అన్నా చెల్లెళ్ల మధ్య కానరాని అనుబంధం.. ఆత్మీయత..
posted on Jul 8, 2022 @ 3:59PM
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద శుక్రవారం ఉదయం సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ప్రతి ఏటా ఇలా వైఎస్సార్ కు జయంతి రోజున, వర్ధంతి రోజున ఇలా నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వైఎస్ కుటుంబం మొత్తం ఒక్కటై నిర్వహిస్తుంది.
ఇడుపులపాయలో గత ఏడాది నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల విడివిడిగా పాల్గొన్నారు. ఈ సారి మాత్రం ఒకేసారి పాల్గొన్నా.. ఇద్దరూ వైఎస్సార్ సమాధి వద్ద కాస్త దూరం దూరంగానే కూర్చోవడం గమనార్మం. వైఎస్ షర్మిల, ఆమె కొడుకు దగ్గర దగ్గరగా కూర్చుంటే.. జగన్ మాత్రం మరికాస్త దూరంలో కూర్చోవడాన్ని అందరూ గమనించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అన్నా చెల్లెలు మాట్లాడుకుంటారేమో, ఒకవేళ మాట్లాడుకుంటే ఏమి మాట్లాడుకుంటారో అనే ఉత్కంఠ అక్కడ ఉన్నవారిలో కనిపించింది.
అయితే.. కాస్త దూరంగానే కూర్చున్నా.. ఒకేసారి తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా జగన్- షర్మిల ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోవడంతో విస్తుపోవడం అందరి వంతు అయింది. అంటే ఎంతో అన్యోన్యంగా ఉండే అన్నా చెల్లెలు జగన్- షర్మిల మధ్య అంతలా సంబంధాలు చెడిపోయాయనేది ఈ సంఘటనతో చెప్పకనే చెప్పినట్లయిందంటున్నారు.
అన్న జగన్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో షర్మిల వేరు కుంపటి పెట్టుకుని తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనం మధ్యలోకి వెళ్తున్నారు. మరో పక్కన జగన్ రోజు రోజుకూ జనానికి దూరమైపోతున్నారు. జగన్ జైలులో ఉండగా ‘అన్న వదిలిన బాణాన్ని’ అంటూ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అన్న కోసం చెల్లెలు షర్మిల అంతలా కష్టపడితే.. ఇప్పుడు ఆమెకు జరిగిందేంటో.. కుటుంబంలో ఎందుకు ఇంతలా విభేదాలు వచ్చాయో వారే స్వయంగా పెదవి విప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు.
ముక్తాయింపు ఏంటంటే.. వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచీ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేయడం. మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంటే.. ముందు నుంచీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు అటు చెల్లిని బయటికి గెంటేసిన జగన్ తల్లికి కూడా నామం పెట్టారా? అందుకే ఆమె వైసీపీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.