ముదిరి పాకాన పడ్డ గెహ్లాట్ పైలట్ వివాదం
posted on May 16, 2023 9:24AM
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పైలట్ ..బాహాటంగానే.. గెహ్లాట్ పై సంచలన విమర్శలు చేశారు. గత బీజేపీ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రశ్నపత్రాల లీకేజీపై ఈ నెలాఖరులోపు చర్యలు తీసుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆయన చేపట్టిన అయిదు రోజుల జన్ సంఘర్ష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జైపూర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పైలట్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు. వారిలో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. తమ డిమాండ్లను ఈ నెలాఖరులోపు అంగీకరించకపోతే ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేపడతామని, తాను దేనికీ భయపడనని, పదవిలో ఉన్నా, లేకున్నా రాష్ట్ర ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాననీ చెప్పిన పైలట్ తననెవరూఅణచివేయలేరన్నారు. పార్టీలో విభేదాల గురించి మాట్లాడుతూ ఆయన గెహ్లాట్ వర్గంపై పరోక్ష విమర్శలు చేశారు.
గెహ్లాట్ నుంచి ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ తాము కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నానన్నారు. 2020లో ప్రభుత్వం సంక్షోభంలో పడినప్పుడు బీజేపీ నేత వసుంధర రాజే అండగా నిలిచారంటూ ఇటీవల గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలపైనా పైలట్ పరోక్షంగా స్పందించారు. గెహ్లాట్ తన సొంత పార్టీ నేతలను తూలనాడుతూ ప్రత్యర్థి పార్టీల నేతలను ప్రశంసిస్తున్నారు. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీస్సులు తప్ప ఇంకేవీ పనిచేయవని పైలట్ పేర్కొన్నారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానంపెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇరువురు నేతలతో చర్చించి వారి మధ్య మనస్పర్ధలు తొలిగించడంపై హై కమాండ్ దృష్టి సారించడం లేదు. వివాదాన్ని పరిష్కరించకుంటే.. ఇది మరో మధ్యప్రదేశ్ అంటే కమలనాథ్, జ్యోతిరాదిత్య సింధియా ఎపిసోడ్ గా మారే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.