ఫుట్ బాల్ దిగ్గజం పీలే కన్నుమూత
posted on Dec 30, 2022 @ 10:07AM
ఫుట్ బాల్ లెజండ్ పీలే కన్నుమూశారు. 82 ఏళ్ల పీలే క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం(డిసెంబర్ 29) అర్ధరాత్రి సావోపాలోలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సాకర్ చరిత్రలోనే అత్యుత్తమ క్రీడాకారుడిగా పీలే గుర్తింపు పొంందారు.
అలాగే మూడు ప్రపంచ కప్ విజయాలలో భాగస్వామిగా ఉన్న ఏకైక సాకర్ క్రీడాకారుడు పీలేయే. 1958, 1962, 1970లలో ప్రపంచ సాకర్ విజేత బ్రెజిల్ జట్టులో పీలో సభ్యుడు . నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్ కు ప్రాతినిధ్యం వహించిన పీలే ప్రత్యర్థి జట్ల డిఫెన్స్ ను ఛేదించి మెరుపు వేగంతో బంతిని గోల్ పోస్టులోకి పంపేసి క్రీడాభిమానులు, ప్రేక్షకులనే కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులను సైతం సంభ్రమాశ్చర్యాలలో ముంచేసే వాడు.
1966లో నే సాకర్ కు గుడ్ బై చెప్పాలని భావించినా, ఆ నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు. 1970 ప్రపంచకప్‌లో ఉత్తమ ఆటగాడిగా బంగారు బంతి అందుకున్నాడు. ప్రపంచకప్‌లలో 14 మ్యాచుల్లో 12 గోల్స్ సాధించాడు. పీలే మృతి పట్ల సాకర్ ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది.