సీబీఐకి కొత్త బాస్.. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా?
posted on May 15, 2023 @ 9:41AM
సీబీఐకి కొత్త బాస్ వచ్చారు. కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ (59) ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కొత్త డైరెక్టర్ గా కేంద్రం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారని పేర్కొంది. సీబీఐ ప్రస్తుత డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైశ్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్ ను నియమించింది. మే 25న జైశ్వాల్ పదవీ కాలం ముగుస్తున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సీబీఐ డైరెక్టర్ ను ఎంపిక చేసే ప్యానల్.. ప్రవీణ్ సూద్ నియామకానికి ఆమోదం తెలిపినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్యానల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్, లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఈ ప్యానల్ సమావేశంలో సూద్ ఎంపికపై.. అధిర్ రంజన్ చౌదరి అసమ్మతి నోట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
1986 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన ప్రవీణ్ సూద్ గత మూడేళ్లుగా కర్ణాటక డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. దిల్లీ ఐఐటీలో, ఐఐఎం బెంగళూరులో చదువుకున్నారు. దాంతో పాటు న్యూయార్క్ లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయంలోనూ విద్యాభ్యాసం చేశారు.
ప్రవీణ్ సూద్ కర్ణాటకలోని బళ్లారి, రాయచూర్ జిల్లాలకు సూపరింటెండెంట్ గా పనిచేశారు. బెంగళూరు నగరానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) గానూ సేవలు అందించారు. అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్), మైసూర్ సిటీ పోలీసు కమిషనర్ గానూ బాధ్యతలు నిర్వహించారు. మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా కూడా ప్రవీణ్ సూద్ పనిచేశారు. మెరుగైన ట్రాఫిక్ నిర్వహణకు సాంకేతికతను ఉపయోగించడం, పౌరులకు సమర్థమైన సేవలను అందించడం వంటి కార్యక్రమాలతో.. ప్రవీణ్ సూద్ కు 2011లో నేషనల్ ఈ-గవర్నెన్స్ గోల్డ్ అవార్డు వచ్చింది. 2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు సైతం ఆయన అందుకున్నారు.
చాలా కాలంగా స్వతంత్ర సంస్థ సీబీఐ... నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడం లేదనే వాదన వినవస్తుంది. కేంద్ర కనుసన్నలలో పని చేస్తున్నదనే అపవాదు మూటగట్టుకుంది. దేశ అత్యుత్తమ న్యాయస్థానం ఒకానొకప్పుడు.. సీబీఐ.. పంజరంలో చిలుక అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతిపక్షాలు సైతం.. సీబీఐ పనితీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. నూతన సారధి సారధ్యంలో సీబీఐ పని తీరు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.