జగన్ ఎమ్మెల్యేలకు ఏం చెప్పబోతున్నారు?
posted on Apr 3, 2023 @ 11:04AM
ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోమవారం తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షిస్తారు.
అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు కూడా పాల్గొంటారు. అన్నిటికీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో బాగా ప్రచారం అవుతున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ముందస్తు ఎన్నికలు తదితర అంశాలపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నారు. మరో వైపు జగన్ ఇటీవలి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీలో వెల్లువెత్తుతున్న అసంతృప్తి, పార్టీపై జనంలో వ్యక్తమౌతున్న ఆగ్రహం, వ్యతిరేకత తదితర అంశాలపై కేంద్ర ఇంటెలిజెన్స నివేదికల ఆధారంగా అమిత్ షా జగన్ కు క్లారిటీగా వివరించినట్లు పార్టీ శ్రేణుల నుంచే వినవస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తి జ్వాలలను చల్లార్చి, వారిని బుజ్జగించి.. పార్టీని గాడిలో పెట్టే యత్నంలో భాగమే ఈ సమావేశం అని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, అసెంబ్లీ రద్దు వంటి నిర్ణయాలపై ఎటువంటి ప్రకటనా సమాచారం ఉండే అవకాశం లేదని అంటున్నారు. అలాగే గత సమావేశాలలోలా ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ వారికి క్లాస్ పీకే అవకాశాలు కూడా కనిపించడం లేదని అంటున్నారు.