Read more!

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ దాడులు, సోదాలపై రాజకీయ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాల దారి సోదాలదే, ఆరోపణల దారి ఆరోపణలదే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ సోదాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.

తాజాగా  హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.  ఈ ఏడాది  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ అధికారులు తరచూ రైడ్స్ నిర్వహించడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో గురువారం (ఫిబ్రవరి 3)ను పెద్దం సంఖ్యలో ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన  కంపెనీల్లో సోదాలు చేసిన ఐటీ ఇప్పడు ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.  ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో దాడులు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత,  తాజాగా ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఐటీ అధికారులు ఎమ్మెల్సీ ఇంట్లో, ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లో సైతం ఏకకాలంలో దాడులు చేస్తున్నారు.

ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా   తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఇప్పుడు ఐటీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో దాడులు జరుగుతున్నాయి.