తెలంగాణలో టెన్త్ పేపర్ లీక్?!
posted on Apr 3, 2023 @ 2:25PM
పేపర్ లీకులు తెలంగాణను అతలాకుతలం చేసేస్తున్నాయా? టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ వ్యవహారం ఇంకా సద్దు మణగక ముందే.. తాజాగా టెన్త్ పరీక్ష పత్రం లీకవ్వడం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణలో సోమవారం (ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు పరీక్ష పత్రం పరీక్ష ప్రారంభానికి ముందే లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వికారాబాద్ జిల్లా తాండూరులో పరీక్ష ప్రారంభానికి కొద్ది సేపు ముందే వాట్సప్ లో ప్రశ్న పత్రం లీకైందని అంటున్నారు. పరీక్ష ప్రారంభానికి ముందే పరీక్షా పత్రం బయటకు రావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం లో ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
ఆ లీకేజీ వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పశ్నపత్రాల లీకేజీలో తలనొప్పులను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సర్కార్ కు ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ పేపర్ కూడా లీక్ అవ్వడం మరింత ఇబ్బందికర వ్యవహారం అనడంలో సందేహం లేదు. టెన్త్ పేపర్ లీకేజీపై జిల్లా విద్యాధికారి పరీక్ష ముగిసిన తరువాత ప్రశ్నాపత్రం మొబైల్ ఫోన్లలో వచ్చింది కానీ, లీక్ కాలేదని వివరించారు.