గిఫ్ట్ ప్యాక్ కు ఐ ప్యాక్ దాసోహం!
posted on Apr 3, 2023 @ 10:17PM
పేనుకు పెత్తనం ఇస్తే ... తలంతా గొరిగేసిందని సామెత. ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) వ్యవహారం కూడా అలాగే వుంది. నిజానికి ఐ ప్యాక్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిస్తే ఐ-ప్యాక్ తెలిసినట్లే. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించడంలో ఐ ప్యాక్ కీలక భూమిక పోషించిందని అంటారు. నిజానిజాలు ఎలా ఉన్నపటికీ, అప్పటికీ ఇప్పటికీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంచీ చెడు అన్నిటికీ ఐ ప్యాక్ సర్వేలు, సలహాల మీదనే ఆధారపడతారనేది జగమెరిగిన సత్యం.
ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ నుంచి బయటకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో అడుగు పెట్టే దిశగా అడుగులు వేస్తున్నా, ఆయన బృందం మాత్రం 2024 ఎన్నికల్లో వైసీపీని మరోమారు గెలిపించే లక్ష్యంతో జగన్ రెడ్డి మహారాజ పోషణలో సర్వేలు చేస్తోంది. వ్యూహాలు రచిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజక వర్గాల్లో ఐ ప్యాక్ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రతి నియోజక వర్గంలో పార్టీ పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారి విజయావకాశాలు, మార్పులు చేర్పులు, ఇతర నియోజక వర్గాల్లో పార్టీ విజయావకాశాలపై విభిన్న కోణాల్లో సర్వేలు నిర్వహించి ఎప్పటికప్పుడు జగన్ రెడ్డికి అందచేస్తున్నాయి. ఈ నివేదికల ఆధారంగానే ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకుంటారని, ఐ ప్యాక్ సర్వే నివేదికల ఆధారంగానే జగన్ రెడ్డి టికెట్ కు టిక్ పెడతారని అందరికీ తెలిసి పోయింది.
దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఐ ప్యాక్ కీలకంగా మారింది. అధికార వైసీపీలో ఆ టీమ్ పాత్ర కూడా అంతే కీలకంగా ఉంది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. నిజానికి, ఐ ప్యాక్ సభ్యులకు చాలా సిన్సియర్ గా సీరియస్ నిజాయతీగా పనిచేస్తారనే పేరుంది. అయితే ఏడడుగులు కలిసి నడిస్తే, వారు వీరవుతారు అన్నట్లు, నియోజక వర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు,నాయకులతో కలిసి పనిచేయడం వల్లనో ఏమో, ఐ – ప్యాక్ టీమ్ లో కొందరు అమ్యామ్యాలకు అలవాడు పడినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యేల ప్రలోభాలకు లోబడి, నివేదికలను తారు మరు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముడుపుల మూటల ‘బరువు’ను బట్టి అభ్యర్ధుల బలాన్ని ఎక్కువచేసి చూపుతున్నారని, అంటున్నారు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ముఖ్యనేత ఖాయంగా ఓడిపోతరాని ఐ ప్యాక్ సర్వేలో స్పష్టంగా తేలింది. అయితే, సదరు ఎమ్మెల్యే ఐ ప్యాక్ కు ఇచ్చిన క్యాష్ గిఫ్ట్ ప్యాక్ బరువుతో నివేదిక మారిపోయిందని అంటున్నారు. ఖాయంగా ఓడి పోయే సిట్టింగ్ ఖాయంగా గెలిచే ఎమ్మెల్యేల జాబితాలో చేరిపోయారని అంటున్నారు.
ఇది ఒక ఉదహరణ మాత్రమే, చాలా వరకు జిల్లాలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఐ-ప్యాక్ సర్వే సభ్యుల తప్పుడు నివేదికల వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందన్న ఆందోళన కూడా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో దాదాపు 8 జిల్లాల్లో ఇదే తరహాలో చేయి తడిపిన వారికి అనుకూలంగా నివేదికలను తయారు చేసి అధిష్టానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. కొంతమంది జిల్లా సభ్యులు ఇచ్చిన తప్పుడు సర్వేలతో ఐ-ప్యాక్ రాష్ట్ర ప్రతినిధులు అవే నివేదికలను ప్రభుత్వ పెద్దలకు అందజేస్తున్నారు. అనేక సందర్భాల్లో ఆ నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటుండడంతో కొన్ని జిల్లాల్లో పార్టీ బలహీన పడుతున్నదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి
అలాగే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో తమ వారికి టికెట్ తెచ్చుకునేందుకు కొందరు పెద్దలు ఐ ప్యాక్ను ‘మ్యానేజి’ చేస్తునట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో సర్వేకు ఆదేశించిన సందర్భంలో కొన్ని ప్రాంతాలకు చెందిన సభ్యులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుని పార్టీకి విధేయుడుగా పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను సైతం బలహీనులుగా చిత్రీకరించి నివేదికలను తయారు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం ఐ ప్యాక్ నివేదికలను బైబిల్ కంటే పవిత్ర పత్రంగా భావిస్తున్నారని, పార్టీలోని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వాస్తవాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు తెసుకోక పొతే, చేజేతులా ఓటమిని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని, పార్టీ పెద్దలు అంటున్నారు.