ఒంగోలుపై బాలినేని పట్టు!?
posted on May 16, 2023 @ 9:53AM
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వచ్చే ఎన్నికల్లో తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకాశం జిల్లాపై పట్టు కోసం వైవీ సుబ్బారెడ్డి, బాలినేని మధ్య పోరు నడుస్తున్న సంగతి విదితమే. ఇటీవలి కాలంలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలకు వైవీ సుబ్బారెడ్డి కారణమనే అనుమానం కూడా బాలినేనిలో ఉంది. ఆ అభిప్రాయాన్నీ, అనుమానాన్నీ బాలినేని ఏమీ దాచుకోవడం లేదు. కొద్ది రోజుల కిందట ప్రాంతీయ కన్వీనర్ పదవికి బాలినేని రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పార్టీ బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని, సొంత జిల్లా బాధ్యత అప్పగించాలని ముఖ్యమంత్రిని కోరినా, జగన్ అందుకు సుతరామూ అంగీకరించలేదు. పార్టీలో అందరికీ ఒకటే నిబంధన ఉంటుందని తేల్చేశారు. ఇక చేసేది ఏమీ లేక..బాలినేని మిన్నకుండిపోయారు.
బాలినేని పార్టీ పదవికి రాజీనామా చేసిన తర్వాత పరిణామాల నేపథ్యంలో వైసీపీ సానుభూతిపరుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బాలినేనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో బాలినేని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది.
ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేయడానికి ముఖ్యమంత్రి చిన్నాన్న, ఉత్తరాంధ్ర ఇన్ చార్జి వైవీసుబ్బారెడ్డి కూడా ఆసక్తి చూపిస్తున్నారు. వైవీ పార్లమెంటుకు పోటీ చేస్తారా అసెంబ్లీకి పోటీ చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ అయితే క్లారిటీ లేదు. 2019లో వైవీ సుబ్బారెడ్డికి టిక్కెట్ దక్కకపోవడంతో రెండు విడతల్లో టీటీడీ ఛైర్మన్ పదవిని ఇచ్చి జగన్ కాంపన్ సేట్ చేశారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని, మంత్రి వర్గంలో చోటును ఆశించినా సిఎం మాత్రం దానిని నెరవేర్చలేదు. అయితే ఇటీవలి కాలంలో మాత్రం వైవీ సుబ్బారెడ్డి మాట జగన్ వద్ద చెల్లుబాటు అవుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు నుంచి బాలినేనికి బదులుగా వైవీకి వైసీపీ టికెట్ దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలినేని ఒంగోలు నుంచే తాను పోటీ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడమే కాకుండా, బాలినేని వైసీపీలో కొనసాగుతారా అన్న చర్చకు తెరతీసింది.
అంతే కాకుండా నేరుగా సీఎంపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రడ్డి బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, అదే సమయంలో నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఉందని బాలినేని అన్నారు. ఈ వైఖరిని జగన్ మార్చుకోకపోతే గడ్డు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తుందనడంలో సందేహం లేదని బాలినేని కుండబద్దలు కొట్టేశారు. వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ఒంగోలు నుంచే తన పోటీపై మరింత స్పష్టత ఇచ్చారు. తనకు రాజకీయంగా జీవితావన్ని ఇచ్చిన ఒంగోలును వదిలిపెట్టే ప్రశ్నేలేదని కుండబద్దలు కొట్టేశారు.
తనను నమ్ముకున్న వారిని, తమ పార్టీ అధినేత జగన్ ను తప్ప ఎవరినీ లెక్క చేయనని పరోక్షంగా ప్రత్యర్థుల గట్టి హెచ్చరిక చేశారు. మార్కాపురం, గిద్దలూరు, దర్శి లలో ఏదో ఓ చోటు నుంచి పోటీలో ఉంటానంటూ ఇటీవల వస్తున్న ప్రచారాన్ని బాలినేకి కొట్టి పారేశారు. సొంత పార్టీలోని వారే ఇటువంటి ప్రచారాన్ని చేస్తున్నారనీ, తనకు వ్యతిరేకంగా కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారనీ బాలినేని చెప్పారు. అటువంటి వారిని లెక్క చేయాల్సిన అవసరం లేదనిపించిందని కార్యకర్తలు తనను ఇప్పటికి అయిదుసార్లు గెలిపించారని వారి రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు.
ఇలా ఉండగా పార్టీలో తనకు వ్యతిరేకంగా కొందరు కుట్ర చేస్తున్నారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని ఉద్దేశించి చేసినవేనని వైసీపీ శ్రేణులు బాహాటంగానే చెబుతున్నాయి. ఒంగోలు నంచి పోటీ చేస్తాననంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన ఎలా ఉంటుందనే దానిపై అందరూ ఆసక్తి తో చూస్తున్నారు.