ఐపీఎల్‌కు ధీటుగా ఏపీలో బెట్టింగ్! లోకేష్‌, ప‌వ‌న్‌పైనే ఫోకస్ ?

దేశవ్యాప్తంగా ఓ వైపు ఐపీఎల్ మరోవైపు ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇక ఐపీఎల్‌లో జోరుగా బెట్టింగ్ నడుస్తోండగా అటు ఏపీలోనూ అదే స్థాయిలో పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. దీంతో ఏపీ ఎన్నికలపై బెట్టింగ్‌లు ఊపందుకున్నాయి. అభ్యర్థుల గెలుపు, ఓటమి అంచనాలు, ఎన్నికల్లో మెజారిటీపై బెట్టింగ్‌ జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికలు పూర్తిగా "జగన్ గెలుపు - జగన్ ఓటమి" పైనే జరుగుతున్నాయని ప్ర‌జ‌ల్లో చర్చ జ‌రుగుతోంది.  బెట్టింగ్ యాప్స్ లో కూడా ఇదే అంశం ప్రధానంగా తీసుకోవడం ఆసక్తిగా మారింది. ప్రభుత్వ ఏర్పాటు, వచ్చే సీట్లు, ఆయా అభ్యర్ధుల గెలుపు, వారి మెజారిటీలపై భారీగా బెట్టింగ్ జరుగుతోంది. సర్వేల ఆధారంగా పార్టీల గెలుపుపై పందేలు కాస్తున్న పరిస్థితి. ఒకటి రెండింతులు, మూడింతలుగా బెట్టింగ్ కాసేందుకు పందెం రాయుళ్లు సిద్ధమయ్యారు. బుకీలు కూడా బెట్టింగ్స్‌కు సంబంధించిన దుకాణాలు తెరిచారు. వేల కోట్ల రూపాయలు చేతులు మారే ఈ బెట్టింగ్ బిజినెస్ ఏపీలో అడ్డూ అదుపూ లేకుండా కొన‌సాగుతోంది. బెట్టింగ్ ఈ అంశాల‌పై జ‌రుగుతోంది.  1) వైసీపీ గెలుస్తుందా లేదా, ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? 2) కుప్పంలో చంద్రబాబు గెలుస్తారా?  మెజార్టీ ఎంత వ‌స్తుంది? 3) మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తారా? మెజార్టీ ఎంత వ‌స్తుంది? 4) పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారా? లేక అక్కడ వంగా గీత గెలుస్తారా? 5) హిందూపూర్‌లో బాల‌కృష్ణ‌కు మెజార్టీ ఎంత వ‌స్తుంది? 6) పులివెందులలో గ‌త ఎన్నిక‌ల‌కంటే మెజారిటీ తగ్గుతుందా? లేదా? 7) కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిల విజయం సాధిస్తారా?  8) భీమిలిలో గంట శ్రీనివాసరావు గట్టెక్కుతాడా?  9) రాజంపేటలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తాడా?  10)  వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది? 11)  కూటమికి ఎన్ని సీట్లు వ‌స్తాయి? మంగ‌ళ‌గిరి, పుంగ‌నూరు, చంద్ర‌గిరి, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌, విజ‌యవాడ వెస్ట్‌, అన‌కాప‌ల్లి, ఫిఠాపురం,  రాజ‌మండ్రి, హిందూపూర్‌, కుప్పం, పీలేరుతో స‌హా ఏపీలోని 30 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో బెట్టింగ్ జోరుగా న‌డుస్తోంది.  గ్రామాలు, ప‌ట్ట‌ణాల‌నే  తేడా లేదు. పెద్ద ఎత్తున బెట్టింగ్ కాసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో బెట్టింగ్ కోట్ల రూపాయ‌ల్లోనే జరుగుతుందని చెప్పుకోవాలి. జగన్ మళ్లీ సీఎం అవుతాడా లేదా అనే దానిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. ఇక వైసీపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, జనసేనాని పవన్ ఈసారి అసెంబ్లీలో అడుగు పెడతారా, ఈసారి పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గుతుందనే అంశం బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందెం కాస్తున్నారు. ఐపీఎల్‌కు ధీటుగా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ జరుగుతుండటం విశేషం. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రోడ్డు ప్రమాదం.. బయటపడిన ‘కట్టల’ పాములు!

విజయవాడ-విశాఖపట్నం జాతీయ రహదారి మీద యాక్సిడెంట్ జరిగింది. కెమెకల్ పొడి బస్తాలను తీసుకెళ్తు్న్న టాటా ఏస్ వెహికల్‌ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దాంతో టాటా ఏస్ వెహికల్‌లో వున్న కెమికల్ పొడి బస్తాలన్నీ రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. అలా  పడిపోయింది కెమికల్ బస్తాలే అయితే మేటర్ మామూలుగానే వుండేది. కానీ అందులోంచి బోలెడన్ని ‘కట్టల’ పాములు బయటపడ్డాయి. మొత్తం ఏడు కోట్ల రూపాయల డబ్బు కట్టలు కెమికల్ పొడి బస్తాల మధ్యలో నుంచి బయటపడ్డాయి. నోట్ల కట్టలను చక్కగా ప్లాస్లిక్ కవర్లలో చుట్టి, అట్టపెట్టెల్లో పెట్టి, కెమికల్ పొడి బస్తాల మధ్యలో పెట్టి రవాణా చేస్తున్నారు. టైమ్ బ్యాడ్ అయి యాక్సిడెంట్ జరిగింది. నోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. పోలీసులు ఈ ఏడు కోట్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్ డ్రైవర్ని డబ్బు గురించి ప్రశ్నిస్తే మమ్మెమ్మే... బెబ్బెబ్బే అన్నాడు. ఇంకా లోతుగా విచారణ జరిపితే, ఒక వైసీపీ నాయకుడికి చెందిన సంస్థ నుంచి మరో వైసీపీ నాయకుడికి చెందిన సంస్థకు ఈ వాహనం రవాణా అవుతున్నట్టు తెలిసింది. అంటే, డబ్బు ఎవరిదో అర్థమైపోతుంది కదా..

ఏపీలో89శాతం పోలింగ్ జరిగే అవకాశం.. పరిశీలకుల అంచనా!

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం (మే13) జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది.  4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ  ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందు కోసం రాష్ట్రంలో మొత్తం 46వేల 389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో దాదాపు సగానికి పైగా పోలింగ్ కేంద్రాలలో   వెబ్‌ కాస్టింగ్ నిర్వహిస్తారు. సోమవారం(మే 13) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. నిర్ణీత సమయంలోగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.  వేసవి దృష్ట్యా అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఓటర్లకు నీడ కల్పించేలా టెంట్లు వేయటంతో పాటు  తాగునీటి సదుపాయం, ఫస్ట్ ఎయిడ్  మెడికల్ కిట్లను ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచనుంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు   ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.   3 లక్షల 30వేల మంది సిబ్బంది పోలింగ్ విధులు నిర్వహిస్తారు. భద్రత కోసం లక్షా 14వేల మంది పోలీసు సిబ్బందిని నియోగిస్తున్నది.  వీరికి అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు.  ఇక రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలకు 454 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2, 387 మంది పోటీలో ఉన్నారు. స్వతంత్రులు, ఇతర పార్టీలూ ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా విపక్ష తెలుగుదేశం కూటమి, అధికార వైసీపీ మధ్యనే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇలా ఉండగా మున్నెనడూ లేని విధంగా ఈ సారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై దేవ వ్యాప్తంగా అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే ఏపీ బయట ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాలు చేసుకుంటున్న వారు ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఓటు హక్కును వినియోగించుకు తీరాలన్న పట్టుదల కనిపిస్తున్నారు. దీంతో దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచీ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కు ఓటర్లు వస్తున్నారు. దీంతో ఈ సారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం భారీగా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో రాష్ట్రంలో 79.84 శాతం ఓటింగ్ నమోదు కాగా ఈ సారి అది 89శాతం వరకూ ఉండొచ్చన్నది అంచనా.  

జనం లేక పలుచన.. పిఠాపురం జగన్ సభ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణంలో అందరి దృష్టీ పిఠాపురంపైనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ కూటమి బ లపరిచిన అభ్యర్థిగా జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వంగా గీత పోటీలో ఉన్నారు. ప్రధాన పోటీ దారులు ఇద్దరూ కూడా ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. పిఠాపురంలో విజయం కోసం ఇరు పార్టీలూ హోరాహోరీ తలపడుతున్నాయి.  పిఠాపురంలో విజయాన్ని పవన్ కల్యాణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అలాగే ఎలాగైనా పవన్ కు ఓడించాలని జగన్ కంకణం కట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా   పిఠాపురంపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. పవన్ కు మద్దతుగా మెగా హీరోలతో పాలు పలువురు సినీ ప్రముఖులు ప్రచారం చేశారు. ఇక వైసీసీ అధినేత జగన్ అయితే ప్రచారం ముగిసే  చివరి రోజున పిఠాపురంలో బహిరంగభలో ప్రసంగించారు.  ఆ సందర్భంగా ఆయన రాజకీయాల కంటే పవన్ వ్యక్తిగత జీవితాన్నే టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతోంది. ఆయన తన ప్రసంగంలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేయడమే కాకుండా  కర్లను మార్చేసినట్లు భార్యలను మార్చేసే జగన్ వద్దకు మహిళలు ఎవరైనా వెళ్లగలరా అంటూ చౌకబారు వ్యాఖ్యలు చేశారు.  జగన్ వ్యాఖ్యల పట్ల మహిళలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక జగన్ తన ప్రసంగంలో పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై జనం నవ్వి పోతున్నారు. ఆయన ఏ నియోజకవర్గంలో ప్రచారానికి వెడితే ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తాను, ఉప ముఖ్యమంత్రిని చేస్తాను అంటూ చేస్తున్న ప్రకటనలపై నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో ఆళ్లను గెలిపిస్తే మంత్రిని చేస్తానన్న జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే కుప్పంలో ప్రచారం నిర్వహిస్తూ జగన్ కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ చేసిన ప్రకటనపై కూడా నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. కుప్పంలో వైసీపీ గెలిస్తే కుప్పం ఎమ్మెల్యే మంత్రి అంటున్నారు. చంద్రబాబు గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని గుర్తు చేస్తున్నారు. అయినా జగన్ ఎవరినైనా మంత్రిని చేయడానికైనా, ఉప ముఖ్యమంత్రిని చేయడానికైనా ముందు ఆయన, ఆయన పార్టీ ఈ ఎన్నికలలో విజయం సాధించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు.  గత ఎన్నికలలో కూడా జగన్ భీమవరంలో పవన్ ను ఓడిస్తే అప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ ను మంత్రిని చేస్తానని ప్రకటించారు.  చేశారా అంటున్నారు.  జగన్ వాగ్దానాలు, హామీలపై జనంలో నమ్మకం పోవడానికి తన ఐదేళ్ల హయాంలో ప్రతి విషయంలోనూ మాట తప్పి, మడమ తిప్పడమే కారణమని అంటున్నారు. ఎన్నికల ప్రచార గడువు ముగిసే చివరి రోజున వ్యూహాత్మకంగా పిఠాపురంలో బహిరంగ సభ ఏర్పాటు చేసిన జగన్ ప్రసంగించారు. అయితే ఆ సభకు జనం పలుచగా ఉండడాన్ని బట్టి అక్కడ వైసీపీ శ్రేణులే చేతులెత్తేశారని అర్ధమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రోడ్డుపైనే తిట్టుకున్న కొడాలి నాని అనుచరులు

మొన్నామధ్య వచ్చిన ‘జాతిరత్నాలు’ సినిమాలో తన నాయకుడు కేక్ కట్ చేసి, తనకు కాకుండా మరొకరికి పెట్టాడన్న కోపంతో ఒక కార్యకర్త తన నాయకుడినే కత్తితో పొడుస్తాడు. ఇంత రేంజ్‌లో జరగలేదుగానీ, తమ నాయకుడు తమకు కాకుండా ఇతరులకు ప్రాధాన్యం ఇచ్చాడన్న కోపంతో రోడ్డు మీదే గొడవపడి, తిట్టుకున్న సంఘటన గుడివాడ నియోజకవర్గంలో జరిగింది. గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొడాలి నాని శనివారం నాడు తన అనుచరులతో కలసి ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని గుడ్లవల్లేరుకు చేరుకున్నారు. ఆ ఊళ్ళో వున్న వైసీపీకి రెండు వర్గాలు వున్నాయి. వర్గం నంబర్ వన్‌కి చెందిన వ్యక్తులు కొడాలి నాని ప్రచారం చేస్తున్న వాహనం మీద ఎక్కారు. అది చూసి వర్గం నంబర్ టూకి చెందిన వ్యక్తులకు కోపం వచ్చింది. మమ్మల్ని కాకుండా వాళ్ళని వాహనం మీద ఎక్కించుకుంటారా అని కొడాలి నానిని నిలదీశారు. దాంతో ఆ వర్గానికి, ఈ వర్గానికి మధ్య వాగ్వాదం జరిగింది. తిట్టుకోవడం వరకు విషయం వెళ్ళింది. వాళ్ళు అలా తిట్టుకుంటూ వుండగానే, సమస్యని పరిష్కరించాల్సిన కొడాలి నాని చక్కగా తన కారును తానే డ్రైవ్ చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాంతో రెండు వర్గాలూ షాకైపోయి నోళ్లు మూసుకున్నారు.

మంత్రి అమర్‌నాథ్ చొరవ.. 50 ఎకరాలు స్వాహా!

తిరుపతి విమానాశ్రయం పక్కనే వున్న 50 ఎకరాల ఏపీఐఐసీ భూమిని మంత్రి అమరనాథ్ రియల్‌ఎస్టేట్ పరం చేశారు. అయినవారికి లబ్ధిని చేకూర్చడం కోసం నిబంధలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు మార్చేసి భూమిని గుటకాయస్వాహా చేసేశారు. పారిశ్రామిక అవసరాలకు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం తిరుపతిలో కేటాయించిన 50 ఎకరాల భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటామని దాన్ని రాయితీ ధరపై తీసుకున్న కంపెనీ కోరితే గుడివాడ అమర్‌నాథ్ ఆశీస్సులతో ప్రభుత్వం ఓకే చెప్పింది. ఆ భూమిని సదరు సంస్థకి కేటాయించింది పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమేనని ఏపీఐసీసీ మొత్తుకుంటున్నా అమర్‌నాథ్ వినలేదు. పాత ఉత్తర్వులను రివర్స్ చేసి, ఏ సంస్థకు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించారో అదే సంస్థ అక్కడ హోటళ్ళు, విల్లాలు కట్టుకోవడానికి అనుమతి వచ్చేలా చేశారు. అంతే కాదు, సదరు సంస్థ నుంచి ఏపీఐసీసీకి రావల్సిన 32 కోట్ల రూపాయల బకాయిలను కూడా రద్దు చేశారు. మొత్తం ఈ వ్యవహారంలో 35 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దళితుడిపై కోన వెంకట్ దాడి

సినీ రచయిత, బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కోన రఘుపతి బంధువు, సినీ రచయిత అయిన కోన వెంకట్ కత్తి రాజేష్ అనే యువకుడి మీద తన అనుచరులతో కలసి దాడి చేశారు. ఆ దాడి కూడా సాక్షాత్తూ పోలీస్ స్టేషన్లోనే కావడం గమనార్హం. బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో ఈ ఘటన జరిగింది. గతంలో వైసీపీలో వున్న కత్తి రాజేష్, తెలుగుదేశం అభ్యర్థి నరేంద్రవర్మ సమక్షంలో శనివారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. మా దగ్గర 8 లక్షలు తీసుకున్న కత్తి రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరారంటూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కత్తి రాజేష్‌ని కర్లపాలెం పోలీస్ స్టేషన్‌కి తెచ్చారు. ఎస్.ఐ. ఛాంబర్లో ఎస్.ఐ. జనార్దన్, కోన వెంకట్, ఇతర వైసీపీ నేతలు దాడి చేసి కొట్టారని తెలుస్తోంది. దీంతో తెలుగుదేశం శ్రేణులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపాయి. స్పందిన డీఎస్పీ మురళీకృష్ణ కత్తి రాజేష్‌పై దాడి చేసిన కోన వెంకట్ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఎస్.ఐ. జనార్దన్‌ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సైలెన్స్!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో  గత నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 6 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.హైదరాబాద్‌, తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ స్వస్థలాలకు లక్షలాదిగా వస్తున్నారు.  ఇక ఎన్నికల కమిషన్ పోలింగ్ ముగిసే వరకూ రాష్ట్రంలోని  పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందనీ,  ఐదుగురు మించి ఎక్కడైనా గుమిగూడితే చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించింది. ఎన్నికలు ముగిసే వరకు రెండు రోజుల పాటు అంటే మే 13 సాయంత్రం 6 గంటల వరకు  వైన్ షాపులు, బార్లు మూసి ఉంచుతారు.   పోలింగ్ ముంగిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరగకుండా పోలీసుల నిఘా ఉంటుంది.  ఎన్నికల ఊరేగింపులు, ర్యాలీలు, సినిమాలు, టీవీల ద్వారా ప్రచారంపై పూర్తి నిషేధం అమలులో ఉంటుంది. అలాగే మొబైల్స్‌ ద్వారా ఎన్నికల సందేశాలను పంపించడం, ఒపీనియన్‌ సర్వేలు వెల్లడించడం కూడా నిషేధం. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష. జరిమానా  విధించే అవకాశం ఉంటుంది.

పిఠాపురంలో  పవన్ కళ్యాణ్ ప్రచారం 

ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు , ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు ఒకే రోజు జరుగుతున్నాయి.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడ లోక్‌సభతోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనుండడంతో వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనల మేరకు ప్రచారం కాసేపట్లో ముగియనుంది. ఎ.పి.లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ముఖ్యంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పోటీ చేస్తున్న పిఠాపురంపైనే ఆ పార్టీ ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా సినిమా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కి మద్దతు ప్రకటించారు. అంతేకాదు, ఇతర రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులు కూడా పవన్‌ని గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్‌ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ పిఠాపురం వెళ్ళారు. రాజమండ్రి విమానాశ్రయం వద్ద మెగా అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. చరణ్‌కు ఘన స్వాగతం పలికారు. అభిమానుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఎయిర్‌ పోర్టు ఎగ్జిట్‌ గేట్‌ వద్ద సందడి నెలకొంది. చరణ్‌తో పాటు ఆయన తల్లి సురేఖ, మేనమామ అల్లు అరవింద్‌ కూడా ఉన్నారు. అక్కడి నుంచి చరణ్‌ పిఠాపురంకు బయల్దేరారు. తొలుత పిఠాపురంలో కుక్కుటేశ్వరస్వామి వారిని చరణ్‌ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత పిఠాపురం పట్టణంలో ఆయన పర్యటిస్తారు.

చెల్లెలి ఉసురు జగన్‌కి తగిలి తీరుతుంది

నో డౌట్.. జగన్‌కి తన చెల్లెలు షర్మిల ఉసురు తప్పకుండా తగులుతుంది. అధికారం తుడిచిపెట్టుకుని పోతుంది. సొంత చెల్లి షర్మిల అన్నను విభేదించిన పాపానికి ఆమె మీద సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ చేత నానామాటలు అనిపించాడు జగన్. షర్మిలను అన్ని రకాలుగా అవమానించాడు. సొంత అన్న అయి వుండి, చెల్లెలు కట్టుకున్న చీర మీద కామెంట్లు చేశాడు. చివరికి ఆమె పుట్టుక విషయంలో కూడా దుష్ప్రచారం చేయించాడు. ఇవన్నీ మీడియా ముందు చెప్పుకుని షర్మిల కన్నీరు పెట్టుకుంది. ఇంటి ఆడపిల్ల కంట కన్నీరు పెట్టించిన జగన్ కన్ఫమ్‌గా ఫలితం అనుభవిస్తాడు. పరిస్థితులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే షర్మిలను, జగన్ 16  నెలలపాటు జైల్లో వుంటే, అన్నాళ్ళూ పార్టీని కాపాడిన షర్మిలను, అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిలను ఈ రకంగా అవమానించడం నిజంగా దారుణం. ఈ పాపాలన్నిటికీ ఫలితం అనుభవించడానికి జగన్ మానసికంగా సిద్ధపడాలి.

10 లక్షలిస్తే నీట్ ఎగ్జామ్ క్వాలిఫై! బేరం కుదుర్చుకున్న గుజ‌రాత్ ముఠా

దేశంలోని వివిధ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ యూజీ-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 557 నగరాల్లో, విదేశాల్లో 14 నగరాల్లో పరీక్ష నిర్వహించారు.  అయితే నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో పలు పోస్టులు హల్‌చల్ చేశాయి.  మ‌రో వైపు  10 లక్షల రూపాయ‌లు ఇస్తే.. నీట్ పరీక్షలో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు.  నీట్‌ పరీక్షలో అక్రమాలకు గుజ‌రాత్ కేంద్రంగా మారింది.  గుజరాత్ లోని ఓ నీట్  యూజీ పరీక్ష కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షల రూపాయ‌లిస్తే నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయ్యేలా చూస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్కూల్ టీచర్ తోపాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు.  పోలీసుల కథనం ప్రకారం గోద్రాలోని ఒక పాఠశాలలో గత ఆదివారం జాతీయస్థాయి వైద్య విద్య అర్హత పరీక్ష అయిన నీట్‌-యూజీ ఎగ్జామ్‌ జరిగింది. ఈ పరీక్షకు ఎగ్జామినర్‌గా వ్యవహరించిన తుషార్‌ భట్‌ అనే ఫిజిక్స్‌ టీచర్‌ పరీక్ష పాస్‌ చేయిస్తానని ఆరుగురు విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నాడు.  ఈ ఎగ్జామ్ లో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ ను ఇన్విజిలేటర్ కు ఇచ్చేస్తే తాను ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని ఆ ఆరుగురు విద్యార్థులకు చెప్పాడు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి రూ. 10 లక్షలు డిమాండ్ చేశాడు. ఓ విద్యార్థి నుంచి రూ. 7 లక్షలను అడ్వాన్స్ గా తీసుకున్నాడు.  అయితే ఈ విషయం కాస్తా బయటకు పొక్కి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఎగ్జామ్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్ తోపాటు పరశురాం రాయ్, ఆరిఫ్ వోరా అనే ఇద్దరు బ్రోకర్లను కూడా అరెస్టు చేశారు. భట్ కారులోంచి రూ. 7 లక్షల అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ తుషార్‌ను విచారణ చేసి అతడి ఫోన్లో నీట్‌ పరీక్ష రాసిన 16 మంది విద్యార్థుల ఫోన్‌ నెంబర్లు, వాళ్ల హాల్‌ టికెట్ల నెంబర్లను గుర్తించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించాడని జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిందితుల‌పై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షకు రికార్డు స్థాయిలో విద్యార్థులు హాజరైయ్యారు. మొత్తం 23.30 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరయ్యారు. నీట్ పరీక్ష కోసం మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 10 లక్షల బాలురు, 13 లక్షల బాలికలు ఉన్నారు. రీజియన్లవారీగా చూస్తే మొత్తం దరఖాస్తుల్లో అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్- 3,39,125 దరఖాస్తులు, ఆ తర్వాత మహారాష్ట్ర 2,79,904 దరఖాస్తులు, రాజస్థాన్ 1,96,139 దరఖాస్తులు అందాయి. ఇక దక్షిణాన తమిళనాడు నుంచి 1,55,216 దరఖాస్తులు, కర్నాటక 1,54,210 దరఖాస్తులు అందాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 1.5 లక్షల మంది (ఏపీ 70 వేలు, తెలంగాణ 80 వేలు) విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

విజయమ్మ మద్దతు షర్మిలకే... జగన్ ను నమ్మొద్దని చెప్పేసినట్లేగా?

దివంగత వైఎస్ సతీమణి, ఏపీ సీఎం జగన్ కన్న తల్లి, ఏపీ కాంగ్రెస్ అధినేత్రి షర్మిల తల్లి వైఎస్ విజయమ్మ తాను ఎవరివైపో స్పష్టంగా చెప్పేశారు. తన కుమార్తె షర్మిలకే తన మద్దతు అని విస్పష్టంగా ప్రకటించేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా ఆమె రాజీనామా చేసినప్పుడే ఆమెను తాడేపల్లి ప్యాలెస్ నుంచి పొగపెట్టి గెంటేశారన్న వార్తలు వినిపించాయి. అయితే ఆమె మాత్రం పార్టీ ప్లీనరీ వేదికగా హుందాగా రాజీనామా చేసి, కుమారుడు జగన్ కు ముద్దు పెట్టి మరీ తెలంగాణలో రాజశేఖరరెడ్డి ఆశయాల సాధనకు సొంతంగా పార్టీ పెట్టుకున్న కుమార్తె షర్మిలకు తోడుగా ఉండేందుకు వెడుతున్నాననీ చెప్పారు. తన బిడ్డలిద్దరూ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాననీ, ఇద్దరినీ ఆశీర్వదిస్తున్నాననీ చెప్పారు.  సరే ఒక సారి ఆమె తాడేపల్లి ప్యాలెస్ విడిచి వెళ్లిన తరువాత ఆమె మళ్లీ ఆ ప్యాలెస్ లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు. అడపాదడపా ఇడుపులపాయలో వైఎస్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలలో కుమారుడితో ముచ్చటించడం వినా వారి మధ్య పెద్దగా సఖ్యత కనిపించలేదు. మధ్యలో ఒక సారి ఆమె అమరావతి వచ్చినప్పటికీ తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రం వెళ్లలేదు. ప్రభుత్వ సలహాదారు సజ్జల నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు తప్ప పక్కనే ఉన్ కుమారుడి నివాసం వైపు చూడనైనా చూడలేదు.  ఆ తరువాత షర్మిల కుమారుడి వివాహానికి జగన్ ను ఆహ్వానించడానికి షర్మిలతో కలిసి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు, మళ్లీ ఆమెతో పాటే బయటకు వచ్చేశారు. దీనిని బట్టి షర్మిల విషయంలో జగన్ తీరును విజయమ్మ వ్యతిరేకించారని స్పష్టంగా అర్ధమౌతుంది. ఇక షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఏపీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ నుంచి ఆమెపై తీవ్ర ఒత్తిడి వచ్చినట్లు వైసీపీ వర్గాలే అప్పట్లో చర్చించుకున్నారు. ఇక ఎన్నికల బరిలోకి షర్మిల దిగిన సమయంలో అయితే జగన్ విజయమ్మపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారనీ, తనకు మద్దతుగా ప్రచారం చేయాల్సిందేనని పట్టుపట్టారనీ వార్తలు వచ్చాయి. చివరికి తన కోసం ప్రచారం చేయకున్నా ఫరవాలేదు కానీ షర్మిల తరఫున మాత్రం ప్రచారం చేయడానికి వీల్లేదని తెగేసి చెప్పడంతో ఆమె మనవడి వద్దకు అమెరికా వెళ్లిపోయారని కూడా అప్పట్లో రాజకీయవర్గాల్లో గట్టిగా వినిపించింది. ఎన్నికల వేళ ఆమె తన బిడ్డలలో ఎవరి తరఫునా నిలబడకుండా తటస్థంగా ఉండేందుకే అమెరికా పర్యటన పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషించారు. గత ఎన్నికలలో జగన్ విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన విజయమ్మ ఇప్పుడు ఆయన చావో రేవో పరిస్థితుల్లో ఉన్న సమయంలో అండగా ఉండకుండా అమెరికా వెళ్లినప్పుడే జగన్ తరఫున ప్రచారం చేయడం ఇష్టం లేకనే ఆమె దూరం జరిగారని వైసీపీ వర్గాలే చర్చించుకున్నాయి. గత ఎన్నికలలో జగన్ విజయంలో కీలకంగా వ్యవహరించిన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు జగన్ నే ఢీ కొంటుంటే, కన్న తల్లి కుమారుడికి అండగా నిలవడం ఇష్టం లేక దూరం జరిగారు.    2019 ఎన్నికల్లో ఐక్యంగా ఉన్న వైఎస్‌ కుటుంబం తర్వాత పరిణామాలతో  నిట్టనిలువుగా చీలిపోయిది. అన్న జగన్‌తో విభేదించిన షర్మిల ముందు తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తున్న షర్మిలకే  వైఎస్‌ ఫ్యామిలీ మద్దతుగా నిలిచింది. ఒకవైపు కుమారుడు, మరోవైపు కుమార్తె ఇద్దరూ చెరో దారిలో వెళ్తుంటే  తల్లి విజయమ్మ  ఎవరి వైపు నిలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ కనిపించింది.  తెలంగాణ రాజకీయాల్లో ఉన్నప్పుడు షర్మిలకు తల్లిగా విజయమ్మ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ సమరం ప్రారంభించినప్పుడు సైలెంట్ అయిపోయారు. ఆయితే షర్మిల ఆంధ్రాకు వచ్చేసినా, విజయమ్మ ఆమెతో పాటే ఉన్నారు తప్ప కుమారుడి నివాసానికి వెళ్లలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో అడుగుపెట్టే ఉద్దేశమే ఆమెకు లేదని షర్మిల పంచనే ఉండిపోవడం ద్వారా తేటతెల్లం చేశారు.  అంతే కాదు  గత ఎన్నికల్లో కుమారుడి విజయం కోసం పాటుపడిన విజయమ్మ ఈసారి జగన్ కు మద్దతుగా నిలవడానికి ఇష్టపడలేదని కూడా వైఎస్ కుటుంబ సభ్యులు అప్పట్లో గట్టిగా చెప్పారు.   అభ్యర్థుల ప్రకటన టైంలో జగన్ ను ఆశీర్వదించిన విజయమ్మ ఆ తరువాత ఎక్కడా జగన్ కు మద్దతుగా మాట్లాడిన దాఖలాలు లేవు.  అయితే షర్మిల, సునీత నుంచి వస్తున్న విమర్శలకు కౌంటర్‌గా ప్రచారం చేయాలనే ఒత్తిడి విజయమ్మపై ఉందనే ప్రచారం ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే  బహిరంగంగా షర్మిలకు మద్దతు ఇస్తూ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేసేందుకు ఆమె వెనుకాడారని అంటారు. అందుకే కీలక సమయంలో ఆమె రాష్ట్రానికి దూరంగా అమెరికాకు వెళ్లిపోయారు. ఇప్పుడు సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు ఆమె తన మద్దతు షర్మిలకే అని ప్రకటిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైఎస్ బిడ్డ షర్మిలకే ఓటు వేయాలని ఆమె కడప ప్రజలకు పిలుపు నిచ్చారు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఆమె ఇచ్చిన  ఈ సందేశంతో ఇప్పటి వరకూ జగన్ విషయంలో షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ వాస్తవమేనని విజయమ్మ సర్టిఫై చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ విజయమ్మ పిలుపు కడప జిల్లా మొత్తాన్నీ జగకు వ్యతిరేకంగా ప్రభావితం చేసే అవకాశాలున్నాయంటున్నారు.  

పోలీసులకు మాధవిలత వార్నింగ్ 

హైదరాబాద్ బిజెపి ఎంపీ  అభ్యర్థి మాధవీలత పోలీసులకు  మాస్ వార్నింగ్  ఇచ్చారు. పోలింగ్ కు ఇంకా రెండు రోజులు కూడా లేకపోవడంతో ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దత్తు ఇస్తుందని ఆరోపిస్తున్న మాధవీలత నిబంధనలను ఉల్లంఘిస్తే పోలీసులను ఊరుకునేది లేదని హెచ్చరించారు. 'బురఖాల్లో చిన్నపిల్లలు, మగవారితో దొంగఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫేస్ ఐడెంటిటీ చేస్తామంటే చేయనివ్వకుండా మా కార్యకర్తలను హింసిస్తే ఈసారి ఊరుకునేది లేదు. ఎవరైనా పోలీసులు కాంప్రమైజ్ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం. మజ్లిస్ ను  పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితి వరకు తీసుకెళ్తాం అని హెచ్చరించారు. 40 ఏళ్ల పాటు వరుసగా గెలుస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీకి ఈ ఎన్నిక పెద్ద సవాల్ గా మారింది. 

పేదరికం లేని మంగళగిరి నా కల‌.. మంగళగిరి ప్రజలకు లోకేష్ బహిరంగలేఖ

శతాబ్ధాల చరిత్ర కలిగిన మంగళగిరి రాజకీయ చైతన్యానికి పుట్టినిల్లు. కృష్ణమ్మ పరవళ్లు, ప్రకృతిసోయగాల నడుమ నిత్యనూతనంగా విరాజిల్లే సుందరమైన ప్రాంతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో నేను పోటీచేసినపుడు ఎన్నికలకు కేవలం 23రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇక్కడ పరిస్థితులను అర్ధం చేసుకునే లోపే ఎన్నికల సంగ్రామం ముగిసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమిచెందాను. ఓడిపోయిన రోజు బాధపడినా మరుసటి రోజు నుంచే మంగళగిరి ప్రజలతో మమేకమయ్యాను. మరీ ముఖ్యంగా ఇక్కడి ప్రజల ప్రేమ, అభిమానం నన్ను కట్టిపడేశాయి. మంగళగిరి ప్రజల హృదయాలను గెలవాలని నిర్ణయించుకున్నాను. ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాను. యువగళం పాదయాత్ర ప్రారంభించకముందే నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసాను, ప్రతి గడప తొక్కాను, నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. యువగళం పాదయాత్ర సందర్భంగా దాదాపు ఏడాదిపాటు నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. కుటుంబసభ్యుల్లా ఇక్కడి ప్రజలు తరచూ నన్ను కలుస్తూ నాపై చూపిన ఆప్యాయత మాటల్లో చెప్పలేను. వారందించిన  ప్రోత్సాహంతోనే రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల పాదయాత్రను దిగ్విజయంగా పూర్తిచేయగలిగాను. జగన్ సర్కారు నాన్నపై తప్పుడు కేసులుపెట్టి 53రోజులు రాజమండ్రి జైలులో పెట్టినపుడు మంగళగిరి ప్రజలు ఇచ్చిన నైతికమద్దతు, మనోధైర్యం జీవితంలో మరువలేను. అత్యంత క్లిష్టపరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడ్డానంటే కారణం నా బలం, బలగమైన మంగళగిరి ప్రజలే. 25 ఏళ్లు నియోజకవర్గాన్ని పాలించిన రెండు కుటుంబాలు చేసింది ఏంటో ప్రజలంతా ఒక్క సారి ఆలోచించాలి. రెండుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పత్తాలేకుండా పోతే నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టమొచ్చినా నేను అండగా ఉన్నాను. మంగళగిరి ప్రజలు నా కుటుంబసభ్యులు అనుకొని సేవలందించాను. చిరువ్యాపారులకు తోపుడుబళ్లు మొదలుకొని పెళ్లికానుకల వరకు, వీధుల్లో సిమెంటు బల్లల మొదలు రోడ్లనిర్మాణం, తాగునీటి ట్యాంకర్ల వరకు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా సొంత నిధులతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అరాచకమూకలు అడ్డంకులు సృష్టించినా ఎదురొడ్డి పోరాడి మరీ మంగళగిరి ప్రజల ఆకలి తీర్చేందుకు అన్నాక్యాంటీన్లు ఏర్పాటుచేశాను. మహిళాసాధికార‌త విషయంలో తాత ఎన్టీఆర్, నాన్న చంద్రబాబుగారి నుంచి స్పూర్తి పొంది స్త్రీశక్తి  కేంద్రాల‌ను ఏర్పాటుచేశాను. మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడమేగాక వేలాదిమంది కుట్టుమిషన్లు అందజేసి సొంతకాళ్లపై నిలబడేలా చేయగలిగాను. ఒకప్పుడు దేశంలోనే పేరెన్నికగన్న మంగళగిరి చేనేతమగ్గాలు కనుమరుగవుతున్న సమయంలో అధునాతన మగ్గాలతో వీవర్స్ శాలను ఏర్పాటుచేశాను. టాటా తనేరియాతో ఒప్పందం చేసుకుని టెక్నాలజీ, మార్కెటింగ్ మద్దతునిచ్చాను. చేనేత సోదరుల జీవితాల్లో మార్పుతెచ్చి, వారి ఆదాయం పెంచేందుకు నా శాయశక్తులా కృషిచేశాను. స్వర్ణకారుల కోసం సొసైటీ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాను. చివరకు పేదింట్లో కుటుంబసభ్యులు చనిపోతే మట్టిఖర్చులు కూడా ఇచ్చి ఇంటికి పెద్దకొడుకులా నిలబడ్డాను. ఒక వ్యక్తిగానే ఇంత చేసిన నన్ను శాసనసభకు పంపితే ఏవిధంగా సేవచేస్తానో చైతన్యవంతులైన మంగళగిరి ప్రజలు ఆలోచించాలి. వ్యక్తిగతంగా ఎంతచేసినా...మంగళగిరి రూపురేఖలు మార్చడానికి నేను చేయాల్సింది చాలాఉంది. రచ్చబండ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని  అన్ని గ్రామాల్లో పర్యటించిన నేను క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తిగా అధ్యయనం చేశాను. కొండప్రాంతాలు, రైల్వేస్థలాలు, దేవాదాయ, అటవీభూముల్లో దశాబ్ధాలుగా నివసిస్తున్న పేదలు పట్టాల్లేక అవస్థలు పడుతున్నారు. కృష్ణానది చెంతనే ఉన్నా ఇప్పటికీ వేసవికాలంలో గుక్కెడు నీటికోసం ఇబ్బందిపడే పరిస్థితులను కళ్ళారా చూశాను. డ్రైనేజి సౌకర్యంలేక మంగళగిరి, తాడేపల్లి పట్టణాల్లో అపార్ట్ మెంట్ వాసులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. గ్రామాల్లోని రహదారులు నడుములోతు గోతులతో అస్తవ్యస్తంగా తయారయ్యాయి. శ్మశానవాటికల్లో స్థలం లేక చనిపోయిన వారికి గౌరవంగా అంతిమసంస్కారాలు సైతం నిర్వహించలేకపోతున్నామని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నపుడు ఎంతో ఆవేదన చెందాను. అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు, పేదలకు 20 వేల ఇళ్లు, స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని మాట ఇస్తున్నాను. మంగళగిరిని దేశంలోనే నెం.1గా తీర్చిదిద్ది, పేదరికం లేని మంగళగిరిని చూడాలన్నదే నా సంకల్పం. అందరం కలసి ఆదర్శ మంగళగిరిని తయారు చేసుకుందాం. ఈనెల 13వతేదీన జరగబోయే ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి. మీ  నారా లోకేష్, మంగళగిరి టిడిపి అభ్యర్థి

‘పోసాని ఆత్మహత్య’... నో ఛాన్స్!

రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ‘తల నరుక్కుంటా’, ‘ఆత్మహత్య చేసుకుంటా’ అని స్టేట్‌మెంట్స్ ఇస్తూ వుంటారు. సినిమా రంగం నుంచి వచ్చినప్పటికీ వైసీపీ రాజకీయాలు బాగానే ఒంటపట్టించుకున్న పోసాని కృష్ణమురళి కూడా ఇప్పుడు ఆత్మహత్య పాట పాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే తమ భూముల పాస్‌బుక్‌ల మీద ప్రత్యక్షమైన జగన్, దేశంలో ఎక్కడా లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా తమ భూములు తమకు కాకుండా పోతాయన్న భయం అందరిలోనూ వుంది. కబ్జాదారులకు, మోసగాళ్ళకు, బడాబాబులకు కలిసొచ్చే విధంగా వున్న ఈ చట్టం రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. 13న జరిగే పోలింగ్‌లో జగన్‌కి వ్యతిరేకంగా ఓటు వేసి తమ భూములను కాపాడుకునే ఆలోచనలో రైతులు వున్నారు. కర్ణుడి చావుకి అనేక కారణాలున్నట్టు, జగన్ ఓడిపోవడానికి ఈ ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ కూడా ఒక కారణం కానుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ విషయంలో జగన్ పార్టీకి డ్యామేజీ జరిగిపోయింది. ఆ డ్యామేజీని రిపేర్ చేయడానికి వైసీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ వర్కవుట్ కావడం లేదు. ఇప్పుడు వైసీపీలో పొలిటికల్ కమెడియన్ పాత్రకి న్యాయం చేస్తున్న పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకుంటానని అన్నారుగానీ, ఉరి వేసుకుంటారా, నీళ్ళలో దూకుతారా, లేక విషం తాగుతారా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.  గతలో ‘తల నరుక్కుంటా’, ‘ఆత్మహత్య చేసుకుంటా’, ‘పబ్లిగ్గా ఉరి వేసుకుంటా’ లాంటి స్టేట్‌మెంట్లు ఇచ్చిన నాయకులెవరూ ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు కాబట్టి, పోసాని కూడా మాటమీద నిలబడి చచ్చిపోడు కాబట్టి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా పోసానికి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా రాదులెండి. ఎందుకంటే, వచ్చేది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసే పని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం. అందువల్ల ఆ చట్టం రద్దయిన తర్వాత రైతులందరూ హ్యాపీగా వుంటారు. వాళ్ళ ఆనందం చూస్తూ పోసాని బతికే వుండొచ్చు. వైసీపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటా అని స్టేట్‌మెంట్ ఇచ్చినా ఇబ్బందేం వుండదని కూడా పోసాని ఆలోచించి వుండవచ్చు. ఖర్మకాలి జగన్ ప్రభుత్వం వస్తే, ఆ దుర్మార్గపు చట్టాన్ని అమలు చేస్తే, అది చూసి పోసాని ఆత్మహత్య చేసుకుంటే రైతులకు ఏం ఒరుగుతుంది? పోసాని ఆత్మహత్య చూసి  జగన్ కరిగిపోయి ఆ చట్టాన్ని అమలు చేయడం ఆపేస్తాడా? పోనీ జగన్ చేసే పనులను అడ్డుకుని, జగన్‌ని కంట్రోల్ చేసే సీన్ పోసానికి వుందా? అయినా పోసాని ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని స్టేట్‌మెంట్ ఇచ్చారుగానీ, నిజంగా ఆయనకు రైతుల మీద ఆ రేంజ్‌లో ప్రేమ వుంటే ఏనాడో ఆత్మహత్య చేసుకుని వుండాలి మరి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన అమరావతి రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధ చూసి, అదే ప్రాంతానికి చెందిన పోసాని ఆత్మహత్య చేసుకుని వుండాలి కదా? తాతలు, తండ్రులు ఇచ్చిన భూముల హక్కుపత్రాల పాస్‌బుక్ మీద జగన్ ఫొటో ముద్రించినప్పుడు ఆ అన్యాయాన్ని చూసినప్పుడే పోసాని ఆత్మహత్య చేసుకుని వుండాలి కదా? ఆ సందర్భాలన్నిట్లోనూ రైతులకు మద్దతుగా రాని పోసాని ఇప్పుడు రైతుల కోసం ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం కంటే పెద్ద కామెడీ మరొకటి లేదు. ఎప్పుడూ రైతుల సైడ్ నిలవని ఈ పెద్దమనిషి ఇప్పుడు సూసైడ్ లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడ్డం వింతల్లోకెల్లా వింత. ఇంకో పాయింట్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి తండ్రి గతంలో పేకాట ఆడి, అప్పుల పాలైపోయి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోసానికి కూడా అలా వంశ పారంపర్యంగా సూడైడ్ టెండెన్సీ వచ్చిందేమో, ఎందుకైనా మంచిది... పోసాని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని, పదికాలాలపాటు చల్లగా వుండాలని సూచన.