కర్ణాటక బాటలో తెలంగాణా కాంగ్రెస్
posted on May 15, 2023 @ 11:07AM
కర్ణాటక ఎన్నికల ఫలితాలు టీకాంగ్రెస్ కు ఊపునిస్తున్నాయి. అంతే కాదు దిశానిర్ధేశం కూడా చేస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న బీజేపీనే గద్దెదింపిన అధిష్టానం రూట్లోనే టీపీసీసీ సీనియర్లు అడుగులు వేయడానికి స్కెచ్ వేస్తున్నారు. దక్షిణాదిలో ఒక్క కర్ణాటకలో మాత్రమే బిజెపి అధికారంలో ఉంది. మొన్నటి ఫలితాలు బిజెపిని మట్టి కరిపించి కాంగ్రెస్ ను అందలం ఎక్కించింది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. అధికారంలో ఉన్న మంత్రులు,నేతలు, పార్టీ పై ఉన్న వ్యతిరేకతే అనే నిర్థారణకు వచ్చారు. ఇక నిరుద్యోగం, నిత్యావసర ధరల పెంపు, అవినీతి,కమిషన్లు ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు వాటి పై విస్తృత ప్రచారం చేసింది కాంగ్రెస్.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎన్నికలకు చాలా రోజుల ముందే ప్రకటించింది. కర్ణాటకలో కాంగ్రెస్ మొదటి జాబితా మార్చిలోనే ఖరారైంది.ఇలా అభ్యర్థులను ముందే ప్రకటించడం వల్ల కాంగ్రెస్ విజయానికి దారి తీసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కూడా కర్ణాటక బాటలోనే ముందుగానే ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
దీనికి ఆకర్షితులై కన్నడిగులు కాంగ్రెస్ కు పట్టంకట్టారని.. కాబట్టి ఇదే ఫార్ములాను తెలంగాణలో అప్లై చేస్తే మంచి ఫలితాలు ఇక్కడ కూడా వస్తాయని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఓపినీయన్ కు వచ్చారు. రాష్ట్ర ప్రజల్లో వివిధ అంశాల్లో ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకతను ఎజెండాగా తీసుకోవాలనుకుంటుంది టీపీసీసీ. అయితే కర్నాటకలో బీజేపీ సత్తా ఏంటో తెలిసిపోయిందని, ఇక తెలంగాణలో ఆ పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని, ప్రధాన ప్రత్యర్థిగా బీఆర్ఎస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ పార్టీలోని అసమ్మతి, అసంతృప్తి, వైపల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతలనే ప్రధానంగా చేసుకొని కార్యాచరణను రూపొందించుకోవాలని టి కాంగ్రెస్ భావిస్తోంది.
ఇక హైదరాబాద్ కర్ణాటక రీజియన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలోని సరిహద్దు నియోజకవర్గాల్లో మరింత దృష్టి పెట్టి, అవసరాన్ని బట్టి కర్ణాటక నేతలను సైతం రప్పించే అవకాశమున్నది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకొని ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే దానికి విరుద్ధంగా వైఫల్యాలను తెరపైకి తెచ్చి ఉద్యోగులు, ఉపాధ్యాయలు, నిరుద్యోగులు , విద్యార్థులు, యూత్ కు చేరువ కావాలన్నాది కాంగ్రెస్ స్కెచ్.
అయితే ఇప్పటికే రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో ప్రకటించిన డిక్లరేషన్ రైతులు, వ్యవసాయం పైన ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ రాష్ట్ర యూనిట్. అదే విధంగా ప్రియాంక గాంధీ సమక్షంలో రిలీజ్ చేసిన డిక్లరేషన్ యూత్ పైన ఫోకస్ పెట్టింది. ఈ రెండు ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు అనుగుణంగా డిక్లరేషన్ లలో హామీలు ఇచ్చాయి. ఇంకా ఏడు డిక్లరేషన్ లను ప్రకటించడానికి ప్రణాళిక వేసుకున్నది. కర్ణాటక లో వచ్చిన తాజా విజయంతో ప్రభుత్వ వ్యతిరేకతను మరింత బలంగా జనంలోకి తీసుకొని వెళ్లాలనుకుంటున్నారు. కర్ణాటకలో పనిచేసిన ఫార్ములా ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందనే ధీమాతో కాంగ్రెస్ నేతలున్నారు.
మరో వైపు ప్రభుత్వ తొమ్మిది వైఫల్యాలు ఇంకా నెరవేర్చని హామీల లిస్ట్ ను టీ కాంగ్రెస్ వెతికే పనిలో పడింది. ఇక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఎఫెక్ట్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టొచ్చినట్టుగా కనిపించడంతో.. దాన్ని కూడా తెలంగాణలో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. సోనియా గాంధీతో పాటు పార్టీ అగ్ర నాయకత్వం మొత్తం కర్ణాటకలో విస్తతంగా ప్రచారం చేసినట్లుగానే తెలంగాణలోనూ జాతీయ నాయకులను దింపడం ద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయని అనుకుంటున్నారు.
అయితే అధిష్టానం ఫుల్ ఫోకస్ కర్ణాటకపై కేటాయించడంతోనే అలా ఫలితాలొచ్చాయని.. అదే విధంగా తెలంగాణపై దృష్టి సారించాలని టీ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరనున్నారు. కాకపోతే తెలంగాణలో ఎన్నికలున్నప్పుడే ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు రానున్నాయి. దీంతో తెలంగాణలో విజయానికి విస్తృతమైన అవకాశాలున్నందున రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడి నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు.