బీజేపీతో టచ్ లోనే నితీష్ కుమార్.. పీకే సంచలన వ్యాఖ్యలు
posted on Oct 20, 2022 @ 10:57AM
నితీష్ కుమార్ మళ్లీ కమలం పార్టీకి షేక్ హ్యాండ్ ఇస్తారా? ఆయన పదవీ దాహంతీర్చుకోవడానికి మరోసారి కమలానికి స్నేహహస్తం చాస్తారా? అంటే ప్రముఖ ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఔననే అంటున్నారు. పీకే గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్(యు)లో కీలక పాత్ర పోషించారు. నితీష్ తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే ఇదంతా 2020కి ముందు.. పీకే జనతాదళ్( యు) నుంచి ఉద్వాసనకు గురికావడానికి ముందు. ఇప్పుడు కాదు.
అటువంటి పీకే తాజాగా నితీష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ బీజేపీతో టచ్ లో ఉన్నారనీ, కాషాయ శిబిరంతో మరోసారి పొత్తుకు ప్రయత్నిస్తున్నారనీ, ఎన్డీయే గూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారనీ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడితో కలిసి మహాఘట్‌బంధన్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఈ ఏడాది ప్రారం భంలో జేడీయూ బిజెపితో సంబంధాలను తెంచుకుని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన సంగతి విదితమే.
అయితే బీహార్‌లో పాదయాత్రలో ఉన్న ప్రశాంత్ కిషోర్ పిటిఐతో మాట్లాడుతూ, నితీష్ కుమార్ బిజెపికి వ్యతిరేకంగా జాతీయ కూట మిని చురుకుగా నిర్మిస్తున్నారని భావిస్తున్న ప్రజలు ఆయన బీజేపీతో మరోసారి పొత్తుకు తలుపులు తెరిచే ఉంచారని తెలిస్తే ఆశ్చర్య పోతారని, అయితే అది వాస్తవమని పేర్కొన్నారు. నితీష్ కుమార్ జేడీయూ పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్ హరివంశ్ జీ ద్వారా బీజేపీతో నిత్య సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు.
జేడీయు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ, రాజ్యసభ పదవికి హరివంశ్ ఇంత వరకూ రాజీనామా చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. ఆర్జేడీతో ఇబ్బందులు వస్తే మళ్లీ కమలంతో చేతులు కలిపి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి నితీష్ ఒక్క నిముషం కూడా ఆలోచించరనీ, రాజకీయాలలో విలువల కంటే అధికారమే ముఖ్యమని నితీష్ భావిస్తారని ప్రశాంత్ కిషోర్ అన్నారు. కాగా రాజ్యసభ పదవికి తాను రాజీనామా ఎందుకు చేయలేదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు హరివంశ్ నిరాకరించారు. కాగా నితీష్ వ్యాఖ్యలను జేడీయూ నిర్ద్వంద్వంగా ఖండించింది. నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపే ప్రశక్తి లేదని జేడీయూ స్పష్టం చేసింది. పీకే వ్యాఖ్యలపై స్పందించిన జేడీయూ అధికార ప్రతినిథి కేసీ త్యాగి
బీహార్ సీఎం నితీష్ కుమార్ తన జీవితంలో బీజేపీతో చేతు కలిపే ప్రశక్తే లేదని బహిరంగంగా ప్రకటించిన సంగతి గుర్తు చేశారు. ఆయన మాటలను తాము పూర్తిగా విశ్వసిస్తున్నామన్నారు. ప్రశాంత్ కిషోర్ గత ఆరు నెలలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారనీ, ఆయనకు ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో గందరగోళాన్ని వ్యాప్తి చేసి లబ్ధి పొందే ఉద్దేశంతోనే ఇటువంటి అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని త్యాగి విమర్శించారు.