పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

 

పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్  ఏర్పాటు చేసింది.  

ప్ర‌భుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.  దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్ర‌వారం కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

 కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు.

హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. 

కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ  భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు.  ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు. 

ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు.  అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది.  అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా  కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.  


స్థానికుల హ‌ర్షం..

మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు. 

రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు.

కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.


 

సమస్యలపై మంత్రిని నిలదీస్తూనే ఆగిన రైతు గుండె

రాజధాని అమరావతిలోని మండడం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మునిసిల్ శాఖ మంత్రి  నారాయణ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఓ రైతు గుండెపోటుతో మరణించారు.   రోడ్డు నిర్మాణ పనుల కోసం ఇళ్లు, భూములు కోల్పోతున్న నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తుండగా   ఘటన జరిగింది.  అమరావతిలో ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న రైతులతో జరిగిన సమావేశంలో  పాల్గొన్న రైతు దొండపాటి రామారావు  తమ సమస్యలపై తొలుత ప్రశాంతంగానే మాట్లాడారు. అయితే మధ్యలో తీవ్ర ఆవేదనకు, ఆవేశానికీ లోనయ్యారు.   ముక్కలు ముక్కలుగా ప్లాట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను రోడ్డు కోసం ఇల్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే ఇళ్లు కోల్పోయే తమ అందరికీ తాళ్లయపాలెం సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఒకేచోట స్థలాలు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలా కాకుండా తమ ఇళ్లు పొలాలూ తీసుకుని రోడ్డున పడేస్తారా అంటూ మంత్రిని నిలదీశారు.  ఆ వెంటనే   గుండెపోటుతో కుప్పకూలిపోయారు.  దీంతో అక్కడున్న అధికారులు, రైతులు రామారావుకు వెంటనే సీపీఆర్ చేశారు. ఆ వెంటనే అతడిని మంత్రి కాన్వాయ్ వాహనంలోని మణిపాల్ ఆస్పత్రికి తరలించారు అయితే..  అప్పటికే  ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో మందడం గ్రామంలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. నిర్వాసిన రైతుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలోనే రైతు మృతి చెందడం స్థానికులను తీవ్ర ఆవేదనకు గురి చేసింది.  భూ సమీకరణలో భాగంగా రాములు ఐదు ఎకరాల భూమిని ఇచ్చారు. ఎన్‌-8 రోడ్డు కింద ఇళ్లు కోల్పోతున్న వారి జాబితాలో ఆయన ఇల్లు కూడా ఉంది.

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

  ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు  రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెడికల్ గ్రౌండ్స్‌పై  అన్ ఫిట్‌గా గుర్తించిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జనవరి 1 తర్వాత అన్ ఫిట్ పొందిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వారిని సర్దుబాటు చేయనున్నారు.  గతంలో మెడికల్‌ అన్‌ఫిట్‌ కారణంగా ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జారీ చేసిన ఈ ఉత్తర్వులతో వందలాది మంది ఉద్యోగులకు ఉపశమనం లభించనుంది. కాగా ప్రభుత్వ నిర్ణయంపై ఆర్టీసీ అన్‌ఫిట్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   

పెట్రోల్ బంక్ లోకి దూసుకు వెళ్లిన ఓమ్ని వ్యాన్

  మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్ అన్నోజిగూడ ప్రాంతంలో ఈరోజు మధ్యాహ్నం సమయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు వస్తున్న ఓ ఓమ్ని వ్యాన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో వాహనం మంటల్లో చిక్కుకుంది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారు భయపడిపోయి వెంటనే కిందకు దిగి పరుగులు తీశారు. అయితే, మంటలు అంటుకున్న సమయంలో డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో అదుపు తప్పిన ఓమ్ని వ్యాన్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వైపు దూసుకెళ్లింది. మంటలతో వస్తున్న వాహనాన్ని గమనించిన పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై నీళ్ళు, అగ్నిమాపక పరికరాలతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. వారి సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ ఘటనతో పెట్రోల్ బంక్ సిబ్బంది, వాహన దారులు, స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతు లకు గురయ్యారు.  కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యాను పెట్రోల్ బంకులోకి దూసుకు వస్తున్న సమయంలో అక్కడ పనిచేసే సిబ్బంది అప్రమత్తమై తగు చర్యలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని లేనిచో ఊహకందని ప్రమాదం జరిగేదని స్థానికులు అంటూ.‌... పెట్రోల్ బంక్ సిబ్బందిని అభినం దించారు.

మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం రికార్డు బ్రేక్... అత్యధిక ప్రేక్షకులు హాజరు

  ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్  రికార్డు బద్దలుకొట్టింది. బాక్సింగ్ డే టెస్టు తొలిరోజు మ్యాచ్ వీక్షించడానికి 94,199 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఇంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ మ్యాచ్‌కు 93,013 మంది ప్రేక్షకులు వచ్చారు. ఈ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ బ్రేక్ చేసింది. ఇదే ఇప్పటివరకు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో నమోదైన అత్యధిక ప్రేక్షకుల రికార్డ్.  మొత్తంగా క్రికెట్ చరిత్రలో 2022 ఐపీఎల్ ఫైనల్‍ మ్యాచ్‌కు అత్యధిక మంది ప్రేక్షకులు హాజరయ్యారు.  ఆ క్రమంలో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ తన రికార్డు తానే బద్దలుకొట్టింది. యాషెస్ సిరీస్ 2025లో భాగంగా ఈ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియాల మధ్య బాక్సింగ్ డే టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌‌ను వీక్షించడానికి క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు టెస్ట్ మ్యాచ్ వీక్షించడానికి ఏకంగా 94,199 మంది క్రికెట్ అభిమానులు వచ్చారు. దీంతో గ్రౌండ్‌లో స్టాండ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి. అంతకుముందు ఈ మ్యాచ్‌కు 93,422 మంది ప్రేక్షకులు వచ్చినట్లు MCG గ్రౌండ్ ఎక్స్ ఖాతాలో ప్రకటించింది.  ఆ తర్వాత గంట వ్యవధిలోనే దాదాపు వెయ్యి మంది అభిమానులు పెరిగినట్లు ప్రకటించింది.కాగా, 2015 వరల్డ్ కప్ ఫైనల్‌‌లో న్యూజిలాండ్-ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో మ్యాచ్ వీక్షించడానికి 93,013 మంది అభిమానులు వచ్చారు. ఆ రికార్డును ప్రస్తుతం జరుగుతున్న బాక్సింగ్‌డే టెస్ట్ అధిగమించింది. ఇదే కాకుండా 2013లో జరిగిన బాక్సింగ్‌డే టెస్టుకు కూడా భారీ సంఖ్యలో (91,112 మంది) క్రికెట్ అభిమానులు తరలివచ్చారు.  MCG మొత్తం సామర్థ్యం 1,00,024. మరోవైపు, క్రికెట్ గ్రౌండ్లలో అత్యధిక మంది ప్రేక్షుకులు హాజరైన రికార్డ్ గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ఉంది. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌కు ఏకంగా 1,01,566 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ స్టేడియం కెపాసిటీ 1,32,000. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షుకులు వచ్చిన మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో సంచలన నమోదైంది. ఒకే రోజు 20 వికెట్లు నేలకూలాయి. ఇంగ్లాండ్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29.5 ఓవర్లలోనే 110 పరుగులకు కుప్పకూలింది. 42 పరుగుల వెనకంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.   

2047 నాటికి ఇండియా సూపర్ పవర్.. ఏ శక్తీ అడ్డుకోలేదు.. చంద్రబాబు

భారతదేశం త్వరలోనే సూపర్ పవర్ కావడం ఖాయమని, దీనిని ఏ శక్తీ అడ్డుకోలేదనీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్  ప్రారంభ సదస్సుకు చంద్రబాబు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. శుక్రవారం (డిసెంబర్ 26) నుంచి సోమవారం ( డిసెంబర్ 29) వరకూ తిరుపతి వేదికగా భారతీయ విజ్ణాన సదస్సు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన చంద్రబిబు ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో కలిసి సందర్శించారు.  పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వివిధ యుద్ద పరికరాల నమూనాలను సీఎం చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సీఎం సభను ప్రారంభించారు.  సంస్కృతి, సంప్రదాయాలను నిలబెడుతూ.. దేశాభివృద్ధి కోసం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఏపీ సీఎం ప్రస్తుతించారు. ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానాన్ని సముపార్జించిన దేశంగా పరిఢవిల్లిందన్న ఆయన  ఎన్నో వేల ఏళ్ల క్రితమే అర్బన్ ప్లానింగ్ అంటే ఏమిటో హరప్పా నాగరికత చాటి చెప్పిందన్నారు.   భారతీయ విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు... మరింత విస్తృత పరిచేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ అద్భుతంగా కృషి చేస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలో ఏడవ భారతీయ విజ్ఞాన్ సమ్మేళనాన్ని తిరుపతిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్న  అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్పెయిన్, జర్మనీ, రష్యా, జపాన్ వంటి దేశాలు 2 వేల ఏళ్ల క్రితం భారత దేశానికంటే ఎంతో వెనుకబడి ఉన్నాయన్నారు.రెండు వేల ఏళ్ల క్రితం ప్రపంచంలోనే భారత దేశం 40 శాతం జీడీపీని కలిగి ఉండేదనీ,  నాలెడ్జ్ ఎకానమీలో భారత్ ఎప్పుడూ సూపర్ పవర్ గానే ఉండేదనీ వివరించారు.  2047 నాటికి భారత దేశం ప్రపంచంలో నెంబర్-1 స్థానంలో నిలుస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.  సైన్స్, టెక్నాలజీ రంగాల్లో ఇండియా చాంపియన్ అన్నారు.    ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతుని చెప్పిన చంద్రబాబు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని పురోగమిస్తోందన్నారు.  ఈ సందర్భంగా ఇండియాస్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రాష్ట్ర మంత్రి అనగాని సత్య ప్రసాద్, ప్రొఫెసర్ భారత్, డాక్టర్ సతీష్ రెడ్డి, సంస్కృత విద్యాపీఠం కులపతి జిఎస్ఆర్కే శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

శ్రీవాణి దర్శనం టికెట్లు రద్దు.. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం

తిరుమలలో  భక్తుల రద్దీ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవాణి దర్శన టికెట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంటకేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి దేవదేవుడి దర్శనం కోసం నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సెలవుదినాలు, వారాంతాలలో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలోనూ టీటీడీ శ్రీవాణి దర్శనం టికెట్లను మూడు రోజుల పాటు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మామూలుగా ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి భక్తులకు దాదాపు 30 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ లైన్ విధానంలో జారీ చేసే శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ రద్దు చేసింది.  అయితే ఆన్ లైన్ లో పూర్తి అయిన శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన వారిని అనుమతించనుంది.  అంతే కాకుండా ఇక నుంచి ఆఫ్ లైన్ విధానాని రద్దు చేసి.. పూర్తిగా ఆన్ లైన్ విధానంలో దర్శన టిక్కెట్లు జారీ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.  

జీహెచ్ఎంసీ.. దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ గా అవతరించింది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలనలో  తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులను చేసింది. ఈ మార్పుల మేరకు జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య ప్రస్తుతమున్న వాటికి రెట్టింపైంది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది.  ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)  లోపల ఉన్న 27 మున్సిపాలిటీలు ,కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన తర్వాత, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.   దీంతో  2000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ హైదరాబాద్ మహానగరం ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భవించింది. డీలిమిటేషన్ లో భాగంగా   నగరంలో  జోన్లు , సర్కిళ్ల సంఖ్యను కూడా ప్రభుత్వం  పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, అలాగే 30 సర్కిళ్లను 60కి పెంచింది. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లు ఏర్పాటయ్యాయి.  45 వేల మంది జనాభాకు ఒక వార్డు ఉండేలా ప్రణాళికలు రూపొందించడంతో పాటు, ప్రతి జోన్‌లో ఐదు సర్కిళ్లు ఉండేలా  అవసరమైన చర్యలు తీసుకుంది.  ప్రాథమిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ప్రజలు, రాజకీయ పార్టీల నుండి దాదాపు ఆరు వేల అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకున్న అనంతరం తుది నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఇక పోతే ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 10తో ముగియనున్న సంగతి తెలిసిదే. ఈ లోపే వార్డుల పునర్విభజన , ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియను పూర్తి చేసి, కొత్త వార్డుల ప్రకారం ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.  

కల్తీ మద్యం కేసులో నిందితులకు కస్టడీ

  నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీ కోరుతూ తంబళ్లపల్లి కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుగగా.. ఐదుగురు నిందితులను మూడు రోజులపాటు కస్టడీకి ఇస్తూ తంబళ్లపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు అనుమతి మేరకు ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు, ఏ26 జగన్మోహన్ రావు, ఏ 28 తాండ్ర రమేష్, ఏ 27తిరుమల శెట్టి శ్రీనివాసరావు, ఏ 29 షేక్ అల్లబక్షులను శుక్రవారం (ఈ నెల 26) ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత అక్కడి నుంచి మదనపల్లి ఎక్సైజ్ స్టేషన్‌కు వారిని తరలించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.

క్రికెట్‌లో సంచలనం... వైభవ్‌కు అరుదైన పురస్కారం

  బిహార్‌కు చెందిన 14 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వైభవ్‌కు ఇప్పుడు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం దక్కింది. ఈ పురస్కారాన్ని న్యూఢిల్లీ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ స్వీకరించాడు. పురస్కార ప్రదానోత్సవం అనంతరం, వైభవ్‌తో పాటు ఇతర అవార్డు గ్రహీతలు ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా కలుసుకున్నారు. దేశ యువతలో ప్రేరణ నింపే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రికెట్ రంగంలో అద్భుత ప్రతిభను కనబరిచినందుకుగాను ఈ పురస్కారం వైభవ్‌కు దక్కింది. చిన్న వయసులోనే జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం అతడి కెరీర్‌లో ఓ చారిత్రక ఘట్టంగా నిలిచింది. అవార్డు కార్యక్రమంలో పాల్గొనడం కారణంగా వైభవ్ విజయ్ హజారే ట్రోఫీ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఫీల్డ్‌లో ఆడే అవకాశం కోల్పోవడం ఏ ఆటగాడికైనా కష్టమే అయినా, దేశ స్థాయిలో గౌరవం అందుకోవడం జీవితంలో అరుదైన అవకాశం అని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్‌లో వైభవ్ చేసిన ప్రదర్శనతో రికార్డులు బద్దలయ్యాయి. కేవలం 84 బంతుల్లో 190 పరుగులు చేసి, బిహార్‌ను భారీ స్కోర్ దిశగా నడిపించాడు.  ఆ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశీయ క్రికెట్‌లో అత్యంత దూకుడు బ్యాటర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న వయసులోనే పెద్ద రికార్డులు నెలకొల్పుతూ, భవిష్యత్ భారత క్రికెట్‌కు ఆశాజనకంగా మారాడు. సీనియర్ జట్టులోకి కూడా వైభవ్‌ను తీసుకోవాలనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అనేది 5 నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇచ్చే భారతదేశ అత్యున్నత పౌర గౌరవం. సాహసం, కళ - సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజి, సామాజిక సేవ, క్రీడల్లో ప్రతిభ చూపిన బాలలకు ఈ అత్యున్నత పురస్కారాన్ని అందజేస్తారు.  

ముగిసిన ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ

  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణ ముగిసింది. శుక్రవారం వేకువజామునే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన్ని విడిచిపెట్టింది. అక్కడి నుంచి ఆయన నేరుగా ఇంటికి వెళ్లిపోయినట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ జరిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయంలో రాజకీయ ప్రత్యర్థులు, కీలక నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధులు తదితరుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  అధికారిక అనుమతులు లేకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ నిఘా సాగినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమా చారాన్ని రాజకీయ ప్రయో జనాల కోసం ఉపయోగిం చారన్న ఆరోపణలు ఈ కేసుకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఈ వ్యవహారంలో మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఆయనను కస్టడీ లోకి తీసుకొని విచారించిన అధికారులు, పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.   ప్రభాకర్ రావు ను 14 రోజుల పాటు కస్టడీలకు తీసుకొని జరిపిన విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక వ్యవస్థ, ఆదేశాల పరంపర, ఎవరి అనుమతి తో నిఘా సాగిందన్న అంశాలపై సిట్ లోతైన విచారణ జరిపింది. ఈ కేసులో మరికొందరు ఉన్నతాధికా రుల పాత్రపై కూడా సిట్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా రాష్ట్రంలోని కీలక రాజకీయ నేతల పేర్లు వెలుగులోకి రావడం ఈ కేసుకు మరింత రాజకీయ వేడి పెంచింది. ఎంపీ ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు వంటి ప్రముఖ నేతల ఫోన్లు నిఘాకు గురయ్యాయా? అన్న కోణంలో సిట్ అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా పలువురు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, ఇతర ప్రభావవంతమైన వ్యక్తుల కమ్యూనికేషన్లపై కూడా నిఘా పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సాక్షిగా మారిన ప్రముఖ సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్‌ను సిట్ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. ఆయన ఫోన్ సంభాషణలు, వివిధ రాజకీయ నేతలు, పారిశ్రామిక వేత్తలతో జరిగిన కమ్యూనికేషన్ల వివరాలను అధికారులు ఆయన ముందు ఉంచారు. గత ప్రభుత్వం నిఘా పెట్టిన కొద్ది మంది ముఖ్యుల్లో ఆరా మస్తాన్ ఒకరని సిట్ భావిస్తోంది.   రానున్న రోజుల్లో మరికొందరు కీలక వ్యక్తులను విచారణకు పిలిచే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతు న్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరి ఆదేశాలతో నిఘా సాగిందన్న అంశం తేలితే, రాజకీయంగా మరియు పరిపాలనా పరంగా ఈ కేసు సంచలనం గా మారే అవకాశముంది. ఫోన్ ట్యాపింగ్ కేసు చివరికి ఎవరి మెడకు చుట్టుకుంటుందన్న ఉత్కంఠ మధ్య, సిట్ విచారణపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది.