చెప్పుల వేటలో రైల్వే పోలీసులు
posted on Apr 3, 2023 @ 10:35PM
మీరెపుడైనా రైలు ఎక్కుతూ చెప్పులు జార విడుచుకున్నారా? ఖంగారు పడకండి.. రైల్వే పోలీసులు వాటిని వెతికి తెచ్చి మీకిస్తారు. సమాన్లు, ఇతర విలువైన వస్తువులు పోతే దొరుకుతాయో లేదో తెలియదు కానీ, చెప్పులు మాత్రం కచ్చితంగా తిరిగి దొరుకుతాయి. నమ్మకం లేదా? కాజీపేటలో అలాగే జరిగింది. పోయిన చెప్పును సొందదారుడికి రైల్వే పోలీసులు భద్రంగా అందించారు. కాజీపేట రైల్వే పోలీసులు ట్వీట్ ద్వారా అందిన ఫిర్యాదుపై స్పందించారు. ఇంతకీ ఆ ఫిర్యాదు ఏమిటంటే.. కాజీపేట రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కే హడావుడిలో తన చెప్పు జారిపడిపోయిందని ఓ ప్రయాణీకుడు ట్వీట్ ద్వారా ఫిర్యాదు చేశాడు. వెంటనే రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. పడిపోయిన చెప్పును వెతికి మరీ ఆ ఫిర్యాదు చేసిన ప్రయాణీకుడికి అప్పగించారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ కు చెందిన ఓ ప్రయాణికుడు గురువారం కాకతీయ రైలు ఎక్కుతున్న క్రమంలో అతని చెప్పు జారి పడిపోయింది. వెంటనే రైల్వే బోర్డు ట్విట్టర్ ఖాతాలో ఫిర్యాదు చేశాడు. ప్రయాణికుడి సమస్యను పరిష్క రించాలని రైల్వేబోర్డు అధికారులు... ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు పడిపోయిన చెప్పును శనివారం రాత్రి ప్రయాణికుడికి అప్పగించారు.
పోలీసులంటే కర్కసత్వం, కాఠిణ్యం, మొరటుతనం మాత్రమే గుర్తుకొస్తాయి.. ఫ్రెండ్లీ పోలిసింగ్ కు ఇది ఉదాహరణ అని కొందరంటుంటే.. చెప్పు పోయిందంటే స్పందించారు. మరి రైల్వే స్టేషన్లలో మిగిలిన చోరీల సంగతేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చైన్ స్నిచింగ్ లు, పిక్ పాకెటింగ్ లు రైల్లే స్టేషన్లలో కామనైపోయాయి కదా, మరి వాటిపై కూడా స్పందించడి అంటున్నారు.