చాయ్ పే చర్చలో... ప్రధాని, ప్రియాంకా
posted on Dec 19, 2025 @ 3:32PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సందర్బంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ , కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఒకేచోట చేరి సరదాగా ముచ్చటించారు. ఈ సమావేశంలో ప్రియాంక వయనాడ్ లోక్ సభ నియోజకవర్గం గురించి ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలుస్తోంది.
వయనాడ్ ఫారెస్ట్‌లో దొరికే ఓ మూలికను వాడుతున్నానని.. దానివల్ల తనకు అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గియని ప్రియాంక తెలిపారు. ఈ సందర్బంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కాకుండా స్నేహపూర్వకంగా సాగిన సరదా ముచ్చట్లు నవ్వుల పువ్వులు పూయించాయి. పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రియాంక గాంధీ చాయ్ పే చర్చ కి హాజరు కావడం విశేషంగా నిలిచింది.
అలాగే ఇటీవల ప్రధాని మోదీ ఇథియోపియా, జోర్డాన్, ఒమన్ పర్యటన వివరాలను ప్రియాంక గాంధీ అడగగా, బావుందని ప్రధాని బదులిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ధర్మేంద్ర యాదవ్, ఎన్‌సిపి (ఎస్పీ)కి చెందిన సుప్రియా సులే, సిపిఐ ఎంపీ డీరాజా పాల్గొన్నారు.