ఖర్గే చెంతకు సోనియా.. కాంగ్రెస్ లో ఇది కొత్త సంప్రదాయం!
posted on Oct 20, 2022 @ 10:26AM
మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన వెంటనే చేసిన మొదటి పని ఏమిటంటే, సోనియా గాంధీతో అపాయింట్‌మెంట్ కోరడం. అంతకు ముందే తన విజయం అమ్మదయే అని ప్రకటించారు. సాధారణంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేకు అడగ్గానే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చేయాలి. మామూలుగానే ఖర్గే వంటి విధేయులకు అడిగినప్పుడల్లా సోనియమ్మ అప్పాయింట్ మెంట్ ఇచ్చేస్తారు.
కానీ ఇప్పుడు తన ఆశీస్సులతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గే కోరినా సోనియాగాంధీ అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు ఏమిటిది అంటూ నిబిడాశ్చర్యంలో మునిగిపోయారు. ఆ ఆశ్చర్యం నుంచి వారు తేరుకోకముందే.. వారు దిగ్భ్రమాశ్చర్యాలకు లోనయ్యే మరో సంఘటన జరిగింది. అదేమిటంటే సోనియాగాంధీ స్వయంగా నంబర్ 10, రాజాజీ మార్గ్ లోని ఖర్గే నివాసానికి చేరుకున్నారు. సాధారణంగా సోనియాగాంధీ ఎవరి నివాసానికీ వెళ్లరు.. ఎవరైనా సరే ఆమె నివాసానికి వచ్చి కలవాల్సిందే.
ఆ సంప్రదాయం మేరకే అధ్యక్షునిగా ఎన్నికైన వెంటనే ఆయన సోనియా ఆశీస్సులను అందుకోవడానికి అప్పాయింట్ మెంట్ కోరారు. అయితే సోనియా ఆయనకు అప్పాయింట్ మెంట్ నిరాకరించి.. స్వయంగా ఆమే ఖర్గే నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షురాలిగా, తాత్కాలిక అధ్యక్షురాలిగా కొత్త అధ్యక్షుడిని స్వయంగా వచ్చి అభినందించడం ద్వారా పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ లో మార్పుపై విస్పష్టమైన సందేశం ఇవ్వాలని సోనియా భావించారు.
పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గేకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి సోనియా స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి.. శ్రేణులకు ఇక ఆయన మార్గదర్శనంలో పని చేయాలన్న స్పష్టమైన సందేశాన్నిచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. అద్యక్షుడెవరైనా రిమోట్ సోనియా చేతిలోనే అన్న భావన ఇకపై ఉండకూడదన్న సందేశాన్ని ఈ చర్య ద్వారా సోనియా ఇచ్చారని అంటున్నారు. సోనియాగాంధీ ఇకపై పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ గా కొనసాగుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అలాగే పార్టీ పార్లమెంటరీ పార్టీ చీఫ్, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేతగా మల్లిఖార్జున్ ఖర్గే స్థానంలో ఎవరిని నియమించాలన్నది సోనియా గాంధీ త్వరలో నిర్ణయిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా సోనియా స్వయంగా ఖర్గే నివాసానికి వచ్చి మరీ అభినందనలు తెలియజేయడంపై పార్టీ సీనియర్ నాయకుడు, అధ్యక్ష ఎన్నికలో ఖర్గే ప్రత్యర్థి అయిన శశిథరూర్ స్పందించారు. కాంగ్రెస్ లో స్పష్టమైన మార్పునకు ఇది సంకేతమని అభివర్ణించారు.