ఈ ఏడాదీ శబ్దం వినపడకూడదు.. ఢిల్లీలో దీపావళి ఆంక్షలు
posted on Oct 20, 2022 @ 10:30AM
పండగ అంటే సరదా. దీపావళి అంటే మరీ సందడీ, సరదా. టపాసులు కొనడం, వాటిని దీపావళిరోజుకి సిద్ధం చేసుకోవడంలో పిల్లలు నానా హడావుడీ చేస్తుంటారు. దీపావళి అంటనే పిల్లల రోజు. వాళ్లని మరీ టపాసులతో ఆటలాడకుండా, ఎవరూ కాళ్లూ, చేతులు కాల్చుకోకుండా పెద్దవాళ్లు వెనక ఉండి నానా కంగారు పడుతూ వేనవేల జాగ్రత్తలు చెబుతూంటారు. ఇది అన్ని ప్రాంతాల్లో అందరి ఇళ్లల్లో మామూలే. కానీ దేశ రాజధాని ఢిల్లీ వారికి మాత్రం ఇది దాదాపు అయిదారేళ్లుగా సరదా లేకుండానే జరిగిపోతోంది. సరదాలేకుండా పండగేమిటి? అనుకోవద్దు.. ఢిల్లీ దేశ రాజధానే. కానీ కాలుష్యం విషయంలో అంతటి దారుణ సిటీ మరోటి ఉండదని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇపుడు అసలు సిటీలో పటాసుల గోలే ఉండకూడదని ఈసారి తప్పకుండా అందరూ ఈ ఆంక్షలు పాటించి తీరాలని ఏకంగా ఢిల్లీ సర్కార్ హెచ్చరికవంటి ప్రకటన చేసింది. అంటే ఈ ఏడాది నిబంధనలు చాలా సీరియస్‌గా అమలు చేయ డానికి ప్రభుత్వం సిద్ధపడిందనే అనాలి. మరి పిల్లల ఆనందానికి అడ్డుకట్టవేసినట్టేనా? మరో మార్గం లేదా అనే ప్రజల ప్రశ్నకు ఢిల్లీ సర్కార్ జవాబు ఇవ్వాలి.
ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సంద ర్భంగా బాణాసంచా కాల్చకుండా నిషేధం విధించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. బాణాసంచా తయారు చేసినా, నిల్వ చేసినా, అమ్మినా, కాల్చినా జరిమా నా విధిస్తామంది. అంతేకాదు మూడేళ్లు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. మరి పండగ సరదా ఏమికావాలి? ఈ సంవత్సరం అటువంటి ఉత్సాహం ప్రదర్శించ కుండ వీలయినంత జాగ్రత్త పాటించాల్సిందే.
ప్రతీసంవత్సరం అలాంటి హెచ్చరికలు ప్రభుత్వం నుంచి వస్తున్నా, కోర్టు ద్వారా ఏదో కొంత సవరణ లభించి ప్రజలు రెండు గంగలయినా టపాసులు కాల్చేవారు. కానీ ఈ ఏడాది మాత్రం అటువంటి అవకా శం ఇచ్చే పరిస్థితుల్లేవని అంటున్నారు. అసలు టపాసుల అమ్మకాల విష యంలో కూడా చాలా నియ మాలు పాటిస్తున్నారు.. పొగ, శబ్ధ నివారణకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే భారీ పేలుడు శబ్దం ఉండకూడదు, ప్రాంతమంతా పొగచూరినట్టు కాకూడదని గట్టి నిబంధన అమలు చేశారు. అసలు దీపావళి అంటేనే లక్ష్మీబాంబులు, తారాజువ్వల హడావుడి ఎక్కువ. అవి కాదంటే ఇక పిన్నలు, పెద్దలు చిచ్చు బుడ్లు, మతాబులు, విష్ణు చక్రాలు, భూచక్రాలతో ఆనందించాల్సిందే మరి.
దీపావళి రోజున పటాకులు కాలిస్తే 6 నెలల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించనున్నట్లు ఢిల్లీ పర్యావ రణ శాఖ మంత్రి గోపాల్‌రాయ్ హెచ్చరించారు. ఇక పటాకుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు చేపడితే రూ.5 వేల జరిమానా విధించడంతో పాటు మూడేళ్ల జైలు శిక్ష ఉంటుందని స్పష్టం చేశారు.