పేపర్ల లీకేజీపై రాష్ట్రపతి ముర్ముకు లేఖ
posted on Apr 3, 2023 @ 12:58PM
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు బీఆర్ఎస్ సర్కార్ ను ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారం భారత రాష్ట్రపతి వద్దకు చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ విషయంపై బీఎస్పీ తెలంగాణ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.
టీఎస్‌పీఎస్సీ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ పాత్రను బహిర్గతం చేయడం కోసం సీబీఐ విచారణ చేయాలని తాను రాష్ట్రపతికి రాసిన లేఖలో కోరినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం (ఏప్రిల్ 24)న ట్వీట్ చేశారు. అలాగే ప్రస్తుత టీఎస్పీఎస్సీ కమిషన్ ను బర్త్ రఫ్ చేయాలని కూడా తానా లేఖలో రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు.
అంతే కాకుండా టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజిపై అందరూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖలు రాయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయడం బీఆర్ఎస్‌కు చేతకాదని తేలిపోయిందని.. బీఎస్పీ అధికారంలోకి రాగానే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించి, పారదర్శకంగా భర్తీ చేస్తామని ప్రవీణ్ కుమార్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.