హతవిధీ ఇదేం కొలువు.. జగన్ సర్కార్ లో బ్యూరోక్రాట్ల పరిస్థితి దయనీయం!

జగన్ సర్కార్ లో హైరార్కీ అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పని చేయడమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. బహుశా స్వతంత్ర భారత దేశంలో అధికారుల సేవలను ఇంతగా తన అవసరాల కోసం వాడుకున్న సీఎం జగన్ వినా ఎవరూ ఉండకపోవచ్చు.

తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఔను సీఎస్ స్వయంగా వారిని విచారిస్తున్న జైలు వద్దకు వెళ్లి విచారణ పూర్తి కాగానే తన కారులో ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డిని వాచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పికే నవీన్ లను సీబీఐ శుక్రవారం ( ఫిబ్రవరి 3)న విచారించింది. వారిరువురినీ కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లోదాదాపు 6 గంటల పాటు విచారించింది. విచారణ  ముగిసిన అనంతరం వారు బయటకు రాగానే సీఎస్ జవహర్ రెడ్డి వారిరువురినీ తన కారులో  తిరుపతి విమానాశ్రాయానికి అక్కడ నుంచి విమానంలో తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు.

ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఒక కేసులో విచారణకు హాజరైన ఇరువురి విషయంలో అంత శ్రద్ధ తీసుకుని విచారణ ముగిసిన అనంతరం స్వయంగా పికప్ చేసుకని మరీ తాడేపల్లికి తోడ్కొని రావడం సంచలనంగా మారింది. ఇరువురినీ విచారణ ముగిసిన తరువాత పికప్ చేసి తీసుకుని రావడమే కాదు.. తాడేపల్లి నుంచి కడపకు ఈయనే డ్రాప్ చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పికప్ ఆండ్ డ్రాప్ పనులు చేయడమేమిటన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలో కూడా జోరుగా సాగుతోంది. జగన్ సర్కార్ లో సీఎస్ కు పనీపాటా లేదా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.  

ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను సీఎస్ ఇలా తన కారులో పికప్ చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కొని రావడం తీవ్రమైన విషయమనీ, ఇది దర్యాప్తును ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ఈ హత్య కేసులో నిందిుతలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహయం, సహకారం అందడం తీవ్ర మైన విషయంగా చెబుతున్నారు. సీఎస్ ఎందుకోసం, ఎవరి కోసం ఇలా చేస్తున్నారో అర్ధమౌతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.  

అయినా జగన్ సర్కార్ లో అధికారులను అడ్డగోలుగా వాడుకోవడం.. చివరికి ఎక్కడైనా తేడా కొడితే నిర్దాక్ష్యిణ్యంగా బలిపశువులను చేసి వదిలించుకోవడం అనవాయితీగా మారిపోయిందని రాజకీయవర్గాలు అంటున్నారు. జగన్ సీఎం కావడానికి ముందు నుంచే ఆయన చెప్పినట్లల్లా నడుచుకున్న అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎంత అవమానకర రీతిలో ఆ పదవి నుంచి సాగనంపారో తెలిసిందే కదా అంటూ ఉదహరిస్తున్నారు. ఆ తరువాత  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే తీసుకుంటే.. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా, విపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆయన పోలీసు అధికారిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉద్యోగుల చలో విజయవాడను విఫలం చేయడంలో ఏపీ పోలీసు వైఫల్యం ఆయన పదవికి ఎసరు తెచ్చిన సంగతి తెలిసిందే.

అలాగే.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. సునీల్.. విపక్ష నేతలు, సామాన్యులపై అడ్డగోలు కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధించారు. కనీస ఫార్మాలటీస్ కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారంటూ కోర్టులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏలిన వారి సేవలో తరించారు. అటువంటి సీఐడీ మాజీ చీఫ్ ను కూడా జగన్ సర్కార్ కూరలో కరివేపాకు మాదిరిగా ఆ పదవి నుంచి పక్కకు పెట్టేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. ఇక తాజాగా గవర్నర్ కార్యదర్శి సిసోడియాకూ అటువంటి మర్యాదే చేసింది. జగన్ సర్కార్. ఏరి కోరి గవర్నర్ కార్యదర్శిపదవిలో నియమించిన ప్రభుత్వమే ఆయనను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి బదలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సిసోడియా అత్యంత విశ్వాసపాత్రుడు. గవర్నర్ కు వచ్చే ఫిర్యాదులను సిసోడియా లీక్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్ష నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకకుండా చేయడం, అలాగే కీలక విషయాలు గవర్నర్ దృష్టికి వెళ్లకుండా చేయడంలోనూ సిసోడియా కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలనూ ఆయన ఎదుర్కొన్నారు. అటువంటి సిసోడియాపై సర్కార్ బదలీ వేటు వేయడం, ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన కూడా జగన్మాయకు బలిపశువు అయ్యారని పరిశీలకులు అంటున్నారు.

ఇంతకీ సిసోడియాపై వేటుకు కారణమేమిటంటే.. గవర్నర్ కు ఉద్యోగుల అపాయింట్ మెంట్ దొరకడమే. ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడమే. ఉద్యోగ సంఘాల నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇప్పించింది సిసోడియానే అన్న నిర్ధారణకు వచ్చిన జగన్ సర్కార్ ఆయనపై బదలీ వేటు వేసిందని అంటున్నారు. ఇక జగన్ సర్కార్ లో అధికారుల విధి నిర్వహణ మొత్తం జగన్ మెప్పు పొందడం కోసమే అన్నట్లుగా మారిందనీ, ఆ పారామీటర్లు చేరుకోలేని వారెవరినైనా ప్రభుత్వం స్పేర్ చేయదనీ ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

Advertising
Advertising