కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ షురూ!
posted on Oct 17, 2022 @ 1:03PM
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. దాదాపు మూడేళ్లుగా ఇదిగో అదిగో అంటూ వాయిదా పడుతూ వచ్చిన గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్ష ఎన్నిక సోమవారం (అక్టోబర్ 17)న పోలింగ్ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 19 ( బుధవారం) జరుగుతుంది.
అధ్యక్ష ఎన్నికలలో పార్టీ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ లు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్న విషయంపై పెద్దగా ఎవరిలోనూ ఉత్కంఠ లేదు. ఫలితం నామినేషన్ల రోజునే తేలిపోయింది. అధిష్ఠానం ఆశీస్సులున్న ఖర్గే విజయం దాదాపు ఖాయమన్న భావన అయితే అందరిలో నెలకొని ఉంది. మరో అభ్యర్థి శశిథరూర్ కూడా ఈ విషయాన్ని బాహాటంగానే చెప్పేయడమే కాకుండా ఖర్గేకు అభినందనలు కూడా తెలియజేశారు.
అయితే దేశ వ్యాప్తంగా ఉన్న తొమ్మిది వేల మంది పీసీసీ ప్రతినిథులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రేసులో ఉన్న మల్లిఖార్జున ఖర్గే తన ఓటు హక్కును బెంగళూరులో వినియోగించుకున్నారు.
అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, జైరాం రమేష్ భారత్ జోడో యాత్ర క్యాంపులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ కూడా ఏఐసీసీ కార్యాలయంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నఅన్ని పీసీసీ కార్యాలయాలలోనూ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది.