బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటలకు?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. విడతల వారీ పాదయాత్రలను సక్సెస్ ఫుల్ గా ముగించినా, ఆ పాదయాత్రల ప్రారంభానికి, ముగింపునకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చి ఆర్భాటం చేసినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మైలేజీ రాలేదా?  పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి కానీ, పార్టీ ఇమేజ్ ప్రజలలో ఇసుమంతైనా పెరగలేదా?

ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారైందా? రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పట్ల ఆందోళనలో ఉందా? గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవలసిన చర్యలపై కసరత్తులు ప్రారంభించిందా? అందులో భాగంగా పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి.

పార్టీ హై కమాండ్ కూడా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి సారించిందంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఫలమయ్యారని హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సభలకు జనసమీకరణలో బండి సంజయ్ సక్సెస్ అయినా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో ఆయన అనుకున్నంతగా విజయవంతం కాలేదని బీజేపీ హైకమాండ్ అభిప్రాయపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం..  రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఈటలకు అప్పగించాలన్న యోచనలో బీజేపీ హై కమాండ్ ఉందని చెబుతున్నారు.

ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వే ఫలితం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సర్వే ఫలితం అని కాకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఎంత మాత్రం పట్టు లేదన్న సంగతి హై కమాండ్ కూడా గుర్తించిందంటున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక ఫలితానికి కూడా అదే కారణమని హై కమాండ్ భావిస్తోంది.  ఇక పోతే ఇటీవలి కాలంలో బండి సంజయ్ కుమారుడి వివాదాస్పద వైఖరి వల్ల పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత పొడసూపిందన్న భావన కూడా బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది.

అదీ కాక పట్టణ ప్రాంతాలకే బండి సంజయ్ ప్రభావం పరిమితం అన్న నిర్ధారణకు కూడా మోడీ, షా వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు అర్బన్ లోనూ ఇటు రూరల్ లోనూ కూడా మంచి పట్టున్న నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ అయితే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా బలోపేతం అవుతుందని మోడీ షా ద్వయం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Advertising
Advertising