జాతీయ రాజకీయాలపై కెసీఆర్ ఫోకస్
posted on May 15, 2023 @ 3:51PM
భారత రాష్ట్ర సమితి నాయకత్వం ఇక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనుంది.కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో బిఆర్ఎస్ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి? అక్కడ ఉన్న స్థానిక రాజకీయాలు , ప్రధాన ప్రత్యర్థి బిజెపిని ఓడించడం, స్థానిక రాజకీయాల్లో పావులు కదపాలని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావిస్తున్నారు. కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం తర్వాత బిజెపి పాలిత రాష్ట్రాలలో ఏ విధంగా వ్యూహం ఉండబోతుంది అనే అంశం ప్రస్తుతం కెసీఆర్ ముందు ఉన్న సవాల్. కర్ణాటక ఫార్ములాను ప్రయోగించాలని ఆయన మదిలో బలంగా ఉంది.
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ప్రభావం చూపబోదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావ్ ట్విట్టర్ వేదికగా చెప్పారు. కర్ణాటక ఫలితాలు వచ్చినప్పుడు రామారావ్ యుకెలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు నిరుత్సాహపడకూడదన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. మంత్రి కెటి రామారావు ట్విట్టర్ వేదికగా స్పందించే ముందే గాంధీభవన్ లో కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవాలు జరుపుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలను అడ్డుకోవడానికే కెటిఆర్ ఆ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన పొంగులేటి, జూపల్లి చూపులు కాంగ్రెస్ వైపే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బిఆర్ఎస్ మూడోసారి అధికారంలో రావాలని చూస్తోంది. మహరాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగే అవకాశముందని బిఆర్ఎస్ కు ఉప్పందింది. వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టింది.
తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యకలాపాలు చురుకుగా కొనసాగుతున్నాయ. మెదక్, రంగా రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు కర్ణాటక బార్డర్ లో ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత ఈ జిల్లాల్లో బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి కప్ప గంతులు వేసే ప్రమాదముందని అధి నాయకత్వం గుర్తించింది. ఈ జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వాళ్లు ప్రతీరోజు కర్ణాటక రాష్ట్రానికి వెళుతుంటారు. కన్నడ వచ్చిన వారు ఈ జిల్లాల్లో ఎక్కువగానే ఉన్నారు. ఈ జిల్లాల్లో ఉన్న వోటర్ల మీద ఎటువంటి ప్రభావం ఉండకూడదన్న తలంపుతో బిఆర్ఎస్ చర్యలు తీసుకుంటోంది.
జూన్ రెండో తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం. వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో వచ్చిన బిఆర్ఎస్ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ ఉత్సవాలల్లో స్థానికులను భాగస్వామ్యం చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదేశం మేరకు ఆయా రాష్ట్రాలలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలను జరుపుకోవడానికి కారణమైన డెవలప్ మెంట్, వెల్ఫేర్ స్కీంలను అన్ని చోట్ల ప్రచారం చేయాలని ఇప్పటికే కేసీఆర్ పార్టీ క్యాడర్ ను ఆదేశించారు.
సర్పంచ్ నుంచి మొదలు ఎంఎల్ ఏ, ఎంపీల వరకు తమ నియోజకవర్గాల్లో అమలవుతున్న ప్రభుత్వ స్కీములను ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తున్నారు. ఎందుకంటే వచ్చే డిసెంబర్ లోనే తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. సమయం ఎక్కువ లేదు. ప్రచారమే మన ముందున్న లక్ష్యమని కేసీఆర్ క్యాడర్ కు ఇప్పటికే పిలుపునిచ్చారు. అన్ని సినిమా హాల్స్ లో స్లైడ్స్ వేయాలని, టీవీలు, పత్రికల్లో ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ కార్యకర్తలకు ఆదేశించారు.