Read more!

తెలుగుదేశంకే స్వల్ప మొగ్గు.. ఆత్మసాక్షి సర్వే

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడం అధికార వైసీపీకీ, విపక్ష తెలుగుదేశం కు కూడా నల్లేరు మీద బండి నడక కాదు. తీవ్ర మైప ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న.. వైసీపీ, బలంగా పుంజుకున్న తెలుగుదేశం కూడా ఎన్నికలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ,   . పొత్తులు, పోటీలపైనే కాకుండా,  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చోపచర్చలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి.

ఇప్పటికే   రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధకారంలోకి ఏ పార్టీ వస్తుంది, పొత్తులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తులు లేకుండా వేర్వేరుగా పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఏలా ఉంటుంది అన్న విషయంపై పలు రకాల సర్వేలు వచ్చాయి.  అయితే తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం వైపు స్వల్ప మొగ్గు ఉంటుందని తేలింది. ఔను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 78 స్దానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే సింపుల్ మెజారిటీకి మాత్రం ఆ పార్టీ అడుగు దూరంలోనే నిలిచిపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక వైసీపీ 63 స్థానాలలో గెలిచి రెండో స్థానంలో నిలుస్తుంది.  ఇక జనసేన కేవలం 7 స్థానాలకే పరిమితమౌతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా 27 స్థానాలలో పోటీ ఉంటుందని పేర్కొంది.

అయితే తుది ఫలితం మాత్రం ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ కనీసం 36 స్థానాలలో ప్రస్తుత అభ్యర్థులు లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ కూడా కనీసం 50 స్థానాలలో సిట్టింగులను లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది.  అంటే తెలుగుదేశం కు స్వల్ప మొగ్గు కనిపించినా, అభ్యర్థుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ భారీగా నష్టపోకతప్పదని సర్వే వెల్లడిస్తోంది. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా ఉందని చెబుతోంది.

వివిధ సామాజిక వర్గాల మొగ్గు, ఆయా వర్గాలను ఆకట్టుకునే విషయంలో తెలుగుదేశం, వైసీపీలకు ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలు, ఇంకా పొత్తులు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి. పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? అన్న అంశాలపై సమగ్ర విశ్లేషణతో పూర్తి సర్వేను త్వరలో వెల్లడించనున్నట్లు శ్రీ ఆత్మసాక్లి ఓ ప్రకటనలో పేర్కొంది.