టాటా కంపెనీ వెళ్లడం లెఫ్ట్ ప్రభుత్వం నిర్వాకమే.. మమత
posted on Oct 20, 2022 @ 11:15AM
సింగూర్ నుంచి టాటా మోటార్స్ ను బయటికి పంపింది సీపీఎం తప్ప తాను కాదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. సిలిగురిలో దుర్గాపూజ అనంతరం జరిగిన విజయ సమ్మిళన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, హుగ్లీ జిల్లాలో టాటా మోటార్స్ నానో ఫ్యాక్టరీ కోసం ఇక్కడి పేద రైతుల నుంచీ గత వామపక్ష ప్రభుత్వం లాక్కున్న భూములను తాను రైతులకు వచ్చేలా చేశానని అన్నారు. కానీ తానే టాటా కంపెనీని బయటికి వెళ్లేట్టు చేశానని భారీ ప్రచారం జరుగుతోందని అందులో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. రైతుల నుంచి భూమి లాక్కనే అవసరం తమకు లేదని తమ వద్ద కావలసినంత భూమి ఉందని, ఆ పని చేసింది గత ప్రభుత్వాలేనని ఆమె అన్నారు.
సిపిఎం చేస్తున్న ప్రచారం అబద్ధ మని అందులో వాస్తవం లేదన్నారు. ఫ్యాక్టరీ వెలుపల హైవే వద్ద భారీ నిరసన ప్రదర్శనలు ధర్నాలు చేయడంతోనే ఫ్యాక్టరీ రాష్ట్రం నుంచి వెళిపోయిందని, ఫలితంగా వేలాది మంది రోడ్డున పడ్డారని సిపీఎం చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. 2008 అక్టోబర్‌లో ప్రాజెక్టును తీసే యాలని జరిగిన ఆందోళన, ధర్నాలు జరిగిన సమయంలో టాటా యాజమాన్యం తమ ప్రభుత్వం మీద బురదజల్లిందని మమత అన్నారు.
మమత బెనర్జీ సారధ్యంలో జరిగిన ఉద్యమంతో 34 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన వామపక్ష ప్రభు త్వం 2011 లో ఊహించని విధంగా అధికారం కోల్పోయింది. మమతాబెనర్జీ ప్రభుత్వం చేపట్టగానే టాటా కంపెనీకి వామ పక్ష ప్రభుత్వం ఇచ్చిన భూములను రైతాంగానికి తిరిగి ఇచ్చేసింది. అదానీ గ్రూప్ తేజ్ పూర్ ప్రాజెక్టు గురించి ప్రస్తావిస్తూ, తమ రాష్ట్రంలో ఎలాంటి వివక్షతా, అంతరాలు లేవని ప్రతి ఒక్కరూ వాణిజ్య వేత్తగా ఎదిగేందుకు అవకాశాలు కల్పిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. విద్యావంతులకు ఉద్యోగ భద్రత కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని, వాణిజ్య, వ్యాపారవేత్తలకు సహకరిస్తు న్నామని, రాష్ట్రంలో నిరుద్యోగులంతా ఉద్యోగులు అవుతున్నారనడంల ఎలాంటి సందేహం లేదన్నారు.
ఇదిలా ఉండగా , సిపీఎం సెంట్రల్ కమిటీ నాయకుడు సుజన్ చక్రవర్తి మాత్రం మమతకు అబద్దాలా డటంలో డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అసలు సింగూర్‌లో ధర్నాలో మమతా పాల్గొనలేదని అపుడు బుద్ధదేవ్ భట్టాచార్యనే ధర్నాలో పాల్గొన్నారన్నారు. మమతా ప్రభుత్వం ఏమాత్రం ఉద్యోగ భద్రత కల్పించడం లేదని అందువల్లనే విద్యావంతులు రాష్ట్రాన్ని విడిచివెళుతున్నారని అన్నారు. మమతా ఆవేశ పూరితంగా నిర్వహించిన ఆందోళన కారణంగానే టాటా మోటార్స్ రాష్ట్రం దాటి వెళ్లిందని, ఫలి తంగా లక్ష లాది మంది నిరుద్యోగులుగా మారారని బీజేపీ కూడా మమతా బెనర్జీపై మండిపడుతోంది. రాష్ట్రంలో మంచి నిపుణులు, మంచి విద్యావంతులు లేరని హుగ్లీ బిజేపీ ఎంపి లాకెట్ ఛటర్జీ అన్నారు.