార్టీ ఆనవాయితీగా వస్తోంది. ఎప్పుడు ఎన్నికలకు సన్నద్ధమవ్వాలంటే అప్పుడు మాత్రమే ప్లీనరీ జరుపుకోవడం వైసీపీలో ఆనవాయితీగా వస్తోంది. ఈ ప్లీనరీ కూడా అంతే, ఇదీ ఎన్నికల ప్లీనరీనే.
అయితే ... రాజదాని మొదలు. మద్యం పాలసీ వరకు ఇచ్చిన మాట తప్పి, మూడేళ్ళలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన జగన్ పాలనకు, ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పుచేశామని తలలు పట్టు కుంటున్న జనం , జగన్ రెడ్డి తమ తప్పులు తెలుసుకోకుండా, దిద్దుబాటు చర్యలు లేకుండా మరొక ఛాన్స్ .. అంటే .. జనం ఇస్తారనుకుంటే మాత్రం .. అది అయ్యే పనికాదు. ఇచ్చిన చక్కని అవకాశాన్ని, ఇంచక్కా వదిలేసుకున్న వైసీపీ, ప్లీనరీలో ఎన్ని ప్రవచనాలు ప్రవచించినా, ఫలితం మాత్రం గోడ మీద రాతలా స్పష్టంగానే వుంది. బై .. బై .. జగన్.