ఆకలి చుట్టూ అ...రాజకీయ దుమారం !

ఎవరో కవి, ఆకలికి అన్ని భాషలు వచ్చన్నారు. నిజం. ఆకలికి అన్నిభాషలు వచ్చును. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలలో ఆకలి మాట్లాడుతుంది. అలాగే,బెంగాలీ, పంజాబీ మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఉర్దూ, హిందీ ఇలా ఉత్తర దక్షణాది భాషలు అన్నిటిలో, ఆకలి మాట్లాడుతుంది. భారతీయ భాషలే కాదు, ప్రపంచ భాష ఇంగ్లీష్’ లోనూ ఆకలి అనర్గళంగా మాట్లాడ గలదు. అలాగే, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, చైనీస్ ఇలా మొత్తంగా  ఏడువేలకు పైగా ఉన్న ప్రపంచ భాషలు అన్నిటిలో ఆకలి మాట్లాడుతుంది.మాట్లాడుతూనే వుంది. ఆకలి కేవలం మాట్లాడమే కాదు, మాట్లాడిస్తుంది.పోట్లాడుతుంది. కేకలు పెడుతుంది. కేకలు పెట్టిస్తుంది. అంతే కాదు, రాజకీయ గర్జనలు చేస్తుంది. అయితే, రాజకీయ ఆకలి కేకలు ఎంతవరకు నిజం అంటే, బొమ్మా బొరుసు రెండూ నిజమే, రెండు కాదు. 

ప్రపంచంలో ఆకలి ఉన్నది ఎంత నిజమో, ఆకలి రాజకీయమూ అంతే నిజం. ఆకలిని రాజకీయ అస్త్రంగా మలచుకునే  ప్రయత్నాలు దేశీయంగానే కాదు. అంతర్జాతీయంగాను జరుగుతున్నాయి. ఇందుకు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 (జిహెచ్‌ఐ-2022) పేరిట ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఎఫ్ఆర్ఐ) విడుదల చేసిన తాజా నివేదిక  ఒక తాజా ఉదాహరణ. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆకలి సూచిలో భారత దేశం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరో ఆరు మెట్లు దిగజారి 121 దేశాల్లో 107 స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం 116 దేశాల్లో 101 స్థానంలో వుంది. 

అయితే, ఈ నివేదిక ఎంతవరకు ప్రామాణికం, నివేదిక తయారు చేసిన ఐఎఫ్ఆర్ఐకు ఉన్న విశ్వసనీయత ఎంత అనే విషయంలో ఎవరి అనుమనాలు వారికున్నాయి. సహజంగానే కేంద్ర ప్రభుత్వం జిహెచ్‌ఐ-2022 నివేదికను తిరస్కరించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు, జిహెచ్‌ఐ-2022ను బోగస్ నివేదిక అని కొట్టి వేస్తున్నాయి. దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు జరుగతున్నకుట్రగా పేర్కొంటున్నాయి.

ఆర్ఎస్ఎస్ అనుబంధ  స్వదేశి జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) అయితే భారత దేశ ప్రతిష్టను దిగజార్చే దురుద్దేశంతో, బాధ్యతారహితంగా జిహెచ్‌ఐ-2022 నివేదికను రూపొందించి/ప్రచురించి సంస్థ పై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  జర్మనీకి చెందిన ప్రభుత్వేతర సంస్థ, ‘వెల్ట్ హుంగర్ హిల్ఫే పై విచారణ జరిపించి  చర్యలు తీసుకోవాలని జాగరణ్ మంచ్ డిమాండ్ చేసింది. నిజానికి గత సంవత్సరం ఇదే సంస్థ ఇదే తప్పుడు గణాంకాల ఆధారంగా తప్పుడు  ఆరోపణలు చేసినప్పుడ, ప్రపంచ ఆహారసంస్థ (ఎఫ్ఏఓ) తప్పును ఒప్పుకుని సరిదిద్దుతామని మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేసిందని స్వదేశి జాగరణ మంచ్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి భారత దేశం ఆర్థిక, ఆహార, ఔషద సహాయం అందుకుంటున్నఇరుగు పొరుగు దేశాలు పాకిస్థాన్, బంగ్లా దేశ్, శ్రీలంకల కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా ఉందని నివేదిక పేర్కొనడం అసత్యం మాత్రమే కాదు హాస్యస్పదంగానూ ఉందని స్వదేశీ జాగరణ్  మంచ్   పేర్కొంది.  

నిజానికి, కొన్ని విదేశీ సంస్థలు భారత దేశ ప్రతిష్టను దిగజార్చేందుకు, ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడే కాదు, గతంలో దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటి నుంచి కూడా ఇలాంటి ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. అయితే, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం విదేశీ స్వచ్చంద సంస్థల కార్యకలాపాలకు సంబందించిన నిబంధనలు కఠినతరం చేసిన నేపథ్యంలో  ఒక్క ఆకలి విషయంలోనే కాదు  ఇంకా అనేక విధాల దేశం ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. కొవిడ్ మరణాల విషయంలో  భారత దేశ జనాభాలో కనీసం  మూడో వంతు  జనాభా ఉన్నా అమెరికా, అంతకంటే తక్కువ జనాభా ఉన్న మరి కొన్ని చిన్న చిన్న దేశాలతో పోల్చి దేశంలో హాహాకారాలు సృష్టించే ప్రయత్నాలు జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు.    
మరోవంక ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఐఎఫ్ఆర్ఐ నివేదికకు, ఎర్ర తివాచీ పరిచి స్వాగతిస్తున్నాయి. హరతులిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇది నిదర్శనమని అంటున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఇదే అదనుగా తీసుకుని  ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టార్గెట్ గా వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసత్య ప్రచారంతో దేశాన్ని బలహీన పరుస్తున్నాయని ఆరోపించారు. అలాగే, ప్రధాని మోడీని విమర్శించడంలో ముందుండే  తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు, తమదైన స్టైల్లో  మోడీ పాలనలో  కొద్ది మంది అస్మదీయులకు మాత్రమే అచ్చే దిన్, అమృత కాల్  దేశానికి మాత్రం డబుల్ ఇంజిన్ విధ్వంశం” అని ట్వీట్ చేశారు.      

అయితే, 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 3000 మంది అభిప్రాయలు సేకరించి, చిత్రించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022 విశ్వసనీయత విషయంలో అధికార పార్టీకే కాదు, సామాన్యులకు కూడా సందేహాలున్నాయని అంటున్నారు.  కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి  పేద ప్రజలను కాపాడేందుకు, 2020 నుంచి  కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల మంది  పేద ప్రజలకు నెలకు ఐదుకిలోల వంతును ఉచితంగా గోధుమలు/ బియ్యం సరఫరా చేస్తోంది. మరో వంక  శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణ ఆసియా దేశాల ఆకలి కేకలు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. అలాగని భారత దేశంలో ఆకలి లేదని కాదు. అంతా బాగుందని అసలే కాదు. కానీ, జిహెచ్‌ఐ-2022 నివేదిక పేర్కొన్నట్లుగా  పాక్, బంగ్లా, శ్రీలంక కంటే భారత దేశంలో పరిస్థితి అధ్వానంగా అయితే లేదు. ఇక్కడే  జిహెచ్‌ఐ-2022 నివేదిక ‘సృష్టి’ కర్తలు తప్పులో కాలేశారని అంటున్నారు.

అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి,  కానీ, జిహెచ్‌ఐ-2022 వివేదిక నిండా బొక్కలే ఉన్నాయని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.  నిజానికి   దక్షిణ ఆసియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో మసక బారుతున్న ఆర్థిక వ్యవస్థకు వెలుగు కిరణం ఏదైనా ఉందంటే అది భారత దేశం ఒక్కటే  అని ఇటీవలనే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తెలిపింది. అయితే, అది సంపూర్ణ సత్యమా, అంటే కాకపోవచ్చును కానీ, జిహెచ్‌ఐ-2022 మాత్రం సంపూర్ణ అసత్యం, అని నిపుణులు అంటున్నారు.

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8)న తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి. https://www.youtube.com/watch?v=dD8qZdp3WHU

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

రంగారెడ్డి జిల్లా  మీర్జాగూడ  సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  మోకిల నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత  చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.  మృతి చెందిన  విద్యార్థులను సూర్యతేజ, సుమిత్, శ్రీనిఖిల్, రోహిత్‌లుగా పోలీసులు గుర్తించారు. కోకాపేట్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొని, తిరిగి వెడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   కారులో మొత్తం ఐదుగురు ఐసీఎఫ్ ఏఐ యూనివర్సిటీకి చెందిన ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. వీరిలో నలుగురు మరణించగా, తీవ్రంగా గాయపడిన విద్యార్థిని నక్షత్ర తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.   

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   

క.వి.త అంటే?

క.  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన క‌విత‌.. ప్రొఫైల్  చూస్తే ఆమె త‌న‌కు తాను చెప్పే మాట‌.. కేసీఆర్, ప్రొ. జ‌య‌శంక‌ర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వ‌చ్చి.. అటు పిమ్మ‌ట జాగృతి అనే  క సంస్థ ఏర్పాటు చేశాన‌నీ, అప్ప‌టి వ‌ర‌కూ అనాథ‌గా ఉన్న బ‌తుక‌మ్మ‌ను త‌న నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమ‌స్ చేశాన‌ని అంటారు క‌విత‌.  ఇక ఉద్య‌మ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపుల‌ర్ అయ్యారు. ఏది ఏమైనా క‌ల్వ‌కుంట్ల క‌విత‌గా స్థిర‌ప‌డ్డారు. ఉద్య‌మ య‌త్నం ఫ‌లించి.. తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్ర‌మోట్ అయ్యారు. ప్ర‌మోష‌న్ ల‌భించిన త‌ర్వాత క‌విత‌.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ క‌విత నుంచి ఎమ్మెల్సీ క‌విత‌గా మారారు. ఇంత‌లో పార్టీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం.. కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డంతో.. అతి ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టం ముగిసిన‌ట్ట‌య్యింది ఆమె రాజ‌కీయ జీవితంలో. దీంతో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ తండ్రికి లేఖ రాశారు క‌విత. ఇది బ‌య‌ట ప‌డ్డంతో మొత్తం గేమ్ ఛేంజ‌ర్ గా మారిపోయింది. ఈ వివాదం త‌ర్వాత పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌న త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని.. ఇక‌పై తాను బీఆర్ఎస్ క‌విత కాదు.. జాగృతి క‌విత అంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వి.   అంటే విడిపోవ‌డం. క‌ల్వ‌కుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవ‌డం. క‌విత జీవితంలో ఇది అత్యంత కీల‌క‌మైన మ‌లుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చారో అప్ప‌టి నుంచీ కాంగ్రెస్ క‌న్నా మించి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా త‌న బావ హ‌రీష్ ని చెడుగుడు ఆడుకున్నారు.  పార్టీలో ట్ర‌బుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హ‌రీష్ ని బ‌బుల్ షూటర్ అంటూ   అవ‌హేళ‌న చేశారు. హ‌రీష్ రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నిటినీ ఎండ‌గ‌ట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హ‌రీష్ రావ్ అంటూ తూర్పార బ‌ట్టారు. ఇక కాళేశ్వ‌రం అవినీతి మొత్తం హ‌రీష్ రావు పాప‌మే అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేనా ఇటు సోద‌రుడు  కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వ‌ద‌ల‌కుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎంద‌రో ఎమ్మెల్యేలపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. జాగృతి జ‌నం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్ర‌లు చేసి.. బీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై, మ‌రీ ముఖ్యంగా హ‌రీష్ పై   విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక స‌మ‌యంలో కాంగ్రెస్ లీడ‌ర్లు చేయాల్సిన ప‌ని క‌విత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది.  కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మంటూ హ‌రీష్‌, కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది.  అయితే త‌న‌ది ఆస్తి కోసం పోరాటం కాద‌ని ఆత్మ‌గౌర‌వ‌ పోరాట‌మ‌నీ.. మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంత‌మై క‌విత‌..   ఎమోష‌న‌ల్ హైడ్రామాకు తెర‌లేపారు. త‌న ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించ‌మ‌ని కోరారు. అన్న‌ట్టుగానే క‌విత రాజీనామా ఆమోదం పొందింది. త‌.    త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డానికి కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు క‌విత‌. ఒక టైంలో గాంధీ భ‌వ‌న్ వైపు ఆమె అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట వినిపించినా.. 2028 ఎన్నిక‌ల్లో తన పార్టీ అయితే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయమని చాటారు క‌విత‌. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మంటోన్న క‌విత‌.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజ‌కీయంగా ఎంత మేర‌కు రాణించ‌గ‌ల‌రు? ఆమె చిర‌కాల వాంఛ సీఎం కావ‌డం  సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  లేక  ష‌ర్మిళ‌లా ఆమె కూడా తేలిపోతారా? అన్న‌ది  క‌విత‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆమె వెన‌క న‌డిచే నాయ‌క‌త్వాన్ని బ‌ట్టి  భవిష్య‌త్ రూపు దిద్ద‌కుంటుంది.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

    ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.