రాహుల్’ సారధ్యంలో జాతీయ కూటమి ?
posted on Dec 29, 2022 @ 9:31AM
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ పై ఆ పార్టీ నేతలలో విశ్వాసం సన్నగిల్లితే సన్నగిల్లిందేమో, కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకే అదినేత ఎంకే స్టాలిన్ లో మాత్రం, హస్తం పార్టీ పై విశ్వాసం రోజురోజుకు పెరిపోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వంపై స్టాలిన్ విశ్వాసం భారత్ జోడో యాత్ర కంటే వేగంగా పరుగులు తీస్తోంది. ద్విగుణీకృతం అవుతోంది. 2024 ఎన్నికల్లో బీజేపీని సమర్ధవంతంగా ఎదుర్కునే సత్తా, సామర్ధ్యం ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని స్టాలిన్ కుండ బద్దలు కొట్టారు.
కాంగ్రెస్ సారథ్యంలో కలిసి పోరాడదాం...రండని.. విపక్ష పార్టీలకు పిలుపు నిచ్చారు. నిజానికి తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా పట్టు లేదు. డిఎంకే అండలేకుండా కాంగ్రెస్ పార్టీ అడుగు తీసి అడుగు వేయలేదు. నిజానికి 1969లో తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. మద్రాస్ రాష్ట్రం చిట్ట చివరి ముఖ్యమంత్రి భక్తవత్సలం (1962- 1967) .. కాంగ్రెస్ పార్టీ చిట్టచివరి ముఖ్యమంత్రి కూడా ఆయనే.. 1969లో మద్రాస్ రాష్ట్రం, తమిళనాడుగా అవతరించిన తర్వాత, తమిళనాడులో వంతుల వారీగా ద్రవిడ పార్టీల (డిఎంకే, అన్నా డిఎంకే) పాలనే సాగుతోంది.
నిజానికి, బీజేపీ కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం ఇవ్వడానికి దశాబ్దాల ముందే, తమిళనాడులో హిందీ వ్యతిరేక ద్రవిడ వాదం జోరులో కాంగ్రెస్ చప్పబడి పోయింది. నిజానికి కాంగ్రెస్ మాత్రమే కాదు, గడచిన ఆరుపదుల పైబడిన కాలంలో బీజేపీ, వామపక్షాలు సహా జాతీయ పార్టీలు ఏవీ, తమిళనాడులో నిలబడలేక పోయాయి. ద్రవిడ పార్టీలు అందించిన అక్సిజిన్ తో ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ పరిస్థితిలో నిజానికి డిఎంకే అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నంతగా, కాంగ్రెస్ పార్టీ అవసరం డిఎంకేకు లేదు. అయినా స్టాలిన్ కాంగ్రెస్ వెంట పడుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను మెచ్చుకోవడమే కాదు, రాహుల్ గాంధీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాలిన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యాన్ని కోల్పోయిందనడాన్ని తాను నమ్మబోనని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు కాంగ్రెస్ పార్టీతో కూడిన జాతీయ కూటమి అవసరమని చెప్పారు. కాంగ్రెస్ తిరిగి గాడిలో పడుతోందని, భారత దేశానికి ఇప్పుడు అదే అవసరమని చెప్పారు. ఆ పార్టీ పునరుజ్జీవం బాటలో ఉందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సోదరునిగా అభివర్ణిస్తూ, బీజేపీ అనుసరించే సంకుచిత రాజకీయాలకు మేలైన విరుగుడు మందు వంటివారు సోదరుడు రాహుల్ గాంధీ అని స్టాలిన్ అన్నారు.
దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు సురక్షితంగా, స్వతంత్రంగా పని చేసే విధంగా చూడటం కోసం జాతీయ కూటమి ఏర్పాటవడం చాలా ముఖ్యమని చెప్పారు .రాహుల్ గాంధీ బీజేపీతో కేవలం ఎన్నికల కోసం మాత్రమే కాకుండా సైద్ధాంతిక ప్రాతిపదికపై కూడా పోరాడుతున్నారన్నారు. భారత్ జోడో యాత్ర భారీ సంచలనం సృష్టించిందన్నారు.
అయితే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇంతలా మేచ్చుకోవడానికి కారణం ఏమిటి? నిజానికి రాహుల్ గాంధీ పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే, ఆయన సాధించిన గొప్ప విజయాలు మచ్చుకైనా కనిపించవు. రాహుల్ గాంధీ 2004లో తొలిసారి అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మరో రెండు మార్లు (2009, 2014) అదే నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యారు. కానీ, 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయారు.ఆ ఎన్నికల్లో అమేథీతో పాటుగా కేరళలోని వాయనాడ్ నియోజక వర్గం నుంచి కూడా పోటీచేశారు. సొంత నియోజక వర్గంలో ఒడి పోయినా, వాయనాడ్ ఓటర్లు ఆయన్ని అక్కున చేర్చుకుని పార్లమెంట్ కు పంపించారు. అదే సమయంలో పార్టీ అధ్యక్షుడిగా పార్టీని గెలిపించలేక, ఓటమికి నైతిక బాధ్యత వహించి పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు..ఆ తర్వాత ఏమి జరిగింది అనేది చరిత్ర.
అయితే స్టాలిన్ రాహుల్ పై ప్రశంసల వర్షం కురిపించడానికి ఆ చరిత్ర కాదు కారణం.. జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అన్నా డిఎంకేలోని అంతర్గత కలహాలను అడ్డుపెట్టుకుని బీజేపీ తమిళనాడులో పాగావేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బీజేపీ కొంత వేగంగా అడుగులు వేస్తోంది.ముఖ్యంగా బీజేపీ ప్రవచించే హిందూ జాతీయ వాదానికి ఆదరణ పెరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లోనూ ఆ ప్రభావం కనిపిస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాల వ్యాప్తి కొంత వేగంగా జరుగుతోంది .. అందుకే రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు, స్టాలిన్ కు కాంగ్రెస్ అవసరం ఏర్పడింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లో బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ జాతీయ వాద భావజాలానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎత్తిన జెండా, అజెండా స్టాలిన్ కు రాజకీయ అవసరంగా మారాయి. అందుకే స్టాలిన్ కాంగ్రెస్ కు జై కొట్టారు. కాంగ్రెస్ /రాహుల్ సారథ్యంలో జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష పార్టీలు ఒకటవ్వాలని పిలుపిచ్చారు.